అమెరికన్ మహిళలు ప్రతి సంవత్సరం తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తుండటంతో, యునైటెడ్ స్టేట్స్లో చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఈ ధోరణి ఇప్పుడు దేశంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రభావం చూపుతోంది.
నేడు అమెరికాలో పాఠశాలకు వెళ్లే పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2010 మధ్య కాలం నుంచి 30 రాష్ట్రాల్లో కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పడిపోయింది.
తగ్గుతున్న విద్యార్థుల నమోదు(ఎన్రోల్మెంట్) లాస్ ఏంజిల్స్, చికాగో, న్యూయార్క్‌తో సహా దేశంలోని అతిపెద్ద పట్టణ పాఠశాలలను దెబ్బతీసిందని న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణలో తేలింది.
చిన్న, శివారు జిల్లాల్లోని పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య అదే స్థాయిలో తగ్గిపోతోంది.
నిధుల లేమి – బడ్జెట్ కోతలు..
తక్కువ మంది విద్యార్థులు అంటే తక్కువ నిధులు అని అర్థం. ఎందుకంటే ప్రభుత్వ నిధులు విద్యార్థుల నమోదు సంఖ్యతో ముడిపడి ఉంటాయి.
అనేక జిల్లాలు ఇప్పుడు బాధాకరమైన బడ్జెట్ కోతలను ఎదుర్కొంటున్నాయి. పాఠశాలలను మూసివేయాలా వద్దా అనే దానిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి.
అనేక అంశాలు అడ్మిషన్ల సంఖ్యను ప్రభావితం చేస్తున్నాయి. నగరాల్లో నివాస ఖర్చులు, ఇతర ఖర్చులు భారీగా పెరగడంతో, కొన్ని కుటుంబాలు నగరాలను వదిలి శివారు ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి.
ఇటీవల వలసలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చే పిల్లల సంఖ్య తగ్గింది. గతంలో ఈ వర్గం దేశవ్యాప్తంగా ప్రవేశాల సంఖ్యను పెంచడానికి సహాయపడేది.
అనేక ప్రభుత్వ పాఠశాలలు కోవిడ్ మహమ్మారి సమయంలో విద్యార్థులను కోల్పోయాయి. ఆ స్కూల్స్ ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు, హోమ్-స్కూలింగ్, చార్టర్ పాఠశాలలు, వర్చువల్ పాఠశాలల నుంచి మునుపెన్నడూ లేనంత పోటీని ఎదుర్కొంటున్నాయి.
మహమ్మారి సమయంలో యుఎస్ ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే అది ఎంతకాలం కొనసాగిందనేది స్పష్టంగా లేదు.
ఇందులో క్యాథలిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇక్కడ మహమ్మారి సమయంలో ప్రవేశాలు పెరిగినప్పటికీ, గత దశాబ్ద కాలంలో మొత్తంగా తగ్గుతూ వచ్చాయి.
అనేక రాష్ట్రాల్లోని కొత్త స్కూల్ వోచర్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రైవేటు పాఠశాలలు ప్రయోజనం పొందనున్నాయి. ఇవి కుటుంబాలు ప్రైవేటు విద్య కోసం డబ్బు చెల్లించడంలో సహాయపడతాయి. కానీ ప్రవేశాలు తగ్గడానికి అతి పెద్ద కారణం యుఎస్‌లో రికార్డు స్థాయిలో తగ్గిన సంతానోత్పత్తి రేటు అని నిపుణులు చెబుతున్నారు.
ఇది(సంతానోత్పత్తి రేటు) చివరిగా 2007లో గరిష్ట స్థాయికి చేరుకుంది, అప్పటి నుంచి 24 శాతం పడిపోయింది.
ఆ వయస్సులోని పిల్లలు ఎదుగుతున్న కొద్దీ, 2007లో జన్మించిన చాలా మంది విద్యార్థులు 2025 నాటికి హైస్కూల్ పూర్తి చేశారు. వారి స్థానంలో కొత్తగా చేరడానికి తక్కువ మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ అంచనాల ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో విద్యార్థుల నమోదు సంఖ్య తగ్గుతూనే ఉంటుంది.
