ప్రపంచ చరిత్రలో మే 9వ తేదీ ఒక అపూర్వమైన చారిత్రక మైలురాయి. ఆ రోజు ఫాసిజం, నాజీ దురాగతం, జాత్యహంకారం, మానవత్వాన్ని నాశనం చేయాలనే క్రూర రాజకీయాలపై ప్రజల సోవియట్ యూనియన్ ప్రజలు, సైనికులు కలసి సాధించిన మహా విజయానికి ప్రతీకగా నిలిచింది. 1945 మే 9న సోవియట్ యూనియన్‌కు చెందిన రెడ్ ఆర్మీ నాజీ జర్మనీని సంపూర్ణంగా ఓడించింది. ఈ రోజు “విక్టరీ డే”గా సోవియట్ ప్రజలు, తరువాత రష్యా మరియు అనేక దేశాలు ఘనంగా జరుపు కుంటున్నాయి.
ఈ విజయం ఒక దేశం గెలుపు మాత్రమే కాదు. అది మానవ నాగరికతను రక్షించిన చారిత్రక పోరాటం. హిట్లర్ నాయకత్వంలోని నాజీ శక్తులు ప్రపంచాన్ని బానిసత్వంలోకి నెట్టాలని ప్రయత్నించినప్పుడు, సోవియట్ ప్రజలు అసాధారణ త్యాగాలు చేసి ఆ దురాక్రమణ శక్తులను మట్టికరిపించారు.
ఫాసిజం, నాజీయిజం ఉద్భవం:
మొదటి ప్రపంచ యుద్ధం (1914–1918) తర్వాత జర్మనీ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో పడింది. వెర్సైల్స్ ఒప్పందం ద్వారా జర్మనీపై భారీ పరిహార భారం మోపబడింది. నిరుద్యోగం, పేదరికం, రాజకీయ అస్థిరత పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలోని నాజీ పార్టీ ప్రజల్లో జాత్యహంకారాన్ని, అతి జాతీయతను రెచ్చగొట్టింది.
హిట్లర్ “ఆర్య జాతి అత్యున్నతమైనది” అని ప్రచారం చేశాడు. యూదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు, లను శత్రువులుగా ప్రకటించాడు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి నియంతృత్వ పాలనను నెలకొల్పాడు.
నాజీ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణాలు:
జాత్యహంకారం,కమ్యూనిజం వ్యతిరేకత, మిలిటరీ నియంతృత్వం,
ఇతర దేశాలపై దాడులు,
కార్మిక ఉద్యమాల అణచివేత,మైనారిటీలపై హింస.
రెండో ప్రపంచ యుద్ధం :
1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్‌పై దాడి చేసింది. దీనితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. తరువాత హిట్లర్ సైన్యం యూరప్‌లో అనేక దేశాలను ఆక్రమించింది. పోలాండ్, ఫ్రాన్స్, బెల్జియం,నార్వే,
నెదర్లాండ్స్,యుగోస్లావియా,
గ్రీస్. హిట్లర్‌కు ఇటలీ నియంత ముస్సోలిని మరియు జపాన్ సైనికవాదులు మద్దతిచ్చారు. ఈ కూటమిని “యాక్సిస్ పవర్స్” అని పిలిచేవారు.
1941 జూన్ 22న “ఆపరేషన్ బార్బరోస్సా” పేరుతో హిట్లర్ సోవియట్ యూనియన్‌పై అతిపెద్ద సైనిక దాడిని ప్రారంభించాడు. సుమారు 30 లక్షలకుపైగా జర్మన్ సైనికులు, వేలాది ట్యాంకులు, యుద్ధవిమానాలు సోవియట్ భూభాగంలోకి దూసుకెళ్లాయి.
హిట్లర్ లక్ష్యాలు:
1.సోవియట్ యూనియన్ను నాశనం చేయడం. 2.కమ్యూనిజాన్ని నిర్మూలించడం 3.సోవియట్ సంపదను స్వాధీనం చేసుకోవడం. 4.స్లావిక్ ప్రజలను బానిసలుగా మార్చడం.
జర్మన్ సైన్యం మొదట వేగంగా ముందుకు సాగింది. లక్షలాది సోవియట్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ సోవియట్ ప్రజలు లొంగిపోలేదు.
సోవియట్ యూనియన్ చరిత్రలో ఎప్పుడూ చూడని స్థాయిలో ప్రజలు యుద్ధంలో పాల్గొన్నారు. కార్మికులు
ఫ్యాక్టరీలను తూర్పు ప్రాంతాలకు తరలించి రాత్రింబవళ్ళు ఆయుధాలు తయారు చేశారు. వేలాది మహిళలు సైన్యంలో చేరారు.
నర్సులుగా పనిచేశారు.
విమాన చోదకులయ్యారు.
ఆయుధ పరిశ్రమలో పనిచేశారు.
రైతులు ఆహార సరఫరా నిలిపిపోకుండా కృషి చేశారు.
