ఆండ్రే బెటెయిల్ మరణంతో, భారతీయ సమాజశాస్త్రంలో అనేక తరాల విద్యార్థులను తీర్చిదిద్దిన, ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ సమాజ అధ్యయనానికి అంకితభావంతో కృషి చేసిన ఒక మహానుభావుని శకం ముగిసింది.
సైద్ధాంతిక లోతు, అనుభావిక అవగాహనల మధ్య అసాధారణమైన సమన్వయం సాధిస్తూ, కఠినమైన క్షేత్ర అధ్యయనంపై ఆధారపడిన ఆయన బౌద్ధిక వారసత్వం అపూర్వమైనది.
భారతీయ సమాజం, అందులోని కులం, వర్గం, హోదా ఆధారిత సామాజిక స్థాయీకరణతో పాటు ఈ అంశాల కలయిక ద్వారా ఏర్పడే అధికార సంబంధాల మార్పు— ఇవే బెటెయిల్ దీర్ఘకాలిక బౌద్ధిక ఆసక్తి.
సాంప్రదాయకంగా కుల వ్యవస్థను వర్ణ పరిధిలో అధ్యయనం చేయడం జరిగింది.
ఇండాలజికల్(భారతీయ విజ్ఞాన) సంప్రదాయం నుంచి వచ్చిన ఈ దృక్పథం భారతీయ శాస్త్రాలను గ్రంథాల ఆధారంగా చదవడం ద్వారా రూపొందించబడింది.
ఈ గ్రంథ గత సోపానక్రమానికి జీవన వాస్తవికత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కేవలం వలసవాద వ్యాసాలలో మాత్రమే కాకుండా, భారతీయ సమాజశాస్త్ర ప్రారంభ దశలో కూడా స్పష్టంగా కనిపించింది.
జీఎస్ ఘుర్యే నుంచి మొదలుకొని తరువాతి పండితులు కూడా భారతీయ సామాజిక నిర్మాణాన్ని వర్ణ చట్రంలోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
గణనీయమైన ప్రభావం..
ఫ్రెంచ్ సమాజశాస్త్రవేత్త లూయీ డ్యూమాంట్ తన విశిష్ట రచన ‘హోమో హైరార్కికస్'(మానవ సోపానక్రమం)లో ఈ గ్రంథగత దృక్పథానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచారు.
పవిత్రత-అపవిత్రత ఆధారంగా కుల వ్యవస్థను ఒక నైతిక క్రమంగా చిత్రీకరించి, చతుర్వర్ణ వ్యవస్థపై ఆధారపడి వివరించారు.
డ్యూమాంట్ రచన కుల అధ్యయనానికి ఒక ప్రమాణంగా మారి, పాశ్చాత్య పండితులపైనే కాకుండా తరువాతి తరం భారతీయ సమాజశాస్త్రవేత్తలపై కూడా గణనీయమైన ప్రభావం చూపింది.
నిర్మల్ కుమార్ బోస్, ఎంఎన్ శ్రీనివాస్— తనకు మార్గదర్శకులైన ఈ ఇద్దరు ప్రముఖుల ప్రభావంతో బెటెయిల్ భారతీయ సామాజిక నిర్మాణాన్ని అధ్యయనం చేశారు.
అయితే బెటెయిల్ దృక్పథం, పద్ధతి, విశ్లేషణలో వారిని మించిపోయారు.
గ్రంథాల నుంచి వాస్తవ ప్రపంచం వైపు, మూలపాఠాల నుంచి సామాజిక సందర్భం వైపు — వాటి మధ్య ఉన్న సంబంధాన్ని విస్మరించకుండా — ఆయన అవలంబించిన పద్ధతి పరమైన మార్పు సహజమైనది.
భారతీయ సమాజం, ముఖ్యంగా కుల సమస్యను కేవలం గ్రంథగత దృక్పథం నుంచి బయటకు తీసుకొచ్చి, కఠినమైన అనుభావిక(క్షేత్రాధారిత) అధ్యయనంపై ఆధారపడి గతిశీలమైన, సందర్భానుసారమైన విశ్లేషణ అందించారు.
వలసవాద వారసత్వం కారణంగా భారతీయ సమాజశాస్త్రం పాశ్చాత్య సిద్ధాంతాలలో బాగా ఇరుక్కుపోయింది.
సామాజిక మార్పులోని గతిశీలతను అర్థం చేసుకోవడానికి అడ్డుపడే, ముందుగా నిర్ణయించుకున్న సైద్ధాంతిక చట్రాలను నిరోధించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు.
సిద్ధాంతం సామాజిక వాస్తవికతను కప్పివేయకుండా దానిపై వెలుగునివ్వాలని నమ్మారు.
కులం, వర్గం, అధికారం..
బెటెయిల్ రాసిన మొదటి ముఖ్య రచన ‘కాస్ట్, క్లాస్ అండ్ పవర్'(కులం, వర్గం, అధికారం – 1965) తంజావూరు జిల్లాలోని రామపురం(శ్రీపురం) అనే బ్రాహ్మణ అగ్రహార గ్రామంపై ఆధారపడి రాయబడింది.
