బ్రెజిల్ దేశంలో కార్మికులు, ఉద్యోగులకు వారానికి జీతం తగ్గించకుండా 6 రోజుల పనికి బదులుగా 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా తెలియజేశారు.
పాశ్చాత్య దేశాలలో కొందరు ఏఐ యుగంలో వారానికి నాలుగు రోజుల పని కోసం ఒత్తిడి చేస్తున్నారు.
కాగా, బ్రెజిల్ మాత్రం ఇప్పుడిప్పుడే తన లక్షలాది మంది కార్మికుల పని గంటలను ఆరు రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని చూస్తోంది.
ఈ సంవత్సరం తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతూ వామపక్ష అధ్యక్షుడు లూలా, వేతనాలను తగ్గించకుండా పని గంటలను 44 నుంచి 40 గంటలకు తగ్గించాలని ప్రతిపాదించారు.
బ్రెజిల్ లాటిన్ అమెరికాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. దీనివల్ల, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 1.5 కోట్ల మందికి ఈ లాభం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.
“తక్కువ సంపాదిస్తూ, కష్టపడి పనిచేస్తూ, తక్కువ అర్హతలు ఉన్నవారికి మేము మెరుగైన జీవితాన్ని, ఎక్కువ గౌరవాన్ని, తీరిక సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాము, దానికి సమయం ఆసన్నమైంది” అని లూలా వర్కర్స్ పార్టీ(పీటీ)కి చెందిన శాసనసభ్యుడు, ఈ అంశంపై బిల్లు రచయిత అయిన రెజినాల్డో లోప్స్ అన్నారు.
ఈ మార్పు కుటుంబ ఆరోగ్యాన్ని, శ్రేయస్సును బలోపేతం చేసి, తద్వారా కార్మికుల పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం చెబుతున్నది.
చిలీ, కొలంబియా వంటి దేశాలలో పని వారాన్ని క్రమంగా తగ్గించే చర్యలకు ఇది అనుగుణంగా ఉంది.
కాగా అనేక యూరోపియన్ దేశాలలో సగటున 40 గంటల కంటే తక్కువ పని గంటలు ఉన్నాయని లూలా మంత్రులు చెబుతున్నారు.
బ్రెజిల్ తీసుకున్న ఈ చర్య దానిని చాలా పాశ్చాత్య ప్రపంచ దేశాలతో సమానంగా నిలుపుతుంది.
‘అవర్ వరల్డ్ ఇన్ డేటా’ ప్రకారం, 2023లో బ్రెజిలియన్లు సగటున 2,000 గంటల కంటే కొంచెం తక్కువగా పనిచేశారు.
ఇది 1,335 గంటలు పనిచేసిన జర్మన్ల కంటే సుమారు 50 శాతం ఎక్కువ.
విస్తృత మద్దతు – వ్యతిరేకత..
“6×1” సంస్కరణగా పిలవబడే లూలా ప్రణాళికకు విస్తృత మద్దతు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల డేటాఫోల్హా సర్వేలో ప్రతి 10 మందిలో ఏడుగురు దీనికి మద్దతు తెలిపారు.
సావో పాలోలో వారానికి ఆరు రోజులు పనిచేసే ఐటీ సహాయకుడు హెన్రిక్ అలీ ఒలివెరా అల్వెస్ దీనికి అనుకూలంగా ఉన్నారు.
“బతకడం కోసం పని చేయడం కన్నా, పని కోసమే బతుకుతున్నట్లు అనిపిస్తోంది,” అని ఆయన అన్నారు. ఇంతకు ముందు “విశ్రాంతి, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యల వంటి ప్రాథమిక విషయాలకు సమయమే లేదు.”
కానీ సంప్రదాయవాదుల ఆధిపత్యంలో ఉన్న శాసనసభలో, రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్న ఈ సమయంలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు.
ఈ ప్రణాళిక వ్యాపారాలకు ఖర్చులను పెంచి ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించవచ్చని, అదనంగా లభించే తీరిక సమయం ప్రజలను తప్పుదారి పట్టించవచ్చని ప్రత్యర్థులు కొందరు అంటున్నారు.
“వారు మాదకద్రవ్యాలకు, జూదానికి ఎక్కువగా గురవుతారు. విశ్రాంతికి బదులుగా, అది చెడుగా మారవచ్చు” అని మితవాద చట్టసభ సభ్యుడు, ఇవాంజెలికల్ పాస్టర్ అయిన మార్కోస్ పెరీరా అన్నారు.
ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా చెప్పారు.
ఎన్నికలకు ముందు ఇది ఆమోదం పొందకపోయినా, అక్టోబర్‌లో జరిగే ఎన్నికలలో లూలాకు ఒక ఆధిక్యతను ఇస్తుందని మద్దతుదారులు ఆశిస్తున్నారు.
పోల్స్ ప్రకారం, జైలులో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు, సెనేటర్ అయిన ఫ్లేవియో బోల్సోనారోకు, లూలాకు మధ్య పోటీ హోరాహోరీగా ఉంది.
ఒప్పంద ఉద్యోగాలలో ఉన్న బ్రెజిలియన్లలో మూడింట ఒక వంతు మంది వారానికి ఆరు రోజులు పనిచేస్తుండగా, వారానికి నాలుగు గంటల పని తగ్గింపు వల్ల 37 మిలియన్ల మంది ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం పేర్కొంది.
ఎన్నికల వ్యూహం, ఆర్థిక సవాళ్లు..
