కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రచురించిన అధికారిక అటవీ మళ్లింపు రికార్డులను “డౌన్ టు ఎర్త్” సంస్థ విశ్లేషించింది.
ఆ విశ్లేషణ ప్రకారం అటవీ భూములను ఇతర అవసరాలకు వినియోగించే విషయమై వచ్చిన ప్రతిపాదనల్లో 80 శాతం ప్రతిపాదనలకు అటవీ సలహా సంఘం ఆమోదం తెలిపినట్లు వెల్లడైంది.
న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జులై 2023 – మే 2026 మధ్య కాలంలో అటవీ భూములపై ఉన్న 2.8 మిలియన్లకు పైగా చెట్ల నరికివేతకు ఆమోదం తెలిపినట్లు “డౌన్ టు ఎర్త్” సంస్థ ఇటీవల వెల్లడించింది.
అడవులను ఇతర అవసరాలకు మళ్లించడం కోసం మంత్రిత్వ శాఖ వద్దకు 288 ప్రతిపాదనలు రాగా అందులో 242 ప్రతిపాదనలను ఆమోదించినట్లు విశ్లేషణలో వెల్లడైంది.
సమావేశ రికార్డుల విశ్లేషణ..
మంత్రిత్వ శాఖ ప్రచురించిన వన్ (సంరక్షణ్ ఏవం సంవర్ధన్) అధినియం 1980 కింద ఏర్పాటు చేసిన సలహా సంఘం సమావేశ మినిట్స్‌ను డౌన్ టు ఎర్త్ విశ్లేషించింది.
సంఘం ముందుకు వచ్చిన అటవీ మళ్లింపు ప్రతిపాదనలను లెక్కిస్తూ, ఒక ప్రతిపాదన ఎన్నిసార్లు చర్చకు వచ్చినప్పటికీ దాన్ని ఒకే ప్రతిపాదనగా వారు లెక్కించారు.
ఆ నివేదిక ప్రకారం మొత్తం 288 వేర్వేరు అటవీ భూముల మళ్లింపు ప్రతిపాదనలలో ఈ సలహా సంఘం 242 ప్రతిపాదనలను ఆమోదించింది(అంటే 80 శాతానికి పైగా ఆమోదం).
గనులు, జల విద్యుత్, ట్రాన్స్మిషన్ లైన్లు వంటి అటవీయేతర ప్రాజెక్టుల కోసం 22 వేల హెక్టార్లకు పైగా అటవీ భూమిని మళ్లించినట్లు రికార్డులు వెల్లడించాయని ఆ నివేదిక పేర్కొంది.
27 రంగాలకు అటవీ భూమిని గడచిన మూడు సంవత్సరాలలో మళ్లించినప్పటికీ, మైనింగ్ ప్రాజెక్టుల కోసం అత్యధికంగా 1.35 మిలియన్ చెట్ల నరికివేతకు ఆమోదించారు లేదా నరికివేశారు.
తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 0.93 మిలియన్ చెట్లు, పునరావాస ప్రాజెక్టుల కోసం 0.23 మిలియన్ చెట్ల నరికివేతకు అనుమతినిచ్చారు.
“అటవీ భూముల మళ్లింపు ప్రతిపాదనల్లో ఈ మూడు రంగాలు కలిపి దాదాపు 90 శాతం చెట్లను నరికివేసినట్లు పరిశీలనలో వెల్లడైందని” డౌన్ టు ఎర్త్ (డీటీఈ) నివేదిక తెలియజేసింది.
విస్తీర్ణం పరంగా చూస్తే, మొత్తం 288 ప్రతిపాదనలలో 139 ప్రతిపాదనలు 0 నుంచి 10 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుకు సంబంధించినవి కాగా, 55 ప్రతిపాదనలు 11 నుంచి 100 హెక్టార్ల భూమికి, 35 ప్రతిపాదనలు 101 నుంచి 500 హెక్టార్ల భూమికి సంబంధించినవి.
