కార్మికులు కొత్త పథకాన్ని దేన్ని అడగడం లేదు. ఇప్పటికే అమలులో ఉన్న పథకం తమకు అమలు జరగాలని మాత్రమే వారు కోరుతున్నారు.
2025 నవంబర్ 21న వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి పరమైన భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు భారతదేశంలో అమల్లోకి వచ్చాయి.
ఇవి కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపుల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఫ్యాక్టరీల చట్టం, కాంట్రాక్ట్ కార్మికుల చట్టం వంటి 29 పాత చట్టాలను రద్దు చేసి కోడ్ల కింద చట్టబద్ధం చేశారు. వాటిలో ఒకటైన ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం 1948(ఈఎస్ఐ చట్టం) రద్దు అయి దాని స్థానంలో ఆ కోడ్ అమలులోకి వచ్చింది.
స్వతంత్ర భారతదేశంలో కార్మికుల కోసం “లోపాలు లేని, అన్నీ విధాలా సామాజిక భద్రతా వ్యవస్థను” సృష్టించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని 1948లో ప్రారంభించింది.
ఈఎస్ఐ చట్టం చరిత్ర
ఈ చట్టాన్ని రూపొందించే ప్రయత్నాలు 1942లోనే ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ కాలంలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ సభ్యుడైన ఫిరోజ్ ఖాన్ నూన్‌తో పాటు యజమానులు, కార్మికుల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో భారతదేశానికి ఒక “ప్రయోగాత్మక” అనారోగ్య బీమా పథకం అవసరమని అంగీకరించారు.
అయితే అప్పటి ప్రావిన్సులు, అనేక సంస్థానాల కార్మిక మంత్రులు ఈ పథకానికి ఆర్థిక సహాయం సమకూర్చడానికి నిరాకరించారు. దీంతో ఆ పథకం బుట్ట దాఖలు అయింది.
ఒక సంవత్సరం తరువాత అప్పటి కార్మిక శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక సామాజిక బీమా బిల్లును ప్రవేశపెట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించారు. అనంతరం సమగ్ర పథకాన్ని రూపొందించే బాధ్యతను ఆర్థికవేత్త, ప్రజా విధాన ఆలోచనాపరుడు ప్రొఫెసర్ బీపీ అదార్కర్కు అప్పగించారు.
1944లో ఆయన సమర్పించిన నివేదికను ఆరో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌లో చర్చించారు. అనంతరం అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) నిపుణులు కూడా దానిని పరిశీలించారు. ఆ పథక ప్రతిపాదనలో ప్రభుత్వం, యజమానులు, కార్మికులు కలిసి నిధులు సమకూర్చే విధానాన్ని ప్రతిపాదించారు.
ఈ పథకం ద్వారా వైద్య సేవలు, అనారోగ్య సెలవులు, ప్రసూతి ప్రయోజనాలు వంటి ప్రయోజనాలు వర్తింపజేయాలని కూడా అందులో పేర్కొన్నారు.
1944 నాటి నివేదికే చివరకు ఈఎస్ఐ చట్టం 1948గా పార్లమెంట్ ఆమోదించి చట్టం అయింది.
ఇది సమగ్ర ఆరోగ్య ఆధారిత సామాజిక భద్రతా పథకంగా ఊహించబడినప్పటికీ, దశాబ్దాల కాలంలో అది వేతన పరిమితులు, ఒక సంస్థలో పనిచేసే కార్మికుల సంఖ్య వంటి అర్హతా ప్రమాణాలపై ఆధారపడే సంక్షేమ పథకంగా మారింది.
సామాజిక బీమా తప్పనిసరి అవసరమైన అసంఘటిత రంగంలో పెద్ద సంఖ్యలో ఉన్న కార్మికులకు ఈ పథకం వరించకుండా అయిపోయింది.
అంతేకాకుండా పథకాన్ని అమలు చేయడం సంక్లిష్టమైన పత్రాల ప్రక్రియ, అధికార యంత్రాంగపు అడ్డంకులు, తగిన మౌలిక, సేవా వసతుల కొరతతో కూడిన వ్యవహారంగా ఈ పథకం మారింది.
