చోరీకి బాధ్యులైన వారిపై చర్యలు, నిష్పక్షపాత దర్యాప్తును డిమాండ్ చేస్తూ సాధువుల సమాజం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనుందని సమావేశం అనంతరం “కంప్యూటర్ బాబా” చెప్పారు.
న్యూఢిల్లీ: రామ మందిరం నిధులను సొంత అవసరాలకు వాడుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు అయోధ్యలో ఆగస్టు 25న పీఠాధిపతులు డిమాండ్ చేశారు.
రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌తో పాటు ట్రస్ట్ మాజీ సభ్యులు అనిల్ మిశ్రా, గోపాల్ రావులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసినట్లు ది ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం తెలియజేసింది.
సమావేశంలో పోలీసుల జోక్యంతో హైడ్రామా..
“కంప్యూటర్ బాబా” అధ్యక్షతన జరిగిన సాధువుల సమావేశ వేదిక వద్దకు పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది చేరుకోవడంతో కొంత సమయం పాటు హైడ్రామా కొనసాగింది.
మత నాయకులు కలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో చోరీ అంశంపై చర్చిస్తుండగా, పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది జోక్యం చేసుకొని సమావేశానికి అంతరాయం కలిగిస్తూ ప్రశ్నించారని పీఠాధిపతులు ఆరోపించారు.
సమావేశ స్థలం నుంచి మీడియా సిబ్బందిని వెళ్లిపోవాలని ఆదేశించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్య పట్ల పీఠాధిపతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పెద్దలనే వదిలేసిన సిట్..
ఈ అంశంపై ఇంతవరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన దర్యాప్తు ఫలితంగా, కేవలం కింది స్థాయిలో ఉన్న వారిపైనే చర్యలు తీసుకున్నారని, పెద్ద ఆటగాళ్లను వదిలేశారని సాధువులు ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచుగా ప్రతిపక్షాలు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తుంటాయి.
లక్ష మందితో ఆందోళన..
నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సాధువుల సమాజం కోరుతోందని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగలమని సమావేశం అనంతరం “కంప్యూటర్ బాబా” తెలిపారు.
“అవసరమైతే ఒక లక్ష మంది సాధువులతో అయోధ్యకు వెళ్లి ఆందోళనను ప్రారంభిస్తాం” అని ఆయన హెచ్చరించారు.
రామ్‌లల్లాకు క్షమాపణలు..
అయోధ్యలో ఈ అంశంపై మాట్లాడకుండా తమను నిరోధిస్తున్నారని పీఠాధిపతులు ఆరోపించారు.
ఈ సమస్యపై ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేయడానికి సిద్ధపడుతున్నట్లు వారు తెలిపారు.
మందిరం నుంచి విరాళాల చోరీ జరగడం పట్ల రామ్‌లల్లా దర్శనం చేసుకొని భగవాన్ రాముడికి క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నట్లు వారు చెప్పారు.
బీజేపీకి ఇబ్బందిగా మారిన వివాదం..
రామ మందిరంలో విరాళాల చోరీ ఆరోపణలు జూన్‌లో వెలుగు చూశాయి. వారం రోజుల తర్వాత ఈ అంశంపై దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.
సుమారు రెండు వారాల తర్వాత జూన్ 26న ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అంతకు ఒక్క రోజు ముందు మాత్రమే ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.
రామ మందిరంలో విరాళాల చోరీ వివాదం బీజేపీని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