ఇది సాధారణ గ్రామ అధ్యయనం కాకుండా, భారతీయ సమాజశాస్త్రంలో ప్రభావవంతమైన సిద్ధాంతాలతో లోతైన సంబంధం ఏర్పరచుకున్న అసాధారణ రచన.
ఈ పుస్తకం ఎంఎన్ శ్రీనివాస్ రాసిన ‘రిమెంబర్డ్ విలేజ్'(జ్ఞాపకాల గ్రామం)తో పోల్చదగిన స్థానం సంపాదించింది.
గ్రామ అధ్యయనాలలో సాధారణంగా దృష్టి సారించే కుటుంబం, బంధుత్వం, ఆచారాలు వంటి వాటి పరిధి నుంచి ఈ అధ్యయనం బయటకు వచ్చింది.
కులం, వర్గం, హోదా, మారుతున్న అధికార సమీకరణాలపై ఇది దృష్టి పెట్టింది. ఒకే అంశం సామాజిక స్థాయీకరణను పూర్తిగా వివరించలేదని బెటెయిల్ స్పష్టం చేశారు.
భూమి, వృత్తి, హోదా, విద్య, రాజకీయ ప్రాప్యతలలో వస్తున్న మార్పుల ద్వారా కులం-వర్గం-అధికారాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని(ఇంటర్సెక్షనాలిటీని) వివరించారు.
“శ్రీపురం సాపేక్షంగా మూసుకుపోయిన సామాజిక వ్యవస్థ నుంచి, సాపేక్షంగా స్వేచ్ఛాయుతమైన(తెరిచిన) వ్యవస్థగా మారుతోంది” అని విశ్లేషించారు.
ఈ మార్పులో కీలకమైన అంశం బ్రాహ్మణుల భూస్వామ్యం, నియంత్రణ తగ్గడం.
అదే సమయంలో బ్రాహ్మణేతర కౌలుదారులు, వృత్తి కులాలు సామాజిక సోపానక్రమంలో పైకి ఎదగడం.
భూమి విపణి(మార్కెట్) ఏర్పాటు, విద్యా వ్యాప్తి, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రవేశం ఈ మార్పును మరింత సులభతరం చేశాయి.
మాక్స్ వెబర్ సిద్ధాంతం నుంచి ప్రేరణ పొందిన బెటెయిల్ కులం, వర్గం, హోదా, అధికారం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు.
అయినప్పటికీ మార్క్సిస్టు విశ్లేషణ పట్ల ఆయన పూర్తి వ్యతిరేకత చూపలేదు. వివిధ బౌద్ధిక సంప్రదాయాల పట్ల ఆయనకున్న విశాల దృక్పథం(తెరిచిన మనస్తత్వం) ఆయన ప్రత్యేక లక్షణం.
మార్పును గుర్తించిన బెటెయిల్..
బెటెయిల్ “మూసుకుపోయిన సమాజం” నుంచి “స్వేచ్ఛాయుత సమాజం” వైపు జరుగుతున్న మార్పును గుర్తించారు.
ఇది కేవలం ఒక్క అంశానికే ప్రాధాన్యత ఇవ్వకుండా, అనేక కారకాలను పరిగణనలోకి తీసుకోవడానికి వీలు కల్పించింది.
రామపురంలో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, ఆది-ద్రావిడులు అనే మూడు ప్రధాన కుల సమూహాలు ఉన్నాయని, అలాగే వర్గాలు భూస్వాములు, కౌలుదారులు, కూలీలుగా విభజించబడ్డాయని ఆయన గుర్తించారు.
కుల హోదా, ఆస్తి యాజమాన్యం కలయిక ద్వారా అధికారం నిర్వచించబడింది.
బ్రాహ్మణులు కులం, భూస్వామ్యం, సామాజిక హోదా, రాజకీయ అధికారం అన్నింటిలోనూ ఉన్నత స్థానంలో ఉండేవారు.
ఆది-ద్రావిడులు అట్టడుగున ఉండేవారు. బ్రాహ్మణేతరులు మధ్యస్థంగా ఉండేవారు.
స్వాతంత్య్రానంతరం, ముఖ్యంగా బ్రాహ్మణేతర ద్రావిడ ఉద్యమం వల్ల బ్రాహ్మణులు తమ భూములు అమ్మి నగరాలకు వలస వెళ్లారు.
దీంతో బ్రాహ్మణేతరులు (ముఖ్యంగా శూద్ర కులాలు) ఆ భూములను కొనుగోలు చేసి రైతులుగా మారి, రాజకీయ శక్తిగా ఎదిగారు.
అయితే ఈ మార్పు ఆది-ద్రావిడుల (దళితుల) జీవితాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. వారు ఇప్పటికీ కుల సోపానక్రమంలో అట్టడుగునే ఉన్నారు, భూమిలేని కూలీలుగానే మిగిలిపోయారు.
గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు భూస్వాములకు, భూమిలేని వారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు ఆధిపత్య శూద్ర కులాలకు, దళితులకు మధ్య వైరుధ్యంగా మారింది. తమిళనాడులో ద్రావిడ పార్టీల మద్దతుదారులైన ఈ శూద్ర కులాలే దళితులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు ప్రధాన కారకులవుతున్నారు.
ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించిన ‘సంస్కృతీకరణ’ భావనను బెటెయిల్ సవాలు చేశారు. ఆ భావన ప్రకారం నిమ్న కులాలు ఉన్నత కులాల(ముఖ్యంగా బ్రాహ్మణుల) ఆచారాలను, విలువలను అనుసరించడం ద్వారా సమాజంలో ఎదుగుతాయి. కానీ బెటెయిల్ ఇది పాక్షికంగా మాత్రమే నిజమని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా నిమ్న కులాలు తమ “అట్టడుగు స్థానాన్ని” గర్వంగా చెప్పుకోవడం, కులం పేర్లను తమ గుర్తింపుగా జోడించుకోవడం పెరుగుతున్నట్లు ఆయన గమనించారు.
రాజ్యాంగ నైతికత..
“సామరస్యపూర్వక”, “సామరస్యరహిత” వ్యవస్థల మధ్య బెటెయిల్ చేసిన వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. సామరస్యపూర్వక వ్యవస్థలో సామాజిక వాస్తవికతకు, సామాజిక నైతికతకు మధ్య సమన్వయం ఉంటుంది. అసమానతలు ఉన్నప్పటికీ అవి చట్టబద్ధమైనవిగానే అంగీకరించబడతాయి.
సామరస్యరహిత వ్యవస్థలో ఈ సమన్వయం లోపిస్తుంది. రాజ్యాంగ నైతికత అనగా- రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక ఆదర్శాలను, విలువలను, స్ఫూర్తిని కాపాడటమేనని బెటెయిల్ నిర్వచించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో చెప్పినట్లు.. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి లక్ష్యాలు ఉన్న రాజ్యాంగాన్ని, కుల వ్యవస్థ ఆధారంగా పాతుకుపోయిన అసమాన సమాజంపై అమలు చేయడం ద్వారా ఒక “వైరుధ్యాల జీవితం” మొదలవుతుందని ఆయన హెచ్చరించారు.
బెటెయిల్ లౌకికవాదం, లౌకికీకరణ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా చర్చించారు. మొదటిది ఒక ఆదర్శం కాగా, రెండవది సమాజంలో దాని ఆచరణాత్మక అమలు.
‘కుల వ్యవస్థ క్షీణత’ వాదన..
తన తరువాతి రచనలలో బెటెయిల్ కుల వ్యవస్థ క్షీణిస్తోందని వాదించారు. పవిత్రత-అపవిత్రత నియమాలు బలహీనపడడం, వివాహాల్లో కుల పట్టింపులు తగ్గడం, కులానికి వృత్తికి మధ్య ఉన్న సంబంధం విడిపోవడం — ఇవి ఆయన వాదనకు ఆధారాలు.
అయితే, ఆయన చేసిన ఈ వాదనను దళితులపై పెరుగుతున్న హింస, దళిత ఉద్యమాలు, పరువు హత్యలు, పత్రికల్లో పెళ్లి సంబంధాల ప్రకటనలు(మ్యాట్రిమోనియల్స్), కులం ఆధారిత వృత్తుల స్థిరత్వం వంటి అంశాలతో బేరీజు వేసుకుని చూడాలి.
నిజానికి, నయా ఉదారవాద యుగంలో కులం తన సాంప్రదాయ రూపంలో కనిపించకపోవచ్చు. కానీ సామాజిక ఉత్పత్తి, ఆస్తి యాజమాన్యం, అధికార పంపిణీలో సవర్ణ, ఆధిపత్య శూద్ర కులాల ఆధిపత్యం ఇప్పటికీ బలంగానే ఉంది. ఇక నయా-హిందుత్వ కాలంలో కులం మరింత స్పష్టంగా బహిర్గతమవుతోంది.
బెటెయిల్ రిజర్వేషన్లను “ప్రతిభతో రాజీ” పడటంగా భావించారు. విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జాతీయ జ్ఞాన సంఘం(నేషనల్ నాలెడ్జ్ కమిషన్) సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.
అయితే నయా ఉదారవాద ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ రంగం కుంచించుకుపోతున్న వాస్తవాన్ని ఆయన తీవ్రంగా పరిగణించలేదు.
బెటెయిల్ ఆరు దశాబ్దాల బౌద్ధిక ప్రయాణం భారతీయ సమాజశాస్త్ర పరిణామానికి అద్దం పడుతుంది. ఆదర్శాలకు అతీతంగా, విశాల దృక్పథంతో, కఠినమైన క్షేత్ర అధ్యయనంతో సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవడమే మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం. ఈ విధానమే సమానత్వ సమాజం నిర్మాణం వైపు మనల్ని నడిపించగలదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
