సామాన్య భారతీయులను ఇంటి నుంచి పనిచేయాలని, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, బంగారం కొనవద్దని కోరడం ఆచరణ సాధ్యం కాని విషయం.
మరోపక్క పాలకవర్గం మాత్రం విలాసవంతమైన అధికారిక పర్యటనలు, భారీగా ఇంధనం ఖర్చయ్యే రాజకీయ కార్యక్రమాలు, ఏమాత్రం నియంత్రణ లేని ప్రభుత్వ వ్యయంతో ముందుకు సాగుతోంది.
న్యూఢిల్లీ: ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్(ఒకే కారులో అందరూ వెళ్లడం) చేయాలని, ప్రజా రవాణాను ఉపయోగించాలని, ఇంటి నుంచి పని చేయాలని, “వంట నూనెను తక్కువగా వినియోగించాలని”, “సంవత్సరం పాటు” అత్యవసరం లేని విదేశీ పర్యటనలను పరిమితం చేసుకోవాలని పౌరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడి, దిగుమతి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆయన ఈ పిలుపునిచ్చారని ప్రభుత్వ వర్గాలు ముడిపెడుతున్నాయి.
ఎన్నికలయ్యాకే పొదుపు పాఠాలు..
జాతీయ త్యాగం చేయాలని కోరుతూ ఇచ్చిన ఈ పిలుపు సమయాన్ని గమనిస్తే, మోదీ రాజకీయ నాయకత్వంలో ఉండే రాజకీయ ప్రయోజనకాంక్ష మరోసారి బట్టబయలైంది.
ఈ పొదుపు చర్యలను ప్రకటించడానికి ఆయన పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు వేచి చూశారు.
హైవోల్టేజ్ ఎన్నికల ప్రచారంలో ఇంధన పొదుపు అవసరం గురించి గానీ, ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం గురించి గానీ మోదీ ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదు.
ఆయన పార్టీ యంత్రాంగం భారీ ఎత్తున వనరులను, ర్యాలీల కోసం ఇంధనాన్ని వాడి- తీవ్రంగా క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలను ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇప్పుడు ఓటింగ్ ముగిసింది. కాబట్టి తన ఆర్థిక వైఫల్యాలకు, ముందస్తు ప్రణాళికా రాహిత్యానికి పరిహారంగా ప్రజలు ఇంటి నుంచి పని చేయాలని, ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం ఆశిస్తోందా? రాష్ట్ర వనరులను విపరీతంగా వాడి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, ఆర్థిక నిర్వహణా లోపాల భారాన్ని ప్రజలు పంచుకోవాలని కోరడం ప్రభుత్వ విరక్తికరమైన విధానానికి నిదర్శనమని విమర్శకులు అంటున్నారు.
ప్రభుత్వ దుబారా – ప్రజలపై భారం..
ప్రజలు తమ కనీస వినియోగాన్ని తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం, మరోపక్క ఖరీదైన కేంద్ర ప్రాజెక్టులను, భారీ రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
మోదీ ప్రసంగం ముగిసిన వెంటనే బహుళ ఎస్‌యూవీల కాన్వాయ్‌లతో రోడ్ షోలు నిర్వహించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలు యథేచ్ఛగా కొనసాగుతాయి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో వర్క్-ఫ్రమ్-హోమ్(ఇంటి నుంచి పని) అమలు చేయడానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆదేశాలు లేవు.
అత్యంత ఖరీదైన తన అంతర్జాతీయ పర్యటనలను గానీ, ప్రభుత్వ దుబారాను గానీ సాక్షాత్తూ మోదీ ఏమాత్రం తగ్గించుకోలేదు.
పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను ఎన్నికల సమయానికి అనుగుణంగా మార్చే ఈ విధానం- ప్రభుత్వం స్థిరమైన విధానాలకు బదులు ఎన్నికల లబ్ధికే ప్రాధాన్యత ఇస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తూ విమర్శలపాలవుతోంది.
దీర్ఘకాలిక కోశ, వాణిజ్య అసమతుల్యతల వల్ల తలెత్తిన సమస్యల మూలాలను నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా పరిష్కరించకుండా, ఆ బాధ్యతను పౌరులపైకి నెట్టేస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం..
“ఇవి ధర్మ ప్రవచనాలు కావు, మోదీ ప్రభుత్వ వైఫల్యాలకు సాక్ష్యాలు” అని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
“ప్రజలు ఏమి కొనాలో, ఏమి కొనకూడదో, ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడికి వెళ్లకూడదో చెప్పే పరిస్థితికి 12 ఏళ్లలో ఆయన దేశాన్ని దిగజార్చారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ప్రతిసారీ వారు ఆ బాధ్యతను ప్రజలపై మోపుతున్నారు” అని ఆయన అన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ తీవ్రతను దాచిపెట్టడం, మోదీకి ఆర్థిక వివేకం కంటే రాజకీయ మనుగడే ముఖ్యమని రుజువు చేస్తోంది.