ప్రస్తుతం ఫ్యాక్టరీలు, రోడ్డు రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, వార్తాపత్రికలు, డిస్పెన్సరీలు వంటి ఇతర సంస్థలకు ఈఎస్ఐ పథకం(ఈఎస్ఐఎస్) వర్తిస్తుంది.
ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్ఐసీ) అనే స్వయంప్రతిపత్తి సంస్థ ఈ చట్టం కింద బీమా చందాలను సేకరించి, ప్రయోజనాలను అందించే బాధ్యతను కలిగి ఉంది.
ఈఎస్ఐఎస్ ద్వారా లభించే ప్రయోజనాలు
ఈఎస్ఐఎస్ ఒక చట్టబద్ధమైన సామాజిక బీమా పథకం. అర్హత కలిగిన ప్రతి కార్మికుడి వేతనం నుంచి 3.25 శాతం, యాజమాన్యాలు 0.75 శాతం మొత్తం 4 శాతం ఈ పథకానికి జమ చేయాలి.
పారిశ్రామిక ప్రమాదం జరిగినప్పుడు, మెడికల్ కేర్‌తో సహా సిక్, ప్రసూతి, అంగ వైకల్యం, మరణించిన వారి అంత్యక్రియ ఖర్చులు లాంటి వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.
పని సమయంలో జరిగిన పారిశ్రామిక గాయం కారణంగా కార్మికుడు మరణిస్తే, అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు నెలవారీ పెన్షన్ కూడా ఈ పథకం ద్వారా లభిస్తుంది.
అయితే ఈఎస్ఐ చట్టంలోని అతిపెద్ద లోపం ఏమిటంటే సాధారణంగా 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పని చేసే సంస్థలు, సీజనల్ కాని పరిశ్రమలు, నెలకు రూ 21,000 లేదా అంతకంటే తక్కువ వేతనం పొందే కార్మికులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
వికలాంగుల విషయంలో ఈ వేతన పరిమితి రూ 25,000 వరకు ఉంటుంది.
సామాజిక భద్రతా కోడ్ 2020
ఈఎస్ఐ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి సామాజిక భద్రతా కోడ్ తీసుకొచ్చింది. ఈఎస్ఐ చట్టంలో కొన్ని మార్పులతో దీన్ని తెచ్చారు. ఈఎస్ఐ చట్టం కొన్ని నోటిఫై చేసిన జిల్లాలకు పరిమితం కాగా కోడ్ ద్వారా ఈ పథకాన్ని మొత్తం భారతదేశానికి విస్తరించారు.
కొన్ని ప్రమాదకర సంస్థలలో 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు.
అంతేకాకుండా, గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కూడా నూతన కోడ్ ద్వారా ఈఎస్ఐఎస్ని విస్తరించింది. ప్రస్తుతం ఈ తరహా కార్మికులను ప్లాట్‌ఫారమ్ కంపెనీలు తమ ఉద్యోగులుగా గుర్తించడం లేదు.
రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల నమోదు, సంక్షేమానికి సంబంధించిన చట్టాలను ఆమోదించాయి.
అయితే అవి ఇంకా అమల్లోకి రాలేదు. వాటిలో చాలా మార్పులు అవసరమని కార్మిక సంఘాలు సవరణలు ప్రతిపాదించాయి.
సామాజిక భద్రతా కోడ్ గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఈఎస్ఐఎస్ వర్తిస్తుందని పేర్కొన్నప్పటికీ ఆచరణలో దాని అమలు చేయడానికి రాష్ట్రాలు చట్టాలు చేయాల్సిన పరిస్థితిని కల్పించింది.
కొన్ని ప్రమాదకర సంస్థలలో 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా కవరేజీని విస్తరించడం, ప్రాంతాలు లేదా జిల్లాల కోసం ప్రత్యేకంగా “నోటిఫికేషన్లు” జారీ చేయాల్సిన అవసరాన్ని తొలగించడం వంటి అడ్డంకులను కోడ్‌లో తొలగిస్తూ ఈఎస్ఐ చట్టంలో చేసిన మార్పులు పైకి సానుకూలంగా కనిపిస్తున్నాయి.
