హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేలా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో వారాల తరబడి విఫలమైన తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక కొత్త వాదనను వినిపిస్తున్నారు.
జలసంధి మూసివేత వల్ల ఇరాన్ ఒక పేలుడు వంటి ప్లంబింగ్ సమస్య అంచున ఉందని, ఇది వారిని తప్పనిసరిగా చర్చల టేబుల్ వద్దకు వచ్చేలా చేస్తుందని ఆయన వాదిస్తున్నారు.
“వారి చమురు కదలికలు నిలిచిపోతే, వారి మొత్తం చమురు మౌలిక సదుపాయాలు పేలిపోబోతున్నాయి” అని ట్రంప్ వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు. ప్రపంచంలోని చమురు, సహజ వాయువులో సుమారు 20 శాతం రవాణా అయ్యే ఈ జలమార్గంపై అమెరికా విధించిన దిగ్బంధం విజయవంతమైందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఈ వారం ఫాక్స్ న్యూస్‌లోని “ది సండే బ్రీఫింగ్” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశం త్వరలో జలసంధి ద్వారా ఎగుమతులు ప్రారంభించకపోతే, ఇరాన్ చమురు పైప్లైన్లు “యాంత్రికంగా, భూమిలోపల కూడా లోపలి నుంచి పేలిపోతాయి” అని చెప్పారు.
“అలా జరగడానికి వారికి కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉందని వారు చెబుతున్నారు. ఒకసారి అది పేలిపోతే, దానిని మళ్లీ ఎప్పటికీ పాత స్థితికి తీసుకురాలేము” అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ అంచనాలను తోసిపుచ్చిన నిపుణులు..
అధ్యక్షుడు ఆసన్న విపత్తు గురించి అంచనాలు వేస్తున్నప్పటికీ, అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం తక్కువ అని ఇంధన రంగ అధికారులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ వద్ద చమురు నిల్వ చేయడానికి స్థలం అయిపోవడానికి ఇంకా వారాలు లేదా నెలల సమయం ఉందని నిపుణులు వాషింగ్టన్ పోస్ట్‌కు తెలిపారు.
ఒకవేళ దేశంలోని నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోయినా, దానివల్ల శాశ్వత నష్టం ఎంత జరుగుతుంది? అసలు జరుగుతుందా లేదా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
గ్యాస్, ఇతర ఉత్పత్తుల కోసం ఎక్కువ ధరలు చెల్లిస్తున్న అమెరికన్లు, అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న ఈ ప్రతిష్టంభన త్వరగా ముగుస్తుందని ఆశించకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“అది అలా జరగదు” అని డిఫెన్స్ ప్రియారిటీస్ అనే థింక్ ట్యాంక్‌లోని మిడిల్ ఈస్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇంధన రంగ పండితురాలు రోజ్మేరీ కెలానిక్ అన్నారు.
ఇరాన్ చమురు పైప్లైన్లు త్వరలో పేలిపోతాయని, దాని ఇంధన రంగం కుప్పకూలే దశలో ఉందన్న ట్రంప్ అంచనాలపై ఆమె స్పందిస్తూ, “ఏదీ దానంతట అది నాశనం అయిపోదు” అని పేర్కొన్నారు.
రైస్ యూనివర్సిటీకి చెందిన బేకర్ ఇన్స్టిట్యూట్ నిపుణుడు మార్క్ ఫిన్లీ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. “ఇరాన్ తన వ్యవస్థను ఎలా కాపాడుకోవాలో దానికి తెలుసునని నిరూపించుకుంది” అని ఆయన తెలిపారు.
“వ్యవస్థ నడుస్తోంది” అని ఆయన అన్నారు. జలసంధి మూసివేత వల్ల ఇరాన్‌కు నిలిచిపోయిన చమురును నిల్వ చేయడానికి అనేక ఖాళీ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయని ఫిన్లీ తెలిపారు. అవి లేకపోయినా, “తక్కువ స్థాయిలోనైనా వ్యవస్థను నడిపించగలిగే దేశీయ రిఫైనింగ్, పంపిణీ నెట్వర్క్ ఇరాన్‌కు ఉంది” అని ఆయన జోడించారు.
అమెరికా అధికారుల వాదనలు..
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక సీనియర్ పరిపాలనా అధికారి మాట్లాడుతూ, ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలు ఒత్తిడిలో ఉన్నాయని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని, ఇది కాలక్రమేణా శాశ్వత నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు.
“దీనిని పునరుద్ధరించడానికి అత్యాధునిక సాంకేతికత, భారీ పెట్టుబడి అవసరం” అని ఆ అధికారి పేర్కొన్నారు. “ప్రస్తుత ఆంక్షల దృష్ట్యా, ఇరాన్ ఈ రెండింటినీ పొందే అవకాశం తక్కువగా ఉంది. దీనివల్ల ఈ నష్టం చాలా వరకు సరిదిద్దలేనిదిగా మారుతుంది.”