“ఈ సంవత్సరం కనిపిస్తున్నది కేవలం సమస్యకు ఆరంభం మాత్రమే (మంచుకొండ కొన లాంటిది)” అని జార్జ్‌టౌన్ యూనివర్శిటీలోని ఎడ్యునామిక్స్ ల్యాబ్ డైరెక్టర్ మార్గరీట్ రోజా అన్నారు.
వలసలు, ఆర్థిక లోటు సవాళ్లు..
44,000 మంది విద్యార్థులున్న ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్ ప్రభుత్వ పాఠశాలల్లో 2014 నుంచి ప్రవేశాలు 9 శాతం తగ్గాయి.
దీనికి ప్రధాన కారణం జననాల రేటు తగ్గడమే. అయితే కుటుంబాలు నగరాన్ని విడిచి వెళ్లిపోవడం కూడా ఒక కారణమని సూపరింటెండెంట్ కింబర్లీ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పారు.
“ప్రజలు తమ పిల్లలను నగరంలో కాకుండా ఖర్చులు తక్కువగా ఉండే వేరే చోట పెంచడానికి మొగ్గు చూపుతున్నారు. శివారు ప్రాంతాలకు లేదా సరసమైన ధరలకు ఇళ్లు లభించే ప్రాంతాలకు వెళ్తున్నారు” అని ఆమె అన్నారు.
అందువల్ల ఇది కేవలం విద్యార్థుల సంఖ్య పడిపోవడమే కాదు. కుటుంబాలకు కుటుంబాలే పోర్ట్ల్యాండ్ను వదిలి వెళ్ళిపోతున్నాయి.
ప్రవేశాల కోసం ప్రచారం ద్వారా, ప్రీ-కిండర్ గార్టెన్, అక్షరాస్యతపై పెట్టుబడి పెట్టడం ద్వారా జిల్లా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆమె చెప్పారు.
“అయితే ఈ ఏడాది కిండర్ గార్టెన్ తరగతి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అది దీర్ఘకాలికంగా సమస్యను పరిష్కరించదు” అని ఆమె అన్నారు.
“వచ్చే ఏడాది ఈ జిల్లా 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ లోటును ఎదుర్కొంటోంది. దీంతో ఉద్యోగుల తొలగింపులు, పాఠశాలల మూసివేతలను చూడాల్సి వస్తోంది.”
డెన్వర్‌లో, తక్కువ జననాల రేటు మరియు అధిక ఖర్చుల కారణంగా 2020లో పాఠశాల ప్రవేశాలు తగ్గడం ప్రారంభించాయి. కానీ 2022, 2024 మధ్య పెరిగిన వలసల కారణంగా వేలాది మంది కొత్త పిల్లలు డెన్వర్ పాఠశాలలకు వచ్చారు.
ప్రస్తుతం, ట్రంప్ పరిపాలనా విధానాల కారణంగా వలసలు తగ్గాయి. ఫలితంగా డెన్వర్ ప్రవేశాలు మళ్లీ తగ్గుతున్నాయి.
డెన్వర్‌లోని ఆష్లే ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశాలు 175 నుంచి దాదాపు 400కి పెరిగాయి.
ఇప్పుడు, వలస కుటుంబాలు యునైటెడ్ స్టేట్స్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదా వారి స్వదేశాలకు తిరిగి వెళ్లడం వల్ల, ఆ సంఖ్య తిరిగి 250కి పడిపోయింది.
తన బడ్జెట్లోని $6,74,000 లోటును పూడ్చుకోవడానికి, ప్రిన్సిపాల్ జానెట్ ఎస్ట్రాడా వచ్చే ఏడాది కోసం ఒక అసిస్టెంట్ ప్రిన్సిపాల్, ఒక స్కూల్ సెక్రటరీ, ఒక ఒకటో తరగతి ఉపాధ్యాయుడుతోపాటు పాఠశాలలోని సగం మంది టీచర్స్ ఎయిడ్స్‌ను(సహాయక ఉపాధ్యాయులను) తొలగిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఉపాధ్యాయుల అవసరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ కోతలు మిగిలి ఉన్న విద్యార్థుల విద్యా బోధనపై ప్రభావాన్ని చూపుతాయి.
