కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక పక్క కార్పొరేట్ అనుకూల విధానాలను వేగంగా అమలు చేస్తూ, ప్రజలపై విపరీతమైన భారాలను వేస్తున్నా, మరోపక్క ఆశ్చర్యకరంగా వరుస ఎన్నికలలో గెలుస్తూనే వస్తోంది.
ఇంకా విశేషమేమిటంటే ప్రత్యేక రక్షణ చట్టాలున్న ఐదవ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాలలోని అపార ప్రకృతి వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతూ, అక్కడ కూడా అనూహ్యంగా గెలవడం. దీనికి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి అన్నది పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు అగుపిస్తాయి.
ఆదివాసీల నుంచి వనవాసీల వైపు: మారుతున్న పదజాలం..
గిరిజనులు భారతదేశపు అతి ప్రాచీన జీవన విధానాన్ని పాటించే సమాజం. వారిది గ్రంథాలు లేని, ప్రకృతిని పూజించే జీవన మతం.
ప్రత్యేక ఆచారాలు, ప్రత్యేక జీవన విధానం ఉన్నాయి. వారు సాంప్రదాయ హిందూమతంలో భాగం కాదు. కానీ ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ గిరిజన ప్రాంతాల్లో హిందూమతాన్ని నాటేందుకు వ్యూహపూరితంగా ప్రచారం చేస్తున్నాయి. గిరిజన సంస్కృతిని ‘హిందూకరణ’ చేస్తున్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు గిరిజనులను “ఆదివాసి” అనగా ఈ భూమికి మొదటి వారసులు అని పిలవడానికి బదులుగా “వనవాసి” అంటే అడవుల్లో నివసించేవారు అని పిలుస్తారు.
‘ఆదివాసి’ అనే పదంలో ఈ దేశపు సంపద, అడవులు, భూములపై వారికి ఉన్న ‘మొదటి హక్కు’ కనిపిస్తుంది. కానీ ‘వనవాసి’ అనడం ద్వారా వారిని కేవలం అడవిలో ఉండే మనుషులుగా చిత్రీకరిస్తూ, భూములపై వారికున్న చారిత్రక హక్కులను కాలరాయడమనే కుట్ర దాగి ఉంది.
వీరు గిరిజన ప్రాంతాలలో బలం పెంచుకోవడానికి విభిన్న ప్రచార మార్గాలను ఎంచుకుంటున్నారు.
సంస్కృతిలో హిందూత్వ విలీనం..
వనవాసి కల్యాణ పరిషత్ లాంటి సంస్థలు గిరిజన ప్రాంతాల్లో ఉచిత విద్య, వైద్యం, వివాహ సహాయం పేరుతో జాతీయవాద భావజాలాన్ని నింపుతాయి. గిరిజన దేవతల బదులుగా హనుమాన్, రాముడు, శివుడు లాంటి దేవతలను పరిచయం చేస్తారు. గిరిజనుల మూలం కూడా వేదకాలపు హిందువులే అనే వాదనను నెత్తిన ఎక్కిస్తారు.
గిరిజన గ్రామాలలో చిన్న చిన్న ఆలయాలు నిర్మించి, ఆధునిక హిందూ పూజా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. గ్రామ పెద్దల ద్వారా శివరాత్రి, గణేష్ చవితి లాంటి పండుగలను ఆచరింపజేస్తున్నారు. ఇది స్థానిక దేవతల విలీనానికి దారితీస్తోంది.
ప్రభుత్వ, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్యాంశాల ద్వారా హిందూ మత పురాణ కథలు బోధిస్తూ, గిరిజన బాలలను మెల్లగా హిందూత్వ వైపు మళ్ళిస్తున్నారు. వారి భూములు, దేవతలు, సంస్కృతి అన్నింటిపై ఆక్రమణ చేస్తూ బీజేపీ “ఐడియలాజికల్ అసిమిలేషన్”(ఆలోచనా విలీన ఉద్యమం)కు వేగం పెంచింది.
బస్తర్, కంధమాల్లలో మతపరమైన మార్పులు..
