భారతదేశంలోని ‘జెన్-జీ’ యువతలో చాలామందికి నరేంద్ర మోదీ ఒక స్నేహితుడిలా అనిపించకపోవచ్చు.
కానీ, భారత ప్రధాని మాత్రం వారితో స్నేహంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.
స్క్రిప్ట్ ప్రకారం ప్రసంగాలు, అధికారిక రేడియో, టీవీ ప్రసారాలు, పక్కా ప్లానింగ్‌తో కూడిన కార్యక్రమాల ద్వారా 75 ఏళ్ల మోదీ చాలా కాలంగా ఒక శక్తివంతమైన నేత అనే ఇమేజ్ను కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ గత కొన్ని వారాలుగా ఆయన తన శైలిని మార్చుకున్నారు.
యువత ఎక్కువగా ఉపయోగించే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు మరింత సింపుల్‌గా, క్యాజువల్‌గా కనిపిస్తున్నారు.
నెల రోజుల క్రితం వరకు మోదీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎంతో జాగ్రత్తగా రూపొందించిన పోస్టులే కనిపించేవి.
ఇప్పుడు మాత్రం అందులో ‘గెట్ రెడీ విత్ మీ’లాంటి రీల్‌తో పాటు, యువతను ‘ఫ్రెండ్స్’ అని పిలుస్తూ సెల్ఫీ స్టైల్లో మాట్లాడిన వీడియోలు కూడా దర్శనమిస్తున్నాయి. అంటే, గతంలో కనిపించిన అధికారిక శైలికి భిన్నంగా ఇప్పుడు ఆయన పోస్టుల్లో మరింత సహజత్వం కనిపిస్తోంది.
ఒక వీడియోలో, ఆయన ఢిల్లీలోని ఒక కాలేజ్ కాన్వొకేషన్లో మాట్లాడుతూ జెన్-జీ యువత ఎక్కువగా ఉపయోగించే ఓ ట్రెండింగ్ డైలాగ్‌ను కూడా ఉపయోగించారు.
“మా వంశంలోనే రాకెట్, చిప్, డ్రోన్ తయారు చేసిన మొదటి వ్యక్తిని నేనే” అంటూ యువత భాషలోనే మాట్లాడి సర్ప్రైజ్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి 10.6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఈ ప్లాట్ఫామ్లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అయ్యే రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరిగా నిలిచారు.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల ప్రభావం..
2014 ఎన్నికల్లో గెలవడానికి డిజిటల్ వ్యూహాలను అద్భుతంగా ఉపయోగించుకున్న ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది.
అయినప్పటికీ, మోదీ ఇన్స్టాగ్రామ్ పోస్టుల శైలి వారి సోషల్ మీడియా వ్యూహంలో ఎప్పుడూ అంత ముఖ్యమైన భాగంగా ఉండేది కాదు.
కానీ, ఈ ఏడాది భారతదేశంలో యువత చేసిన నిరసనల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
వ్యంగ్యంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకత్వంలో మొదలైన ఈ ఉద్యమం మీమ్స్, లైవ్‌స్ట్రీమ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విపరీతంగా వ్యాపించింది.
చివరికి ఒక కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేసేంత బలమైన శక్తిగా ఈ నిరసన రూపాంతరం చెందింది.
వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ పేజీలు, ఎక్స్ ఖాతాల ద్వారా తమ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ- గత దశాబ్ద కాలంగా ఈ హిందూ జాతీయవాద పార్టీ (బీజేపీ) ఆన్లైన్లో భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుందని రచయిత, విశ్లేషకుడు అనురాగ్ మైనస్ వర్మ అభిప్రాయపడ్డారు.
కానీ నేటి తరం భారతీయ యువత ఫాలో అయ్యే కంటెంట్, వారి రాజకీయ ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయి.
భారతదేశ జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వారే. అలాగే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ‘జెన్-జీ’(1997, 2012 మధ్య జన్మించిన వారు) దేశంలోనే అతిపెద్ద ఓటింగ్ వర్గాల్లో ఒకటిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ట్రోలింగ్ బారిన పడ్డ తొలి రీల్స్..