ఆమె ఒక ఆర్ట్ టీచర్‌ను కూడా తొలగించాల్సి వచ్చింది. దానివల్ల విద్యార్థులకు ఇకపై ప్రత్యేకమైన ఆర్ట్ క్లాస్ ఉండదు.
‘నేను పదేపదే చెప్పేదేమంటే- ఇది కేవలం ఆష్లే పాఠశాల సమస్య మాత్రమే కాదు, మొత్తం అమెరికా దేశం ఎదుర్కొంటున్న సమస్య’ అని ఎస్ట్రాడా చెప్పారు.
పాఠశాలల మూసివేతపై విమర్శలు, నిర్ణయాలు..
పలో ఆల్టో, కాలిఫోర్నియా, మోంట్క్లైర్, న్యూజెర్సీ వంటి అధిక పనితీరు కనబరిచే స్కూల్స్ కారణంగా కుటుంబాలను ఆకర్షించే కొన్ని సంపన్న ప్రాంతాల్లోని పాఠశాలలు కూడా ప్రవేశాలను మునుపటిలా కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నాయి.
ప్రధాన మెట్రో ప్రాంతాల శివార్లలోని గ్రామీణ ప్రాంతాలు, ఇడాహో, ఉటా, టెక్సాస్ వంటి విస్తృతంగా జనాభా పెరిగిన రాష్ట్రాలు ఈ ధోరణికి భిన్నంగా ఉన్నాయి.
అయితే ఆ రాష్ట్రాల్లో కూడా ఇటీవలి కాలంలో కొంత తగ్గుదల కనిపిస్తోంది.
బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లోని సీనియర్ ఫెలో, జనాభా శాస్త్రవేత్త విలియం హెచ్ ఫ్రెయ్ మాట్లాడుతూ, అమెరికన్లు సాధారణంగా అధిక ఖర్చుతో కూడిన తీరప్రాంత రాష్ట్రాలు, మిడ్‌వెస్ట్రన్ రాష్ట్రాల నుంచి దక్షిణాది, కొన్ని పశ్చిమ రాష్ట్రాలకు, అలాగే పెద్ద నగరాల నుంచి బయటకు వెళ్తున్నారని చెప్పారు. కోవిడ్ మహమ్మారి ఈ ధోరణులను మరింత వేగవంతం చేసింది.
“పెద్ద సంఖ్యలో ప్రజలు తమకు సరసమైన ధరలో గృహవసతి, తమ కుటుంబాలు నివసించడానికి సరైన ప్రాంతం, మంచి ఉద్యోగం లభించే చోటికి మారుతున్నారు” అని ఆయన అన్నారు.
ఇది పాఠశాలలకు, అక్కడే ఉండిపోయిన విద్యార్థులకు ఒక సవాలును విసిరింది.
చాలా తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు కూడా ఒక ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర ముఖ్య ఉద్యోగులు అవసరం. దీని ఫలితంగా ప్రతి విద్యార్థిపై అయ్యే ఖర్చు పెరుగుతుంది.
ఫలితంగా పాఠశాలలు ఐచ్ఛిక సబ్జెక్టులను తగ్గించడం లేదా తక్కువ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ తరగతులను అందిస్తాయి. ఇది మరిన్ని కుటుంబాలను సరైన విద్యకు దూరం చేస్తుంది.
పాఠశాలలను మూసివేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. కానీ అది రాజకీయంగా వివాదాస్పదం కావచ్చు.
కుటుంబాల నుంచి వచ్చే రాజకీయ ఒత్తిడి కారణంగా, ఇప్పటివరకు సాపేక్షంగా తక్కువ జిల్లాలే పెద్ద ఎత్తున పాఠశాలల మూసివేతను చేపట్టాయి.
పాఠశాలల మూసివేత మైనారిటీ, తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులను అసమానంగా దెబ్బతీస్తుందని కొన్ని జిల్లాలు విమర్శలను ఎదుర్కొన్నాయి.
అయినప్పటికీ, మరిన్ని జిల్లాల్లో పాఠశాలల మూసివేతలు జరిగే అవకాశం ఉంది.