అయితే, ఎలా వాటిని అమలు చేయాలనేదానిపై కోడ్‌లో స్పష్టత లేదు. ఎందుకంటే యజమానులు కోడ్‌ని చిత్తశుద్ధితో అమలు చేస్తారని ఊహించడం కూడా కష్టమే.
అంతేకాకుండా ఈఎస్ఐ వైద్య మౌలిక వసతులను సృష్టించడానికి, పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన సంస్థాగత ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్రాలపై ఉంది.
కార్మిక సంఘాల డిమాండ్లు
సామాజిక భద్రతా కోడ్‌తో పాటు నాలుగు లేబర్ కోడ్లకు కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్‌లో నిబంధనలు ప్రకటించే ముందు పారిశ్రామిక కేంద్రాలలో అనేక సమ్మెలు జరిగాయి.
ఉత్తర భారతదేశంలోని నోయిడా, గురుగ్రామ్, మానేసర్ వంటి ప్రాంతాల్లో ఆటోమొబైల్, దుస్తులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల కార్మికులు కొత్త కోడ్‌కు వ్యతిరేకంగా సమ్మె చేశారు.
తరువాత ఈ సమ్మెలు హర్యానాలోని పానీపట్, గుజరాత్‌లోని సూరత్, బీహార్‌లోని బరౌనీ తదితర ప్రాంతాలకు కూడా విస్తరించాయి.
కనీస వేతనం పెంచాలి, పనిచేసిన గంటలకు తగిన వేతనం ఇవ్వాలి, మానవీయ పని పరిస్థితులు కల్పించాలి, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా ఉండాలి, సామాజిక భద్రత కల్పించాలి అనే ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మెలు జరిగాయి.
వీటిలో సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయడం, ముఖ్యంగా ఈఎస్ఐఎస్ను సార్వత్రికంగా అందుబాటులోకి తీసుకురావాలనేది కీలకమైన డిమాండ్లలో ఒకటి.
ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు, వలస కార్మికులు యూనియన్లలో లేని కార్మికులు ఈ సమ్మెలలో పాల్గొన్నారు.
కార్పొరేట్ అనుకూల విధానాలు, కనీస వేతనాలు పెంచకుండా పని గంటలను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కోడ్‌లో కల్పించడంతో పాటు వాణిజ్యం-పన్నుల ఒప్పందాలు తదితర కారణాల ఫలితంగా ఈ కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.
2026 ఏప్రిల్‌లో జరిగిన సమ్మెలన్నిటిలో సామాజిక సంక్షేమ ప్రయోజనాల అమలు, అందరికీ ఈఎస్ఐఎస్ కవరేజ్ వర్తింపచేయాలనేవి ప్రధాన డిమాండ్లు.
కాగితంపై సార్వత్రిక కవరేజీ హామీ
ఈఎస్ఐఎస్ ఇప్పటికీ అధికారికంగా ఉద్యోగులుగా నమోదైన కార్మికులకు వర్తిస్తుంది. ఇందులో వలస కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, తక్కువ వేతనాలు పొందే కార్మికులు కూడా ఉన్నారు.
8 గంటలకు మించి పని చేసిన ఈ కార్మికులకు, పారిశ్రామిక ప్రమాదం, ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోవడం వంటి వాటి రక్షణకు ఈఎస్ఐఎస్ ఉపయోగపడాలి.
వైద్య సేవలు, వైకల్య నష్ట పరిహారం, పెన్షన్ వంటి ప్రయోజనాలు వర్తిస్తాయని కోడ్‌లో ఉంది. 4 కీలక పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు, వారిపై ఆధారపడిన సుమారు 16 కోట్ల మందికి(జనాభాలో 10 శాతం) ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని, ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతంగా కాగితాల మీద కనిపిస్తుంది.
అయితే ఆచరణలో, ఈ పథకం ప్రయోజనాలు లభించాల్సిన పెద్ద సంఖ్యలో ఉన్న కార్మికులకు లభించడం లేదు. కనీసంగా అత్యంత అవసరమైన సమయంలో కూడా వారికి ప్రయోజనాలు అందడం లేదు.