వారిని ఆకట్టుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వారిని చేరుకోవాల్సిందే.
అక్కడ సంప్రదాయ రాజకీయ సందేశాల కంటే వ్యక్తిగతమైన, ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఉండే కంటెంట్ యువతపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
మోదీ పోస్టులు మొదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించినప్పుడు ఈ మార్పు స్పష్టంగా తెలిసింది.
యువ నెటిజన్లు కూడా వెంటనే వ్యంగ్యంగా స్పందించారు.
యువత నిరసనలు జరుగుతున్న సమయంలోనే వాటిపై మోదీ తొలిసారి మౌనం వీడుతూ చేసిన సెల్ఫీ-వీడియో రీల్‌ను చాలామంది ఎగతాళి చేశారు.
అయితే, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం మోదీ “ఫ్రెండ్స్” అని చెప్పిన తర్వాత తీసుకున్న సుదీర్ఘ విరామం.
వెంటనే ఆ వీడియోకు సంబంధించిన రకరకాల వెర్షన్లు ఆన్లైన్లో ట్రెండ్ అయ్యాయి.
యూజర్లు వాటికి ఎడిటింగ్లు, జోకులు జోడించడంతో పాటు, వీడియోలోని లైటింగ్, కెమెరా యాంగిల్స్‌ను కూడా ట్రోల్ చేశారు.
ఆ తర్వాత వచ్చిన పోస్టుల్లో మోదీ సోషల్ మీడియా టీమ్ ఆ విమర్శలకు స్పందించినట్లు కనిపించింది. వేర్వేరు కెమెరా యాంగిల్స్, బ్యాక్‌డ్రాప్‌లు, లైటింగ్‌తో కొత్తగా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది.
అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా?
ప్రభుత్వం తమను చేరుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొంతమంది యువతీయువకులు అభినందింస్తున్నారు.
అయినప్పటికీ, చాలామంది మాత్రం ఇవి చేస్తున్న టైమింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ తమ వయసు ఉన్నవారితో కనెక్ట్ అవ్వాలని ఎందుకు అనుకుంటోందో తనకు “అర్థమవుతోంది” అని 22 ఏళ్ల గిన్ని మాలియా పేర్కొన్నారు.
కానీ, “హఠాత్తుగా ఇంత మార్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని మనం కచ్చితంగా గమనించాలి” అని ఆమె అన్నారు.
“ఈ వీడియోలు ‘జెన్-జీ’ యువత మాట్లాడే భాషను, వారి వీడియో ఫార్మాట్లను వాడుతున్నట్లు కనిపిస్తున్నా.. అసలు నిరసనలకు కారణమైన యువత సమస్యలను మాత్రం ఇవి ప్రస్తావించడం లేదు”ని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇది కేవలం మోదీ ఖాతాకే పరిమితం కాలేదు. బీజేపీ అధికారిక సోషల్ మీడియా పేజీలు కూడా యువతను ఆకట్టుకోవడానికి మీమ్స్, ట్రెండింగ్ పదాలు, పాప్-కల్చర్ అంశాలను ఉపయోగించడం ప్రారంభించాయి.
నిరసనలు ముగిసిన కొద్దిసేపటికే, బీజేపీ ఒక జిమ్ నేపథ్యంలో ఉన్న రీల్‌ను పోస్ట్ చేసింది.
అందులో కొందరు యువతీయువకులు, అలాగే వయసులో పెద్దవాడైన ట్రైనర్ కనిపిస్తారు.
యువత ఇలాంటి నిరసనలకు దూరంగా ఉండాలని ఆ ట్రైనర్ వాదించడం ఆ వీడియో సారాంశం.
అయితే, నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ, కామెంట్లలో అది చాలా “క్రింజ్”గా ఉందంటూ కొట్టిపారేశారు.
బీజేపీ పోస్ట్ చేసిన మరో వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో 90ల నాటి ప్రసిద్ధ సిట్కామ్ టీవీ షో ‘ఫ్రెండ్స్’ టైటిల్ ట్రాక్ ప్లే అవుతుండగా, దానికి “పీఎం మోదీ ఈజ్ దేర్ ఫర్ యూ” అని క్యాప్షన్ ఇచ్చారు.