కేవలం ‘బాహ్య’ కారణాలే కాదు..
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కంటే ముందు నుంచే, దేశ ఆర్థిక వ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక బలహీనతలే దేశాన్ని ఈ దుస్థితికి నెట్టాయని భారత ఆర్థిక సూచీలు స్పష్టం చేస్తున్నాయి.
దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారత్ ఆధారపడటం 2014 నాటి 77.6% నుంచి 2026 నాటికి 88.6%కి పెరిగింది.
దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తి వరుసగా పలు సంవత్సరాలుగా క్షీణిస్తుండగా, ఇంధనం, శుద్ధి చేసిన ఉత్పత్తులకు డిమాండ్ మాత్రం బాగా పెరిగింది.
భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను మోదీ ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే నింపింది. 5.33 మిలియన్ టన్నుల సామర్థ్యానికి గాను కేవలం 3.37 మిలియన్ టన్నులు(సుమారు 64%) మాత్రమే నిల్వ చేశారు.
సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే ఇది కేవలం 10 రోజులకు మాత్రమే కవరేజ్ అందిస్తుంది.
అంతర్జాతీయ ఇంధన భద్రతా ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన 90-రోజుల నిల్వలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
దిగుమతులపై ఆధారపడే చైనా మాదిరిగా కాకుండా, పశ్చిమాసియా అలజడుల వల్ల ఏర్పడే ధరల హెచ్చుతగ్గులకు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యేలా మోదీ ప్రభుత్వం వదిలేసింది.
కొన్నేళ్లుగా ముడిచమురు తక్కువ ధరకు లభిస్తున్నప్పుడు పంప్ ధరలను ఏమాత్రం తగ్గించని మోదీ ప్రభుత్వం, ఇప్పుడు మాత్రం ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని పౌరులను కోరుతోంది.
ఆ కాలంలో వచ్చిన లాభాలను భారతీయ వినియోగదారులకు సబ్సిడీగా ఉపయోగించాలి, అలాగే ఇథనాల్‌తో సహా ఇంధన ధరల నిర్ణయ ప్రక్రియను దేశానికి పారదర్శకంగా వెల్లడించాలి.
ముడి చమురుకు గ్లోబల్ మార్కెట్లలో చెల్లించే ధరతో ముడిపెట్టి, ఒక స్పష్టమైన “ఫార్ములా ఆధారిత పబ్లిక్ ప్రైసింగ్ మోడల్” ద్వారా మాత్రమే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పారదర్శకంగా ఉండాలని థింక్‌ట్యాంక్ జీటీఆర్ఐ కోరింది.
చారిత్రక కనిష్టానికి రూపాయి పతనం..
ప్రధానమంత్రిగా మోదీ ఒక పుష్కరం(12 ఏళ్లు) కాలంగా అధికారంలో ఉన్నారు. ప్రతి సమస్యను పశ్చిమాసియా సంక్షోభంపైకి నెట్టేయకుండా, తన విధానాలు, చర్యలకు ఆయనే బాధ్యత వహించాలి.
గత ఏడాది కాలంగా ఆసియాలోనే “అత్యంత దారుణంగా పతనమైన కరెన్సీగా” రూపాయి నిలిచింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోయింది.
2024 చివరి నాటికి 85-86 వద్ద ట్రేడ్ అయిన రూపాయి, 2025 చివరికి 90కి చేరుకుని, మే 2026 నాటికి 94-95 దరిదాపుల్లోకి పడిపోయింది.
ఇది ఇటీవలి కాలంలో 10 శాతానికి పైగా తరుగుదలను సూచిస్తుండగా, 2014లో 60 స్థాయిలో ఉన్నప్పటి నుంచి సుదీర్ఘకాల పతనానికి అద్దం పడుతోంది.
2010 దశాబ్దం ప్రారంభం తర్వాత రూపాయికి ఇది అత్యంత చెత్త వార్షిక పనితీరు. ఇది కేవలం పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏర్పడిన తాత్కాలిక షాక్ కాదు; విదేశీ మూలధనం నిరంతర ఉపసంహరణ, ముడిచమురు ధరల పెరుగుదల, బలమైన డాలర్ వంటి కారణాల సమ్మేళనాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
కరెన్సీ పతనం వల్ల ఇంధనం, ఎలక్ట్రానిక్స్, మూలధన వస్తువులతో సహా దాదాపు అన్ని దిగుమతుల వ్యయం పెరుగుతుంది.
