‘చౌహాన్’ సినిమా టీజర్ అనేది మెజారిటేరియన్ ప్రచారాన్ని విక్రయించే చలనచిత్రాల వరుసలో తాజాది.
భారత ప్రభుత్వం తన కథనాలను సెట్ చేయడానికి ఇష్టపడే ప్రదేశంలోనే ఇది ప్రారంభమవుతుంది — పుల్వామాలోని ఒక వీధి, గాల్లోకి లేచే రాళ్లు, వ్యూహాత్మకంగా మోహరించిన భద్రతా దళాలు.
ప్రొటెక్షన్ మాస్క్‌లు ఆన్లైన్లో సులభంగా దొరుకుతున్నందున టియర్ గ్యాస్ పనికిరాకుండా పోతుందని, వాటర్ క్యానన్లు కేవలం తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఆ టీజర్‌లోని వాయిస్ ఓవర్ చెబుతుంది. అంటే, ఇంకాస్త కఠినమైన చర్యలు అవసరమని ఈ టీజర్ పరోక్షంగా సూచిస్తుంది.
భారతదేశంలో మెజారిటేరియన్ కథనాల నిర్మాణం ఇటువంటి వాదనలను ఎవరూ తనిఖీ చేయరనే నమ్మకంతో నడుస్తుంది. కాబట్టి, మనం ఒకసారి వాస్తవాలను పరిశీలిద్దాం.
పెల్లెట్ తుపాకుల విధ్వంసం – అమ్నెస్టీ నివేదిక..
2017లో, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా 2014 – 2017 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఉపయోగించిన షాట్‌గన్‌ల వల్ల చూపు దెబ్బతిన్న 88 మంది వ్యక్తుల వివరాలను నమోదు చేసింది. కొందరికి చూపు తిరిగి వచ్చినప్పటికీ, చాలా మందికి రాలేదు.
ఒకే ఒక్క కాట్రిడ్జ్ నుంచి 360 నుంచి 600 లోహపు గుండ్లు చెల్లాచెదురుగా దూసుకుపోతాయి, అవి ఎవరికి తగులుతాయో నియంత్రించే మార్గం లేదు.
అందువల్ల ఈ పెల్లెట్ తుపాకులు ఎవరినీ మినహాయింపు లేకుండా అందరిపై ప్రభావం చూపుతాయి.
మేము మాట్లాడిన ఆ 88 మందిలో 14 మంది నిరసనకారులు కానేకారు.
వాళ్లు తమ ఇళ్లలో పనులు చేసుకుంటున్న మహిళలు. దీన్ని బట్టే పెల్లెట్ తుపాకులకు ఎవరైనా బలి కావచ్చు అనేది స్పష్టమవుతుంది.
భద్రతా దళాల సహచరులు జరిపిన కాల్పుల వల్ల వారికే గాయాలయ్యాయి, అంటే ఈ ఆయుధాల ఉపయోగం అంత ప్రమాదకరమైనది.
అమాయకులపై దాడి – చూపు కోల్పోయిన బాలిక..
ఆ బాధితులలో ఇన్షా ముస్తాక్ అనే పద్నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. 2016 జూలై 11 సాయంత్రం కాశ్మీర్‌లోని తన గ్రామంలో కిటికీ వెలుపల వీధి వైపు చూస్తూ కూర్చుని ఉంది తను.
ఆ తర్వాత ఆమె మరెప్పుడూ ఆ వీధిని గానీ, మరి దేనిని గానీ చూడలేకపోయింది. ఆమె పూర్తిగా అంధురాలైంది. డాక్టర్లు దీనిని తాము చూసిన అత్యంత ఘోరమైన కేసుగా అభివర్ణించారు.
ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం, 2016 జూలై, 2017 ఫిబ్రవరి మధ్య 6221 మంది గాయపడ్డారు, వారిలో 782 మందికి కళ్లపై గాయాలు అయ్యాయి.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం ఈ పెల్లెట్ షాట్‌గన్‌ను “కాశ్మీర్లో ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటి”గా పేర్కొంది.
జనసమూహాన్ని అదుపు చేసే ఆయుధాల జాబితా నుంచి దీనిని తొలగించాలని సిఫార్సు చేసింది. పిల్లల ముఖాలపై ఎందుకు కాల్పులు జరుపుతున్నారని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, జాతీయ భద్రతను ఉటంకిస్తూ సమాధానం చెప్పడానికి నిరాకరించింది. “పరిమిత నష్టం” అనే పదం ఇక్కడి వాస్తవాలకు ఏమాత్రం సరిపోదని స్పష్టమవుతోంది.
