విదేశాలకు వెళ్లడాన్ని మానుకోవాలని ప్రధానమంత్రి మోదీ సలహా ఇస్తున్నారు, కానీ ప్రజలు ఇప్పటికే విదేశీ పర్యటనలపై ఖర్చును తగ్గించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ డేటా వెల్లడించింది.
విదేశాలకు వెళ్లవద్దని పిలుపునిచ్చిన వారం రోజుల లోపే, మోదీ మే 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు యూఏఈ, ఐరోపాలోని ఐదు దేశాల పర్యటనకు బయల్దేరనున్నారు.
న్యూఢిల్లీ: గత కొద్ది సంవత్సరాలతో పోల్చి చూస్తే గడచిన రెండేళ్లుగా భారతీయ జాతీయుల విదేశీ పర్యటనలపై ఖర్చులు బాగా తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) డేటా విశ్లేషణ వెల్లడించిందని ‘ది హిందూ’ కథనం తెలియజేసింది.
కొద్ది రోజుల క్రితమే మే 10న తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఏడాది పాటు విదేశీ పర్యటనలు జరపవద్దని, విదేశీ పెళ్లిళ్లపై భారీగా ఖర్చులు చేయరాదని ప్రజలను కోరారు.
“మధ్యతరగతి వర్గాలలో విదేశాలలో వివాహాలు, విదేశీ పర్యటనలు, సెలవుల్లో విదేశాలకు వెళ్లడం విస్తారంగా మారింది. ఇలాంటి సంక్షోభ సమయంలో కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవడంపై మనం కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి” అని మోదీ అన్నారు.
అయితే ఇప్పటికే గత రెండు సంవత్సరాలుగా విదేశీ పర్యటనలపై ఖర్చులు బాగా తగ్గుముఖం పట్టినట్లు ఆర్బీఐ డేటా సూచిస్తోంది.
పెట్టుబడుల వల్లే డాలర్ల ప్రవాహం..
విదేశీ పర్యటనలు, వివాహాలపై పెట్టే భారీ ఖర్చులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని మోదీ సూచించిన దానికి విరుద్ధంగా.. విదేశాల్లో చరాస్తులు, స్థిరాస్తులలో పెట్టుబడులు పెడుతున్న హై-నెట్-వర్త్ వ్యక్తుల(హెచ్ఎన్ఐ – HNI) నుంచే వాస్తవంగా డాలర్ల అవుట్‌ఫ్లో(బయటకు వెళ్లడం) జరుగుతోందని, అంతే తప్ప సెలవుల్లో వెళ్లే వారి నుంచి లేదా విదేశాల్లో వివాహాలు జరపడం వల్ల కాదని ‘ది హిందూ’ కథనం స్పష్టం చేసింది.
భారతీయులు విదేశాల్లో ఖర్చు చేయడానికి ఉన్న ఏకైక అధికారిక మార్గమైన ‘లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్’ కింద చేసిన ఖర్చును పరిశీలిస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో(ఏప్రిల్ 2025-ఫిబ్రవరి 2026) $26.4 బిలియన్లు ఖర్చయింది. 2024-25లో ఇదే కాలంతో పోలిస్తే ఈ అంకె 2.3% తక్కువగా ఉంది.
మొత్తం $26.4 బిలియన్లలో విదేశీ పర్యటనలపై ఖర్చు $15.3 బిలియన్లు కాగా, ఇది ఈ ఏడాది (ఏప్రిల్ 2025-ఫిబ్రవరి 2026)లో గత ఏడాది ఇదే కాలంతో చూస్తే 3.1% తగ్గింది.
అంతేకాకుండా అంతకు ముందు ఏడాదితో (ఏప్రిల్ 2024-ఫిబ్రవరి 2025) పోలిస్తే కూడా 1% తక్కువే.
విదేశాలకు పంపించే బహుమతులపై ఖర్చులు కూడా బాగా తగ్గాయని.. 2024-25 మొదటి 11 నెలలలో 19.1% క్షీణించగా, 2025-26లో 12.7% మేర తగ్గిందని హిందూ కథనం పేర్కొంది.
ఇదిలా ఉండగా, విదేశీ డెట్ (అప్పు), ఈక్విటీలలో భారతీయుల పెట్టుబడులు ఏప్రిల్ 2025 – ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో దాదాపు 59% పెరిగి $2.2 బిలియన్లకు చేరుకున్నాయి.
విదేశాల్లో స్థిరాస్తుల కొనుగోలుపై చేసిన ఖర్చు కూడా 2025-26 సంవత్సరపు మొదటి 11 నెలలలో 76 శాతానికి పైగా పెరిగి $490 మిలియన్లకు చేరుకుంది.
మోదీ ఐదు దేశాల పర్యటన..
విదేశీ పర్యటనలు జరపవద్దని ప్రజలకు పిలుపునిచ్చిన వారం రోజుల లోపే మోదీ ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఆరు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఐరోపా పర్యటనకు బయల్దేరనున్నట్లు రాయిటర్స్ కథనం తెలియజేసింది.
మోదీ మే 15న యూఏఈని సందర్శిస్తారు. ఆ తర్వాత నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలలో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 12న ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారత ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమయంలోనే ప్రధానమంత్రి తాజాగా ఈ విదేశీ పర్యటనకు బయల్దేరనుండటం గమనార్హం.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
