దక్షిణాదిలో తమకు ప్రయోగశాలగా మారిన కర్ణాటకలో సంఘ్‌పరివార్ విద్వేష విషం చిమ్ముతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, తమను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ లింగాయత్‌లు పెద్ద ఎత్తున మరోసారి ఉద్యమించారు. ఇందులో భాగంగా సెప్టెంబరు నుంచి అక్టోబర్ 5 వరకు బసవ సంస్కృతి యాత్ర పేరుతో లింగాయత్ సంఘాల ఐక్యకూటమి నాయకత్వంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి అస్థిత్వ ఉద్యమ లక్షణాలు ఉన్నాయి.
ప్రతి అస్థిత్వ ఉద్యమాన్ని దేనికదే విశ్లేషణ చేసి; అది తిరోగామి లేదా పురోగామి స్వభావం కలిగినదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎంఏ అరుణ్ రాసిన విశ్లేషణను ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాం.
తమను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ వందలాది మంది లింగాయత్ నేతలు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 2025 సెప్టెంబరులో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. వీరిలో ప్రముఖ, ఇప్పుడిప్పుడే ఉనికిలోకి వస్తున్న మఠాలకు చెందిన అధిపతులందరూ ఉన్నారు. లింగాయత్ నేతలు, స్వాములతో కూడిన శక్తివంతమైన లింగాయత్ మతాధీశుల ఐక్య కూటమి సంస్థ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో లక్షలాది మందిని సమీకరించి ప్రచారం జరిపారు.
సభలలో సమతా భావాల సందేశాలు..
భారీ ఎత్తున జరిగిన సభల్లో హిందూయేతరులుగా గుర్తింపుతెచ్చుకోవాలని లింగాయత్‌లకు వక్తలు పిలుపునిచ్చారు. అంతేకాకుండా లింగాయత్ మతానికి చట్టపరంగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నెండవ శతాబ్ది బోధకుడు బసవ, ఆయన సమకాలికులు ప్రబోధించిన అంతర్గాహ్యమైన, హేతుబద్ద, సమతా భావనలను అనుసరించాలని ఉద్బోధించారు. ప్రజాసమూహాల నుంచి వచ్చిన స్పందనకు అనుగుణంగా ప్రత్యేక మతం గుర్తింపు గురించి నొక్కివక్కాణించారు.
బసవ సంస్కృతి యాత్రను సెప్టెంబరులో ప్రారంభించి అక్టోబరు 5న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ముగించారు. ఈ ముగింపు సభకు చాలా మంది స్వాములు, లక్షలాది మంది జనం హాజరైయ్యారు.
కర్ణాటక రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఈ యాత్ర సాగింది. ప్రతి జిల్లాలో ఒక రోజు కార్యక్రమం జరిగింది. ప్రతి చోట మూడు భాగాలుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం పూట విద్యార్థులతో ప్రశ్నలు- సమాధానాలు, మధ్యాహ్నం భారీ ప్రదర్శనలు, సాయంత్రం లింగాయత్ విశ్వాసంపై నిపుణులతో బహిరంగ సభలలో ఉపన్యాసాలను ఇప్పించారు.
నిర్మొహమాట చర్చలలో కొన్నిసార్లు ఇబ్బంది పడ్డ స్వాములు..
బాగల్కోట్లో జరిగిన కార్యక్రమంలో, “నిజంగా మహిళాసాధికారత కోసం బసవ పని చేస్తే, వేదికపై కేవలం పురుష స్వాములే ఎందుకు ఆసీనులయ్యారు” అని ఒక హైస్కూలు బాలిక స్వాములను ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు స్వాముల నుంచి సమాధానం రాలేదు. ఆ ఉదంతం తరువాత స్వాములు మరింత కలవరపడ్డారు.
దీర్ఘకాలం ఖాళీగా కూర్చోని సంఘ్‌పరివార్ పుంజుకొనేందుకు అవకాశం ఇచ్చారని చామరాజనగర సభలో ఒక కార్యకర్త మీనాక్షీ బాలి స్వాములను తప్పుపట్టారు. ”కొన్ని దశాబ్దాల క్రితమే మీరు ఈ పని చేసి ఉంటే, మన రాష్ట్రం సురక్షిత ప్రాంతంగా మారి ఉండేదని” ఆమె చెప్పారు. ఆ తరువాత ప్రసంగించిన ఇలక్కల్ స్వామి ఆ విమర్శను హుందాగా అంగీకరించారు.
