దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశంలో 2026లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించాయి.
మొదటి దఫా ఎన్నికలు 2026 మే 31న జరిగాయి. అందులో ఏ అభ్యర్థికి 50 శాతం ఓట్లు రాకపోవడంతో జూన్ 21వ తేదీ రెండో దఫా ఎన్నికలు జరిగాయి.
అమెరికా పౌరసత్వం కలిగి డొనాల్డ్ ట్రంప్‌కు నమ్మినబంటు అయిన అభ్యర్థికి, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థికి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది.
మొదటి దఫా పోలింగ్‌లో ట్రంప్ అనుయాయునికి 43.7 శాతం ఓట్లు రాగా, కమ్యూనిస్టు అభ్యర్థికి 40.9 శాతం ఓట్లు వచ్చాయి.
రెండో దశ ఎన్నికలలో ట్రంప్ అనుకూల అభ్యర్థి అబెల్డారో డి లా ఎస్పిరెల్లా స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కమ్యూనిస్ట్ అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటమిని అంగీకరించారు.
అధికారిక లెక్కల ప్రకారం విజేతకు సుమారు 49.6 శాతం ఓట్లు లభించగా, ప్రత్యర్థి 48.7 శాతం ఓట్లు సాధించారు.
మొదటి దఫా ఎన్నికలలో ఇరువురి మధ్య 2.8 శాతం ఓట్ల తేడా ఉంది. రెండో దఫా ఎన్నికలకు ఈ తేడా భారీగా తగ్గి ఒక శాతం లోపుగానే నమోదైంది.
కమ్యూనిస్టు అభ్యర్థి తన ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నారు. అయినప్పటికీ సామ్రాజ్యవాద శక్తుల కుట్రలు, వారి అండదండలతో ట్రంప్ అనుకూల అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గారు.
నెగ్గిన అభ్యర్థికి అమెరికా పౌరసత్వంతో పాటు కొలంబియా పౌరసత్వం కూడా ఉంది.
ఇది కొలంబియా దేశంలో ఎన్నికల సందర్భంగా పెద్ద చర్చనీయాంశమైంది. అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి కొలంబియా దేశానికి అధ్యక్షుడు ఎలా అవుతాడనే ప్రశ్న బలంగా ముందుకు వచ్చింది. అయినా అతను నెగ్గారు. ఈ ఎన్నికలు కొలంబియా దేశం రాజకీయంగా దాదాపు సమానంగా విభజించబడిందని రుజువు చేశాయి.
కొలంబియా రాజకీయ నేపథ్యం..
కొలంబియా అనేక దశాబ్దాలుగా భూస్వామ్య అసమానతలు, గ్రామీణ పేదరికం, మాదకద్రవ్య ముఠాలు, సాయుధ ఘర్షణలతో సతమతమవుతున్న దేశం.
20వ శతాబ్దం మధ్యకాలం నుంచి దేశంలో వామపక్ష గెరిల్లా ఉద్యమాలు, రైట్ వింగ్ శక్తులు, పారామిలటరీ బలగాలు, ప్రభుత్వ సైన్యాల మధ్య ఘర్షణలు కొనసాగాయి.
ఈ పరిస్థితుల్లో రైతులు, భూమిలేని కూలీలు, పేద ప్రజల సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తూ 1964లో రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా అనే గెరిల్లా సంస్థ ఏర్పడింది.
భూసంస్కరణలు, సామాజిక న్యాయం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం తమ లక్ష్యమని ప్రకటించిన ఈ సంస్థ తరువాత దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో పాల్గొంది.
దాదాపు ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన అంతర్యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది మంది మరణించారు. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, పేదరికం, అసమానతలు కొనసాగడం వల్ల ప్రజలలో వామపక్ష భావజాలానికి మద్దతు కొనసాగింది.
2016లో అప్పటి ప్రభుత్వం, RAFC మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం RAFC ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి రాజకీయ పార్టీగా మారింది.
గ్రామీణాభివృద్ధి, మాజీ యోధుల పునరావాసం, బాధితులకు న్యాయం వంటి అంశాలను ఒప్పందంలో చేర్చారు.
అయితే అమలు విషయంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్ని విభాగాలు తిరిగి సాయుధ మార్గాన్ని ఎంచుకున్నాయి.