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో పెద్దఎత్తున గిరిజన క్రైస్తవులు ఉన్నారు. 2008లో విశ్వహిందూ పరిషత్ గిరిజన క్రైస్తవులపై దాడులు చేసింది. లక్షలాది మంది బలవంతంగా “హిందువులం” అనే అంగీకారం తీసుకోవాల్సి వచ్చింది.
ఛత్తీస్‌గఢ్ – బస్తర్ ప్రాంతంలోని దంతేవాడ, బీజాపూర్, సుక్మాలలో వనవాసి కల్యాణ సంస్థలు ఆదివాసీలకు హిందూ మత శిక్షణ ఇస్తున్నాయి. గిరిజన దేవతలకు బదులు “జై శ్రీరాం” నినాదాలు ఇప్పిస్తున్నాయి.
బస్తర్ ప్రాంతంలో దసరా గతంలో స్థానిక దేవతల పండుగగా ఉండేది. ఇప్పుడు దీనిని రామరాజ్య దసరాగా ప్రచారం చేస్తున్నారు. గిరిజన యువతకు వేట యాత్రల బదులు, రామనవమి ఊరేగింపులు జరపడం ప్రారంభమైంది. ఫలితంగా నేడు దేశంలోని అనేక గిరిజన ప్రాంతాల్లో బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది.
గుజరాత్లో దశాబ్దాల వ్యూహం..
గుజరాత్ రాష్ట్రంలోని డాంగ్‌లో 1990 దశకంలో బీజేపీ అనుబంధ సంస్థ వనవాసి కల్యాణ ఆశ్రమ్ అడుగుపెట్టింది.
పాఠశాలలు, ఆశ్రమాలు స్థాపించి, గిరిజన పిల్లలకు ఉచిత విద్య పేరుతో రామాయణ, మహాభారతం బోధించింది.
గిరిజనులు చాలామంది క్రైస్తవులుగా మారడం వల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్తో కూడిన సాంస్కృతిక మేళాను జరుపుకుంటుంటారు.
2006లో విశ్వహిందూ పరిషత్ “ఇది విదేశీ మతం ప్రభావం” అంటూ వ్యతిరేకించి, అదే తేదీన “హనుమాన్ జయంతి” జరుపుకోవాలని ప్రచారం ప్రారంభించింది.
ఈ సందర్భంగా నలభై హనుమాన్ విగ్రహాలను గిరిజన గ్రామాల్లో ప్రతిష్టించింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు “ఒకే సంస్కృతి – ఒకే దేశం” అనే నినాదంతో ముందుకు వెళ్లారు.
గిరిజన యువకులను ఆర్ఎస్ఎస్ శిబిరాలకు తీసుకెళ్లి, దేశభక్తి, హిందూ ఇతిహాసాలు, పరశురాముడు, శివుడు లాంటి దేవతల విలువల గురించి బోధిస్తున్నారు.
గిరిజన ఓటు బ్యాంక్‌ను ఉద్దేశించి “వారు క్రైస్తవులైపోతున్నారు, మన సంస్కృతి గల్లంతవుతుంది” అనే విషపు ప్రచారం కూడా జరిగింది.
ఫలితంగా 1990 వరకు ఈ ప్రాంతంలో ఏమీలేని బీజేపీకి 2002 తర్వాత గిరిజన ఓట్లు భారీగా వచ్చాయి.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో, గుజరాత్ గిరిజన ప్రాంతాల్లో 27 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో 24 సీట్లు గెలిచింది.
మధ్యప్రదేశ్, ఒడిశాలలో రాజకీయ లబ్ధి..
మధ్యప్రదేశ్‌లోని జబువా, ఆలిరాజ్పూర్, ధర్ జిల్లాలలో 2000 నాటికి కాంగ్రెస్ దాదాపు గిరిజన వర్గాలపై ఆధిపత్యం కలిగి ఉండేది.
బీజేపీ గిరిజన యువతలో “వీర హిందూ” భావజాలం నూరిపోసే ప్రయత్నం చేసింది.
“రాజ గోండు”, “భీల్ రాజవంశీయులు” అనే భవితవ్యాన్ని ప్రచారం చేసి గౌరవం, గొప్పతనంతో మత భావాన్ని కలిపారు.