ఇది నేరుగా ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్య గృహస్తులపై ధరల ఒత్తిడిని పెంచుతుంది.
అయితే షేర్ మార్కెట్ల నుంచి భారీగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం, భారత్‌లో నికర ఎఫ్‌డీఐ రికార్డు పేలవంగా ఉండటం వంటి రూపాయి బలహీనతలు.. ఇరాన్‌పై దాడుల కంటే ముందు నుంచే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాణిజ్య లోటు కూడా భారీగా విస్తరించింది. భారత్ వస్తు వాణిజ్య లోటు 2023-24లో $241.1 బిలియన్ల నుంచి 2024-25లో $282.8 బిలియన్లకు పెరిగింది.
ఎగుమతుల కంటే దిగుమతులు వేగంగా పెరగడంతో వస్తు, సేవలు కలిపిన మొత్తం వాణిజ్య గ్యాప్ 2025-26లో మరింతగా విస్తరించింది.
చైనాతో భారత్ వాణిజ్య లోటు గణనీయంగా పెరిగింది. 2025-26 నాటికి అది $116 బిలియన్లకు చేరుకుంది. ఎగుమతుల కన్నా దిగుమతులే అధికంగా ఉండటం- ఉత్పాదక, వినియోగ అవసరాల కోసం చైనా వస్తువులపై మన దేశం ఇంకా భారీగానే ఆధారపడుతోందని ఇది సూచిస్తోంది.
మచ్చుకైనా కనిపించని దౌత్యం..
మోదీ విదేశాంగ విధాన ఎంపికలు ప్రాంతీయ ప్రమాదాల నుంచి భారత్‌ను రక్షించలేకపోయాయి. ఇజ్రాయెల్, యూఏఈ వంటి భాగస్వాములతో సన్నిహితంగా మెలగడం వల్ల, ఇంధన భద్రత అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో మన పలుకుబడి తగ్గిపోయింది.
మారుతున్న గ్లోబల్ ఆర్డర్లో లోతైన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కొనసాగించడంలో లేదా స్థిరమైన ధరలకు దీర్ఘకాలిక ఇంధన కాంట్రాక్టులను దక్కించుకోవడంలో మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం విఫలమైంది.
కీలక మార్గాల్లో అంతరాయాలు దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయి, దానికి దేశీయ బలహీనతలు తోడై ఆ ప్రభావం తీవ్రమవుతోంది.
ఉదాహరణకు, టెహ్రాన్ మొదట్లో కొన్నింటిని అనుమతించినప్పటికీ, హార్ముజ్ జలసంధిలో భారతీయ నౌకలు చిక్కుకుపోవడం ఇంకా కొనసాగుతూనే ఉంది.
మోదీ నేతృత్వంలో పేరుకుపోయిన ఆర్థిక నిర్వహణా లోపాలను ఈ సూచీలు నొక్కి చెబుతున్నాయి. బలహీనమైన కరెన్సీ, పెరుగుతున్న లోటు, అసంపూర్ణ నిల్వలు, అసమాన ఉపాధి వృద్ధి కారణంగా విధానపరమైన అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో రాజకీయ జవాబుదారీతనం నుంచి తప్పించుకుని, ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న పేద భారతీయులపై భారాన్ని మోపుతున్నారు.
బాధ్యత నుంచి తప్పించుకునే వ్యూహం..
మోదీ ఈ పిలుపునిచ్చిన సమయం ఒక మోసపూరిత రాజకీయ చర్యగా ఆన్లైన్లో విస్తృత విమర్శలకు దారితీసింది. పొదుపు చర్యలను ఒక జాతీయ త్యాగంగా అభివర్ణించడం ద్వారా, రూపాయి పతనానికి, పెరుగుతున్న విదేశీ రంగ లోటుకు, ఇంధన పన్నుల నిర్మాణం, దిగుమతులపై ఆధారపడే వృద్ధి వ్యూహం వంటి విధానపరమైన లోపాల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఆ భారాన్ని గృహస్తులు, వ్యాపార వర్గాలపై మోదీ నెట్టేస్తున్నారు.
ఒక బాధ్యత గల నాయకుడు- ఎన్నికల సంవత్సరం వరకూ వేచి చూసి అప్పుడు పౌరులను ఇంధన వినియోగం, ప్రయాణాలు తగ్గించుకోమని అడగడు.
దానికి బదులుగా, ఇంధన వనరులను ముందుగానే వైవిధ్యపరచడం(విస్తరించడం), వ్యూహాత్మక నిల్వలను పెంచడం, ఆర్థిక వృద్ధిలో ఆయిల్ ఇంటెన్సిటీని తగ్గించడానికి సరైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం వంటి ముందస్తు చర్యలు తీసుకుంటారని ఆశిస్తారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