ఐక్యకూటమి నేతలు ఎక్కువ మంది 70వ పడిలో ఉన్నారు. వారికి ఒక శిక్షలా కార్యక్రమాలను ఏర్పాటు చేసినప్పటికీ వారు సకాలంలో వాటిని పూర్తి చేశారు. పన్నెండు గంటలపాటు సాగిన కార్యక్రమంలో పాల్గొని తదుపరి కార్యక్రమం కోసం రాత్రి సమయాల్లో వందల కిలోమీటర్లు ప్రయాణించి, మరుసటి రోజు ఉదయం పదిగంటలకల్లా సిద్ధంగా ఉండేవారు.
ఒక కీలక నిర్వాహకుడు సానేహళ్లి పండితారాధ్య స్వామి సమయపాలనలో నిక్కచ్చిగా ఉన్నారు. మొత్తం కార్యక్రమాలను సకాలంలో నిర్వహించేందుకు కొన్నింటిని అర్ధంతరంగా ముగించేసేవారు.

ప్రత్యేక మతం కోసం డిమాండ్..
వివక్షాపూరితమైన హిందూమత ఆచారాలు, మతగ్రంధాలకు వ్యతిరేకంగా బసవ ఆయన సమతుల్యులు, అనుచరులు పన్నెండవ శతాబ్దిలో వైదికేతర సమభావన ప్రత్యామ్నాయాన్ని సృష్టించారు. చరిత్ర అంతటా లింగాయత్‌లను హిందూయేతర సామాజిక తరగతిగానే పరిగణించారు. ఆదిల్ షాహి రాజులు జిజియా- మతపరమైన పన్ను- విడివిడిగానే హిందువులు, లింగాయత్‌ల మీద విధించారు.
తొలిసారిగా 1871లో జరిపిన మైసూరు జనగణనలో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణించారు. తీవ్రమైన వివాదం జరుగుతుండగానే వారిని 1881 తరువాతే హిందువులుగా లెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. శతాబ్దాల తరబడి హిందూ ప్రభావం పెరిగిన కారణంగా వైదికేతర మూలాల నుంచి లింగాయత్‌లు దూరమయ్యారు.
పన్నెండవ శతాబ్దంలో లింగాయతులు తమ ప్రాంతం నుంచి వివిధ చోట్లకు వలస వెళ్లారు. వారితో పాటు చెల్లాచెదురైన ప్రధానమైన లింగాయత్ మత బోధనలకు సంబంధించిన వచనాలను(ప్రవచనాల సాహిత్యాన్ని) కనుగొనే ప్రక్రియ గత వంద సంవత్సరాలుగా పెరుగుతోంది. లింగాయత్ మతానికి చెందిన విప్లవాత్మకమైన వైఖరులు వెలుగులోకి వస్తున్నాయి. అనేక మంది కార్యకర్తలు, స్వాములు, పండితుడైన ఎంఎం కల్బుర్గి(హిందుత్వ శక్తులు 2015 ఆగస్టు 30న ఆయనను కాల్చిచంపారు- ఎడిటర్) వంటి వారు సంస్మృతీ(సంస్మృతం)కరణకు గురైన లింగాయతులను వెనక్కు మళ్లించేందుకు, ఉద్యమ అసలుసిసలు భావనలను తిరిగి పాదుకొల్పేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రత్యేక మతంగా గుర్తింపును కోరుతూ గత శతాబ్దిలో అడపాదడపా లింగాయతులు ఆందోళనలు నిర్వహించారు. ఆ ఉద్యమం 2017- 18లో ఊపందుకుంది. అనేక పట్టణాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. తరువాత కాస్త తగ్గినప్పటికీ ఇప్పుడు తిరిగి ఉనికిలోకి వస్తున్నది.
గత కొన్ని దశాబ్దాలుగా బసవ అనుచరులుగా ఉండే దాదాపు వెయ్యి స్వచ్ఛంద సంస్థలు లింగాయత్ మతాన్ని వ్యాపింపజేసేందుకు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. అవి ప్రార్ధనా సమావేశాలు జరిపాయి. నిజమైన ఆచారకర్మల ఆచరణకు, వచనాలకు భాష్యం చెప్పేందుకు చర్చలు నిర్వహించాయి.