2013లో 47 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ 31 సీట్లు గెలిచింది. ఒడిశాలోని మయూర్భంజ్, సుందర్‌గఢ్, కంధమాల్ జిల్లాలలో గిరిజనులు ఎక్కువగా క్రైస్తవులు. 2008 కంధమాల్ మత ఘర్షణల తర్వాత, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ పెద్ద ఎత్తున “గిరిజనులు హిందువులే” అనే ప్రచారం మొదలుపెట్టాయి.
వీహెచ్‌పీ నాయకుడు స్వామి లక్ష్మణానంద హత్యను బలమైన రాజకీయాయుధంగా వాడారు.
క్రైస్తవులపై దాడులు, చర్చిల ధ్వంసం, వేలాది ఇళ్లు కూల్చివేత, లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఫలితంగా మత విభజన జరిగింది.
2019లో బీజేపీ మయూర్భంజ్ పార్లమెంటు స్థానాన్ని గెలిచింది. ఇది గతంలో ఎక్కువగా బీజేడీకి దక్కేది.
జార్ఖండ్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు కాషాయ వ్యూహాలు..
జార్ఖండ్‌లో గిరిజనుల డిమాండు అయిన సర్ణ మతం గుర్తింపుకు బీజేపీ వ్యతిరేకంగా ఉండగా కూడా, వారి మత ప్రచారం, సేవా కార్యక్రమాల వల్ల గిరిజన ఓటు భాగం గెలుచుకున్నారు. 2014లో ఖుంటి, రాంచీ, లోహర్దాగా ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లోని దంతేవాడ, బీజాపూర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం.
బీజేపీ అనుబంధ సంస్థలు “మావోయిస్టులు గిరిజనుల ఆస్తిని హరిస్తున్నారు, హిందూ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని” ప్రచారం చేశాయి. స్థానిక గిరిజన నేతలను హిందూత్వ అభిప్రాయాలకు ఆకర్షించారు.
2008లో బస్తర్ నియోజకవర్గం బీజేపీకి దక్కింది. ఇది కాంగ్రెస్‌కు బలమైన కోటగా ఉండేది.
త్రిపురలో ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అనే ఆదివాసీ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. బెంగాలీ, గిరిజన వైషమ్యాన్ని మతంతో మేళవించి, గిరిజనులను హిందూ ఐక్యత వైపు లాక్కొచ్చారు. 2018 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.
ఆంధ్ర రాష్ట్రంలో పాడేరు ఏజన్సీలో కేంద్రీకరించి పని చేస్తోంది. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రితో పాడేరులో భారీ సభ నిర్వహించింది.
వేలాది మంది గిరిజనులను పూరి, కాశీ, అయోధ్య, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలకు తీసుకెళ్తున్నారు.
అల్లూరి సీతారామ రాజు వారసులం తామే అన్నట్లుగా హడావిడి చేస్తూ మోదీ స్వయంగా భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణ చేశారు.
తెలంగాణలో కొమరం భీంను “హిందూ వీరుడు”గా వర్ణించే ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు.
కార్పొరేట్ ప్రయోజనాల కోసం కుట్రలు..
అడవులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, గనుల తవ్వకాలు, భారీ పరిశ్రమల కోసం అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపరుస్తూ మోదీ ప్రభుత్వం గిరిజనులను వారి ప్రాంతాల నుండి బలవంతంగా ఖాళీ చేయిస్తోంది.
మరోపక్క మతం పేరుతో గిరిజనుల మధ్య విభజనలు తెచ్చి, వారి ఏకత్వాన్ని దెబ్బతీసేందుకు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం క్రైస్తవ మతం పాటిస్తున్న గిరిజనులకు రిజర్వేషన్లు ఎత్తేయాలనే ప్రచారం బలంగా చేస్తోంది.
రాజ్యాంగం ప్రకారం గిరిజన గుర్తింపు అనేది వారి సామాజిక, భౌగోళిక వెనుకబాటుతనంపై ఆధారపడి ఉంటుంది. కానీ మతంపై కాదు.
స్థూలంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాలను కార్పొరేట్ కాషాయీకరణ చేయాలని ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఈ జంట ప్రమాదాన్ని గుర్తించి, నయా ఉదారవాద విధానాల దుష్ప్రభావాలను విస్తృతంగా ఎండగట్టాలి. గిరిజన సంస్కృతి రక్షణకై నిలవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
