ఈ సంవత్సరం ప్రారంభంలో, 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు భారత సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించినప్పుడు(అదే కేసులో ఇతర ఐదుగురు వ్యక్తులకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ), ఒక కీలకమైన ప్రశ్న తలెత్తింది: ఒక నేరంలో దోషిగా తేలకుండానే పౌరులను ఎంతకాలం జైల్లో ఉంచవచ్చు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే సమయానికి, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లు విచారణ లేకుండా ఐదు సంవత్సరాలకు పైగా జైలులో గడిపారు; ఈ వ్యాసం రాసే సమయానికి, ఆ కాలం ఆరేళ్లకు చేరుకుంటోంది.
బెయిలు: సాచివేతలు – హక్కులు..
విచారణలో సుదీర్ఘ ఆలస్యం అనేది ఆర్టికల్ 21 ప్రకారం నిందితుడి వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును ప్రభావితం చేస్తుందని గతంలో ఇచ్చిన తీర్పులలో సుప్రీంకోర్టు పేర్కొంది.
అందువల్ల, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)లో బెయిల్ పొందాలంటే కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆలస్యం కారణంగా ఈ చట్టబద్ధమైన పరిమితులు రాజ్యాంగబద్ధమైన వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును తోసిపుచ్చలేవని అదే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అయితే ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ, కోర్టులోని మరొక ధర్మాసనం, విచారణలో జాప్యం అనేది బెయిల్ పొందడానికి తిరుగులేని హక్కును కల్పించదని, నేరం తీవ్రత, ఆలస్యానికి ఏ పక్షం “బాధ్యత” వహిస్తుందనే ఇతర అంశాలతో దానిని పోల్చి చూడాలని పేర్కొంది.
ఈ పరిశీలనలు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. నేరం తీవ్రత లాంటి అంశాలు ప్రాథమికంగా బెయిల్ అర్హతను నిర్ణయించడానికి మాత్రమే ఉపయోగపడాలి.
కానీ బెయిల్ దశలో – కేవలం ప్రభుత్వం చేసిన ఆరోపణ మాత్రమే అయిన నేరం తీవ్రతను ఆధారంగా చేసుకుని, ఆలస్యం అనే అంశాన్ని పక్కన పెట్టడం అంటే, తీవ్రమైన నేరాల “ఆరోపణలు” ఎదుర్కొంటున్న నిర్దిష్ట వ్యక్తులను దశాబ్దాల తరబడి జైల్లో ఉంచవచ్చనే ఒక తప్పుడు పద్ధతికి మార్గం సుగమం చేసినట్లు అవుతుంది.
వాస్తవానికి జరుగుతున్నది ఇదే. ఉపా కింద నిందితులుగా ఉన్న వ్యక్తులు చివరకు నిర్దోషులుగా విడుదల కావడానికి ముందు రెండు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం జైలులో మగ్గిపోయారు, వారి జీవితాల్లోని విలువైన కాలాన్ని వారి నుంచి లాక్కున్నారు.
ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు జరగడం కోర్టును పునరాలోచన చేసేలా చేయాలి. విచారణ ఆలస్యానికి నిందితులే బాధ్యులు కావచ్చు అనే వాదన కూడా నిలబడదు.
నిందితుడు (లేదా ఆ విషయానికొస్తే, ప్రభుత్వం) ఎలాంటి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ- అంతిమంగా కోర్టును, శీఘ్ర విచారణను నియంత్రించేది న్యాయమూర్తి మాత్రమే.
విచారణలు సహేతుకమైన కాలపరిమితిలో పూర్తయ్యేలా చూసే అంతిమ బాధ్యత న్యాయమూర్తిపైనే ఉంటుంది.
వాస్తవానికి ఒక అరుదైన చర్యగా, మరొక ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇటీవల ఢిల్లీ అల్లర్ల బెయిల్ నిరాకరణను, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉందని బహిరంగంగా విమర్శించినప్పుడు, కోర్టు స్వయంగా ఈ సమస్యలలో కొన్నింటిని గుర్తించిందని అర్థం చేసుకోవచ్చు.
రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలనను అనుసరించి విచారణ లేకుండా వ్యక్తులను నిరవధికంగా బంధించలేరనే ప్రాథమిక సూత్రాన్ని అది పునరుద్ఘాటించింది.
దీనికి సమాధానంగా- మరొక కేసులో, ఢిల్లీ అల్లర్ల ధర్మాసనం ఈ ప్రశ్నను పరిష్కరించడానికి విస్తృత ధర్మాసనానికి “రిఫర్” చేసింది.
ఒక దశాబ్దంలో సగానికి పైగా జైలులో గడిపిన వ్యక్తులను (ప్రసిద్ధ రాజకీయ ఖైదీ కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్ జైలులో గడిపిన కాలం) విడుదల చేయాలా వద్దా అనే విషయమై సుప్రీంకోర్టు ఇంకా చర్చిస్తూనే ఉండటం ఆందోళన కలిగించే విషయమే.
బెయిలు – చట్టపరమైన అనిశ్చితి..