హిందూ ఆచారకర్మల కంటే భిన్నంగా లింగాయతుల కర్మలు ఉంటాయి. ఖర్చు కూడా తక్కువే. అంతేకాకుండా మూఢనమ్మకాలను లింగాయత్‌లు తిరస్కరించారు. పూర్తిగా వచనాల ప్రాతిపదికను ఉనికిలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

లింగాయత్ ఆచారం ప్రకారం భౌతిక శాస్త్ర ఆచార్యుడు హెచ్ఎం సోమశేఖరప్ప ఇటీవలనే గృహప్రవేశ క్రతువు నిర్వహించారు. ”నేను పూర్తి కార్యక్రమానికి 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేశాను. అదే హిందూ క్రతువుకు ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది” అని చెప్పారు.
ప్రత్యేక మత గుర్తింపు డిమాండ్‌ను ప్రాతిపదికగా చేసుకొనేందుకు 2017- 18లో జరిగిన ప్రజాప్రదర్శనలు సైద్ధాంతికంగా ఒక స్పష్టతనిచ్చాయి. ఈ సంస్థలు ఇప్పుడు ఐక్యకూటమితో చేతులు కలిపి యాత్రకు భారీ ఆదరణ వచ్చేట్లు చేశాయి.
ఎంతో ప్రభావం చూపే జగతిక(ప్రపంచ) లింగాయత్ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం జామదార్ మాట్లాడుతూ, ”ఈ యాత్రకు మేము ఊహించినదానికంటే ప్రతి చోటా స్పందన ఎంతో ఎక్కువగా ఉంది. మేము చెబుతున్నది ఏమిటి అని అర్ధం చేసుకొనేందుకు జనాలు 2017- 18లో ఎంతో ప్రయాసపడ్డారు. కానీ అప్పటి నుంచి లింగాయత్ మతాన్ని ప్రత్యేకంగా గుర్తించాలనే చైతన్యం అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు అది దిగువ స్థాయికి చేరిన ఉద్యమంగా మారింది” అన్నారు.
మాజీ ఐఎఎస్ అధికారి, ఎంతో గౌరవనీయ పండితుడైన జామదార్ లింగాయత్ ఉద్యమాన్ని వ్యాపింపజేస్తున్నారు.
విస్తృతమౌతున్న సంఘర్షణ..
గతేడాది డిసెంబరులో యాత్ర గురించి ఐక్య కూటమిలో ఒక సీనియర్ నేత విలేకర్లతో మాట్లాడారు. సంఘ్‌పరివార్ నుంచి లింగాయత్ యువతను వెనక్కు తీసుకురావటం తమ ప్రచార ముఖ్య లక్ష్యమని చెప్పారు. అయితే యాత్ర సమయం దగ్గరపడిన కొద్దీ ఐక్యకూటమి ఒక నిర్ణయం తీసుకుంది: ఏ సంస్థ లేదా ఏ మతాన్ని విమర్శించకూడదని, లింగాయత్ సమాజంలోని మితవాదులు తప్పుదారి పట్టించకుండా లేదా వారిని దూరంగా పెట్టేందుకు కేవలం లింగాయత్ మత గుర్తింపు మీద మాత్రమే కేంద్రీకరించాలని నిర్ణయించారు.
మహారాష్ట్రలో శివాజీ మాదిరి కర్ణాటక ప్రభుత్వం 2024లో ”రాష్ట్ర సాంస్కృతిక నాయకుడు బసవన ” అని ప్రకటించింది. తాము హిందువులం కాదని, బసవన తమ మతగురువని లింగాయతులకు గుర్తు చేస్తూ, వచనాలే తమ పవిత్ర మతశాస్త్ర సూత్రాలని ప్రకటించేందుకు యాత్రను తొలివార్షికోత్సవంగా పరిగణించాలని ఐక్య కూటమి స్వాములు చెప్పారు.