‘చౌహాన్’ టీజర్ వాదన ప్రకారం, పరిమిత బలప్రయోగం వల్ల ఎలాంటి ఫలితం ఉండదనేది అబద్ధం, ఎందుకంటే కాశ్మీర్లో ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడూ సంయమనం గానీ, బలగాల కొరత గానీ లేదు.
ఈ ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా సాగిన బలప్రయోగం ఏం సాధించిందో ఈ పరిస్థితి ప్రతిబింబిస్తుంది.
ఒక ఉల్లంఘనకు బదులుగా మరో తీవ్రమైన ఉల్లంఘనతో సమాధానమిచ్చే ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పొందలేదు, పైగా ఆ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.
ప్రజాస్వామ్య ప్రక్రియల ఉల్లంఘన – ఏకపక్ష వైఖరి..
భారత పార్లమెంటు తలుపులు తమకు మూసుకుపోయినందున నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు. ఇది కేవలం కాశ్మీర్‌లోనే కాదు.
2014లో ఆమోదించబడిన భారత ప్రభుత్వ ‘ప్రీ-లెజిస్లేటివ్ కన్సల్టేషన్ పాలసీ’ ప్రకారం, అన్ని ముసాయిదా చట్టాలను ముప్పై రోజుల పాటు ప్రజల మధ్య చర్చకు పెట్టాలి.
అయినప్పటికీ, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ డేటా ప్రకారం, 2014 నుంచి ప్రవేశపెట్టబడిన 301 బిల్లులలో 227 బిల్లులు ఎలాంటి ప్రజా సంప్రదింపులు లేకుండానే ఆమోదించబడ్డాయి.
పార్లమెంటరీ కమిటీలకు పంపిన బిల్లుల వాటా 2014 కంటే ముందు 71 శాతం ఉండగా, ఆ తర్వాత 20 శాతానికి పడిపోయింది.
2025 డిసెంబర్లో, ఈ విధానం అమలును ప్రభుత్వం పర్యవేక్షిస్తోందా అని ప్రశ్నించినప్పుడు, తాము ఆ విధానాన్ని ఎప్పుడూ మూల్యాంకనం చేయలేదని, దానిని ఎవరు అనుసరించారనే రికార్డును ఉంచలేదని సమాధానమిచ్చింది.
చట్టాల అసలు అర్థాన్ని మార్చివేస్తూ, విమర్శకులను “దేశద్రోహులు”, నిరసనకారులను “ఆందోళనజీవులు”, రిపోర్టర్లను “ప్రెస్టిట్యూట్” అని పిలిచే ఒక కొత్త నిఘంటువును ప్రభుత్వం సృష్టించింది.
ఈ పదాలు ప్రచారం ద్వారా భారతీయుల మనస్సుల్లోకి చొచ్చుకుపోయాక, ప్రభుత్వ చర్యలకు ఎలాంటి సమర్థన అవసరం లేదు.
జవాబుదారీతనం లేమి – అధికారుల అంగీకారం..
ఒక అమ్మాయి కిటికీలోంచి బయటకు చూసినందుకు ఆమె చూపును దూరం చేసే ఆయుధాన్ని “పరిమిత నష్టం” కలిగించేదిగా అభివర్ణించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
అమ్నెస్టీ నివేదిక ప్రచురితమైనప్పుడు, నేను నా సహోద్యోగి రఘుతో కలిసి జమ్మూ కాశ్మీర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లి, అప్పటి ఎస్పీ వైద్‌ను కలిశాను.
మా నివేదిక ప్రతిని ఆయన స్వీకరించి, షాట్‌గన్‌ల వల్ల నిరసనకారులకు జరిగిన నష్టం గురించిన మా పరిశోధనలను విన్నారు. ఆయన ఆ ఫలితాలను తోసిపుచ్చలేదు, కానీ ఆ ఆయుధాన్ని ఎందుకు నిలిపివేయాలో అర్థం చేసుకోలేకపోయారు.
భారతదేశంలో మరెక్కడా జనసమూహాన్ని అదుపు చేయడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించరని, కాబట్టి దీనిని పూర్తిగా నిలిపివేయాలని నేను ఆయనతో చెప్పాను. దానికి ఆయన “అవును, నిలిపివేయాలి” అని బదులిచ్చారు.
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాస రచయిత ఆకార్ పటేల్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాకు అధిపతిగా పనిచేశారు; దక్కన్ క్రానికల్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
