ముందుగా పౌరసత్వ అంశాన్ని తేల్చాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు వ్యతిరేకంగా పెండింగ్‌లో ఉన్న అప్పీలుపై అప్పీలుదారుడికి వీలైనంత త్వరగా విచారణ జరిగేలా చూడాలని కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రత్యేక విస్తృత సవరణ(సర్) సందర్భంగా ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించిన వ్యక్తి దరఖాస్తు ప్రక్రియను చేపట్టడంపై పాస్‌పోర్టు అధికారులను ఆదేశించడాన్ని, జల్పైగురి కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ నిరాకరించింది.
ముందుగా “పౌరసత్వ ప్రశ్నను” పరిష్కరించాలని కోర్టు పేర్కొన్నట్లు లైవ్ లా కథనం తెలియజేసింది.
విదేశాల్లో వైద్యం కోసం కావాల్సిన పాస్‌పోర్టును “పెండింగ్”లో ఉంచడాన్ని పరిష్కరించాలని కోరుతూ సిరాజుల్ షేఖ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
అప్పీలుపై త్వరగా విచారణ జరపాలి..
ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి వ్యతిరేకంగా షేఖ్ చట్టబద్ధంగా చేసుకున్న అప్పీలు పెండింగ్‌లో ఉంది.
ఈ అంశాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని సర్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను జస్టిస్ కౌసిక్ చందా ధర్మాసనం కోరింది.
తన అసలు ఓటరు గుర్తింపు కార్డును చూపించాలని పాస్‌పోర్టు కార్యాలయం షేఖ్‌ను కోరగా, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన కారణంగా ఆయన గుర్తింపు కార్డును చూపించలేకపోయారు.
ఇది సప్లిమెంటరీ డిలీషన్ లిస్ట్ ద్వారా జరిగిందని లైవ్ లా నివేదించింది.
ఓటరు కార్డు తప్పనిసరి కాదు..
పాస్‌పోర్టు చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు లేదా పాస్‌పోర్టు నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై కింద ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి పత్రం కాదని; గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీని ఇతర మార్గాల్లో నిర్ధారిస్తే సరిపోతుందని కోర్టుకు షేఖ్ తరఫున న్యాయవాది అవిసిక్తా దాస్ వాదించారు.
అయినా ఆయనకు తత్కాల్ పాస్‌పోర్టును త్వరగా జారీ చేసి సహాయపడాలని పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఆదేశించడాన్ని కోర్టు నిరాకరించింది.
సర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే వాటన్నింటినీ పరిష్కరించడానికి “ఇరవై ఒక్క సంవత్సరాలు పడుతుందని” న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నిరాకరణ..
సర్ ఆధారంగా ఆహార సబ్సిడీల లబ్ధిదారులను తొలగించాలన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేయడాన్ని కలకత్తా హైకోర్టు గత వారం నిరాకరించింది.
అయితే ఇంతవరకు ఏ ఒక్క బాధితుడూ కోర్టును ఆశ్రయించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
సర్ కింద ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన ఒక సీనియర్ జర్నలిస్టు పాస్‌పోర్టు వ్యవహారంలో, ప్రజల నిరసనల తర్వాత గత వారమే ఆయన పాస్‌పోర్టును ‘ప్రింటింగ్ కోసం’ పంపారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