యువకులు, విద్యార్థులు సైన్యంలో చేరి పోరాడారు.
లెనిన్ గ్రాడ్ ముట్టడి:
నాజీ సైన్యం లెనిన్ గ్రాడ్ (ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్) నగరాన్ని దాదాపు 900 రోజులు ముట్టడించింది. తీవ్రమైన ఆకలి, చలి, బాంబు దాడుల
వల్ల లక్షలాది ప్రజలు మరణించారు. అయినప్పటికీ నగరం లొంగలేదు. ఇది మానవ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచింది.
మాస్కో యుద్ధం:
1941 చివర్లో జర్మన్ సైన్యం మాస్కో నగర ద్వారాల వరకు చేరుకుంది. సోవియట్ రెడ్ ఆర్మీ గట్టి ప్రతిఘటన చేసింది.
భీకరమైన చలికాలం. సోవియట్ ప్రజల ధైర్యం, రెడ్ ఆర్మీ వ్యూహాలతో జర్మన్ దాడిని తిప్పి కొట్టింది.
ఇది హిట్లర్ సైన్యానికి తొలి పెద్ద దెబ్బ.
స్టాలిన్ గ్రాడ్ యుద్ధం – యుద్ధ గమనాన్ని మార్చిన ఘట్టం:
1942–43 మధ్య జరిగిన స్టాలిన్ గ్రాడ్ యుద్ధం ప్రపంచ చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకటి.
హిట్లర్‌కు స్టాలిన్ గ్రాడ్ నగరం ప్రతిష్టాత్మక లక్ష్యం. కానీ సోవియట్ సైన్యం అద్భుతంగా తిప్పి కొట్టింది.
“ఒక్క అడుగు కూడా వెనక్కి కాదు”నినాదంతో రెడ్ ఆర్మీ పోరాడింది.వీధి, వీధిలో యుద్ధం. ఇంటింట పోరాటం.
వేలాది ప్రాణ త్యాగాలు.
చివరకు 1943 ఫిబ్రవరిలో జర్మన్ జనరల్ పౌలస్ లొంగిపోయాడు.ఇది ప్రపంచ యుద్ధంలో కీలక మలుపు.
కుర్స్క్ యుద్ధం:
1943లో జరిగిన కుర్స్క్ యుద్ధం చరిత్రలో అతిపెద్ద ట్యాంకుల యుద్ధంగా ప్రసిద్ధి చెందింది.రెడ్ ఆర్మీ జర్మన్ దాడిని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ తర్వాత జర్మన్ సైన్యం తిరిగి కోలుకోలేకపోయింది.
రెడ్ ఆర్మీ ముందడుగు:
1944–45 నాటికి సోవియట్ సైన్యం పోలాండ్, రొమేనియా,
బల్గేరియా, హంగేరీ, చెకొస్లోవేకియా, యుగోస్లావియా
దేశాలను నాజీ దురాక్రమణ నుండి విముక్తి చేసింది.
ప్రజలు రెడ్ ఆర్మీని విమోచక సైన్యంగా స్వాగతించారు.
బెర్లిన్ యుద్ధం:
1945 ఏప్రిల్‌లో రెడ్ ఆర్మీ జర్మనీ రాజధాని బెర్లిన్ను చుట్టుముట్టింది.
భీకరమైన యుద్ధం జరిగింది. చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నాజీ ప్రభుత్వం కూలిపోయింది.
1945 మే 8న జర్మనీ లొంగిపోయింది.
సోవియట్ కాలమానం ప్రకారం అది మే 9 కావడంతో ఆ రోజును విక్టరీ డేగా ప్రకటించారు.
రెడ్ ఆర్మీ జెండా రైఖ్స్టాగ్పై ఎగిరిన చారిత్రక క్షణం:
బెర్లిన్‌లోని జర్మన్ పార్లమెంట్ భవనం రైఖ్స్టాగ్పై సోవియట్ రెడ్ ఫ్లాగ్ ఎగరవేయడం ఫాసిజంపై విజయానికి ప్రతీకగా మారింది.
ఈ చిత్రం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
రెండో ప్రపంచ యుద్ధంలో అత్యధిక ప్రాణనష్టం సోవియట్ యూనియన్‌కే జరిగింది. 2.7 కోట్లకు పైగా సోవియట్ ప్రజలు మరణించారని అంచనా.
వేలాది పట్టణాలు ధ్వంసమయ్యాయి. కోట్లాది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఈ త్యాగం లేకపోతే ఫాసిజాన్ని ఓడించడం అసాధ్యమని అనేక చరిత్రకారులు భావిస్తారు.
ఫాసిజం అంటే ఏమిటి?
ఫాసిజం అంటే ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన. భిన్న భిప్రాయాల అణచివేత.
కార్మిక హక్కుల నిరాకరణ.
కార్పొరేట్ ఆధిపత్యానికి మద్దతు. జాతి, మత ద్వేష ప్రచారం. యుద్ధోన్మాదం.