వామపక్ష ప్రభుత్వ ఆవిర్భావం..
2022లో గుస్తావో పెట్రో దేశ చరిత్రలో తొలి వామపక్ష అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన 2012 నుంచి 2015 వరకు దేశ రాజధాని బొగోటా నగరానికి మేయర్‌గా పనిచేశారు. ఆ కాలంలో బొగోటా నగరాన్ని బాగా అభివృద్ధి చేశారు. బస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంను ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ప్రఖ్యాత BRTS విధానంగా బొగోటా పేరుగాంచింది.
దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రభుత్వం “సంపూర్ణ శాంతి” విధానాన్ని ప్రకటించి మిగిలిన సాయుధ సంస్థలతో చర్చలకు ప్రయత్నించింది.
అయితే పెరుగుతున్న నేరాలు, మాదకద్రవ్య రవాణా, భద్రతా సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రజలలో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల సమయంలో భద్రత ప్రధాన అంశంగా మారింది.
2026 ఎన్నికల ప్రధాన అజెండా..
ఈ ఎన్నికలు రెండు రాజకీయ దృక్పథాల మధ్య జరిగిన పోరాటంగా నిలిచాయి. ఒకవైపు శాంతి చర్చలు, సామాజిక సంక్షేమం, సంస్కరణలను సమర్థించిన వామపక్షం, మరోవైపు కఠిన భద్రతా చర్యలు, నేర ముఠాలపై ఉక్కుపాదం, మార్కెట్ ఆధారిత ఆర్థిక విధానాలను సమర్థించిన రైట్ వింగ్ పార్టీ పోటీపడ్డాయి.
చివరికి ట్రంప్ అనుయాయుడు, అమెరికా పౌరసత్వం కూడా కలిగిన రైట్ వింగ్ పార్టీ అభ్యర్థి విజయం సాధించినప్పటికీ, వామపక్ష అభ్యర్థి కూడా దాదాపు సగం ఓట్లు పొందడం వల్ల కొలంబియాలో వామపక్ష ప్రభావం బలంగా ఉందని స్పష్టమైంది.
లాటిన్ అమెరికాపై ప్రభావం..
ఇటీవలి కాలంలో అర్జెంటీనా, ఈక్వెడార్ తదితర దేశాలలో కూడా రైట్ వింగ్ శక్తులు బలపడుతున్నాయి. కొలంబియా ఫలితం ఈ ధోరణిని మరింత బలపరిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నేరాలు, ఆర్థిక మందగమనం, భద్రతా సమస్యలు ప్రజలను కఠిన విధానాల వైపు మళ్లిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే లాటిన్ అమెరికాలో వామపక్ష రాజకీయాలు అంతరించిపోలేదు. సామాజిక అసమానతలు, పేదరికం, కార్మిక సమస్యలు కొనసాగుతున్నంత వరకు వామపక్ష రాజకీయాలకు ప్రజల్లో ఆదరణ కొనసాగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కొత్త ప్రభుత్వానికి ముందున్న ప్రధాన సవాళ్లు..
1. పెరుగుతున్న హింస, మాదకద్రవ్య ముఠాలను నియంత్రించడం.
2. శాంతి ఒప్పంద అమలును కొనసాగించడం.
3. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.
4. రాజకీయ విభజనను తగ్గించడం.
5. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచడం.
అత్యల్ప ఓట్ల తేడాతో విజయం సాధించినందున కొత్త అధ్యక్షుడు దేశంలోని అన్ని వర్గాల మద్దతును పొందాల్సిన అవసరం ఉంది.
విభజన కంటే సమైక్యతకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే కొలంబియా స్థిరత్వం, అభివృద్ధి దిశగా ముందుకు సాగగలదు.
కొలంబియా ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు. అవి శాంతి, భద్రత, సంక్షేమం, మార్కెట్ విధానాలు, సంభాషణ, కఠిన చర్యల మధ్య జరిగిన రాజకీయ ఎంపిక.
ఈ ఎన్నికల ప్రభావం రాబోయే సంవత్సరాలలో కేవలం కొలంబియా పైనే కాకుండా మొత్తం లాటిన్ అమెరికా రాజకీయాలపై కూడా కనిపించే అవకాశం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
