రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది. ఆరు గ్యారంటీల అమలు అట్లా ఉంచి, సరికొత్త ఆలోచనలను తెరపైకి తీసుకొస్తున్నది. మచ్చుకు ఫోర్త్ సిటీ, రైజింగ్ తెలంగాణ చెప్పుకోవచ్చు. పరిపాలనలో తన ముద్ర ఉండాలనే తలంపు, తాపత్రయమూ సీఎంలో కనిపిస్తున్నాయి. ఎవరూ అడగని మూసీ రివర్ ఫంట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హైడ్రా కూడా ఈ కోవకు చెందినదే. వీటి ఫలితాలు, పర్యవసనాలు ముందుముందు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు మాత్రం జనం ఆలోచనలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.
ఒకవైపు వరదలతో జనం సతమతమవుతున్నారు. యూరియా సమస్య సరేసరి. సమస్యలకు సమాధానాలు ఇవ్వడం లేదనే భావన ప్రజల్లో బలంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను ప్రజల ముందు తీసుకొచ్చింది. అదే రైజింగ్ తెలంగాణ- 2047.
రాష్ట్రాన్ని సకలరంగాలలో అభివృద్ధి చేస్తామని– విద్యా, వైద్యం, ఉపాధి రంగాల విస్తరణ, సుస్థిరాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి నమూనాగా రైజింగ్ తెలంగాణను ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది. ఇందుకుగాను ప్రజల నుంచి సూచనలు- సలహాలను కోరుతున్నది.
నిజానికి తెలంగాణ ఎట్లా ఉండాలనేది, ఈ రాష్ట్ర అవసరాలు ఏమిటనేది ఉద్యమ సమయంలోనే ఎజెండాగా ముందుకు వచ్చింది. గత ప్రభుత్వం కొన్నింటిని అడ్రస్ చేసింది, కొన్ని చేయలేదు. అసంపూర్తి ఎజెండాను అలా ఉంచి, ఇప్పుడు మరొక ఎజెండా వస్తున్నట్టుంది. ఇలాంటి ఎజెండాలు గతంలో ప్రజలు చూశారు.
విజన్ డాక్యుమెంట్లు, వివరణలు నిజంగానే మంచి భవిష్యత్తును ఇస్తాయా? పకడ్బందీ ప్రణాళిక అమలుకు దోహదం చేస్తాయా? అనేది సందేహమే.
బెడిసికొట్టిన విజన్- 2020 డాక్యుమెంట్..
ఉమ్మడి రాష్ట్రంలో విజన్– 2020 డాక్యుమెంట్‌ను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తెచ్చారు. అప్పట్లో దానిపై విస్తృతమైన చర్చ జరిగింది. సానుకూల, వ్యతిరేక శిబిరాలుగా కొన్నేళ్ల పాటు ఆ చర్చ కొనసాగింది. వాస్తవ ప్రజాజీవితానికి విజన్– 2020 డాక్యుమెంట్ రిప్లికా కాలేకపోయింది. ప్రజల కనీస అవసరాలు విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలు, నాణ్యమైనవిగా లేకపోవడం వల్ల ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
ప్రజల జీవితాల నుంచి తీసుకుని ఆచరించి ఉంటే, ఆ విజన్‌కు సార్థకత ఉండేదని అప్పట్లో మేధావుల మాట. నాటి ప్రభుత్వం తాను అనుకున్న విషయాల మినహా మరి ఎవరి మాట వినలేదు. కనీసం విన్నట్టు నటించనూలేదు. వెరసి 2004 ఎన్నికల్లో ఓటమి ద్వారా ఫలితాన్ని చంద్రబాబు చవిచూడాల్సి వచ్చింది.
అరవంతు ఆచరించినా అద్భుతమే..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగు, విద్యా రంగంలో సరికొత్త ప్రతిపాదనలు తెస్తున్నది. గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నది. తమది పొదుపు మార్గమని చెప్పుకుంటున్నది. తుమ్మడిహట్టి వద్ద మరో బ్యారేజీ నిర్మిస్తానంటున్నది. మరి దీనికయ్యే నిధుల సంగతి? పాలమూరు, రంగారెడ్డి భవిష్యత్తు ఏంటో చెప్పడం లేదు. ప్రభుత్వ బడుల మరమత్తులు- మౌలిక సదుపాయాల గురించి వెల్లడించడం లేదు. పెన్షన్లు, బకాయిలు వీటి గురించి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక నిరుద్యోగుల గురించి సవివరంగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. నిజానిజాలు ఏంటో గత- ప్రస్తుత ప్రభుత్వాలకు అన్నీ తెలుసు. బాధలేంటో ఆశావాహ అభ్యుర్థులకు తెలుసు. ఎన్నికల ముందు బలంగా చెప్పిన ఆరు గ్యారంటీల ఊసే ఎత్తడం లేదు. ఉచిత బస్సు మినహా మరే పథకం ప్రజల అనుభవంలోకి రావడం లేదు. స్కూటీలు, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఎండమావుల్లా ఉన్నాయనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతున్నది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ అంటున్నది. ఈ రైజింగ్ తెలంగాణ పాత ఎజెండాను మరిపించేందుకా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత కమ్యూనికేషన్ ప్రపంచంలో ఉపాధి, ఉద్యోగరంగాల విస్తరణకు అవకాశాలు మెండుగా ఉన్న మాట వాస్తవం. ఎనిమిది రకాల ప్రశ్నలిచ్చి, అప్షన్లు ప్రభుత్వమే ఇచ్చి సూచనలివ్వాలని కోరుతున్నది. అది కూడా ఆన్లైన్ ద్వారా. వినేందుకు ఇవన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది. ఆచరణ ఎమిటనేదే అసలు ప్రశ్న.
వాస్తవానికి రైజింగ్ తెలంగాణ– 2047 కింద ప్రభుత్వం ఇచ్చిన ప్రశ్నలకు సమాధాలు కూడా తానే ఇచ్చింది. మిగిలిన పాలనాకాలంలో వీటిలో అరవంతు ఆచరించినా తెలంగాణలో అద్భుతం జరిగినట్లే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
