తాజా ఎన్నికల్లో సూపర్‌స్టార్ విజయ్ విజేతగా నిలిచారు. తనకు అనుకూలంగా వచ్చిన ఈ సంచలన తీర్పును గౌరవించడానికి ఆయన ఖచ్చితంగా ఏమి చేయాల్సి ఉంటుంది?
తమిళనాడు ఇప్పుడే ఇచ్చిన ఈ తీర్పును రాబోయే దశాబ్దాల పాటు రాజనీతి శాస్త్ర తరగతుల్లో అధ్యయనం చేస్తారు.
మూడు సంవత్సరాల క్రితం ఉనికిలోనే లేని ‘తమిళగ వెట్రి కజగం'(టీవీకే) పార్టీ.. దేశంలోనే అత్యంత పటిష్టమైన క్షేత్రస్థాయి యంత్రాంగం, ఏడు దశాబ్దాలకు పైగా సంస్థాగత చరిత్ర ఉన్న ద్రావిడ మున్నేత్ర కజగం(డీఎంకే)ను తుడిచిపెట్టేసింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో ఓడిపోయారు. కేవలం ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రమే ఈ పరిణామాన్ని ముందుగా పసిగట్టగలిగింది.
దీనికి సులువైన వివరణ చెప్పాలంటే ‘స్టార్ పవర్’ అనవచ్చు. తన విశేష అభిమానగణానికి దళపతి(నాయకుడు) విజయ్, భారతీయ చలనచిత్ర రంగంలో అతిపెద్ద పేర్లలో ఒకరు.
గతంలో ఎంజీ రామచంద్రన్, జే జయలలిత రూపంలో తమిళనాడు ఇలాంటి స్టార్ పవర్‌ను చూసింది. కానీ, కేవలం ఈ వివరణ మాత్రమే ఇప్పుడు సరిపోకపోవచ్చు.
2026 మే 4న ఈరోజు చోటుచేసుకున్నది ఆ పాత పరంపరకు కొనసాగింపు కాదు; ఇదొక భిన్నమైన పరివర్తన. సైద్ధాంతిక స్పష్టత స్థానాన్ని సంస్థాగత బలం, భావోద్వేగాల పెట్టుబడి ఆక్రమిస్తున్న సరికొత్త దశలోకి తమిళనాడు రాజకీయాలు ప్రవేశిస్తున్నాయా?
సినిమా చరిష్మా బ్యాలెట్‌కు బదిలీ..
నిశితంగా చర్చించిన విధానపరమైన దార్శనికత బలంతో టీవీకే అధికారంలోకి రాలేదు.
ఆ పార్టీ ఇచ్చిన హామీలు కూడా ప్రధాన ద్రావిడ పార్టీల హామీలకు భిన్నంగా ఏమీ లేవు. వాస్తవానికి అవి వాటి పొడిగింపు మాత్రమే.
కానీ నిజంగా ఆకట్టుకున్న విషయం మరొకటి ఉంది- ఒక సినిమా వ్యక్తిత్వం బ్యాలెట్ మీదకు బదిలీ కావడం.
తెరపై అవినీతి రహిత, న్యాయం అందించే హీరోగా విజయ్ పోషించిన పాత్ర ఒక రాజకీయ ప్రతిపాదనగా మారింది.
పాత మోడల్ వర్సెస్ కొత్త ఫార్ములా..
ఇక్కడే ఎంజీఆర్, జయలలితలతో ఆయనకున్న పోలిక ఆగిపోతుంది. ఆ నాయకులు తమ ఛరిష్మాను రాజకీయ సామర్థ్యంగా మార్చుకున్నారు. వారు క్యాడర్‌ను, అంతర్గత వ్యవస్థలను, పాలనా నైపుణ్యాలను నిర్మించుకున్నారు.
స్టార్డమ్ అనేది వారికి కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే, వారి ఆపరేటింగ్ సిస్టమ్ కాదు.
అయితే, ఆ పరివర్తనను పూర్తిగా దాటేసి విజయం సాధించడమే నేటి మోడల్ కాగలదా? ఇది ఇతరులు అనుకరించగల మోడలా?
మరో తమిళ స్టార్ అజిత్ కుమార్ కూడా రాజకీయాల్లోకి రావాలని మధురై నుంచి పోటీ చేసిన సినీ దర్శకుడు సుందర్ సీ సూచించినప్పుడు, ఆయన ఒక నమూనాను గుర్తిస్తూ ఉండి ఉండవచ్చు.
తమిళనాడుకు ఇప్పుడు పనిచేసే ఒక ఫార్ములా దొరికింది: అభిమాన సంఘాల నెట్‌వర్క్‌లను సమీకరించడం, భావోద్వేగ విధేయతను వాడుకోవడం, దానికి ఒక విస్తృతమైన మేనిఫెస్టోను జతచేయడం, ఆపై ఆ క్రేజ్‌ను ఓట్లుగా మార్చుకోవడం.
కానీ ఈ ఫార్ములాతో పాలన సాగించగలరా అన్నదే అసలు ప్రశ్న. ఇక్కడే టీవీకే తన సత్యపరీక్షను ఎదుర్కోనుంది.
పాలన అనేది అడపాదడపా జరిగేది కాదు; అది ఒక నియమబద్ధమైన విధానం, సంప్రదింపులతో కూడుకున్నది, చాలా సందర్భాల్లో ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండనిది. సంస్థాగత లోతు లేకపోతే, అఖండ మెజారిటీలు సైతం కుప్పకూలిపోతాయి.
టీవీకే తక్షణమే చేయాల్సిన 5 కీలక పనులు..
