నాలుగు రోజుల క్రితం ఒడిశాలో జరిగిన ఓ అస్థిపంజరం ప్రదర్శన యాత్రను చూసిన దేశ ప్రజలు మీడియా కథనాల ద్వారా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటన మనసున్న మనిషి ఎవరినైనా సరే గుండెలు దద్దరిల్లిపోయేలా చేసింది.
వ్యవస్థలో కొందరు అధికారుల పనితీరును, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైఖరిని నడిరోడ్డుపై ఎండగట్టింది.
అక్క అస్థిపంజరంతో బ్యాంకు ముందు తమ్ముడు చేసిన నిరసన, దేశంలో పలు వ్యవస్థల నిర్లక్ష్యానికి అతి దారుణ ఉదాహరణగా మారింది.
వ్యవస్థల వైఫల్యానికి ప్రతీక..
అవును, అసలు ప్రభుత్వం అంటే ఏమిటి…? అందులో అధికారుల పాత్ర ఏమిటి…?
అనే ప్రశ్నలకు సమాధానంగా నిలవాల్సిన వ్యవస్థ, కొన్నిసార్లు మనసును కలిచివేసే దృశ్యాలకు కారణమవుతోంది.
ఇక్కడ జీతూ ముండా ఘటన కూడా అలాంటిదే. ఇది కేవలం ఒక వ్యక్తి బాధ కాదు, దేశంలో కొన్ని వ్యవస్థల వైఫల్యానికి ప్రతీక.
తన అక్క కల్రా ముండా అస్థిపంజరాన్ని చేతుల్లో పట్టుకుని బ్యాంకు ముందు నిరసనకు దిగిన జీతూ ముండా దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది.
ఇది ఒక నిరసన మాత్రమే కాదు, న్యాయం కోసం అతను చేసిన చివరి ప్రయత్నంగా చెప్పుకోవాలి.
ఒక పేద మనిషి ఎంతవరకు తట్టుకోలేకపోతే ఇలాంటి దారుణ స్థితికి వస్తాడో అన్నది ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సంఘటన ఇది.
నిబంధనల పేరుతో అమానుషం..
జీతూ ముండా కథలో ఉన్న బాధ అంతా డబ్బు గురించి కాదు, తనకు చెందిన హక్కు కోసం చేసిన పోరాటం గురించి అని మన వ్యవస్థలు అర్థం చేసుకోవాలి.
బ్యాంకులో తన కుటుంబానికి చెందిన డబ్బు ఉండి కూడా, సరైన పత్రాలు లేవన్న కారణాలతో అతడిని, మరణించిన తన అక్కను తీసుకొస్తేనే ఖాతాలో ఉన్న నగదు ఇస్తామని చెప్పడం అమానుషం.
చదువురాని ఓ గిరిజనుడైన అమాయకుని పట్ల అంత కఠినంగా వ్యవహరించే అధికారం తమకు ఉందనే మదం, మన వ్యవస్థల లోపాలను ఎత్తిచూపింది.
అయితే, ఇక్కడ మనుషుల కన్నా ముందు మన వ్యవస్థలు మారాల్సిన అవసరం చాలా ఉంది. జీతూలాంటి బాధితులకు నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడమే పెద్ద శత్రువులుగా మారాయి. ఇప్పుడు ప్రశ్న ఇదే… ప్రభుత్వ అధికారులు ఎవరికి అధికారులు? పట్టణాల్లో ఉన్న చదువుకున్న వారికేనా…? లేక గ్రామాల్లోని జీతూ ముండా లాంటి అమాయకులకు కాదా…?
మానవత్వం మృగ్యం కాకూడదు..
ప్రభుత్వ సేవలు అందించాల్సిన బాధ్యతను మరిచిపోయిన వ్యవస్థ, నియమాలు అనే పేరుతో మానవత్వాన్ని పక్కనబెడితే ఇలాంటి ఘటనలు తప్పవు.
ఒక పేద మనిషి తన హక్కు కోసం చనిపోయిన సోదరి అస్థిపంజరాన్ని తీసుకుని రావాల్సి వస్తే, అది కేవలం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, సమాజానికే సిగ్గుచేటు.
దేశవ్యాప్తంగా ఇలాంటి ఎందరో జీతూ ముండాలు ఉన్నారు. బ్యాంకుల్లో, పలు కార్యాలయాల్లో వారి డబ్బు మూలుగుతోంది. కానీ, వారికి ఏ దారీ తెలియదు. ఒక సంతకం రాక, ఒక పత్రం లేకపోవడం వల్ల వారి హక్కులు అక్కడే ఆగిపోతున్నాయి.
కొందరి అహంకారపు అధికారుల తీరుతో వ్యవస్థ సిగ్గు పడాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే, ఇక్కడ తప్పు ఎవరిది…? వ్యవస్థదా…? లేక ఆ వ్యవస్థను నడిపే మనుషులదా…? కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ప్రభుత్వాలు ఈ సంఘటనను ఒక హెచ్చరికగా తీసుకోవాలి.
వ్యవస్థల తీరు మారకపోతే…
జీతూ ముండా పేరుతోనే ఇలాంటి బాధిత కుటుంబాలకు ప్రత్యేక సదుపాయాలు, సులభ విధానాలు ప్రభుత్వాలు తీసుకురావాలి. ఈ క్రమంలో నిరక్షరాస్యులకు బ్యాంకింగ్ సేవలు అందించే ప్రత్యేక సహాయ కేంద్రాలు అవసరం. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు తమ పాత్రను కేవలం ఒక విధిగా కాకుండా బాధ్యతగా చూడాలి.
నియమాలు అవసరం, కానీ మానవత్వం మరింత అవసరం. ఆ రోజున జీతూ ముండా చేతుల్లో ఉన్న అస్థిపంజరం కేవలం ఒక మృతదేహం కాదు, అది వ్యవస్థల నిర్లక్ష్యానికి ప్రతీకగానే చూడాలి.
నిస్సహాయుడైన జీతూ ముండా ఈ వ్యవస్థపై ఎంతగా పోరాడి అలసిపోయి చేసిన అస్థిపంజరం శవయాత్ర, ఈ రోజున వ్యవస్థలు తీరు మార్చుకోవాల్సిన పరిస్థితిని గుర్తుచేసింది.
లేదంటే ఇక ముందు ముందు మరెన్నో అస్థిపంజరాలు న్యాయం కోసం ఎదురుచూస్తాయనే హెచ్చరిక, వ్యవస్థల బాధ్యతను మరింత గుర్తుచేసేలా చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

