ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విర్రవీగుతున్న భారతదేశంలో ఈరోజు ఓటరు హక్కుపై కోలుకోలేని దెబ్బపడింది.
కోట్ల మంది పౌరుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓటర్ల జాబితా సవరణ(సర్) ప్రక్రియ ఒక అంధకారమైన కుట్రగా మారిందనే ఆరోపణలు దేశాన్ని తీవ్రంగా ఊపేస్తున్నాయి.
ఈ ప్రజాస్వామ్య విధ్వంసానికి సూత్రధారి, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశం నలుమూలలా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
ఢిల్లీ వీధుల దిగ్బంధం
అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున దేశ రాజధాని ఢిల్లీ ఒక ఇనుప కోటగా మారిపోయింది. జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ప్రతిపక్ష నాయకులు, కార్మిక సంఘాలు శ్వాస పీల్చుకోవడానికి కూడా వీల్లేని రీతిలో పోలీసులు దిగ్బంధించారు.
మెట్రో స్టేషన్లను మూసివేసి, ఇంటర్నెట్ను నిలిపివేసి, వేలాది మందిని అదుపులోకి తీసుకున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే జనం గొంతుకలను ఏ నిర్బంధమూ నొక్కలేకపోయింది.
‘కాక్రోచ్’ ఉద్యమం – యువతరంగం
కొద్ది నెలల కిందట విద్యాశాఖ మంత్రిని గద్దె దించిన యువతరం ‘కాక్రోచ్ మూవ్మెంట్'(కాక్రోచ్ జనతా పార్టీ) పేరుతో మళ్లీ రోడ్లపైకి వచ్చింది.
సోషల్ మీడియా నుంచి మొదలై ఈరోజు వీధులను శాసిస్తున్న ఈ యువ ప్రతిఘటన, దేశంలో జరుగుతున్న ఓట్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాట జెండా ఎత్తింది.
ఢిల్లీ నుంచి ముంబై వరకు, కేరళ నుంచి కశ్మీర్ వరకు వీరి నినాదాలు దేశ పౌరుల గుండెలను పిండిచేస్తున్నాయి.
13 కోట్లకు పైగా ఓట్లు మాయం
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియలో దాదాపు 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, దళితులు, గిరిజనులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే సామాన్య ప్రజల ఓట్లే లక్ష్యంగా ఈ ‘డిజిటల్ కోత’ విధించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఓటు హక్కు లేని పౌరుడు తన సొంత దేశంలోనే పరాయివాడిగా మారే ప్రమాదం దాపురించింది.
రాజ్యాంగ వ్యవస్థలోనే కుట్రలు
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంచలనాత్మక దర్యాప్తు కథనంతో ఎన్నికల కమిషన్ అంతర్గత దారుణాలు బయటపడ్డాయి.
ముగ్గురు సభ్యుల కమిషన్‌లో మిగతా ఇద్దరు కమిషనర్లు (సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి) ఓటర్ల జాబితా సవరణల్లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాలపై ఏకంగా 14 సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వారి మాటలను ఏకపక్షంగా త్రోసిపుచ్చారు.
మెజారిటీ నిర్ణయంతో నడవాల్సిన వ్యవస్థను వ్యక్తిగత అజెండాతో నడిపారని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రశ్నిస్తే పోలీసు లాఠీలు
గ్వాలియర్ నుంచి 335 కిలోమీటర్లు రాత్రికి రాత్రే బస్సులో ప్రయాణించి ఢిల్లీ చేరుకున్న 24 ఏళ్ల సౌరవ్ యాదవ్ అనే కళాకారుడు, తన చేతిలో జాతీయ జెండా పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్లారు.
పోలీసు వ్యాన్ వెనుక కూర్చుని, ఒళ్లంతా చెమటలు పడుతుంటే అతడు అన్న మాటలు ప్రతి భారతీయుడి గుండెను పిండిచేస్తున్నాయి.
‘మనది ప్రజాస్వామ్యమంటూ కేవలం నటిస్తున్నాం. ఎన్నికలను నిర్వహించే వ్యవస్థనే మేనేజ్ చేస్తుంటే, ఇక ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది?’
లాఠీ గుంపును ఆపగలదు.. ప్రశ్నను కాదు
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘ఓట్ల దొంగతనాన్ని ప్రశ్నించడమే ఈ యువత చేసిన నేరమా? బాపూ నేర్పిన అహింసా మార్గంలో పోరాడుతున్న వారిపై లాఠీలు ఝళిపిస్తున్నారు.
లాఠీలు గుంపును ఆపగలవు, కానీ పౌరుడి గుండెల్లోంచి వచ్చే ప్రశ్నను ఆపలేవు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే, ఆయన్ను నియమించిన ఈ అన్యాయమైన వ్యవస్థ అంతం కావాల్సిందే’ అని హెచ్చరించారు.
ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల ఐక్య పోరాటం
ఈ నిరసనల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్), ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్ యూఐ వంటి దేశవ్యాప్త విద్యార్థి, యువజన సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి.
ఢిల్లీలో వామపక్ష నాయకులు డి. రాజా, బృందా కరత్, ఎంఎ బేబీ, ఎఎ రహీమ్, విద్యాశాఖ మాజీ మంత్రి అతిషి వంటి నాయకులను పోలీసులు నిర్బంధించారు.
