2026 జూన్ 23న న్యూయార్క్ నగర డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య సోషలిస్టు భావజాల నాయకులు గణనీయమైన విజయాలు సాధించారు.
ముఖ్యంగా నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించడం అమెరికా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
అమెరికా రాజకీయాల్లో ఈ పరిణామం కొత్త మలుపుకు నాంది అని భావిస్తున్నారు.
ఈ విజయాలు అమెరికా దేశ మొత్తం రాజకీయ దిశను వెంటనే మార్చకపోయినా, డెమోక్రటిక్ పార్టీ లోపల వామపక్ష ప్రభావం పెరుగుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి.
అమెరికా రాజకీయాలను చాలాకాలంగా రెండు ప్రధాన పార్టీలు- డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన ఇంటి అద్దెలు, వైద్య, విద్య ఖర్చులు, అప్పుల భారంతో విసిగిపోయిన యువతలో వామపక్ష, సోషలిస్ట్ ఆలోచనలకు ఆదరణ పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగరంలో ప్రజాస్వామ్య సోషలిస్టు భావజాలానికి చెందిన నాయకులు వరుస విజయాలు సాధించడం అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త ధోరణికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది.
న్యూయార్క్ ఎన్నికల్లో సోషలిస్టు భావజాలానికి చెందిన నాయకుల విజయాలు కేవలం స్థానిక ఎన్నికల ఫలితాలు మాత్రమే కావు.
అవి అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రజల అసంతృప్తికి రాజకీయ రూపం.
ఈ పరిణామాలు భవిష్యత్తులో అమెరికా డెమోక్రటిక్ పార్టీ విధానాలను, అలాగే దేశ రాజకీయ చర్చలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
జోహ్రాన్ మమ్దానీ ప్రభావం..
ఈ రాజకీయ మార్పుకు కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ. ఆయన తనను తాను “డెమోక్రటిక్ సోషలిస్టు”గా ప్రకటించుకున్నారు.
2025లో న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి, 2026 జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు.
ఆయన న్యూయార్క్ నగర చరిత్రలో తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా మూలాలున్న మేయర్‌గా నిలిచారు.
అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో ఉన్నత విద్య, ఇంటి అద్దెల నియంత్రణ, కార్మికులకు మెరుగైన వేతనాలు, సంపన్నులపై అధిక పన్నులు విధించి సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం, ప్రభుత్వ సేవల విస్తరణ ఆయన తన లక్ష్యాలుగా ప్రకటించుకున్నారు.
దీంతో యువత, విద్యార్థులు, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు సోషలిస్టు విధానాల వైపు మొగ్గుచూపుతున్నారు.
అమెరికాలో జరుగుతున్న ప్రైమరీ ఎన్నికలు, నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికలు, వివిధ స్థాయిల అధికార యంత్రాంగాల వివరాలను గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
ప్రైమరీ ఎన్నికలు..
ప్రైమరీ ఎన్నికలు అంటే పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసే ఎన్నికలు. జనరల్ ఎన్నికలు అంటే వివిధ పార్టీల అభ్యర్థుల మధ్య జరిగే అసలు ఎన్నికలు.
భారతదేశంలో గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అభ్యర్థుల ఎంపికను రాజకీయ పార్టీలు చేస్తాయి. కానీ అమెరికాలో అందుకు భిన్నంగా జరుగుతుంది.
అక్కడ రెండే ప్రధాన పార్టీలు. ఆ పార్టీల తరపున అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్న వారు పార్టీకి దరఖాస్తు చేసుకుంటారు.
ఆ దరఖాస్తులను పరిశీలించి ఒక అభ్యర్థిని ఖరారు చేయడం కోసం ఆ పార్టీ తన సభ్యుల ఓటింగ్ నిర్వహిస్తుంది.
అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన వారిలో ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు వస్తే ఆ వ్యక్తి ఆ పార్టీ అధికార అభ్యర్థి అవుతాడు.
దీనినే ప్రైమరీ ఎన్నికలు అంటారు. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీలో కేవలం డెమోక్రటిక్ పార్టీ సభ్యులుగా నమోదు చేసుకున్న ఓటర్లే ఓటు వేయగలరు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీలో కూడా జరుగుతుంది.
