ఇజ్రాయెల్ పాలస్తీనియన్లపై చేస్తున్న మారణహోమం విషయంలో భారత ప్రభుత్వం తటస్థంగా ఉంటూ, మౌనం వహించి, చూసీచూడనట్లు వ్యవహరించింది.
నికితా నాయుడు దీనికి భిన్నంగా గాజా వెళ్తున్న సుముద్ ఫ్లోటిల్లాలో భాగస్వామి అయ్యింది.
గాజాపై దిగ్బంధనాన్ని ఛేదించే లక్ష్యంతో చరిత్రలోనే అతిపెద్ద పౌర నేతృత్వ మానవతా మిషన్‌గా అభివర్ణించబడుతున్న గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా ఉత్తర ఆఫ్రికా భూతల యాత్రలో భారతదేశానికి చెందిన వాతావరణ కార్యకర్త నికితా నాయుడు చేరారు. ఈ యాత్రలో పాల్గొన్న తొలి భారత జాతీయురాలు ఈమె.
మే 7 గురువారం నాడు నాయుడు లిబియాలోని ట్రిపోలికి చేరుకున్నారు. అక్కడ, ఉత్తర ఆఫ్రికా గుండా గాజాలోని రఫా సరిహద్దు వైపు వైద్య సహాయం, ఇతర అత్యవసర మానవతా సామాగ్రిని తీసుకువెళ్తున్న భూమార్గ కాన్వాయ్‌తో ఆమె కలిశారు.
ఈ కాన్వాయ్ మే నెల ప్రారంభంలో మౌరిటానియా నుంచి బయలుదేరి, అప్పటి నుంచి లిబియాకు చేరుకోవడానికి ముందు అల్జీరియా, ట్యునీషియా గుండా ప్రయాణించింది.
దీని తదుపరి గమ్యస్థానాలు ఈజిప్ట్, చివరగా రఫా సరిహద్దు. అక్కడ ఇది రెడ్ క్రెసెంట్ సమన్వయంతో గాజా ప్రజలకు నేరుగా సామాగ్రిని అందజేస్తుంది.
‘నేనే స్వయంగా చేసుకోవాలి’: నికితా నాయుడు
భారత ప్రతినిధి బృందం గ్రౌండ్ టీమ్ సభ్యుడి ప్రకారం, కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా చేరతారని భావించిన మరో ఇద్దరు భారతీయులు వైదొలగడంతో, భూమార్గ కాన్వాయ్‌లో పాల్గొంటున్న ఏకైక భారతీయురాలు ఆమెనే.
సముద్ర కాన్వాయ్‌లో భారతీయులు చేరాలన్న మునుపటి ప్రణాళికలు కూడా వీసా తిరస్కరణలు, రవాణాపరమైన ఇబ్బందుల వల్ల అది జరగలేదు.
“మేము మొదట సముద్ర కాన్వాయ్ కోసం సుమారు పది మందితో ప్రారంభించాము” అని గ్రౌండ్ టీమ్ సభ్యుడు చెప్పారు. “వీసా సమస్యలతో సహా వివిధ కారణాల వల్ల ఆ సంఖ్య ఒకరికి పడిపోయింది.”
భారత ప్రభుత్వం కుట్రపూరిత మౌనం వహించిన నేపథ్యంలో, వ్యక్తిగత బాధ్యతా భావంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నాయుడు అన్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలో భారతదేశ ప్రతిష్టను ‘అధికారంలో ఉన్న వ్యక్తులు’ తీర్చిదిద్దుతున్నారని ప్రస్తావిస్తూ, “వివేకం ఉన్న భారతీయులుగా, మనకు ప్రాతినిధ్యం వహించేది వారొక్కరే కావడానికి మనం అనుమతించలేము” అని ‘ది పోలీస్ ప్రాజెక్ట్’ ప్రచురించిన ఒక ఇంటర్వ్యూలో నాయుడు అన్నారు.
“నేను ప్రాతినిధ్యం వహించాలని కోరుకున్న దేశం, నేను కోరుకున్న విధంగా నాకు ప్రాతినిధ్యం వహించకపోవడం నిరుత్సాహాన్ని, నిరాశను కలిగిస్తోంది. అందుకే, నేనే స్వయంగా ఈ పని చేసుకోవాలి” అని ఆమె అన్నారు.
పాలస్తీనా సమస్యతో భారతదేశానికి ఉన్న చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ, మాజీ పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌తో న్యూఢిల్లీకి ఉన్న అనుబంధాన్ని, పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశంగా భారతదేశానికి ఉన్న హోదాను నాయుడు ప్రముఖంగా పేర్కొన్నారు.
ఈ విషయంలో తన భాగస్వామ్యం వల్ల కలిగే వ్యక్తిగత నష్టాల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె తెలిపారు.
