బాంబే హైకోర్టు తీర్పు ఒక పిడుగుపాటులా పరిణమించింది. బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి, పౌరసత్వాన్ని పొందడానికి నకిలీ పత్రాలను సృష్టించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబు అబ్దుల్ రఫ్ సర్దార్కు బెయిల్ నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
పై ప్రశ్న గుండెల్లో గుచ్చుకుంటోంది కదూ? స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత, ప్రతి ఏటా జెండా ఎగురవేసే వేళ “అంత అభివృద్ధి సాధిస్తాం, ఇంత అభివృద్ధి సాధిస్తాం” అని చేసే వాగ్దానాల తర్వాత, నవీన భారతం వెన్నెముకగా చెప్పుకున్న డిజిటల్ ఇండియా కోసం వేల వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత కూడా, ఒక భారతీయ పౌరుడు తన చేతిలో ఉన్న గుర్తింపు కార్డులన్నీ వర్షంలో తడిసి ముద్దయిన కాగితాల్లా ముక్కలైపోతుంటే, రిక్త హస్తాలతో నిలబడాల్సి వస్తోంది.
గుర్తింపు కార్డులు – పౌరసత్వానికి రుజువులు కావా?
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన హెచ్చరికను పునరుద్ఘాటిస్తూ బాంబే హైకోర్టు ఆ భ్రమను తొలగించింది. మనకు అత్యంత పవిత్రమైన గుర్తింపు బిళ్ళలుగా భావించే ఆధార్, పాన్, ఓటర్ ఐడీలు మన పౌరసత్వానికి ఎంతమాత్రం రుజువు కావు.
ఇది చట్టపరమైన స్వల్ప వివాదం కాదు. ఇదొక విశ్వాసఘాతుకం, బ్యూరోక్రాటిక్ ముసుగును తొలగించడం, ఇది 95 కోట్ల మంది ఓటర్లను దిగ్భ్రాంతికి గురి చేయడం.
స్కాన్ చేసిన ప్రతి వేలిముద్ర, సేకరించిన ప్రతి ఐరిస్, వేసిన ప్రతి ఓటు కేవలం ఒక పరిపాలనాపరమైన ముచ్చటగా మిగిలిపోయింది.
మనం భారతీయులమని ధ్రువపరిచాయనుకున్న పత్రాలు అకస్మాత్తుగా డొల్లవని తేలిపోయాయి. కాబట్టి పై ప్రశ్న పదునైన కత్తిలా వేలాడుతోంది.
ఈ కార్డులు నన్ను భారతీయుడిగా పరిగణించకపోతే, మరేది పరిగణిస్తుంది? ఒకవేళ రాజ్యం దీనికి సమాధానం చెప్పలేకపోతే, మనం ఏ దేశానికి చెందినవారమని భావిస్తున్నామో దానికి అర్థం ఉందా?
బాంబే హైకోర్టు తీర్పు పిడుగుపాటులా పరిణమించిందని చెప్పుకున్నాం కదా, జస్టిస్ అమిత్ బోర్కర్ వ్యాఖ్యలు చాలా స్పష్టంగా, సూటిగా ఉన్నాయి- “ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి పత్రాలు ఉన్నంత మాత్రాన ఎవరికి వారు భారత పౌరులు అయిపోరు.”
ఈ పత్రాలు కేవలం గుర్తింపు కోసం లేదా సేవలను పొందడం కోసం మాత్రమే. కానీ, పౌరసత్వ చట్టం 1955 ప్రకారం జాతీయతను నిరూపించడానికి మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.
అదే రోజు సమాంతరంగా జరిగిన మరో కేసులో సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి మద్దతుగా ఆధార్‌ను “పౌరసత్వానికి నిర్ణయాత్మకమైన రుజువుగా అంగీకరించలేము”, దానిని స్వతంత్రంగా ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది.
చొరబాటుదారులపై కఠినమైన నిబంధనలను వర్తింపజేయడంలో కోర్టుల నిర్ణయం సమర్థనీయమే కావచ్చు. కానీ ప్రభుత్వ సంస్థలు అవివేకంగా ఆ నిబంధనలను అవిభక్త భారతదేశంలో జన్మించిన వారిపై కూడా రుద్దాలా? వారు స్వతంత్ర భారతదేశాన్ని తమ జీవితకాల సహజ నివాసంగా ఎంచుకున్నారు. లేదూ ఆ తర్వాత భారత దేశంలో జన్మించిన వారి గతి కూడా ఇంతేనా?
ఎన్నికల సంఘం నిబంధనలు – సామాన్యుల అవస్థలు..
ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్న వైపుకు నడిపిస్తుంది. ఒక వ్యక్తి తన భారతీయ పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను ఎక్కడ వెతకాలి? బ్యూరోక్రాటిక్ వివాదాల కారణంగా 2011 నుంచి పౌరుల రిజిస్టర్ సవరించబడలేదు.