501 నుంచి 1,000 హెక్టార్లలోపు తొమ్మిది ప్రాజెక్టులు ఉండగా, 1,000 హెక్టార్లకు మించి ఉన్న అటవీ భూమి మళ్లింపు ప్రతిపాదనలు నాలుగు ఉన్నాయి.
ముందంజలో ఛత్తీస్‌గఢ్..
గడచిన మూడు సంవత్సరాలలో చెట్ల నరికివేతకు ఆమోదం పొందిన రాష్ట్రాలలో ఛత్తీస్‌గఢ్ ముందంజలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
సర్గుజా డివిజన్లో కెంటే ఎక్స్టెన్షన్ ఓపెన్‌కాస్ట్ కోల్ మైనింగ్, పిట్-హెడ్ కోల్ వాషరీ ప్రాజెక్టు కోసం 0.4 మిలియన్‌కు పైగా (4 లక్షలు) చెట్లను నరికివేయడానికి సలహా కమిటీ ఆమోదం తెలిపింది.
అటవీ హక్కులు, భూమికి సంబంధించి స్థానిక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన ప్రాజెక్టు ఇదని డీటీఈ కథనం తెలిపింది.
ఇదిలా ఉండగా, కనీసం 84 ప్రాజెక్టులలో ఎలాంటి చెట్లను నరికివేయలేదని విశ్లేషణలో వెల్లడైంది. 14 ప్రాజెక్టులకు సంబంధించి చెట్ల నరికివేత డేటా గురించి సమావేశ మినిట్స్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.

ఒడిశాలోని సిజిమాలి బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టు కూడా ఇందులో ఉంది. ఇక్కడ దాదాపు 700 హెక్టార్ల అటవీ భూమిని మళ్ళించాల్సి ఉంది.
ఈ గనిని నిర్వహించే వేదాంత గ్రూపు, బాక్సైట్ గని కోసం 708.204 హెక్టార్ల అటవీ భూమిని క్లియర్ చేయడానికి 2024లోనే ప్రతిపాదనలు సమర్పించింది.
చెట్ల లెక్కింపును చేపట్టినట్లు, ఆ ప్రాంతంపై నరికివేత ప్రభావాన్ని సమావేశ మినిట్స్ అంగీకరించినప్పటికీ, కచ్చితంగా చెట్ల సంఖ్యను మాత్రం ప్రస్తావించలేదని డీటీఈ పేర్కొంది.
నివేదిక ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణ ప్రభావం “తక్కువగా” ఉంటుందని మినిట్స్ పేర్కొన్నాయి.
ఆ పీఠభూమి ప్రస్తుత ఎకో సిస్టమ్ “పరిమిత జీవ వైవిధ్యానికి మద్దతునిస్తుందని, అనేక జాతులు మనుగడ కోసం లోయలోని వృక్షసంపదపై ఆధారపడి ఉన్నాయని” అందులో తెలిపారు.
దానికి విరుద్ధంగా, లోయ ప్రాంతానికి సమీపంలో ఉన్న చెట్లను నరికివేయడం వల్ల వన్యప్రాణుల నివాసాలకు అంతరాయం ఏర్పడగలదని, జాతుల స్థానభ్రంశం జరుగుతుందని, మట్టి కోత పెరగడంతో పాటు సమీపాన ఉన్న జల వనరులు పూడికతో నిండిపోవడానికి దారితీస్తుందని అదే మినిట్స్‌లో చెప్పినట్లు డీటీఈ వెల్లడించింది.
పార్లమెంటులో ఆ ఏడాది పర్యావరణ శాఖ సహాయ మంత్రి అందజేసిన డేటా ఆధారంగా, 2016-2019 మధ్య కాలంలో 69.4 లక్షల చెట్లను నరికివేయడానికి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు 2019లో డీటీఈ నివేదించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

