భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్)– సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
మే 10, 11 తేదీలలో న్యూఢిల్లీలో సమావేశమైన పొలిట్ బ్యూరో, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి మే 11న ఒక సమగ్ర పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్ష – కేరళ, బెంగాల్లో ఎదురుదెబ్బ..
ఏప్రిల్‌లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతోపాటు పశ్చిమ బెంగాల్ అనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తీరుపై పొలిట్ బ్యూరో సమీక్ష నిర్వహించింది.
పదేళ్ల నిరంతర పాలన తర్వాత కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని, అక్కడ తొలిసారిగా బీజేపీ మూడు సీట్లు గెలుచుకోవడం తీవ్రమైన ముప్పును సూచిస్తుందని సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది.
సీపీఐ(ఎం)పై నిరాధారమైన ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం, మత శక్తుల పట్ల మెతక వైఖరి అవలంబించడం వంటి కాంగ్రెస్ ప్రవర్తనే కేరళలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడిందని విమర్శించింది.
ఓటమి పాలైనప్పటికీ, ఎల్డీఎఫ్ 37.6 శాతం ఓట్లను సాధించి, ప్రజల్లో తనకున్న మద్దతును చాటుకుందని పార్టీ పేర్కొంది.
ఎన్నికల సమయంలో కష్టపడి పనిచేసిన ఎల్డీఎఫ్ కార్యకర్తలకు, సానుభూతిపరులకు, పార్టీకి ఓటు వేసిన కేరళ ప్రజలకు పొలిట్ బ్యూరో(పీబీ) ధన్యవాదాలు తెలిపింది.
రాష్ట్రంలో మతతత్వ శక్తుల పెరుగుదలను ప్రతిఘటించడంలో పార్టీ ముందుండి, సమాజంలోని లౌకిక, ప్రజాస్వామ్య స్వరూపాన్ని పరిరక్షిస్తుందని స్పష్టం చేసింది.
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వారి జీవనోపాధి, ప్రజాస్వామ్య హక్కులపై జరిగే ఎలాంటి దాడులనైనా ప్రతిఘటిస్తూనే ఉంటుందని ఉద్ఘాటించింది.
పార్టీ ఫలితాలపై ప్రాథమిక సమీక్షను నిర్వహించిందని, ఈ ఎదురుదెబ్బకు కారణమైన బలహీనతలను గుర్తించడానికి రాబోయే రోజుల్లో మరింత లోతైన సమీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
ఈ సమీక్ష సమయంలో పార్టీ సభ్యులు, శ్రేయోభిలాషులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన దిద్దుబాట్లు, సవరణలు చేపడతామని స్పష్టం చేశారు.
మతతత్వ ప్రచారంతోనే బెంగాల్, అస్సాంలో బీజేపీ గెలుపు..
పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం పార్టీకి ఒక పెద్ద దెబ్బ అని పొలిట్ బ్యూరో విశ్లేషించింది.
మతతత్వ, విభజన రాజకీయాలు, తీవ్ర ద్వేషపూరిత ప్రచారం, భారీ స్థాయిలో ధన వ్యయం చేయడంతో పాటు.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), ‘ఎస్ఐఆర్’వంటి ప్రక్రియలను, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారానే బీజేపీకి ఈ విజయం సాధ్యమైందని ఆరోపించింది.
అలాగే అవినీతి, నిరంకుశ టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న బలమైన వ్యతిరేకత కూడా బీజేపీకి లబ్ధి చేకూర్చిందని పేర్కొంది.
అస్సాంలో బీజేపీ పెరిగిన మెజారిటీతో తిరిగి ఎన్నికవడంతో పాటు, దేశంలో హిందుత్వ-మతతత్వ, మితవాద శక్తుల ప్రాబల్యం పెరుగుతున్న తీరు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
పుదుచ్చేరిలో కూడా బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించడాన్ని బ్యూరో ప్రస్తావించింది.
తమిళనాడులో ప్రజా తీర్పును అడ్డుకునే యత్నం – కొత్త ప్రభుత్వానికి సీపీఐ(ఎం) మద్దతు..