ట్రెజరీ శాఖ ఒక ప్రకటనలో ఇరాన్ ఇప్పటికే చమురు ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతోందని తెలిపింది. వైట్ హౌస్ సమావేశంలో ఇంధన రంగ ఎగ్జిక్యూటివ్‌లు “దిగ్బంధాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్ త్వరలోనే పూర్తిగా మూతపడుతుందని పునరుద్ఘాటించారు.”
చమురు ధరలపై ప్రభావం – వాస్తవ పరిస్థితులు..
ఫిబ్రవరి చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినప్పటి నుంచి గ్యాస్ ధరలు సాధారణం కంటే పెరిగి, గురువారం ఉదయానికి గ్యాలన్‌కు $4.30కి చేరుకున్నాయి.
ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వాదనలు ఈ సమయంలోనే వచ్చాయి. చమురు ధరలు 2022 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుని, బుధవారం రాత్రి బ్యారెల్‌కు $126కి చేరి, గురువారం ఉదయం $114 వద్ద స్థిరపడ్డాయి.
ఈ రెండు నెలల సంఘర్షణలో అధ్యక్షుడు, ఆయన యంత్రాంగం యుద్ధంపై తమ లక్ష్యాలను మారుస్తూ వచ్చారు. హోర్ముజ్ జలసంధి ఎప్పుడు తెరుచుకుంటుందనే దానిపై ఎప్పటికప్పుడు మారుతున్న, కొన్నిసార్లు పరస్పర విరుద్ధమైన వాదనలు చేశారు.
ప్రపంచ ఇంధన సరఫరాపై యుద్ధ ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్న కొందరికి, పైప్లైన్లు పేలిపోతాయన్న ట్రంప్ అంచనాలు వాస్తవం కంటే ఆశపై ఆధారపడినవిగా కనిపిస్తున్నాయి.
“మమ్మల్ని రక్షించే ఒక అద్భుత పరిష్కారం కోసం మేము ఎదురుచూస్తున్నాము” అని ఆయన అన్నారు.
“ఇది అనేక విధాలుగా లోపభూయిష్టమైనది” అని అబ్సిడియన్ రిస్క్ అడ్వైజర్స్ మేనేజింగ్ ప్రిన్సిపల్ బ్రెట్ ఎరిక్సన్ అన్నారు. ఈ సంస్థ ఆర్థిక నేరాలు, ముఖ్యంగా ఇరాన్‌పై విధించిన ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి చమురును ఎలా తరలిస్తారనే విషయాలపై ప్రత్యేకత కలిగి ఉంది.
“ఇది వారు పట్టుకున్న సరికొత్త విజయ సిద్ధాంతం. ఇది అర్థవంతంగా ఉందని కాదు. కానీ ఇది చాలా వేగంగా, సులభంగా ఉంది. వారికి నచ్చిన సమయ పరిమితిని కలిగి ఉంది కాబట్టి దీనిని నమ్ముతున్నారు” అని డిఫెన్స్ ప్రియారిటీస్కు చెందిన కెలానిక్ అన్నారు.
ఇరాన్ స్పందన – ట్రెజరీ శాఖ సమర్థన..
దీనిపై వ్యాఖ్యానించాలని కోరగా వైట్ హౌస్ స్పందించలేదు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సోమవారం ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తూ, ఇరాన్ ఉత్పత్తి ఇప్పటికే మందగించిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
“అమెరికా దిగ్బంధం కారణంగా ఇరాన్ పాతబడి పోయిన చమురు పరిశ్రమ, ఉత్పత్తిని నిలిపివేయడం ప్రారంభిస్తోంది. త్వరలోనే పంపింగ్ పూర్తిగా కుప్పకూలుతుంది” అని ఆయన రాశారు.
ట్రెజరీ శాఖ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఖర్గ్ ఐలాండ్‌లో ఉన్న ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం దాని నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉందని, ఇది ఉత్పత్తిని తగ్గించేలా చేస్తోందని చెప్పారు. “దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 170 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతుంది. దాని చమురు మౌలిక సదుపాయాలకు శాశ్వత నష్టం వాటిల్లుతుంది” అని ఆ ప్రతినిధి తెలిపారు.
కొలంబియా యూనివర్శిటీ సెంటర్ ఆన్ గ్లోబల్ ఎనర్జీ పాలసీ ప్రచురించిన తాజా విశ్లేషణ నివేదిక ప్రకారం, ఒకవేళ ఇరాన్ వద్ద నిల్వ స్థలం అయిపోయినా, అది చమురు పరిశ్రమకు “ఘోరమైన లేదా చాలా తీవ్రమైన నష్టాన్ని” కలిగించదు.
పంపింగ్ ఆగిపోతే చమురు సౌకర్యాలలో “షట్-ఇన్” అనే సమస్య ఎదురవుతుంది. దీనివల్ల సాధారణంగా నీరు, గ్యాస్, చమురు నిల్వలను కలుషితం చేస్తాయి. లేదా చమురు నిల్వలను రాళ్ల లోపలికి నెట్టివేస్తాయి. అక్కడ నుంచి వాటిని తిరిగి తీయడం సాధ్యం కాదు. ఇది దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, దీనివల్ల పేలుళ్లు సంభవిస్తాయని ఎక్కడా లేదు.