బసవ సంఘాల సంఘటిత వైఖరి, ప్రజాకర్షక విజ్ఞప్తి సంఘ్‌పరివార్ రాజకీయాలకు రాష్ట్రంలో ఒక విరుగుడని కర్ణాటకలో అనేక మంది భావిస్తున్నారు. ప్రభుత్వం 2024లో చేసిన ప్రకటన లింగాయతుల్లో పెద్ద ఉద్వేగాన్ని రేకెత్తించింది. బసవ సంస్థలు తమ కార్యకలాపాలను పెంచాయి. అనుకోకుండానే సంఘపరివార్‌తో తమ విరోధ తీవ్రతను పెంచాయి. లింగాయత్‌ల ఓట్లు నష్టపోవటం తమ ఓటమికి ఒక కారణమని 2024 ఎన్నికల దెబ్బ తరువాత సంఘ్‌పరివార్ ఆరోపించింది. ప్రత్యేక మత డిమాండ్‌కు పెరుగుతున్న మద్దతును అరికట్టేందుకు, దూరమైనవారిని తిరిగి వెనక్కు తెచ్చుకొనేందుకు అది అనేక కార్యక్రమాలను చేపట్టింది. వచన దర్శన పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకువచ్చింది. బసవన చెప్పిన వచనాలు, శరణులు వైదిక హిందూయిజంలో కేవలం ఒక శాఖ మాత్రమే అని దానిలో చెప్పారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా రాష్ట్రంలోని పట్టణాలన్నింటా జరిపారు.
శరణార శక్తి పేరుతో ఒక సినిమా విడుదల చేశారు. లింగాయత్ ఉద్యమం హిందూ సాంప్రదాయంలో అంతర్లీనమే అని దానితో చెప్పించారు. లింగాయత్‌లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, పుస్తకాన్ని దహనం చేశారు. సినిమాలో అనేక కోతలు పెట్టాల్సి వచ్చింది.
సంఘ్‌పరివార్ వాదనలకు సమాధానంగా వారు రెండు పుస్తకాలను తీసుకువచ్చారు. పలు నగరాల్లో వాటిని ఆవిష్కరించారు. దీనికి ప్రతిగా తమ శిబిరంలో ఉన్న లింగాయత్ నేతలు, స్వాములతో నూతన పదజాలాన్ని సృష్టించారు. తమ భావజాల వ్యతిరేకులను బసవ తాలిబాన్లు అని నిందించారు.
”ఈ యాత్ర ఒక విషయాన్ని స్పష్టం చేసింది. మాకున్న వనరులు, భావజాలం, రాష్ట్రంలో మేం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎంత పెద్ద సభలను నిర్వహించగలమో మా ప్రత్యర్ధులకు చూపింది. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, మా లక్ష్యాన్ని చేరేవరకు మేము ఆగేది లేదు”అని ఐక్య కూటమిలో చురుకుగా పని చేసే ఒక స్వామి అన్నారు.
వీర శైవుల్లో బేధాలను పెంచుతున్నది..
ప్రత్యేక మతం కోసం పెరుగుతున్న మద్దతు వీరశైవుల్లో బేధాలను కూడా పెంచుకుతున్నది. వీర శైవులు లింగాయతుల్లో ఉన్న వంద ఉపకులాల్లో ఒకరు. వారిని పంచాచార్యలు(ఐదుగురు) నడిపిస్తున్నారు. బ్రాహ్మణ తరగతిలో మూలాలు ఉన్నవారు బసవ ఉద్యమంలో చేరారు. ఇతరులు అత్యధికంగా వెనుకబడిన, దళిత సామాజిక తరగతులకు చెందిన వారు లింగాయత్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు.
పంచాచార్యులెవరు ?
వీరశైవ సామాజిక తరగతిని ఐదుగురు ప్రముఖ స్వాములు నడిపిస్తారు. వారికి కేదార్ నాథ్, వారణాసి, కర్ణాటకలోని ఉజాని, రంబాపురి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలలో మఠాలు ఉన్నాయి. వారందరినీ కలిపి పంచ(ఐదుగురు) ఆచార్యులు(ప్రబోధకులు) అంటారు. కర్ణాటకలో ఈ మఠాలకు కొన్ని జిల్లాల్లో శాఖలు ఉన్నాయి.
వీరశైవులు బసవ ప్రభావం కిందికి వచ్చినప్పటికీ వారు నిజమైన వేదాచరణను కొనసాగిస్తున్నారు. లింగాయతుల్లో పూజారులుగా ఉండేందుకు ఉన్నత సామాజిక హోదాను వినియోగించుకుంటున్నారు. నిజమైన బసవ ఉద్యమం అలాంటి పూజారులను తిరస్కరించినప్పటికీ అది కొనసాగింది. శతాబ్దాల తరబడి లింగాయతుల్లో హిందూ విశ్వాసాలను విస్తరింపచేసేందుకు, కర్మకాండలను కొనసాగించేందుకు సాధనాలుగా మారారు. వారు తమ సామాజిక తరగతి మొత్తాన్ని వీరశైవ లింగాయతులుగా పిలిపించుకొనేంత ప్రభావశీలురుగా పెరిగారు. లింగాయతులు తమ వైదికేతర మూలాలకు తిరిగి వచ్చేందుకు సంఘటితం అవుతున్నారు. అదేవిధంగా వీరశైవ ప్రభావం నుంచి దూరం జరుగుతున్నారు.