తమిళనాడు ఎన్నికల తీర్పును తారుమారు చేయడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది.
టీవీకే నాయకుడైన సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకోవడానికి వారు శాయశక్తులా ప్రయత్నించారని విమర్శించింది.
ఆ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్ ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చిందని పేర్కొంది.
లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించే ఉద్దేశంతోనే టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి సీపీఐ, వీసీకే పార్టీలతో కలిసి సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించిందని పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది.
నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అందుకుని తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రధాని పొదుపు పిలుపు అసంబద్ధం: సీపీఐ(ఎం) ఖండన..
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం సాకుతో పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధాని ప్రజలకు పిలుపునివ్వడం అత్యంత విడ్డూరంగా ఉందని సీపీఐ(ఎం) ఎద్దేవా చేసింది.
ఇరాన్‌పై(బ్రిక్స్ సభ్య దేశం) దాడులకు, ప్రస్తుత గందరగోళ పరిస్థితికి కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో ప్రధాని పూర్తిగా చేతులు కలపడం వల్లే ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది.
ఇరాన్‌పై దాడులను ఖండించకపోవడం, అమెరికా-ఇజ్రాయెల్ కూటమిని నిందించడానికి నిరాకరించడం దారుణమని పేర్కొంది.
ప్రజలను వస్తువులను తక్కువగా వినియోగించుకోమని, పొదుపుగా జీవించమని ఉచిత సలహాలు ఇవ్వడానికి బదులుగా.. అమెరికా దాడులను ఆపి, హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛా రవాణాను అనుమతించేలా ఒత్తిడి తీసుకురావడంలో గ్లోబల్ సౌత్ దేశాలతో భారత్ చేతులు కలపాలని హితవు పలికింది.
ప్రభుత్వానికి ఏమాత్రం ముందుచూపు ఉన్నా చమురు ఉత్పత్తుల కొనుగోలును ముందుగానే విస్తరించి ఉండేదని, అప్పుడు దేశానికి ఈ దుస్థితి తప్పేదని విమర్శించింది.
వ్యవసాయ సీజన్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న తరుణంలో, రైతులకు ప్రాధాన్యతా క్రమంలో ఎరువులు అందుబాటులోకి తీసుకురాకపోతే ఆహార ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటుందని పార్టీ హెచ్చరించింది.
ఇది ప్రజల జీవనోపాధిపై, మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎరువులను సేకరించి రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ చేసిన వాదనలు ప్రధాని తాజా ప్రకటనతో బట్టబయలయ్యాయని పీబీ విమర్శించింది. ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడానికి ప్రధాని ప్రకటనలే రుజువని పేర్కొంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రకటనలు చేయడం గమనార్హమని, అబద్ధాలతో ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతోనే ప్రజల నుంచి ఆర్థిక వాస్తవాలను ఇన్నాళ్లూ ఉద్దేశపూర్వకంగా మరుగున పెట్టారని ఆరోపించింది.
పొదుపు చర్యల పేరుతో ప్రభుత్వం విధించదలచిన ఆర్థిక భారాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా సన్నద్ధం కావాలని పీబీ పిలుపునిచ్చింది.
కార్మిక చట్టాల అమలు ఒక మోసపూరిత చర్య..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను(లేబర్ కోడ్లను) వాస్తవానికి 2026 ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తీసుకురావాలని భావించినప్పటికీ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూసి, ఫలితాలు వెలువడిన కేవలం నాలుగు రోజులకే వాటిని అమలులోకి తేవడం కేంద్రం మోసపూరిత వైఖరికి అద్దం పడుతోందని సీపీఐ(ఎం) మండిపడింది.
రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ఈ కార్మిక చట్టాలను అమలు చేయడానికి ఉత్సాహం చూపుతూ ముసాయిదా నిబంధనలను కూడా సిద్ధం చేశాయని దుయ్యబట్టింది.