నిజానికి ‘మిలీనియల్స్’ (1981–1996 మధ్య పుట్టినవారు) బాగా ఇష్టపడిన ఈ షో గురించి నేటి ‘జెన్-జీ’ యువతకు పెద్దగా అవగాహన లేదు.
తమ వయసు వారిలో ఇలాంటి వీడియోలను రాజకీయ సందేశాలుగా లేదా యువతను చేరుకునే ప్రయత్నాలుగా చూడట్లేదని, కేవలం “కామెడీ కంటెంట్”గానే భావిస్తున్నారని మాలియా చెప్పారు.
మంత్రులకు సోషల్ మీడియా రిపోర్ట్ కార్డ్..
వివిధ నివేదికల ప్రకారం, యువతను ఆకట్టుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు అనుకున్నంతగా ఫలించడం లేదనే విషయం బీజేపీకి కూడా అర్థమైనట్లు కనిపిస్తుంది.
నిరసనలు జరుగుతున్న సమయంలో- ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులను సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉంటూ యువతకు చేరువ కావాలని కోరినట్లు సమాచారం.
కేంద్ర మంత్రుల సోషల్ మీడియా పనితీరుకు సంబంధించిన ఒక “రిపోర్ట్ కార్డ్”ను వారికి అందించారని, అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మరింత చురుగ్గా ఉండాలని వారికి సూచించినట్లు హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది.
ఇటీవల, ఆ పార్టీ 2015 నుంచి తమ సోషల్ మీడియా విభాగాధిపతిగా ఉన్న అమిత్ మాల్వియాను కూడా ఆ పదవి నుంచి తప్పించింది.
నిరసనల సమయంలో ఆన్లైన్లో బీజేపీ ఎదుర్కొన్న విమర్శలను, సోషల్ మీడియాలో వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆ విభాగం విఫలం కావడం వల్లే ఈ మార్పు జరిగి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ కూడా అదే బాటలో..
అయితే, యువతతో అనుసంధానం కావడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నది కేవలం బీజేపీ ఒక్కటే కాదు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా యువతతో అనుసంధానం కావడానికి ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఆయన తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ తరహా వీడియోలు, సహజమైన ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు.
నిరసనల తర్వాత ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అందులో “నేను, బ్యాట్‌మ్యాన్ ఒకే గదిలో ఉన్నట్టు మీరు ఎప్పుడైనా చూశారా?” వంటి సరదా సమాధానాలు కూడా ఇచ్చారు.
అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం జనం దృష్టిని ఆకర్షించడం ఒక ఎత్తయితే.. అక్కడ జరిగే చర్చలను తమకు అనుకూలంగా మలచుకోవడం మరో ఎత్తు.
ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్.. బీజేపీకి సవాల్..
యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో ‘రాజకీయాల్లో సోషల్ మీడియా వినియోగం’ అనే అంశంపై బోధించే ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ దీనిపై స్పందించారు.
తమ సందేశాలను విపరీతంగా ప్రచారం చేయడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి బీజేపీ చాలా కాలంగా ఎక్స్, వాట్సాప్‌లలోని తమ మద్దతుదారుల నెట్వర్క్పైనే ఎక్కువగా ఆధారపడుతోందని- కానీ ఆ వ్యూహం ఇన్‌స్టాగ్రామ్‌లో అంతగా పనిచేయదని ఆయన విశ్లేషించారు.
ఎందుకంటే, ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్ అనేది- యూజర్లు ఎక్కువసేపు చూసే వీడియోలు, మళ్లీ మళ్లీ ప్లే చేసే కంటెంట్, ఎక్కువగా షేర్ అయ్యే పోస్టులు, ఎక్కువ కామెంట్లు వచ్చే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
“పది మిలియన్ల వ్యూస్ వచ్చిన రీల్ 200 మంది ఫాలోవర్లున్న అకౌంట్ నుంచి రావచ్చు. అదే సమయంలో, లక్షల మంది ఫాలోవర్లున్న వ్యక్తులు పోస్ట్ చేసిన రీల్స్‌కు కొన్ని వేల వ్యూస్ మాత్రమే రావచ్చు. ఇది ఈరోజుల్లో అసాధారణం కాదు”అని పాల్ పేర్కొన్నారు.