హిట్లర్ పాలనలో ట్రేడ్ యూనియన్లు నిషేధించబడ్డాయి.
కమ్యూనిస్టులు, సోషలిస్టులు హత్య చేయబడ్డారు.
యూదులపై సామూహిక హత్యలు జరిగాయి.
హోలోకాస్ట్: మానవ చరిత్రలో నల్ల అధ్యాయం గా నిలిచింది. నాజీ పాలనలో సుమారు 60 లక్షలమంది యూదులు హత్య చేయబడ్డారు. రోమా ప్రజలు,
కమ్యూనిస్టులు, మేధావులు
లక్షల సంఖ్యలో హత మయ్యారు.
ఆశ్విట్జ్ వంటి కాన్సన్ట్రేషన్ శిబిరాలు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేశాయి.
ప్రపంచ ప్రజల పాత్ర:
సోవియట్ యూనియన్‌తో పాటు చైనా ప్రజలు, యుగోస్లావ్ పార్టిజన్లు, ఫ్రెంచ్ రెసిస్టెన్స్, ఇటాలియన్ యాంటీ ఫాసిస్టులు, బ్రిటన్ ప్రజలు, అమెరికా సైన్యం
కూడా ఫాసిజం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించారు.
భారతదేశంపై ప్రభావం:
రెండో ప్రపంచ యుద్ధం భారత స్వాతంత్ర్య ఉద్యమంపై ప్రభావం చూపింది.
ఫాసిజం వ్యతిరేక పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య, స్వాతంత్ర్య ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది.
ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే సాంస్కృతిక పోరాటానికి ఆజ్యం పోసింది ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్. దేశంలోని సాంస్కృతిక సైన్యం లక్నోలో ప్రేమ్ చంద్ నాయకత్వంలో ప్రథమ మహాసభ జరుపుకుంది. దీంతో స్వాతంత్ర్య పోరాటంలో సాంస్కృతిక కర్తవ్యాలు ముందుకు వచ్చాయి. కళ కళ కోసం కాదు ప్రజలకోసం అన్నది ఉద్యమ నినాదంగా మారింది.
భారత కమ్యూనిస్టులు, ప్రగతిశీల రచయితలు, కార్మిక ఉద్యమాలు ఫాసిజం వ్యతిరేక ప్రచారం నిర్వహించాయి.
సోవియట్ విజయం – ప్రపంచ రాజకీయాలపై ప్రభావం:
రెడ్ ఆర్మీ విజయం తరువాత
తూర్పు యూరప్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వలస వ్యతిరేక ఉద్యమాలు బలపడ్డాయి.
సామ్యవాద భావజాలానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో విముక్తి ఉద్యమాలకు ఇది ప్రేరణ అయింది.
మే 9 ప్రాముఖ్యత:
రష్యా మరియు పూర్వ సోవియట్ దేశాల్లో మే 9ను అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
ఆ రోజు. సైనిక పరేడ్లు,
అమర వీరులకు నివాళులు,
యుద్ధ స్మారక కార్యక్రమాలు
జరుగుతాయి.
ఇది కేవలం సైనిక విజయం కాదు. ప్రజల ఐక్య శక్తి, త్యాగం, ధైర్యానికి చిహ్నం.
నేటి ప్రపంచానికి ఈ విజయం నేర్పే పాఠాలు:
ఫాసిజం పూర్తిగా అంతరించిపోలేదు. నేటికీ జాత్యహంకారం,
మత విద్వేషం, నియంతృత్వ ధోరణులు, యుద్ధ రాజకీయాలు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి.
మే 9 విజయం మనకు గుర్తు చేసే అంశాలు:
1.ప్రజల ఐక్యతే అత్యంత శక్తి.
2.ఫాసిజాన్ని ఎప్పటికప్పుడు ప్రతిఘటించాలి.
3.ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.4.శాంతి కోసం పోరాడాలి. 5.కార్మిక, ప్రజా ఉద్యమాలు బలపడాలి.
ముగింపు:
1945 మే 9న సోవియట్ రెడ్ ఆర్మీ సాధించిన విజయం మానవ చరిత్రలో అత్యంత గొప్ప విజయాలలో ఒకటి. అది కేవలం జర్మనీపై విజయం కాదు. మానవత్వాన్ని రక్షించిన మహా పోరాటం.
లక్షలాది కార్మికులు, రైతులు, మహిళలు, యువత, సైనికులు చేసిన అపార త్యాగం వల్లే ఫాసిజం ఓడిపోయింది. రెడ్ ఆర్మీ బెర్లిన్‌పై ఎగరవేసిన ఎర్ర జెండా ప్రపంచ ప్రజలకు ఆశ, ధైర్యం, విముక్తికి సంకేతంగా నిలిచింది. ప్రజలు ఐక్యమైతే, ఎంతటి క్రూర నియంతృత్వాన్నైనా ఓడించగలరనీ అది రుజువు చేసింది. ఫాసిజంపై విజయం సాధించిన అమర వీరులకు ఎర్ర వందనాలు!
ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