కనీస వేతనాలు, మెరుగైన జీవన పరిస్థితులు కోరుతూ, పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ కార్మికులు దేశవ్యాప్తంగా చేస్తున్న భారీ నిరసనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ నిబంధనలను ప్రకటించడం బీజేపీ కార్మిక వ్యతిరేక స్వభావాన్ని బట్టబయలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం నోటిఫై చేసిన ఈ చట్టాలను అమలు చేయకుండా, భారత రాజ్యాంగం కల్పించిన శాసన అధికారాలను వినియోగించుకుని కార్మిక చట్టాలకు అవసరమైన సవరణలు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.
కొత్తగా నోటిఫై చేసిన ఈ నిబంధనల అమలును వ్యతిరేకిస్తూ పోరాడుతున్న కార్మికులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారితోనే నిలబడతామని పీబీ పునరుద్ఘాటించింది.
నియోజకవర్గాల పునర్విభజన ఓ పెద్ద కుట్ర..
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియ పేరుతో దేశ ఎన్నికల పటాన్ని మార్చాలనే కుటిల అజెండాను ముందుకు నెట్టడానికి బీజేపీ ప్రభుత్వం యత్నించిందని పొలిట్ బ్యూరో ఆరోపించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టి మద్దతు కూడగట్టాలని చూసిందని విమర్శించింది.
అయితే ఈ ప్రతిపాదనకు రాజ్యాంగ సవరణ, తద్వారా మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కావడంతో ప్రతిపక్షాలన్నీ సమిష్టిగా బీజేపీ కుట్రలను ఓడించాయని గుర్తుచేసింది.
దీనిపై ప్రతిపక్షాలను మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని ఎద్దేవా చేసింది.
ఈ దఫా బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టగలిగినప్పటికీ, డీలిమిటేషన్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరించింది.
ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా, బలహీనంగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేలా ఈ మొత్తం ప్రక్రియ వెనుక కుట్ర దాగి ఉందని విశ్లేషించింది.
ఈ అజెండాను అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వ సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని వాడుకుంటోందని స్పష్టం చేసింది.
డీలిమిటేషన్ ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేకుండా, వచ్చే విడత ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును బేషరతుగా అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియపై ఆందోళన..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియ ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై భారీ ప్రభావాన్ని చూపిందని పార్టీ ఆరోపించింది.
ఓటర్లు అప్పీల్ చేసుకుని, తగిన డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించినప్పటికీ, ఈసీఐ ‘తార్కిక వ్యత్యాసాలు'(లాజికల్ డిస్క్రిపెన్సీస్) అనే కొత్త సాకును చూపి దాదాపు 27 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఏకపక్షంగా తొలగించిందని మండిపడింది.
ఈ తొలగింపులు ఎన్నికల ఫలితాలపై పెను ప్రభావం చూపాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితాలను ఇలా తారుమారు చేయడం మున్నెన్నడూ జరగలేదని, ఈ వ్యవహారం మన ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వ సంస్థలలో దాదాపు అన్ని స్థాయిల్లోకి చొచ్చుకుపోయిన తమ అనుకూల కేడర్‌ను అడ్డుపెట్టుకుని ఆర్ఎస్ఎస్-బీజేపీ తమ లక్ష్యాలను సాధించడానికి కుట్రలు పన్నుతున్నాయని విమర్శించింది.
బెంగాల్ నూతన బీజేపీ ముఖ్యమంత్రికి సలహాదారు పదవికి ఒక ఎన్నికల పరిశీలకుడిని నియమించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది.
వాస్తవాలను, విమర్శలను పట్టించుకోకుండా ఈసీఐ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఏకపక్షంగా కొనసాగించడం దారుణమని, ఈ కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న వైఖరి సైతం అత్యంత దురదృష్టకరమని పీబీ వ్యాఖ్యానించింది.
కార్మికుల ఆకస్మిక నిరసనలకు పూర్తి మద్దతు..
గత రెండు నెలలుగా దేశంలో అత్యంత తీవ్రమైన, ఆకస్మిక కార్మిక వర్గ నిరసనలు వెల్లువెత్తాయని పార్టీ గుర్తుచేసింది.