పథకం తన హామీ నుంచి ఎక్కడ దూరమవుతోంది
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నిర్వహించిన అనేక ఆడిట్లు, ఈఎస్ఐసీ వార్షిక నివేదికలు, ఐఎల్ఓ ప్రచురణలు ఈ పథకంలో వ్యవస్థాపరమైన సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఉదాహరణకు ఐఎల్ఓ నివేదిక ప్రకారం, గత రెండు దశాబ్దాల్లో ఈ పథకం బాగా విస్తరించింది.
1999-2000 సంవత్సరాలలో ఈఎస్ఐసీ కవరేజ్ వరించే సంస్థల సంఖ్య 0.22 మిలియన్ల నుంచి ఆశ్చర్యకరంగా 2018-19 నాటికి 1.03 మిలియన్లకు పెరిగింది.
ఇదే కాలంలో పథకం వర్తించిన కార్మికుల సంఖ్య 7.86 మిలియన్ల నుంచి 31.17 మిలియన్లకు పెరిగింది. అయితే ఈ విస్తరణ వల్ల సేవల నాణ్యతలో మెరుగుదల లేదు. నమోదైన పరిశ్రమలే ఎక్కువగా లెక్కలోకి వస్తున్నాయి.
డైరెక్టరేట్ జనరల్ ఫ్యాక్టరీ అడ్వైజ్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ (డీజీఎఫ్ఏఎస్ఎల్ఐ) అనేది కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక సంస్థ. పని ప్రదేశాలకు సలహాలు ఇవ్వడం, ప్రమాణాలు రూపొందించడం, శిక్షణ, విద్య, పరిశోధన, ఆడిట్లు నిర్వహించడం వంటి బాధ్యతలు దీనికి ఉన్నాయి.
అయితే 2016 నుంచి 2020 మధ్య పారిశ్రామికీకరణ పెరుగుతున్నప్పటికీ, నమోదు కావాల్సిన ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరగలేదు. కొన్ని సంవత్సరాల్లో అది స్వల్పంగా పెరిగింది లేదా తగ్గింది. అదే సమయంలో నమోదైన ఫ్యాక్టరీలలో ఉద్యోగుల సంఖ్య కూడా స్వల్పంగానే పెరిగింది.
లక్ష మంది కార్మికులకు, అలాగే ప్రతి వెయ్యి నమోదైన ఫ్యాక్టరీలకు సంబంధించిన గాయాల సంఖ్య 2016 నుంచి 2020 మధ్య తగ్గినట్లు కనిపించింది.
ఈ అసాధారణ ధోరణికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, డీజీఎఫ్ఏఎస్ఎల్ఐ పారిశ్రామిక గాయాలు, ప్రమాదాలపై డేటాను ప్రతి రాష్ట్రంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్(డిష్) నుంచి సేకరిస్తుంది. కానీ డిష్ సేకరించే సమాచారం ప్రధానంగా నమోదైన ఫ్యాక్టరీలకే పరిమితం.
ఐసిగ్నల్ అంచనా ప్రకారం భారతదేశంలోని దాదాపు 90 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇలాంటి చోట్ల ఫ్యాక్టరీల నమోదు ఖచ్చితంగా జరుగుతుందని గ్యారంటీ లేదు.
ఉదాహరణకు గుజరాత్‌లోని 25 జిల్లాల్లో నమోదైన ఫ్యాక్టరీలకు సంబంధించి డిష్ గణాంకాలు 2018 నుంచి 2022 మధ్య మొత్తం 992 ప్రమాదాలు జరిగినట్లు పేర్కొంది.
అయితే కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు సమర్పించిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. 2015 నుంచి 2024 మధ్య గుజరాత్లో 10,815 పారిశ్రామిక ప్రమాదాలు జరిగినట్లు నివేదిక తెలియజేసింది. వాటిలో 2,282 ప్రాణాలు కోల్పోయిన గాయాలు కాగా 8,533 ప్రాణాంతకం కాని గాయాలు ఉన్నాయి.