ఇదే కాలంలో ట్రయల్ కోర్టు, హైకోర్టుల స్థాయిలలో జ్యుడీషియల్ నిర్ణయాలలో వైరుధ్యాలు, అనిశ్చితులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు కాశ్మీరీ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌కు బెయిల్ మంజూరు చేసి సరైన నిర్ణయం తీసుకున్నది.
ఆయన విచారణ లేకుండా నాలుగేళ్లకు పైగా జైలులో ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయించడంలో విచారణ లేకుండా జైలులో గడిపిన ఈ కాలం హైకోర్టు తీర్పుపై తీవ్ర ప్రభావం చూపింది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీ అల్లర్ల కేసుల్లో గత ఏడాది బెయిల్ నిరాకరించిన అదే న్యాయమూర్తి, ఖుర్రం పర్వేజ్‌కు బెయిల్ మంజూరు చేశారు.
ఒకే రకమైన వాస్తవాల ఆధారంగా, అదే న్యాయమూర్తి ఒక సంవత్సరం వ్యవధిలో పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.
ఏ కేసు కూడా మరొక కేసుతో సమానంగా ఉండదని చెప్పడం సహజమే.
అయితే విచారణకు ముందు జైలు శిక్ష విధించడం లాంటి ప్రాథమిక సమస్యపై వివిధ కేసులలో, కోర్టులలో ఇటువంటి స్థిరత్వం లేని వైరుధ్యాలు చట్టబద్ధమైన పాలనను బలహీనపరుస్తాయి. అంతిమంగా ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకు నష్టం కలిగిస్తాయి.
ఉపా లాంటి చట్టాలు స్పష్టమైన రాజకీయ స్వభావాన్ని కలిగి ఉన్నందున ఈ ప్రశ్నలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
రాజకీయ అసమ్మతికి, చట్టం “ఉగ్రవాదం” అని నిర్వచించే దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అస్పష్టం చేసే విధంగా ఈ చట్టాలను వ్యాఖ్యానించడానికి ప్రభుత్వాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది.
పాలస్తీనాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించి బ్రిటన్, అమెరికా దేశాలలో ఇటీవల జరిగిన సంఘటనలు దీనికి ఉదాహరణలు.
న్యాయవ్యవస్థ ఏమి నిర్ధారించాలి?
ఇటువంటి సందర్భంలో, ఇటువంటి చట్టాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవడం న్యాయవ్యవస్థకు చాలా ముఖ్యం. చట్టపరమైన వ్యాఖ్యానం ఆత్మాశ్రయమైనది అయినప్పటికీ, ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉండాలి.
ప్రభుత్వం విచారణ లేకుండా ప్రజలను సంవత్సరాల తరబడి జైల్లో ఉంచకూడదు. అలా ఉంచడం చట్టబద్ధమైన పాలన ఆధారంగా పనిచేసే వ్యవస్థను ఎగతాళి చేయడమే అవుతుంది.
పాత సామెత చెప్పుకున్నట్లు విచారణ ప్రక్రియనే శిక్షగా మారుస్తుంది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఈ సమస్యపై ఎప్పుడు – లేదా అసలు అభిప్రాయం వ్యక్తం చేస్తుందో లేదో తెలియకుండా ఉన్నది.
ఈ లోగా వివాదాస్పద ఉపా కేసులలో నిర్బంధించబడిన వ్యక్తులు విచారణ లేకుండా జైలులోనే మగ్గుతున్నారు.
ఎలాంటి పరిష్కారం కనిపించకుండా వారి జైలు జీవిత కాలం పెరుగుతూ పోతోంది. వాస్తవానికి అటువంటి కేసులలో ఒకటి ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లది.
“ఢిల్లీ అల్లర్ల కేసులలో” జైలులో ఉన్న చివరి ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు వీరే. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత, కేసు మళ్లీ ట్రయల్ కోర్టు ముందుకు వస్తోంది.
ఈ లోగా జైలులో గడిపిన ఐదేళ్లు ఆరేళ్లుగా మారాయి. దీని మూల్యం — జైలులో ఉన్న వ్యక్తుల జీవితాలకు, చట్టబద్ధమైన పాలనకు — మరింత భారంగా మారుతోంది.
అంతిమంగా ఈ సమస్య వ్యక్తిగత మానవ జీవితాలకు, మానవ విలువలు, ప్రజాస్వామ్య విలువల పట్ల సమాజంగా మనకున్న నిబద్ధతకు సంబంధించినది.
ఇటువంటి కేసులు నిరంతరం వస్తూనే ఉన్నందున, ట్రయల్ కోర్టుల ముందు వ్యక్తిగత బెయిల్ కేసులలో లేదా కోర్టు ముందు చట్టాన్ని నిర్దేశించేటప్పుడు, ఈ విలువలను పునరుద్ఘాటించడానికి కోర్టులకు మరోసారి అవకాశం లభిస్తుంది.
ఇది జరగాలని, విచారణ లేకుండా నిరవధికంగా జైలులో ఉంచే ఈ దుష్ట వలయం ముగుస్తుందని ఆశిద్దాం.
అనువాదం: కె సత్యరంజన్
(ది హిందూ సంపాదకీయ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. వ్యాస రచయిత ఢిల్లీకి చెందిన న్యాయవాది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