ఇవి ప్రధానంగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సిఆర్) చుట్టూ కేంద్రీకృతమైనప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించాయని తెలిపింది.
నిరసన బాట పట్టిన వారిలో అత్యధిక శాతం మంది కాంట్రాక్ట్, వలస మరియు అసంఘటిత రంగ కార్మికులే ఉన్నారని, వీరిలో చాలామంది యువకులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారేనని బ్యూరో పేర్కొంది.
తమ సమస్యలను వెలుగెత్తి చాటడానికి, పోరాట సమీకరణ కోసం వారు సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకున్నారని ప్రశంసించింది.
నాయకత్వం వహించడానికి నిర్దిష్ట యూనియన్ లేకపోయినా వారు ఆకస్మికంగా రోడ్లెక్కి నిరసనలు తెలిపారని పేర్కొంది.
ఉత్తర ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ నిరసనలను క్రూరంగా అణచివేసేందుకు పోలీసు బలగాలను ప్రయోగించిందని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది.
వందలాది మంది కార్మికులను అకారణంగా అరెస్టు చేయగా, చాలామంది ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
నిరసనల తీవ్రత, దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకత దెబ్బకు గత్యంతరం లేక ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాల్సి వచ్చిందని, అయితే ఆ పెంపు నామమాత్రంగానే ఉందని విమర్శించింది.
కార్మికులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ప్రభుత్వాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించి కనీస వేతనాలను సముచితంగా పెంచాలని డిమాండ్ చేసింది.
దీనిని శాంతిభద్రతల సమస్యగా కాకుండా న్యాయబద్ధమైన కార్మిక వివాదంగా పరిగణించాలని పీబీ స్పష్టం చేసింది.
క్యూబాపై అమెరికా ఆంక్షల ఖండన – కేంద్రం ‘దాసోహ’ విదేశాంగ విధానంపై విమర్శలు..
క్యూబాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా మరోసారి చేసిన ప్రకటనలను, ఆంక్షలను మరింత కఠినతరం చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. అమెరికా సైనిక దండయాత్ర బెదిరింపులను తప్పుబట్టింది.
మే 1న, క్యూబా సంస్థలతో లావాదేవీలు జరిపే ఏ విదేశీ సంస్థపైనైనా కఠినమైన ద్వితీయ ఆంక్షలు విధిస్తూ అగ్రరాజ్యం జారీ చేసిన ఉత్తర్వు- సార్వభౌమ మూడవ పక్ష దేశాలపై ప్రయోగిస్తున్న ప్రత్యక్ష బలప్రయోగమేనని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు అని స్పష్టం చేసింది.
క్యూబాకు పీబీ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియజేస్తూ, అమెరికా సామ్రాజ్యవాద బెదిరింపులను సమైక్యంగా ఖండించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
క్యూబాపై ఆర్థిక దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
అదే సమయంలో, ఇరాన్‌పై అమెరికా దురాక్రమణను నిస్సందేహంగా ఖండించడంలో భారత ప్రభుత్వం దారుణంగా విఫలమైందని సీపీఐ(ఎం) దుయ్యబట్టింది.
బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న దేశంగా ఉన్న భారత్‌కు ఈ వైఫల్యం మచ్చ తెచ్చిందని, దీనివల్ల గ్లోబల్ సౌత్ దేశాల మధ్య భారతదేశం తన గౌరవాన్ని, స్థానాన్ని కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
క్యూబాపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, క్యూబాకు సంఘీభావం తెలుపుతూ గట్టి వైఖరి తీసుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం శోచనీయమని పేర్కొంది.
ఇది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వపు లొంగుబాటు(దాసోహపూరిత) విదేశాంగ విధానానికి మరో నిదర్శనమని విమర్శించింది.
మే 22 నుంచి కేంద్ర కమిటీ సమావేశాలు..
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ 2026 మే 22-24 తేదీలలో న్యూఢిల్లీలో సమావేశం కానుందని పొలిట్ బ్యూరో ప్రకటనలో తెలిపింది.
ఈ సమావేశాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై నాయకత్వం లోతుగా చర్చించనుందని బ్యూరో వెల్లడించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