ప్రతి దశాబ్దానికి మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రమించి తయారుచేసే ఏకైక విశ్వసనీయమైన పత్రం బహుశా ఈ రిజిస్టరు మాత్రమే.
ఇప్పుడు భారతీయుడికి ఓటు హక్కు కల్పించే యంత్రాంగాన్ని ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది అంటే అది పౌర పట్టిక రూపొందించే పాత్రను కూడా పోషిస్తోందని అర్థం.
ఎందుకంటే భారత పౌరుడు మాత్రమే ఎన్నికలలో పాల్గొనగలడు. ఒక కాబోయే ఓటరు తన ఓటు హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి 11 పత్రాలను సమర్పించాలని ఎన్నికల సంఘం కోరుతోంది.
ఇప్పుడు ఎన్నికల సంఘం పౌరుల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం మొదలైన వాటిని సమర్పించమని అడుగుతుంది.
ఆశ్చర్యకరంగా, ప్లాస్టిక్ లేదా డిజిటల్ గుర్తింపులైన ఆధార్, పాన్, ఎన్నికల సంఘం జారీ చేసిన స్వంత ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు కూడా బలమైన ఆధారాలు కావు అంటుంది.
ఎందుకనీ? దీనికి ఎన్నికల సంఘం ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు.
భారతీయులలో కేవలం 2.5 శాతం మందికి మాత్రమే పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని, 14.71 శాతం మందికి మాత్రమే మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి గుర్తు చేయాలా.
ఇక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలా? ఎంతమంది భారతీయుల వద్ద అవి ఉన్నాయో ఊహించడం కష్టం.
లక్షలాది మంది భారతీయుల దగ్గర ఈ పత్రాలు లేవని కోర్టులో ఎన్నికల సంఘం సమర్పించిన స్వంత డేటానే వివరిస్తుంది.
ఆధార్‌పై వెచ్చించిన కోట్లు – మిగిలిన గందరగోళం..
ఇక ఆధార్ గురించి మాట్లాడుకుందాం. 2023 నాటికి ఈ “విశిష్ట గుర్తింపు” వ్యవస్థను సాకారం చేయడానికి ప్రభుత్వం సుమారు రూ 12,000 కోట్లు అంటే సుమారు 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
ఇది బ్యాంక్ ఖాతాలు, పన్నులు, ఆస్తి లావాదేవీలు, చివరకు విమానాశ్రయాల వంటి సున్నితమైన ప్రదేశాలలోకి ప్రవేశించడానికి కూడా ఆధార్ ఒక్కటే కీలకం అని ప్రకటించారు. ఇది మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, వ్యక్తిగత చరిత్రను సేకరించి, మిమ్మల్ని మీ కుటుంబంతో, మీ చిరునామాతో, మీ ఉనికితో అనుసంధానించే ఒక బయోమెట్రిక్ దిగ్గజం.
కారు కొనాలన్నా, ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా లేదా పన్నులు చెల్లించాలన్నా ఇది తప్పనిసరి. అయినప్పటికీ, మీరు భారతీయుడని నిరూపించుకోవడానికి వచ్చేసరికి దీనికి విలువ లేదు.
ఓటర్ల జాబితాలో మీ పేరు చేర్చడానికి ఇది సరిపోదని ఎన్నికల సంఘం చెబుతోంది. “మీ ఆధార్ మీ గుర్తింపు” అని ప్రచారం చేసిన అదే ప్రభుత్వం ఇప్పుడు చేతులు దులుపుకుంటూ- “క్షమించండి, పౌరసత్వానికి ఇది పనికిరాదు” అని అంటోంది. దీనికి తోడు, ఆధార్‌లోని లోపాలు పదే పదే బయటపడుతూనే ఉన్నాయి.
ఇక ఎన్నికల సంఘం జారీ చేసే ఓటర్ గుర్తింపు సంగతి చూద్దాం.
దశాబ్దాలుగా, ఇది మీరు బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయడానికి ఒక టోకెన్‌గా, భారతదేశ ప్రజాస్వామ్య హృదయ స్పందనలో మీరూ ఒక భాగమనే దానికి సాక్ష్యంగా ఉంది. కానీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉన్నాయని ఎన్నికల సంఘం హఠాత్తుగా కనిపెట్టింది.
చట్టం నిర్వచించిన ప్రకారం, అక్రమ వలసదారులు అందుబాటులో ఉన్న ఏ మార్గం ద్వారా కూడా పౌరసత్వాన్ని పొందలేరు.
పౌరుడంటే ప్రభుత్వం భావిస్తున్న నిర్వచనం ఏమిటో ఎందుకు స్పష్టం చేయడం లేదు? అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నంబర్ లేదా యూకేలో నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ లాగా పౌరసత్వాన్ని నిరూపించే ఒకే ఒక సురక్షితమైన గుర్తింపు కార్డును ఎందుకు సృష్టించలేదు?
ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు —వీటిలో ఏదీ పౌరసత్వానికి రుజువు కానప్పుడు ప్రభుత్వం ఎందుకు గారడీ చేస్తుంది?