మధ్యంతర ఎన్నికలు..
అమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగు సంవత్సరాలు. అధ్యక్ష ఎన్నికలు జరిగిన రెండు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు లేదా మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటారు.
2024 నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు సంవత్సరాల పదవీకాలం 2025 జనవరి నుంచి 2029 జనవరి వరకు ఉంటుంది.
ఈ నాలుగు సంవత్సరాల కాలానికి మధ్యలో 2026 నవంబరులో జరిగే ఎన్నికలే మధ్యంతర ఎన్నికలు. ఈ మధ్యంతర ఎన్నికలు 2026 నవంబర్ 3న జరుగుతాయి.
ప్రతినిధుల సభ..
అమెరికా ప్రతినిధుల సభలో(హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్) మొత్తం 435 మంది సభ్యులు ఉంటారు. (భారతదేశంలో లోక్ సభ లాంటిది). వీరి పదవీకాలం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. అందువల్ల ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్ని 435 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
సెనేట్..
అమెరికా సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు.(భారతదేశ రాజ్యసభ లాంటిది). వారి పదవీకాలం ఆరు సంవత్సరాలు.
అయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి సుమారు మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 2026లో 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అమెరికా కాంగ్రెస్ రెండు సభలతో ఉంటుంది.
1. ప్రతినిధుల సభ
2. సెనేట్
అధ్యక్షుడి పార్టీకి ఈ రెండు సభల్లో మెజారిటీ ఉంటే ఆయన విధానాలను అమలు చేయడం సులభం అవుతుంది.
మెజారిటీ కోల్పోతే కొత్త చట్టాలు ఆమోదించడం కష్టం అవుతుంది. బడ్జెట్ ఆమోదంలో సమస్యలు వస్తాయి.
ప్రభుత్వ నియామకాలపై ప్రతిపక్షం ప్రభావం పెరుగుతుంది. అధ్యక్షుడిపై దర్యాప్తులు, విచారణలు పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికాలో ప్రతి రెండు సంవత్సరాలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికలు జరగడం వల్ల ప్రజలు ప్రభుత్వ పనితీరుపై తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం పొందుతారు.
రాష్ట్ర గవర్నర్ ఎన్నికలు..
అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయి. 2026లో 36 రాష్ట్రాలు, 3 ప్రాంతాల్లో గవర్నర్ ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్ర శాసనసభ, స్థానిక ఎన్నికలు..
రాష్ట్ర శాసనసభలు, అటార్నీ జనరల్ పదవులు, మేయర్లు, స్థానిక సంస్థలు, న్యాయమూర్తుల పదవులు, ప్రజాభిప్రాయ సేకరణలు వంటి అనేక ఎన్నికలు కూడా అదే రోజు జరుగుతాయి.
రిపబ్లికన్ పార్టీకి కాంగ్రెస్‌లో స్వల్ప ఆధిక్యం ఉంది. డెమోక్రటిక్ పార్టీ, ప్రతినిధుల సభపై తిరిగి ఆధిపత్యం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది.
ఈ నేపథ్యంలో 2026 మధ్యంతర ఎన్నికలు అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా పరిగణించబడుతున్నాయి.
మధ్యంతర ఎన్నికల ప్రాధాన్యత..
న్యూయార్క్ డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గిన సోషలిస్టు అభ్యర్థులు నవంబరులో జరిగే ప్రధాన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులను ఎదుర్కొంటారు. వారు నవంబరులో కూడా గెలిస్తే, అమెరికా కాంగ్రెస్‌లో వామపక్ష, ప్రగతిశీల విధానాలకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుంది.
అమెరికా రాజకీయాల్లో ఒక సామెత ఉంది. అదేమంటే “ప్రెసిడెంట్ వైట్‌హౌస్‌ను నడిపిస్తాడు. కానీ కాంగ్రెస్ దేశ పాలనకు దిశానిర్దేశం చేస్తుంది.” అందువల్ల మధ్యంతర ఎన్నికలు అధ్యక్ష ఎన్నికలతో సమానమైన రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
సాధారణంగా అమెరికాలో ప్రైమరీ ఎన్నికలు జూన్ నెలలో, ప్రధాన ఎన్నికలు నవంబర్ నెలలో నిర్వహించడం ఒక స్థిరమైన ఎన్నికల చక్రంలో భాగంగా ఉంటుంది.