మరి, ఒక హెచ్చరిక కథగా/గుణపాఠంగా మిగిలిపోకుండా ఉండాలంటే టీవీకే తక్షణం ఏమి చేయాలి?
మొదటిది: తన అభిమాన వర్గాన్ని రాజకీయ క్యాడర్‌గా మార్చుకోవాలి. అభిమాన సంఘాలు విధేయతపై నిర్మితమవుతాయి; కానీ రాజకీయ క్యాడర్ అనేది విధానాలు, రాజ్యాంగ నిర్మాణాలు, స్థానిక పాలన పట్ల అవగాహన(అక్షరాస్యత) పై నిర్మితం కావాలి.
దీనికి వ్యవస్థీకృత రాజకీయ విద్య అవసరం: జిల్లా స్థాయి శిక్షణా శిబిరాలు, అంశాల ఆధారిత వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి కులం, సంక్షేమ ఫలాల పంపిణీ, ఫెడరలిజం, ఆర్థిక విధానాలపై స్థిరమైన అవగాహన కల్పించాలి.
రెండవది: అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, నాయకత్వ లోతును నిర్మించాలి. విధానాలను వివరించగల, నియోజకవర్గాలను నిర్వహించగల, బాధ్యతలు తీసుకోగల ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు టీవీకేకు అవసరం.
ఎంజీఆర్, జయలలితలకు సెకండ్-ఇన్-కమాండ్ దాదాపుగా లేరు(దీనివల్లే జయలలిత లేని ఏఐఏడీఎంకే నేడు మూడవ స్థానానికి పడిపోయి కుదేలవుతోంది). కాబట్టి విజయ్ నిర్ణయాత్మక విధానాలను కేవలం తన సన్నిహిత వర్గాల నుంచి సంస్థాగత వేదికలకు మార్చడం మంచిది.
మూడవది: కేవలం మాటలు/కథనాల మీద కాకుండా, వాస్తవ పాలనపై పట్టు సాధించాలి. అంటే, ఆరోగ్య సంరక్షణ, నీటి నిర్వహణ, ఉపాధి, పట్టణ ప్రణాళిక వంటి కీలక రంగాలపై వివరణాత్మక శ్వేతపత్రాలను రూపొందించి ప్రజల పరిశీలనకు ఉంచాలి.
ప్రచార నినాదాలు వెంటనే.. కాలపరిమితులు, బడ్జెట్లు, జవాబుదారీ యంత్రాంగాలతో కూడిన ఆచరణాత్మక విధానాలుగా మారాలి.
నాల్గవది: క్షేత్రస్థాయిలో తమ ఉనికిని సంస్థాగతం చేసుకోవాలి. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీల బలం బూత్ స్థాయి నెట్‌వర్క్‌లు, ఓటర్లతో నిరంతర సంబంధాలపై ఆధారపడి ఉండేది. టీవీకే కేవలం ఈవెంట్-ఆధారిత సమీకరణల స్థాయి నుంచి దాటి, రోజువారీ పాలనలో తన ఉనికిని చాటుకోవాలి.
ఐదవది(అత్యంత కీలకమైనది): వెండితెరను, పాలనను(రాజ్యాన్ని) వేరుచేసి చూడాలి. నటుడు విజయ్, రాజకీయ నాయకుడు విజయ్ ఒకే తర్కంతో పనిచేయలేరు.
పాలనలో రాజీపడటం, అంచెలంచెలుగా సాగడం అవసరమవుతాయి; ఇవి సినిమాలో ఉండే నైతిక స్పష్టతకు సరిపోకపోవచ్చు. ఆ మార్పును నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించడమే వారి విశ్వసనీయతను నిర్ధారిస్తుంది.
సరికొత్త రాజకీయ శకం..
గతంలో కూడా తమిళనాడు ఛరిష్మాకు స్పందించింది. రాజకీయాలు ఒక మేధోపరమైన, సామాజిక ప్రాజెక్ట్ అని, కేవలం భావోద్వేగాల లావాదేవీ కాదని నొక్కిచెప్పిన పెరియార్, కరుణానిధి వంటి నాయకులను తయారు చేసిన రాష్ట్రం ఇది.
ఓటర్లు తిరస్కరించడం వల్ల ఆ సంప్రదాయం క్షీణించలేదు, పార్టీలు దానిని పునరుద్ధరించడం ఆపేయడం వల్లే క్షీణించింది.
సిద్ధాంతం కేవలం అలంకారప్రాయంగా మారింది. సంస్థలు బలహీనపడ్డాయి. నాయకత్వం సంకుచితమైంది. ఆ కోణంలో చూస్తే విజయ్ ఒక అంతరాయం కాదు.. ఆ పతనానికి వచ్చిన పంటలాంటి వారు.
ప్రస్తుతానికి ఒక విషయం స్పష్టం: విజయ్ తమిళనాడు రాజకీయ ప్రయాణాన్ని మరో దశలోకి లాక్కొచ్చి, దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వయాన్ని బద్దలు కొట్టారు.
కమల్ హాసన్, విజయకాంత్ లాంటి నటులు ప్రయత్నించి విఫలమైన దురదృష్టాన్ని ఆయన తిప్పికొట్టారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌లాంటి వారు రాజకీయాల్లోకి రావాలని ఊరించి ఎప్పుడూ రంగంలోకి దిగని లోటును కూడా ఆయన తీర్చారు.
(వ్యాస రచయిత జాన్ జె కెన్నెడీ – బెంగళూరుకు చెందిన విద్యావేత్త, కాలమిస్ట్, రాజకీయ విశ్లేషకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