ఇటీవలి సంవత్సరాలలో వీరశైవ స్వాములతో లింగాయతులు కూడా ఘర్షణలకు దిగుతున్నారు. తమ అనుచరుల సంఖ్య తగ్గుతుండటంతో వారు మేలుకొని తమ అదుపులో ఉంచుకొనేందుకు దిక్కుమాలినదారులు వెతుకుతున్నారు.

ప్రతిక్రియలు..
తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని యాత్ర నొక్కివక్కాణిస్తుండటంతో జనబాహుళ్య మద్దతు వెల్లడౌతున్నది. అది హిందూత్వ, వీరశైవ మద్దతుదార్ల నుంచి తీవ్ర ప్రతిక్రియలకు దారితీస్తున్నది.
అసలు బసవ ఎలాంటి నూతన మతాన్ని ప్రారంభించలేదని, కొన్ని కంపెనీలు దాన్ని తయారు చేశాయని హిందూత్వ- లింగాయత్ రాజకీయవేత్త బసన గౌడ యత్నాల్ అన్నారు. ఆలిండియా వీరశైవ మహాసభ-(ఇది లింగాయత్ సంస్థలలో చాలా పాతది, ప్రధానంగా యడ్యూరప్ప వంటి రాజకీయవేత్తలకు చెందిన సంస్థ, లింగాయత్, వీరశైవ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచేందుకు చూస్తున్నది) రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత పోలీసు డైరెక్టర్ జనరల్ శంకర్ బిదారి మాట్లాడుతూ, సమాజాన్ని ముక్కలు చేసేందుకు రోగపూరితమైన మెదళ్లు కలవారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇతగాడు ఆర్ఎస్ఎస్తో వేదికను పంచుకున్నారు, లింగాయతులు హిందువులు తప్ప ప్రత్యేక మతం కాదని చెబుతారు. కమ్యూనిస్టు స్వాముల బృందం ఒకటి సమాజాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నదని ఆర్ఎస్ఎస్ అనుబంధ రచయితలు ఆరోపించారు.
బెంగలూరులో వీరశైవ మద్దతుదారుల బృందం ఒకటి యాత్ర సభను అడ్డుకొనేందుకు ప్రయత్నించింది. ఇరువర్గాలు చేతులు కలపటమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
”గోడీ మీడియా బసవ యాత్రకు వ్యతిరేకం. ఎక్కడైనా ఒక ఘర్షణ జరిగితే దాన్ని జాతీయ వివాదంగా మార్చి యాత్రను పక్కదారి పట్టించేది. అలాంటిది చోటు చేసుకోకుండా మావారిని అదుపు చేశామ”ని భౌతిక శాస్త్ర ఆచార్యుడు సోమశేఖరప్ప చెప్పారు. అదే వీరశైవ బృందం మరుసటి రోజు హసన్ వెళ్లి అక్కడ యాత్రలో భాగంగా సాయంత్రం జరిగిన సభను విచ్ఛిన్నం చేసింది. అయితే పోలీసులు, స్థానిక స్వామి 15 నిమిషాల తరువాత సభను ప్రారంభింపజేశారు.
యాత్ర ముందుకు కొనసాగుతుండగా రెండు సామాజిక తరగతుల మధ్య ఐక్యత కొనసాగాలనే పేరుతో వీరశైవ స్వాములు పోటీగా హుబ్లీలో సెప్టెంబరు 19న ఏక్తా సమావేశ పేరుతో ఒక సభను ఏర్పాటు చేశారు. కనీసం ఒక లక్షమందిని సమీకరిస్తామని వారు చెప్పినప్పటికీ ఒక అంచనా ప్రకారం కేవలం ఏడువేల మంది మాత్రమే వచ్చారు. సమావేశంలో వక్తల మధ్య ఏకాభిప్రాయం లేక గందరగోళం జరిగింది. వేదిక మీద ఉన్న బీజేపీ నేతలు తాము హిందువులమని ప్రకటించుకోవాలని లింగాయతులను కోరారు. వీరశైవ మహాసభ నేతలు వీరశైవ లింగాయతులు ప్రత్యేక మతమని పిలుచుకోవాలని కోరారు. తమను చూసి జనం వస్తారని వీరశైవ స్వాముల స్వంత పలుకుడి మీద ఆధారపడ్డారు.
