తిరుపత్తూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి, నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అభ్యర్థి కేఆర్ పెర్యకరుప్పన్ను తమిళగ వెట్రి కజగం(టీవీకే) అభ్యర్థి ఆర్ శ్రీనివాస సేతుపతి ఓడించారు.
న్యూఢిల్లీ: శివగంగ జిల్లాలో ఉన్న తిరుపత్తూర్ శాసనసభ నియోజకవర్గంలో పోటీ కేవలం ఒక్క ఓటు తేడాతో ముగిసింది.
తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇంత తక్కువ తేడాతో ఫలితం వెలువడటం ఇదే తొలిసారి.
అర్థరాత్రి వరకు నాటకీయంగా సాగిన లెక్కింపు ప్రక్రియ అనంతరం మాజీ మంత్రి, నాలుగు సార్లు శాసనసభ్యునిగా పని చేసిన ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అభ్యర్థి కేఆర్ పెర్యకరుప్పన్పై తమిళగ వెట్రి కజగం(టీవీకే) అభ్యర్థి ఆర్ శ్రీనివాస సేతుపతి విజయం సాధించారు.
ఆరంభంలో డీఎంకే ముందంజ..
తొలి లెక్కింపు పోకడలు పెర్యకరుప్పన్కు అనుకూలంగా కనిపించాయి.
మొత్తం 30 రౌండ్లకుగానూ మొదటి రౌండ్ ముగిసే సరికి ఆయన 902 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు, రోజంతా ఎక్కువగా ముందంజలోనే కొనసాగారు.
అయితే 25వ రౌండ్ ముగిసే నాటికి సేతుపతికి వచ్చిన 76,646 ఓట్లతో పోలిస్తే పెర్యకరుప్పన్కు 77,773 ఓట్లు వచ్చాయి.
మారిన ఫలితాల సరళి..
26వ రౌండ్లో సేతుపతి 199 ఓట్ల ఆధిక్యంలోకి వెళ్లడంతో అప్పటివరకు ఉన్న ఫలితాల సరళి పూర్తిగా మారిపోయింది. ఆ తదుపరి రౌండ్లలో ఆయన లీడ్ పెరుగుతూ వెళ్లింది.
27వ రౌండ్లో 606 ఓట్లతో, 28వ రౌండ్లో 691 ఓట్లతో ముందుండగా- 29లో 788 ఓట్లు, 30వ రౌండ్ ముగిసే సరికి 819 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
ఈ దశలో సేతుపతికి 83,010 ఓట్లు పడగా, పెర్యకరుప్పన్కు 82,191 ఓట్లు వచ్చాయని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.
ఒక్క ఓటుతో గెలుపు – అర్ధరాత్రి ప్రకటన..
ఆసక్తికరమైన విషయమేమిటంటే, సేతుపతికి 365 పోస్టల్ ఓట్లు రాగా, పెర్యకరుప్పన్కు 1,183 ఓట్లు వచ్చాయి. మొత్తం లెక్కింపు పూర్తి అయ్యేసరికి, కేవలం ఒక్క ఓటు తేడాతో సేతుపతి గెలుపొందారు.
డీఎంకే అభ్యంతరాల మేరకు చెల్లని ఓట్లను పలు మార్లు పరిశీలించిన తర్వాతనే తెల్లవారుజామున సుమారు 1.15 గంటలకు విజేతను ప్రకటించినట్టు అధికారులు విలేకరులకు చెప్పారు.
లెక్కింపు సమయంలో ఇద్దరు అభ్యర్థుల మధ్య అంతరంలో హెచ్చుతగ్గులు విస్తృతంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
10వ రౌండ్లో గరిష్టంగా 4,902 ఓట్ల తేడా నమోదు కాగా, అన్ని రౌండ్లలో సగటు తేడా 2,637 ఓట్లుగా ఉంది.
ఓటింగ్ బహిష్కరణ ప్రభావం..
ఆర్ పాలకురిచ్చిలో పోలీస్ స్టేషన్ పరిధులను మార్చాలని, తిరుపత్తూర్ నుంచి పొన్నామరవతికి ఓటింగ్ హక్కులను మార్చాలని డిమాండ్ చేస్తూ 2,012 మంది ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు.
“మా సమస్యలను పరిష్కరించి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి” అని స్థానికులు చెప్పినట్టు టీఎన్ఐఈ కథనం తెలియజేసింది.
మొత్తం 234 సీట్లలో టీవీకే 108 స్థానాలను గెలుచుకొని మెజారిటీ మార్క్ 118కు కొంత దూరంలో నిలిచిపోగా, డీఎంకే కేవలం 59 సీట్ల గెలుపుతో సరిపెట్టుకుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