ప్రస్తుత హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ పార్టీ(అధికార పార్టీ) 220, డెమోక్రటిక్ పార్టీ 212, మరొక మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ 53, డెమొక్రటిక్ పార్టీ 45, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు.
డెమొక్రటిక్ పార్టీలోని 212 మందిలో దాదాపు 95 మంది అభ్యుదయవాదులు ఉన్నారు. వారు సాధారణంగా కింది విషయాలలో ప్రజల పక్షాన ఉంటారు: యూనివర్సల్ హెల్త్ కేర్, బలమైన కార్మిక హక్కులు, అత్యంత సంపన్నులపై అధిక పన్నులు విధించడం, విద్యార్థుల రుణాల విముక్తి, సామాజిక సంక్షేమం పరిధిని విస్తరించడం, పర్యావరణ సమస్యలు. అధికార రిపబ్లికన్ పార్టీలో ప్రజల పక్షాన నిలబడే అభ్యర్థులు దాదాపుగా ఎవరూ లేరని చెప్పాలి.
అమెరికా ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత..
అమెరికా అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ముఖ్యంగా 1980 తర్వాత దేశ పారిశ్రామికీకరణ క్రమంగా బలహీనపడింది. తేలిగ్గా డబ్బు సంపాదించే షేర్ మార్కెట్ల ప్రాధాన్యత పెరిగింది.
సంపద కొద్ది మంది చేతుల్లో బాగా కేంద్రీకృతం అవుతున్నది. సాధారణ ప్రజల జీవనం చాలా కష్టంగా మారింది. క్రమంగా పేదరికం పెరుగుతున్నది. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేకపోవడం, ఇంటి అద్దెలు పెరగడం మధ్యతరగతి ప్రజలలో మరో ముఖ్య సమస్యగా ఉంది. యువతలో నిరుద్యోగం బాగా పెరుగుతున్నది.
మరిముఖ్యంగా, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన టారిఫ్ యుద్ధం అమెరికా దేశంలో సరుకుల ధరలు విపరీతంగా పెరగడానికి దారితీసింది.
మరొకవైపు ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. వెరసి పెట్టుబడిదారీ వ్యవస్థ పట్లనే క్రమంగా అమెరికాలోని సాధారణ ప్రజలలో, ముఖ్యంగా యువకులలో అసంతృప్తి, వ్యతిరేకత ప్రారంభమయ్యాయని ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ నగర మేయర్‌గా సోషలిస్ట్ ఎన్నికైన తర్వాత క్రమంగా సోషలిస్టుల ప్రాబల్యం బాగా పెరుగుతున్నది. ప్రముఖ సోషలిస్టు నాయకుడు, వామపక్ష వాది బెర్నీ సాండర్స్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు.
న్యూయార్క్ నగర మేయర్‌తో పాటు కొన్ని ఇతర నగరాలకు జరిగిన ఎన్నికల్లో కూడా వామపక్ష, సోషలిస్టు భావాలు కలిగిన వారు ఎన్నికయ్యారు. సోషలిస్టుల పట్ల ఆదరణ క్రమంగా పెరుగుతున్నది.
2026 నవంబర్‌లో జరగబోతున్న మధ్యంతర ఎన్నికల్లో వీరి సంఖ్య పెరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి.
నవంబరు 3న హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌కు జరగనున్న మధ్యంతర ఎన్నికలలో సోషలిస్టు భావాలు కలిగిన వారు ఎంత ఎక్కువ మంది విజయం సాధించగలిగితే అమెరికాలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అది ఎంతగానో దోహదపడుతుంది.
అమెరికాలో అలాంటి వాతావరణం ఏర్పడటం భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నింటిలోని సాధారణ ప్రజానీకానికి పలు విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ విధంగా 2026 నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