లింగాయత్ స్వాములు అంటే ఆ సమాజంలోని వెనుకబడిన తరగతులు, దళితులతో కూడిన విశాల ప్రాతిపదికన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి రాష్ట్రమంతటా ఉన్న బసవ సంస్థల మద్దతు కూడా ఉంది. దాంతో వారికి సంఘటిత శక్తి లభించింది. తమ పలుకుబడి చెల్లదని వీరశైవస్వాములు గుర్తించలేదు. ”అర్ధంపర్ధం లేని క్రతువులకు కట్టుబడి ఉండటం కాకుండా వ్యక్తులు, సామాజిక అభివృద్ధిని కోరిన బసవతత్వానికి జనాలు స్పందించారు ” అని హుబ్లీ కేంద్రంగా ఉన్న ఒక లింగాయత్ స్వామీజి చెప్పారు.
లింగాయత్‌లకు ఒక నూతన మార్గదర్శనం..
కర్ణాటకలో కులగణన అంశం ఒక సమీకరణ పోటీగా మారింది. లింగాయత్ స్వాములు లింగాయత్‌లుగా, వీరశైవ స్వాములు వీరశైవ లింగాయత్‌లుగా, సంఘ్‌పరివార్ మద్దతుదార్లు హిందువులుగా తమ గుర్తింపును కోరాలని ఎవరికి వారు పిలుపునిస్తున్నారు. ఈ చంచలమైన స్థితిలో ఈ యాత్ర పురోగామి లింగాయత్ స్వాముల గళం ప్రధానమైనదిగా ఆవిర్భవించే సాధికారత కలిగించింది. విశాలమైన సామాజిక సంఘటన ఏర్పాటుకు వారు లింగాయేతర సామాజికుల వద్దకు చేరారు. యాత్ర సందర్భంగా స్వాములకు అంబేద్కర్ విగ్రహాలు ఎదురైన ప్రతిచోటా ఊరేగింపును ఆపి పుష్పాంజలి ఘటించారు. బసవ వచనాల ఆదర్శాలకు అనుగుణంగా అదే అజెండాతో భారత రాజ్యాంగ రచనకు అంబేద్కర్ పని చేశారనే ఏకాభిప్రాయం లింగాయత్ స్వాముల్లో ఉంది. అనేక చోట్ల లింగాయత్‌లు- దళితుల మధ్య వివాదాలు ఉన్నప్పటికీ తమ స్వంత బోధకుల నుంచి లింగాయత్ సమాజం ఈ సందేశాన్ని ఆలకించటం పెరిగింది.
అవసరమైతే ఉన్నత స్థానాల్లో ఉన్న స్వాములు వెనక్కు తగ్గి వెనుకబడిన తరగతులు, దళిత స్వాములను ముందుకు తేవాలని కూడా యాత్ర ఆకాంక్షించింది. కులబేధాలను పాటించేవారిగా కనిపిస్తున్న వీరశైవ స్వాములతో వెనుకబడిన తరగతుల స్వాముల సంబంధాలు పరుషమైనవిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దానికి భిన్నంగా లింగాయత్ స్వాములు సాంఘికంగా కలుపుగోలు తనం, కట్టుబడిన బసవ అనుచరులుగా ఉన్నట్లు వారు వర్ణించారు. ఉడిపి, మంగళూరుల్లో లింగాయత్‌ల సంఖ్య స్వల్పం. అక్కడ ముస్లిం, క్రైస్తవ బృందాల సాయంతో యాత్ర నిర్వహించారు. మైనారిటీలు నిర్వహించిన మతపరమైన ఊరేగింపుల్లో, కార్యక్రమాల్లో స్వాములు భాగస్వాములైనపుడు తరచుగా మితవాద బృందాలు వారిపై దాడులు చేసిన నేపథ్యాన్ని చూసినపుడు ఇదొక ముఖ్యమైన అంశం.
