విదేశాంగ మంత్రిత్వ శాఖ వంటి అధికారిక మార్గాల ద్వారా బంగ్లాదేశ్ జాతీయులని ఆరోపించబడిన వారిని బహిష్కరించడం చాలా కష్టమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో, రాత్రి చీకటి పడగానే, బంగ్లాదేశ్ సరిహద్దు దళం లేని ప్రదేశాల నుంచి వారిని బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ఏప్రిల్ 30న తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, భారత తాత్కాలిక హైకమిషనర్ పవన్ బధేను పిలిపించింది.
బంగ్లాదేశ్ మీడియా కథనాలను ఉటంకిస్తూ ‘ది ప్రింట్’ పత్రిక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని దక్షిణాసియా డైరెక్టర్ జనరల్ ఇష్రత్ జహాన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శర్మ చేసిన వ్యాఖ్యలపై పవన్ బధేకు ఢాకా వైఖరిని తెలియజేశారని నివేదించింది.
ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్-భారత్ సంబంధాలను అవమానించేవిగా ఉన్నాయని, భారత్ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయని ఒక దౌత్యవేత్త చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.
అయితే, దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
సీఎం శర్మ ఇంటర్వ్యూలో ఏమన్నారు?..
గత వారం ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి అధికారిక మార్గాల ద్వారా బంగ్లాదేశ్ జాతీయులని ఆరోపించబడిన వారిని బహిష్కరించడం చాలా కష్టమని శర్మ పేర్కొన్నారు.
“రాత్రి చీకటిని ఆసరాగా తీసుకుని, బీడీఆర్(బంగ్లాదేశ్ రైఫిల్స్, ఇప్పుడు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) లేని ప్రదేశాల నుంచి వారిని బహిష్కరిస్తున్నారు” అని ఆయన అన్నారు.
శర్మ మాట్లాడుతూ, “అస్సాం ఎన్ఆర్సీ 17 లక్షల మంది చొరబాటుదారులను గుర్తించింది. వారిని చట్టబద్ధంగా బహిష్కరించాలంటే, మనం ఈ మొత్తం కేసును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపాల్సి ఉంటుంది. అప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానిని బంగ్లాదేశ్‌కు పంపుతుంది. వారిలో ఎవరు తమ పౌరులు, ఎవరు కారు అని బంగ్లాదేశ్ ధృవీకరిస్తుంది. బంగ్లాదేశ్ ఎవరినీ అంగీకరించదు. అందువల్ల, చట్టబద్ధంగా మనం చొరబాటుదారులను బంగ్లాదేశ్‌కు బహిష్కరించలేము” అని వివరించారు.
అస్సాం ముఖ్యమంత్రి ప్రకారం, బంగ్లాదేశ్‌కు ‘తిరిగి పంపించడానికి’ అనువైన సమయం దొరికే వరకు భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అటువంటి వ్యక్తులను నిర్బంధిస్తుంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అధికారిక ప్రక్రియను అనుసరించి అస్సాం ప్రభుత్వం బహిష్కరణను ప్రారంభించడానికి ప్రయత్నించినప్పుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశీ జాతీయులను స్వీకరించడానికి ఢాకా నిరాకరించడం ఈ పరిస్థితికి దారితీసిందని శర్మ అన్నారు.
వాతావరణం సృష్టించాలి..
చొరబాటుదారులు స్వచ్ఛందంగా అస్సాం విడిచి వెళ్ళేలా వారికి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించాలని అస్సాం ముఖ్యమంత్రి ఆ ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు.
అంతకుముందు, ఆయన ఆ వర్గాన్ని భౌతికంగా వేధించవద్దని ప్రజలకు సూచించారు. ఆయన ఇలా అన్నారు, “రిక్షా ఛార్జీ 5 రూపాయలైతే, వారికి 4 రూపాయలు ఇవ్వండి. వారిని వేధించినంత మాత్రాన అస్సాంను విడిచి వెళ్లరు, ఇవి సమస్యలు కావు.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