ముంబై శివాజీ పార్క్ నుంచి రణభేరి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్‌లో వేలాది మంది యువకులు, కళాకారులు, సాధారణ ప్రజలు సమీకృతమయ్యారు.
నటి షబానా అజ్మీ, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ వంటి ప్రముఖులు ఈ వేదికపైకి వచ్చి మద్దతు తెలిపారు.
‘రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును లాక్కుంటే ఊరుకునేది లేదు’ అని షబానా అజ్మీ స్పష్టం చేయగా, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఈ పోరాటాన్ని దేశమంతటా విస్తరింపజేస్తామని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు ప్రతిపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి.
తెలంగాణలో, హైదరాబాద్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బుద్ధ భవన్ వద్ద ఉన్న ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు టీపీసీసీ శ్రేణులతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం), ఐవైసీ కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చి భారీ మార్చ్ నిర్వహించారు.
ప్రదర్శనకారులు సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – ఓట్ల దొంగతనాన్ని ఆపండి’ అనే నినాదాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను హోరెత్తించారు.
కేరళలోని తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్‌లలో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్ కాంగ్రెస్ కార్యాలయం ముందు నాయకులను దిగ్బంధించినా నినాదాలు ఆపలేదు.
జైపూర్, పాట్నా, కోల్‌కతా నగరాలు నిరసనలతో హోరెత్తాయి.
ప్రభుత్వ సన్నిహిత అధికారిగా జ్ఞానేష్ కుమార్
ఈ వివాదాల కేంద్రబిందువు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సామాన్య అధికారి కారు. 2019లో కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేసే ఆర్టికల్ 370 ఉపసంహరణ బిల్లు ముసాయిదా తయారీలో, ఆ తర్వాత అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతల్లో కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకమైన అధికారిగా వ్యవహరించారు.
అలాంటి వ్యక్తిని ఎన్నికల కమిషన్ అధిపతిగా కూర్చోబెట్టి ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు రాజకీయ విశ్లేషకుల్లో సైతం బలపడుతున్నాయి.
వ్యవస్థల స్వయంప్రతిపత్తిపై దెబ్బ
ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ. కానీ నేడు అది అధికార పక్షానికి గుప్పెట్లో ఉన్న బొమ్మలా మారిందనే ఆరోపణలు దేశ ప్రజాస్వామ్య ప్రతిష్టను అంతర్జాతీయంగా మసకబారుస్తున్నాయి.
మూడింట రెండొంతుల అభ్యంతరాలను తొక్కిపెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
మేల్కొన్న యువతరం
ఉపాధి లేక, భవిష్యత్తు లేక సతమతమవుతున్న దేశ జెన్ జెడ్ యువత, తమ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధమైన ‘ఓటు’ను కూడా లాక్కుంటున్నారని గ్రహించింది.
అందుకే ఈరోజు ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, తమ పౌర హక్కుల పరిరక్షణ కోసం వీధుల్లోకి వచ్చి పోరాడుతోంది. ఇది భయంతో వచ్చిన ఉద్యమం కాదు, భవిష్యత్తుపై ఉన్న బాధ్యతతో వచ్చిన విప్లవం.
ప్రభుత్వ అణచివేత ధోరణి
ఇంటర్నెట్ బంద్, మెట్రో రద్దు, కరెంట్ కోతలు, సెక్షన్ 163 విధించడాలు.. ఇవన్నీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణాలు కావు, భయపడుతున్న సర్కారు సంకేతాలు. తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ప్రభుత్వం శాంతియుత నిరసనలను సైతం బలప్రయోగంతో అణచివేసే ప్రయత్నం చేస్తోంది.
అక్టోబర్ 6: పార్లమెంట్ వైపు అడుగులు
ఈ నిరసనలు ఇక్కడితో ఆగవు. ‘ఇండియా’ కూటమికి చెందిన నాయకులు, ఎంపీలు, విద్యార్థి సంఘాలు అక్టోబర్ 6న ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో ఓటర్ల విజిలెన్స్ కమిటీలు వేసి తమ ఓట్లను తామే కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నారు.
పౌర సమాజం మేల్కోవాల్సిన సమయం
ఈ పోరాటం కేవలం కాంగ్రెస్‌దో, వామపక్షాలదో, విద్యార్థులదో కాదు. ప్రతి ఇంట్లో ఉన్న ఓటు, రేపటి తరం భవిష్యత్తును నిర్ణయించే ఓటు జాబితా నుంచి మాయమవుతుంటే మౌనంగా ఉండటం నేరం. ఈరోజు ఇతరుల ఓటు పోయింది, రేపు మన వంతు రావచ్చు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన సమయం ఆసన్నమైంది.
పదవులు నిత్యం కావు, అధికారాలు శాశ్వతం కావు. ఓటు హక్కును కాలరాసే ఏ ప్రభుత్వమూ చరిత్రలో నిలబడలేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, ‘సర్’ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి పారదర్శకమైన ఓటర్ల జాబితాను ప్రచురించాలి. లేకపోతే ఈ దేశ వీధులు సృష్టించే ప్రజా ఉద్యమంలో అధికార పీఠాలు దిగిరాక తప్పదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