ఇద్దరు లింగాయత్ స్వాములు ప్రత్యేకించి సానేహళ్లి పండితారాధ్య స్వామి, బైలూరు నిజగుణ ప్రభుస్వాముల సంగతి చూడాలనే మితవాద వాతావరణం ఉంది. వినాయక ఆరాధన నిలిపివేయాలని రెండు సంవత్సరాల క్రితం పండితారాధ్య స్వామి లింగాయత్‌లను కోరినప్పటి నుంచి వార్తలలోని వ్యక్తిగా మారారు. మితవాద మీడియా అతన్నొక భూతంగా, లింగాయతుల్లో అతను ఒంటరి అన్నట్లుగా చిత్రించింది. అతని సంస్థాపరమైన సామర్ధ్యాలు యాత్రలో పెద్ద పాత్ర పోషించాయి. ఒక పలుకుబడి కలిగిన లింగాయత్ స్వామిగా ముందుకు వచ్చారు.
నిర్మొహమాటంగా మాట్లాడే నిజగుణ ప్రభు స్వామి లింగాయత్ మతం కోసం దూకుడుగా ప్రచారం నిర్వహించేవారిలో ఒకరు. చంపేస్తామనే బెదిరింపులు, న్యాయపరమైన చిక్కులతో తన గళాన్ని కాస్త తగ్గించినా ఇప్పటికీ హిందూత్వ బృందాల లక్ష్యంగానే ఉన్నారు. ఈ యాత్ర సందర్భంగా సభల్లో అతిసాహసవంతుడిగా జనం దృష్టిలో పడ్డారు.
ఎంతో పేరు ఉన్న తన మఠ వార్షిక కార్యక్రమాల సందర్భంగా ముస్లింలను దూరంగా ఉంచాలన్న శ్రీరామ సేన చేస్తున్న డిమాండ్‌ను తిరస్కరించటంతో, తరచూ గదక్ సిద్ధరామ స్వామిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. బెంగళూరులో పత్రికా సమావేశం నిర్వహించేందుకు యాత్ర నుంచి ఆయన విరామం తీసుకున్నారు.
ఆ విలేకర్ల సమావేశంలో సంఘ్‌పరివార్ మద్దతుదారులైన జర్నలిస్టులు ప్రతికూలమైన ప్రశ్నలతో ధ్వజమెత్తారు. హిందూయేతరులమని గుర్తింపు కోరటం జాతివ్యతిరేకమైనదేమీ కాదని ఇప్పుడు సిక్కులు చేస్తున్న మాదిరే లింగాయత్‌లు కూడా జాతికి తమ వంతు కృషి చేస్తారని ఆయన చెప్పారు.
భౌతిక శాస్త్ర ఆచార్యుడు సోమశేఖరప్ప గతంలో చెప్పినట్లుగా, లింగాయతుల్లో పెరుగుతున్న పురోగామి అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం కలిగించవచ్చు.
అభియాన్ ఒక సైద్ధాంతిక ఉద్యమ గుండెకాయగా ఉంది. లింగాయత్‌లు ఉన్నతమైన ప్రజాస్వామిక సమూహంగా ప్రారంభమయ్యారు. అయితే, కొంత కాలం తరువాత వెనుకపట్టు పట్టారు. “మేము ఇప్పుడు బహుతావాదాన్ని పునరుద్ధరించేందుకు, సమాజంలో విద్వేషం విస్తరించకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం” అని ఆయన చెప్పారు. ఆచార్యులు తన వ్యక్తిగత అనుభవాన్ని పేర్కొన్నారు.
”చిత్రదుర్గలో యాత్ర సందర్భంగా ముస్లిం మహిళల బృందం ఒకటి లింగాయత్ సమాజ అతి పెద్ద సంస్థలలో ఒకటి, పురాతనమైన మఠాన్ని వెతుక్కుంటూ రావటాన్ని నేను గమనించాను. వారు పట్టణ సందర్శకులుగా వచ్చారు. వారికి ఆతిథ్యమిచ్చిన వ్యక్తి లింగాయతుల ప్రముఖ ఆరాధన స్థలం బయటా లోపలా ఉన్న వాటిని చూపటాన్ని చూశాను. అలాంటి వారసత్వ పరిరక్షణ కోసం మేం పోరాడుతున్నాం” అని చెప్పారు.
విశ్లేషణాత్మక అనువాదం: ఎం కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