“బీజేపీ వ్యూహం నెట్వర్క్-ఆధారిత ఇంటర్నెట్ కోసం రూపొందించబడింది. కానీ నేటి ప్లాట్‌ఫామ్‌లు భావోద్వేగ-ఆధారితంగా మారాయి. ఇది బీజేపీకి పెద్ద సమస్య.” అని ఆయన అన్నారు.
వీడియో పోస్ట్ చేసిన తర్వాత జరిగే పరిణామాలపై నియంత్రణ కోల్పోవడం బీజేపీకి మరో అడ్డంకి కావచ్చు.
మోదీ మొదటి రీల్ ఇందుకు ఒక ఉదాహరణ. అది 40 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.
భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ, యువత ఆ వీడియోను వ్యంగ్యంగా, ఎగతాళి చేసేలా ఎడిట్ చేసి మళ్లీ షేర్ చేశారు. దీంతో మోదీ ఉద్దేశించిన దానికి పూర్తిగా భిన్నమైన టోన్‌లో అది ప్రచారం పొందిందని వర్మ అభిప్రాయపడ్డారు.
ఈ డైనమిక్స్‌ను అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా వ్యవహరించడం బీజేపీకి ఒక సవాలుగా మారవచ్చు.
“ఇన్స్టాగ్రామ్ అనేది ప్రాథమికంగా వ్యంగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ప్లాట్‌ఫామ్” అని వర్మ అంటున్నారు. “రీల్స్ రూపంలో సీరియస్ రాజకీయ సందేశాలు ఇచ్చినా వాటిని ట్రోల్ చేయడం జరుగుతూనే ఉంటుంది.”
కొత్త తరహా ప్రచార శైలి నేర్చుకుంటున్న బీజేపీ..
అయితే, జెన్-జీ యువతను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలకు మరీ అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వారి కంటెంట్‌కు వచ్చే ఆదరణ కంటే, వారి క్షేత్రస్థాయి సంస్థాగత బలం, వారికున్న నమ్మకమైన ఓటు బ్యాంకుపైనే ఎన్నికల్లో ఆ పార్టీ సాధించే విజయం ఆధారపడి ఉంటుందని వారు చెబుతున్నారు.
“ఎన్నికల్లో గెలిచే సామర్థ్యానికి, సోషల్ మీడియాలో సాగుతున్న కథనాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యానికి మధ్య తేడాను గుర్తించడం ముఖ్యం” అని పాల్ అంటున్నారు.
“సోషల్ మీడియాలో జెన్-జీ మొత్తం బీజేపీని వ్యతిరేకించినా, ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయగల సత్తా ఆ పార్టీకి కచ్చితంగా ఉంది” అని అన్నారు.
ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీ, భారతదేశ రాజకీయాల్లోని మిగతా పార్టీలలాగే, తమకు అలవాటు లేని ఒక కొత్త రంగంలో అడుగులు వేయడం నేర్చుకుంటోంది.
అయితే, చివరికి బీజేపీ ఈ కొత్త పరిస్థితులను కూడా అర్థం చేసుకుని, అందుకు తగినట్లుగా మారడంలో ఆశ్చర్యం లేదని పాల్ అంటున్నారు.
ఎందుకంటే, రాజకీయ ప్రచారం కోసం దేశంలోనే అందరికంటే ముందుగా సోషల్ మీడియాను వాడడం దగ్గరి నుంచి.. ఈ మధ్య కాలంలో పాడ్‌కాస్ట్‌లు, ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూల లాంటి సరికొత్త పద్ధతులను అంగీకరించడం వరకు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త రాజకీయ ప్రచార శైలిని అలవర్చుకోవడంలో బీజేపీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
“కానీ దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అంటే- వారు కచ్చితంగా సరికొత్త పద్ధతులను నేర్చుకోవాల్సి ఉంటుందని అర్థం” అని ఆయన ముగించారు.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