80 ఏళ్ల మాజీ కార్మిక సంఘ నాయకుడు తన కార్మిక వర్గ మద్దతుదారులతో తిరిగి సంబంధాలు ఏర్పరచుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ప్రతిపాదన అని విశ్లేషకులు భావిస్తున్నారు.
“లూలా, పీటీ 1980ల నాటి కార్మిక సంఘ వాదం ఫలితం. సాంకేతికతకు సంబంధించినవి అయినా లేదా యాప్ ఆధారిత కార్మికుల వంటి అనధికారిక రంగాలకు సంబంధించినవి అయినా, ఉపాధి మార్కెట్లోని మార్పులకు అనుగుణంగా ఉండటానికి వారు చాలా కష్టపడ్డారు” అని రాజకీయ విశ్లేషకుడు థామస్ ట్రౌమాన్ అన్నారు.
2003 నుంచి 2010 వరకు తన మొదటి పదవీకాలంలో పేదరికాన్ని తగ్గించినందుకు లూలా అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్నారని మాజీ అధ్యక్షుని పత్రికా కార్యదర్శి అన్నారు.
మూడేళ్ల క్రితం తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆయన తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. కనీస వేతనాన్ని పెంచారు. సామాజిక సంక్షేమ చెల్లింపులను పెంచారు.
అయినప్పటికీ బలమైన జీడీపీ వృద్ధి, సాపేక్షంగా తక్కువ నిరుద్యోగం ఉన్నప్పటికీ- ఆయనకు ప్రజాదరణ రేటింగ్‌లు తగ్గాయి. ద్రవ్యోల్బణం, అధిక గృహ రుణాల కారణంగా చెప్పబడే ఈ సంఖ్యలు, లూలా “6×1” ప్రణాళికపై ఎందుకు దృష్టి పెట్టారో వివరిస్తాయి.
ఈ సంస్కరణను పూర్తిగా వ్యతిరేకించే కార్మికులను కనుగొనడం కష్టమైనప్పటికీ, అందరూ ఉత్సాహంగా లేరు. సావో పాలోకు చెందిన సెక్యూరిటీ సిస్టమ్స్ సేల్స్‌మెన్ అయిన రోజెరియో ఒలివెరా, శనివారాల్లో వచ్చే తన ఆదాయంలో ఐదవ వంతు కోల్పోతానేమోనని ఆందోళన చెందారు. అయినప్పటికీ, వారంలో ఒక రోజు సెలవు తీసుకోవడానికి తన యజమాని అనుమతిస్తారని ఆయన ఆశించారు.
ఈ ప్రతిపాదనలు ఉద్యోగ కల్పనను మందగింపజేయవచ్చని లేదా తొలగింపులకు కూడా దారితీయవచ్చని ప్రైవేట్ రంగ సంస్థలు అంటున్నాయి.
సర్దుబాటు చేయాల్సిన అంశాలు- ఐఎంఎఫ్ భావన..
పని గంటలను 40 గంటలకు తగ్గించడం వల్ల ఖర్చులు ప్రతి గంటకి 10 శాతం మేర పెరగవచ్చని, దీనివల్ల వ్యవసాయ వ్యాపారం, రిటైల్, సేవా రంగం, పారిశ్రామిక రంగాలు “తీవ్రంగా ప్రభావితం” అవుతాయని సావో పాలో వాణిజ్య సమాఖ్య అంచనా.
ఇటీవలి దశాబ్దాలలో స్తంభించిపోయిన ఉత్పాదకతలో మెరుగుదలలు వచ్చిన తర్వాతే పని గంటలను తగ్గించాలని వ్యాపార ప్రతినిధులు భావిస్తున్నారు.
పెరిగిన కార్మిక వ్యయాల కారణంగా ఉత్పాదకత మరింత దిగజారుతుందని, ఇది అంతిమంగా మధ్యకాలికం నుండి దీర్ఘకాలికంగా తక్కువ జీడీపీకి, అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఏఆర్ఎక్స్ ఇన్వెస్టిమెంటోస్ ముఖ్య ఆర్థికవేత్త గాబ్రియేల్ లీల్ డీ బారోస్ అన్నారు.
అర్థశాస్త్రవేత్తలందరూ దీనితో ఏకీభవించరు. ప్రభుత్వ మేధోమథన సంస్థ అయిన ఐపియా చేసిన ఒక అధ్యయనం, ఈ ప్రతిపాదనలకు అయ్యే ఖర్చులు నిర్వహించదగినవిగా ఉంటాయని సూచించింది.
ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, వ్యాపారాలు మరింత సమర్థవంతంగా మారడం ద్వారా పాక్షికంగా సర్దుబాటు చేసుకున్నాయి.
“ఎక్కువ విశ్రాంతి తీసుకున్న కార్మికుడు మరింత ఉత్పాదకతతో పనిచేస్తాడు” అని లూలా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గిల్హెర్మే బౌలోస్ అన్నారు.
కానీ కొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ కార్మికులతో పోలిస్తే అమెరికా కార్మికులు ఎక్కువ సంపాదించడానికి ఎక్కువ గంటలు పనిచేసే సంస్కృతి ఒక పెద్ద కారణం.
ప్రజలను ఎక్కువసేపు పనిచేయమని బలవంతం చేయడం పరిష్కారం కాదని, మెరుగైన పేరెంట్ లీవ్ వంటి విధానాల ద్వారా ఎక్కువ మందిని పనిలోకి తీసుకువచ్చి, వారు వృద్ధాప్యం వరకు పనిచేసేలా సహాయం చేయడమే పరిష్కారమని ఐఎంఎఫ్ భావించింది.
యూరోపియన్ ఫైనాన్సియల్ టైమ్స్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
అనువాదం: సుబ్రమణ్యం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
