చైనా శాసనసభ్యులు ఇటీవల సమీక్షించిన ఒక ముసాయిదా చట్టం ప్రకారం, చైనా తన ప్రసూతి బీమా వ్యవస్థను మెరుగుపరచాలననీ మరియు దాని పరిధిని విస్తరించాలనీ యోచిస్తోంది.
ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ ముసాయిదా చట్టాన్ని దేశంలోని అత్యున్నత శాసనసభ అయిన జాతీయ ప్రజా కాంగ్రెస్ స్థాయీ సంఘం సమావేశంలో రెండోసారి పరిశీలనకు సమర్పించారు. ఆ సమావేశం గురువారం ముగిసింది.
ఈ ముసాయిదా ప్రకారం, ప్రసూతి బీమాలో భాగమైన వ్యక్తులకు ప్రసవానికి సంబంధించిన వైద్య ఖర్చులు మాత్రమే కాకుండా ప్రసూతి అలవెన్సులు కూడా లభిస్తాయి. ఉద్యోగం చేయని జీవిత భాగస్వాముల ప్రసవ సంబంధిత వైద్య ఖర్చులు కూడా ఈ పరిధి లోకి వస్తాయి.
అలాగే, ఉద్యోగుల ప్రాథమిక వైద్య బీమా నిధితో ప్రసూతి బీమా నిధిని విలీనం చేసి ఒకే అకౌంటింగ్ వ్యవస్థగా మార్చాలని కూడా ప్రతిపాదించింది.
కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించి, జననాలకు అనుకూలమైన సమాజాన్ని ప్రోత్సహించే చర్యలలో భాగంగా ఈ నిబంధనలు తీసుకువస్తున్నారు.
జాతీయ ఆరోగ్య సంరక్షణ సెక్యూరిటీ అధికారిక గణాంకాల ప్రకారం, 2025 చివరి నాటికి ప్రసూతి బీమా కవరేజీ దాదాపు 259.7 మిలియన్ల మందికి చేరింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 6.7 మిలియన్లు పెరిగింది. గత సంవత్సరం గర్భధారణ పరీక్షలు, ఆసుపత్రి ప్రసవాలు, ప్రసూతి అలవెన్సులు వంటి ప్రయోజనాల కోసం దాదాపు 136 బిలియన్ యువాన్లు (18.6 బిలియన్ డాలర్లు) ఖర్చు చేయడం జరిగింది.
సాంప్రదాయంగా ఈ పథకం ఉద్యోగుల బీమా కార్యక్రమంలో ఉన్నవారికే వర్తించేది. నివాసితుల బీమా పథకంలో ఉన్నవారు దీని పరిధిలో ఉండేవారు కాదు. అయితే డిసెంబరులో జరిగిన జాతీయ ఆరోగ్య సంరక్షణ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ యొక్క వార్షిక సమావేశంలో, ఫ్లెక్సిబుల్ ఉద్యోగులు, వలస కార్మికులు, మరియు కొత్త రకాల ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఈ బీమా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికే జియంగ్జి,జెజియాంగ్, మరియు గ్యూజౌ రాష్ట్రాలతో పాటుగా పలు ప్రాంతాలలోనూ, తియాంజిన్ మరియు షాంఘై లలోనూ, ఫ్లెక్సిబుల్ ఉద్యోగులకు కూడా ఈ బీమా కవరేజీ విస్తరించబడింది.
చైనాలో ప్రాథమిక వైద్య బీమా కవరేజీ శాతం ఎన్నో సంవత్సరాలుగా 95 శాతంగా స్థిరంగా కొనసాగుతోంది.
ఈ ముసాయిదా చట్టం బహుళ స్థాయి వైద్య బీమా వ్యవస్థ నిర్మాణంపై కూడా దృష్టి సారించింది. వాణిజ్య ఆరోగ్య బీమా అభివృద్ధికి చేయూత నివ్వడం, ఆరోగ్య సంబంధిత దాతృత్వ విరాళాలు మరియు పరస్పర వైద్య సహాయ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజల విభిన్న అవసరాలను తీర్చాలని సూచించింది.
దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, ప్రాథమిక ఆరోగ్య బీమా నిధుల సక్రమ నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అలాగే ఆదాయం-వ్యయాల మధ్య మధ్యకాల మరియు దీర్ఘకాల సమతౌల్యాన్ని కాపాడే విధానాన్ని రూపొందించాలని ముసాయిదా ప్రతిపాదించింది. అత్యవసర పరిస్థితులకు సమర్థంగా స్పందించే సామర్థ్యాన్ని కూడా ఇది నిర్ధారించనుంది.
అనువాదం: నాగలక్ష్మి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