బాంబే హైకోర్టు తీర్పుపై న్యాయవాది సౌరవ్ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ, “కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు పౌరసత్వ నిరూపణ పత్రాన్ని అందించడానికి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.
గతంలో ఆధార్‌ను కొనసాగించడం కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఎడతెగకుండా పోరాడింది, కానీ ఇప్పుడు గోప్యత హక్కుల పేరిట ఆధార్ కేవలం ఒక కాగితపు ముక్కగా మారిపోవడం ఆశ్చర్యకరం” అని సరైన పాయింట్‌ను లేవనెత్తారు.
ముందడుగుకు మార్గం – ఏకైక పౌర గుర్తింపు పత్రం ఆవశ్యకత..
భారతదేశానికి ఒక సార్వజనీన పౌర గుర్తింపు పత్రం అవసరం—ఇది పౌరసత్వం, ఓటు అర్హత, గుర్తింపును నిరూపించే ఒకే ఒక సురక్షితమైన పత్రం కావాలి.
ఇతర దేశాలు అలా రూపొందించాయి.
అమెరికాకు సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉంది; జర్మనీకి పెర్సనాలాస్వీస్ ఉంది. మనం ఎందుకు చేయలేం? ప్రభుత్వం పౌరసత్వ చట్టం కింద స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేయాలి, పత్రాల అవసరాలను క్రమబద్ధీకరించాలి. పౌరుల డేటాను పరిరక్షించాలి.
95 కోట్ల మంది ఓటర్లు గుర్తింపు అనిశ్చితిని ఎదుర్కొంటున్న ప్రస్తుత గందరగోళ పరిస్థితి ఆమోదయోగ్యం కాదు. 78 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం తన ప్రజలను జాతీయతను నిర్వచించడానికి ఒక మార్గం వెతుకుతోందంటే అది హాస్యాస్పదం మాత్రమే కాదు—ప్రజాస్వామ్యానికే తీరని అవమానం.
కాబట్టి, నేను భారతీయ పౌరుడినేనా? నా వద్ద బయోమెట్రిక్స్‌తో కూడిన ఆధార్ ఉంది, ఓట్లతో బాప్టిజం పొందిన ఓటర్ ఐడీ ఉంది, నేను చెల్లించిన ప్రతి పన్నుతో ముడిపడి ఉన్న పాన్ కార్డ్ ఉంది.
అయినప్పటికీ, నేను నేటి సరిహద్దులకు ఆవల, ఇప్పుడు పాకిస్తాన్‌గా పిలవబడే ప్రదేశంలో జన్మించినందున, కాలక్రమేణా నా తల్లిదండ్రుల పత్రాలు నశించిపోయినందున, నేను తగిన రుజువులు తీసుకువచ్చే వరకు నేను ఎవరినీ కాదని, పేరు లేనివాడినని, దేశం లేనివాడినని కోర్టులు ప్రకటిస్తున్నాయి.
ఇది నా ఒక్కడి భారం మాత్రమే కాదు—ఇది లక్షలాది మంది ఎదుర్కొంటున్న ఒక సామూహిక సమస్య, సమిష్టిగా సిలువ నెక్కించడం.
ఇక్కడ ప్రభుత్వం మనం అందించలేమని తెలిసిన ఆధారాలనే సమర్పించమని అడుగుతూ ఒక కాఫ్కా తరహా గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఇది ప్రయాసతో కూడిన కాగితాల పని, కరుణ లేని బ్యూరోక్రసీ, విశ్వాసరాహిత్యం తప్ప మరొకటి కాదు.
గుర్తింపు అనేది ఒక విచారణగా మారింది; పౌరసత్వం అనేది ఒక అనుమానంగా మారింది. ప్రభుత్వం ఈ బూటకాన్ని బద్దలు కొట్టాలి.
ప్రభుత్వమే ఒకే ఒక సార్వజనీన పౌర గుర్తింపు కార్డును రూపొందించాలి, పౌరుడిగా ఉండే హక్కును క్రోడీకరించాలి, ఈ సందేహాల అంతరాన్ని పూడ్చాలి.
అప్పటి వరకు, కోట్లాది మంది భారతీయులు తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులను తాయెత్తుల్లా పట్టుకుని ఉంటారు, చివరకు అవి ప్లాస్టిక్ ముక్కలు మాత్రమే అని తెలుసుకుంటారు. అంటే క్రూర పరిహాసం మిగిలే ఉంటుంది.
వంద కోట్లకు పైగా ఆత్మలు ఉన్న దేశంలో, భారతీయుడు ఎవరు అనే ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేకుండా గాలిలో కొట్టుమిట్టాడుతోంది, ఇది భారతీయతా భావాన్ని వెంటాడుతోంది.
డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ ప్రశ్నకు సమాధానం గాలిలోనే కొట్టుకుంటోంది. ప్రస్తుతానికి, నేను సగటు ఓటరుని. కానీ రేపటి సంగతి ఏమిటి?
అనువాదం: కె. సత్యరంజన్
(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
