2026 మే 7న యునైటెడ్ కింగ్డమ్(బ్రిటన్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్)లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
రెండు సంవత్సరాల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ఘోరపరాజయాన్ని పొందింది.
అదే సందర్భంలో అనేక దఫాలుగా అధికారంలో ఉండి ఐరన్ లేడీగా పేరుగాంచిన మార్గరెట్ థాచర్ పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఆ విధంగా యూకే చరిత్రలో దాదాపు మొదటిసారి రెండు పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టి నూతన శక్తులు ముందుకు వచ్చాయి.
లేబర్, కన్జర్వేటివ్ పార్టీల పరాజయానికి కారణాలు..
లేబర్ పార్టీ సాధారణంగా కార్మికులు, సాధారణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తుందనే నానుడి ఉంది.
గతంలో కొన్ని ప్రభుత్వాలు ఆ రకంగా ఆచరించి చూపాయి కూడా. కానీ ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాలను, పద్ధతులను సమాధి చేశాడు.
కార్పొరేట్లకు రాయితీలు, ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలు తీసుకున్నాడు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాయి. నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రజల జీవన పరిస్థితులు గడ్డుగా మారాయి.
పైగా లేబర్ పార్టీ నిలకడగా అనుసరించిన పాలస్తీనా అనుకూల విధానాన్ని నీరుగార్చాడు.
పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై ఆంక్షలు విధించి దౌర్జన్యం సాగించాడు. వీటన్నిటి ఫలితమే స్థానిక సంస్థల ఎన్నికలలో ఘోర పరాజయానికి దారి తీసింది.
అదే సందర్భంలో కన్జర్వేటివ్ పార్టీ పూర్తిగా ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకు తదితర సంస్థల ఆదేశాలకు అనుగుణంగా పరిపాలన సాగించింది.
మరీ ముఖ్యంగా మార్గరెట్ థాచర్, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి బ్రిటన్ దేశాన్ని, కార్మిక వర్గాన్ని అతలాకుతలం చేసింది.
తదనంతరం అధికారానికి వచ్చిన కన్జర్వేటివ్ పార్టీ నేతలు అదే విధానాలను అమలు జరిపారు. మరీ ముఖ్యంగా 2019-2024 మధ్య రాజకీయ అస్థిరత చోటు చేసుకుంది.
ముగ్గురు ప్రధానులు మారారు. భారతదేశ ఐటీ దిగ్గజం నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ బ్రిటిష్ ప్రధాని అయ్యాడు.
భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత అయ్యాడని భారత మీడియా పతాక శీర్షికలతో ఆకాశానికి ఎత్తింది.
కానీ, రెండు సంవత్సరాల లోపే జరిగిన సాధారణ ఎన్నికలలో ఆయన నేతృత్వంలోని పార్టీ ఘోర పరాజయం పొందింది.
నేటి స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీని ప్రజలు సుదూరానికి నెట్టివేశారు. ఈ అనుభవం రుజువు చేస్తున్నదేమంటే- “ప్రజలు గుడ్డివారు కాదు, అమాయకంగా తల దించుకొని జీ హుజూర్” అనే వాళ్ళు కారు అని.
పుంజుకున్న ‘రిఫార్మ్ యూకే’ పార్టీ..
ఇంగ్లాండ్‌లోని డజన్ల కొద్దీ కౌన్సిల్లకు, స్కాట్లాండ్, వేల్స్ పార్లమెంటులకు జరిగిన ఎన్నికలు, ప్రస్తుతానికి సెంచరీ కాలం నాటి లేబర్, కన్జర్వేటివ్ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టాయి.
లేబర్ పార్టీ భారీ విజయం సాధించిన రెండేళ్ల తర్వాత, కేంద్ర స్థానం స్థిరంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, బ్రిటిష్ రాజకీయాలు ఒక అస్థిరమైన కాలీడోస్కోప్లా విచ్ఛిన్నమయ్యాయి.
నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని నేషనలిస్ట్ ‘రిఫార్మ్ యూకే’ పార్టీ భారీ విజయాలను నమోదు చేసుకుంది. ఇది అనేక ప్రాంతాలలో టోరీలను(కన్జర్వేటివ్‌లను) వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
రిఫార్మ్ పార్టీపై ఆరోపణలు – నిధుల వివాదం..
అయితే మెజారిటీ స్థానాలు సంపాదించిన రిఫార్మ్ పార్టీ అధినేతపై పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఒక కార్పొరేట్ కంపెనీ భారీ మొత్తంలో నిధులు సమకూర్చింది.
బ్రిటన్ దేశ నిబంధనల ప్రకారం పార్లమెంట్‌కు ఎన్నికైన వ్యక్తి ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం గాని, ఎన్నికైన తర్వాత గాని తనకు అందిన నిధులను ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ ఆయన అలా తెలియజేయకపోగా- “నాకు వ్యక్తిగతంగా వచ్చిన గిఫ్ట్ కాబట్టి నేను తెలియజేయాల్సిన అవసరం లేదు” అని ప్రకటించారు.
ఈ పార్టీ వెనకాల ఎలాన్ మస్క్ లాంటి కుబేరులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పార్టీ కూడా సంస్కరణలకు వ్యతిరేకం కాదు అని ఒక స్థానిక సంస్థకు గతంలో ఎన్నికైన ఈ పార్టీ అభ్యర్థి స్పష్టంగా తెలియజేశారు.
ఏమైనా ఇవి స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలే అయినప్పటికీ, రానున్న కాలంలో బ్రిటన్ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.
గ్రీన్స్, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం..
కొన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజలు జాక్ పోలన్స్కీ ద్వారా “ఎకో-పాపులిస్టులు”గా పునర్నిర్మించబడిన గ్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. స్కాట్లాండ్లో లేబర్ పార్టీ బలహీనత కారణంగా స్కాటిష్ నేషనల్ పార్టీ తన 19 ఏళ్ల పాలనను పొడిగించుకోగలిగింది.
అలాగే వేల్స్లో నేషనలిస్ట్ పార్టీ ‘ప్లాయిడ్ సిమ్రు’, 1999లో అధికార వికేంద్రీకరణ జరిగిన తర్వాత మొదటిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.
యూకేలోని నాలుగు దేశాలలో మూడింటిని ఇప్పుడు విడిపోవాలని కోరుకునే పార్టీలే నడిపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారీ సంక్షోభం- భారత రాజకీయ పరిణామాలు..
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవస్థాగతంగానే సంక్షోభంలో ఉంది. ఫలితంగానే గత నెలలో పోలాండ్, హంగేరీలలో జరిగిన ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలను ప్రజలు ఓడించారు.
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో కూడా రెండు ద్రవిడ పార్టీలను కాదని మరొక నూతన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో మొదటిసారి అధికారం దక్కించుకోవడం, అస్సాంలో హ్యాట్రిక్ సాధించటంతో బీజేపీ తిరుగులేని శక్తి అని ప్రచారం జరుగుతున్నది.
అయితే ఈ విజయాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం మాత్రం కాదు. అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” పేర ఒక వర్గానికి చెందిన ఓటర్లను లక్షల సంఖ్యలో తొలగించడం కారణంగానే బీజేపీ విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజలు తమ జీవన పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం లాంటి ప్రధాన సమస్యలతో సతమతమవుతున్నారు.
మతం ముసుగులో కొన్ని విజయాలు సాధించినంత మాత్రాన ఎగిరిపడటం మంచిది కాదు. ప్రజల తీర్పును గౌరవించి, ప్రజానుకూల విధానాలను అమలు జరపడమే ఏకైక పరిష్కార మార్గం.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
ఫైనాన్షియల్ టైమ్స్, గార్డియన్ పత్రికల సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