Tanker-Trackers.com నుంచి సేకరించిన షిప్పింగ్ డేటా ప్రకారం, హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధం లోపల సుమారు 45 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురును నిల్వ చేయడానికి సరిపడా ఖాళీ ట్యాంకర్లు ఉన్నాయి. ఇది ఇరాన్ ఆరు వారాల సాధారణ ఎగుమతి ఉత్పత్తికి సమానం. అంతేకాకుండా ఆ దేశం లోపల కూడా మిలియన్ల బ్యారెళ్ల ఉపయోగించని నిల్వ సామర్థ్యం ఉంది.
ఎనర్జీ అనలిటిక్స్ సంస్థ ‘కెప్లర్’ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.
“3 రోజులు గడిచాయి. ఒక్క బావి కూడా పేలలేదు. మేము దీనిని 30 రోజుల వరకు పొడిగించి, ఇక్కడి బావిని ప్రత్యక్ష ప్రసారం చేయగలము” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ ట్విట్టర్లో ఒక పోస్ట్‌తో ట్రంప్‌తోపాటు బెస్సెంట్లను ఎద్దేవా చేశారు.
పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం..
ట్రంప్ ప్రభుత్వ వాదనలను సమర్థించేవారు మాత్రం, ఇరాన్ మౌలిక సదుపాయాలలోని లోపాలను, చమురు నిల్వలను పొందే విషయంలో ఉన్న ఇబ్బందులను విస్మరిస్తున్నారని అంటున్నారు.
గతంలో ట్రెజరీ శాఖలో సీనియర్ శాంక్షన్స్ అధికారిగా పనిచేసి, ప్రస్తుతం ‘ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్’ థింక్ ట్యాంక్‌లో సభ్యునిగా ఉన్న మియాద్ మలేకి మాట్లాడుతూ, ఇరాన్ తీరంలో ఉన్న ఖాళీ ట్యాంకర్లు అసలు చమురును నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా లేదని అన్నారు.
వాటిలో కొన్ని ఇతర దేశాలకు చెందినవి కావచ్చు. అమెరికా దిగ్బంధంలో నిరవధికంగా చిక్కుకుపోయే చమురును నింపుకోవడానికి ఆ ట్యాంకర్ల యజమానులు ఇష్టపడకపోవచ్చు అని ఆయన పేర్కొన్నారు.
ఒకవేళ ప్రతి ఖాళీ ట్యాంకర్‌తోపాటు నిల్వ కేంద్రాన్ని నింపగలిగినా, ఉత్పత్తిని నిలిపివేసే ప్రక్రియకు వారాల సమయం పడుతుందని, అది ఇరాన్లో ఇప్పటికే ప్రారంభమై ఉండవచ్చని ఆయన చెప్పారు.
ట్రంప్ వాదనలను సందేహించే నిపుణులు, ఒకవేళ పంపింగ్ ఆగిపోతే ఇరాన్ పాతబడిపోయిన చమురు మౌలిక సదుపాయాలకు జరిగే నష్టాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన జోడించారు.
“వారు ఇరాన్ చమురు పరిశ్రమను గురించి అది అమెరికా పరిశ్రమలాగా మాట్లాడుతున్నారు” అని మలేకి అన్నారు. “అక్కడ సరైన నిర్వహణ లేదని, ఇరాన్ వద్ద అవసరమైన పరికరాలు, విడిభాగాలతోపాటు సాంకేతికత లేవని వారు అర్థం చేసుకోవడం లేదు. దీని ప్రభావం అందరూ ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంటుంది.”
ఒకవేళ ఇరాన్ ప్రతికూల పరిణామాలను ఎదుర్కొని, హోర్ముజ్ జలసంధిని త్వరగా తెరిచినా, అమెరికా వాహనదారులకు లేదా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం త్వరగా లభించదు. ఆసియాలో ఇంధన కొరత కారణంగా ఇప్పటికే కర్మాగారాలు మూతపడ్డాయి. సహజ వాయువుతో తయారయ్యే ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఆహార ధరలు కూడా పెరుగుతాయి.
“ప్రపంచ చమురు కొరత ప్రభావం ఇప్పటికే అమెరికా తీరాలలో కనిపిస్తోంది” అని రైస్ యూనివర్సిటీకి చెందిన ఫిన్లీ, వేగంగా పడిపోతున్న అమెరికా చమురు నిల్వలను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా, “బాధ రోజురోజుకూ పెరుగుతోంది. ఆ జలసంధి మూసివేసి ఉన్న ప్రతి రోజూ, ప్రపంచ చమురు పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది” అని చెప్పుకొచ్చారు.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
వాషింగ్టన్ పోస్ట్ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