“వీసా తిరస్కరణలు ఎదురైనా, నేను ఎదుర్కోవలసి వచ్చే అంతర్గత పరిశీలన, రాజకీయ, అంతర్గత నిఘా ఏవైనా సరే, చివరికి నేను తీసుకునే వైఖరి మానవతా వాదమే. అది గాజా ప్రజల కోసం, పాలస్తీనా ప్రజల కోసం” అని నాయుడు అన్నారు.
నౌకాదళం – దాని అడ్డగింపు..
గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా తనను తాను, గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణను అంతం చేయడానికి పనిచేస్తున్న ఒక సమన్వయ, అహింసాత్మక అంతర్జాతీయ ఉద్యమంగా అభివర్ణించుకుంటుంది.
దీని 2026 వసంతకాలపు మిషన్‌లో సముద్ర నౌకాదళం, భూతల కాన్వాయ్ రెండూ ఉన్నాయి.
ఇందులో 70కి పైగా దేశాలకు చెందిన వైద్యులు, విద్యావేత్తలు, ఇంజనీర్లు, మానవతావాద కార్యకర్తలు పాల్గొంటున్నారు.
ఈ భూతల కాన్వాయ్, ఫ్లోటిల్లా సముద్ర మిషన్‌కు సమాంతరంగా నడుస్తోంది. ఈ సముద్ర మిషన్ గత నెలలో ఒక పెద్ద అంతర్జాతీయ ఘర్షణకు దారితీసింది.
ఏప్రిల్ 29న, గాజాకు సుమారు 600 నాటికల్ మైళ్ల దూరంలో, గ్రీకు ద్వీపమైన క్రీట్‌కు పశ్చిమాన ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయెల్ నావికా దళాలు ఆ నౌకాదళంలోని పడవలను అడ్డగించాయి.
ఇజ్రాయెల్ 58 పడవలలో 22 పడవలను స్వాధీనం చేసుకుని, సుమారు 175 మంది కార్యకర్తలను నిర్బంధించింది.
నిర్బంధించబడిన వారిలో ఇద్దరైన స్పానిష్-స్వీడిష్ జాతీయుడు సైఫ్ అబుకేశెక్, బ్రెజిలియన్ జాతీయుడు థియాగో అవిలా, అష్కెలాన్‌లోని షిక్మా జైలులో ఇజ్రాయెల్ అదుపులోనే ఉన్నారు.
వారిని శారీరకంగా హింసించారని వారి న్యాయవాదులు ఆరోపించగా, నిరసనగా ఆ ఇద్దరూ నిరాహార దీక్ష ప్రారంభించారు. మిగిలిన నౌకాదళం గాజా వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
టర్కీ, స్పెయిన్, బ్రెజిల్, బంగ్లాదేశ్, కొలంబియా, జోర్డాన్, లిబియా, మలేషియా, మాల్దీవులు, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, మౌరిటానియా మరియు ఇండోనేషియా విదేశాంగ మంత్రులు ఇజ్రాయెల్ చర్యను “అంతర్జాతీయ చట్టాల దారుణ ఉల్లంఘన”గా ఖండిస్తూ ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశారు.
ఈ నౌకాదళాన్ని అడ్డగించడంపై భారతదేశం బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.
మారిన భారత్ వైఖరి..
ఈ సంఘర్షణపై భారతదేశ వైఖరి చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడులను బహిరంగంగా ఖండించి, ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపిన తొలి ప్రపంచ నాయకులలో ఒకరిగా నిలిచారు.
ఇది న్యూఢిల్లీ, టెల్ అవీవ్‌ల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. 2026 ఫిబ్రవరిలో, ప్రధాని మోదీ ఇజ్రాయెల్ క్నెసెట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత నాయకుడిగా నిలిచారు.
“ఈ తరుణంలో, ఆ తర్వాత కూడా భారతదేశం పూర్తి విశ్వాసంతో, దృఢంగా ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుంది” అని ఆయన ప్రకటించారు.
అదే సమయంలో, భారతదేశం రెండు దేశాల పరిష్కారానికి లాంఛనంగా మద్దతు ఇస్తూనే ఉంది. గాజాలో మానవతా సహాయం, కాల్పుల విరమణ ప్రయత్నాలకు పిలుపునిచ్చింది.
“ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా పక్కపక్కన జీవించే సార్వభౌమ, స్వతంత్ర, నిలదొక్కుకోగల పాలస్తీనా రాజ్యానికి” భారతదేశం మద్దతు ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పదేపదే పేర్కొంది.
బందీల విడుదల, చర్చలు, నిరంతర మానవతా సహాయానికి పిలుపునిచ్చింది.
అయినప్పటికీ, గాజా సంబంధిత తీర్మానాలపై ఐక్యరాజ్యసమితిలో భారతదేశం వరుసగా ఓటింగ్‌కు దూరంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి.
వాటిలో, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన జూన్ 2025 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీర్మానం కూడా ఉంది.
దానిలో సమతుల్యత లోపించిందనే కారణంతో న్యూఢిల్లీ దానికి దూరంగా ఉంది.
అనువాదం: ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