ఫిలడెల్ఫియా, టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరాలు ఇటీవల పాఠశాలలను మూసివేసే ప్రణాళికలను ఆమోదించాయి.
కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో, గతంలో పాఠశాలలను మూసివేయడానికి చేసిన ప్రయత్నాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.
అయినా ఇప్పుడు 60 మంది ప్రిన్సిపాల్లు మూసివేతలకు మద్దతుగా లేఖపై సంతకం చేయడం గమనార్హం.
పిట్స్‌బర్గ్‌లో, తొమ్మిది పాఠశాలలను మూసివేయాలనే ప్రణాళికను నవంబర్‌లో స్కూల్ బోర్డు వ్యతిరేకించింది. కానీ ఈ వసంతకాలంలో ఆ ప్రతిపాదన మళ్ళీ అజెండాలోకి వచ్చింది.
“ఇది అవసరం” అని స్కూల్ బోర్డ్ ప్రెసిడెంట్ జీన్ వాకర్ అన్నారు.
నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత దశాబ్ద కాలంలో నమోదు(ఎన్రోల్మెంట్) దాదాపు 25 శాతం తగ్గిపోయింది.
ఒక K-8(కిండర్ గార్టెన్ నుంచి 8వ తరగతి వరకు) పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నందున అది ఆల్జీబ్రాను(బీజగణితం) కూడా బోధించలేకపోతోందని ఆయన చెప్పారు.
కొత్త ప్రణాళిక కింద దానిని సరిచేయాలని వాకర్ ఆశిస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో విద్యా, ఇతర కార్యక్రమాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం.
ఉదాహరణకు, అన్ని ప్రాథమిక పాఠశాలలు కళలు, సంగీతం, విదేశీ భాషను బోధిస్తాయి.
పాఠశాలల మూసివేత విద్యార్థులను విద్యాపరంగా దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలింది. అయితే విద్యార్థులను ఉన్నత ప్రమాణాలు కలిగిన పాఠశాలకు మార్చినప్పుడు వారు ప్రయోజనం పొందవచ్చు.
“మనం చేయాల్సిన ఈ కఠినమైన మార్పును చేయడానికి మనకు ఇష్టం లేనందువల్ల, మీకు లభించాల్సిన వాటిని మేము ఇవ్వలేకపోతున్నామని మన యువత కళ్ళలోకి చూసి చెప్పడం కంటే ఇది మంచిది” అని వాకర్ అన్నారు.
భవిష్యత్తుపై ఆశలు..
కొంతమంది జనాభా శాస్త్రవేత్తల ప్రకారం, నేటి యువతులు పిల్లలను కనడాన్ని తమ 30, 40 ఏళ్ల వయస్సుల వరకు వాయిదా వేస్తున్నప్పటికీ, అమెరికా సంతానోత్పత్తి రేటు భవిష్యత్తులో కొంతవరకు పుంజుకోవచ్చు.
మహిళా ఉద్యమం తర్వాత మహిళలు కళాశాల, కెరీర్ల కోసం గర్భం దాల్చడాన్ని వాయిదా వేయడంతో 1970లలో ఇలాగే జరిగింది.
అప్పుడు కొన్ని జిల్లాలు పాఠశాలలను మూసివేసాయి. ఆ తర్వాత ఎక్కువ మంది పిల్లలు పుట్టడంతో పాఠశాలల్లో మళ్లీ రద్దీని ఎదుర్కొన్నాయి.
అయినప్పటికీ, పిట్స్బర్గ్ వంటి జిల్లాలు భవిష్యత్తులో కొత్త పాఠశాలలను నిర్మించాల్సి వచ్చినా, ప్రస్తుతానికి పరిమాణాన్ని తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేకపోవచ్చు.
“ఒకవేళ సంతానోత్పత్తి రేటు పెరిగినా, అది జరగడానికి మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది” అని వాకర్ చెప్పారు.
“మనం మరో 10 నుంచి 15 ఏళ్లు వేచి ఉంటే, ఈ జిల్లా మనుగడ సాగిస్తుందో లేదో నాకు తెలియదు” అని ఆయన అన్నారు.
న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
అనువాదం: ఆర్.లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