కార్మికుల నమోదు తప్పించుకునే యజమానులు
యజమానులు, కాంట్రాక్టర్లు కార్మికుల వివరాలను విధిగా రికార్డ్ చేయాలనే నిబంధన లేకపోవడం ఇందుకు ప్రధాన లోపం.
హర్యానా, మహారాష్ట్రలోని ఆటోమోటివ్ రంగంలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐసీ ప్రయోజనాలు ఎలా అందుతున్నాయో పరిశీలించిన సేఫ్ ఇన్ ఇండియా(ఎస్ఐఐ) సంస్థ ప్రచురించిన క్రష్డ్ 2026 నివేదిక దీనికి ఉదాహరణ.
ఈ కార్మికులు యంత్రాల వల్ల తీవ్రమైన గాయాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎస్ఐఐ సహాయం పొందిన గాయపడిన కార్మికుల్లో సుమారు 63 శాతం మందికి ప్రమాదం జరిగిన తర్వాతే ఈఎస్ఐసీ ఈ-పహచాన్ కార్డు లభించింది. కానీ చట్టం ప్రకారం అది ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఇవ్వాలి.
మహారాష్ట్రలో ఈ సంఖ్య దాదాపు 79 శాతం. హర్యానా, మహారాష్ట్రల్లో మొత్తం కేసుల్లో కేవలం 15–17 శాతం కేసులను మాత్రమే ప్రమాదానికి ముందు రిజిస్ట్రేషన్(పీఏఆర్)గా గుర్తించారు. అంటే కార్మికుడికి ప్రమాదం జరగడానికి ముందు నమోదు చేశారు. అంటే అత్యధిక కేసులలో ప్రమాదం జరిగిన తరువాతే యజమాని అతన్ని ఈఎస్ఐసీలో నమోదు చేశారు.
ఇది చట్ట విరుద్ధమయినప్పటికీ, దానికి తగిన శిక్షలు చాలా అరుదుగా పడుతున్నాయి.
ప్రమాదాలు జరిగిన వెంటనే యజమానులు ఆ వివరాలు డిష్(గతంలో అయితే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్)కి తెలియచేయకుండా జాప్యం చేయడం లేదా అసలు ప్రమాద నివేదికలను ఇవ్వకపోవడం ఇంకొక ముఖ్యమైన సమస్య.
పరిశ్రమలో కార్మికులుగా నమోదయిన వారిలో ప్రమాదానికి గురయిన దాదాపుగా నాల్గవ వంతు(23 శాతం – 25 శాతం) కార్మికులు తమకు ప్రమాదం జరిగిందనే రిపోర్టులు డిష్‌కి పంపడం ఆలస్యం చేశారని లేదా తెలియజేయడానికి నిరాకరించారని ఎస్ఐఐ సర్వేలో తేలింది. పరిశ్రమ యాజమాన్యం నివేదిక లేకుండా నష్ట పరిహారం కేసులు ప్రాసెస్ చేయడం సాధ్యం కాదు.
అదే విధంగా యజమానులు భయపడి చట్టాన్ని విధిగా అమలు చేసేలా ఉండాల్సిన జరిమానాలు నామమాత్రంగా ఉన్నాయి.
కార్మికుడు జీవితాంతం పొందాల్సిన శాశ్వత అంగ వైకల్య ప్రయోజనం మొత్తంతో పోల్చినప్పుడు పీఏఆర్ లేదా ప్రమాద నివేదిక సమర్పించకపోవడానికి యజమానులకు విధిస్తున్న ప్రస్తుత జరిమానాలు నామమాత్రంగా ఉన్నాయి. అందువల్ల చట్టాన్ని పాటించకపోవడం ఒక వ్యవస్థీకృతమైన అంశంగా మారింది.
‘గోల్డెన్ అవర్’ కూడా కోల్పోతున్నారు
ఒక కార్మికుడు ఈఎస్ఐసీలో నమోదై ఉన్నప్పటికీ, తీవ్రమైన యంత్ర ప్రమాదం జరిగినప్పుడు అత్యంత కీలకమైన “గోల్డెన్ అవర్” లో (ప్రమాదం జరిగిన కొద్ది గంటలలో అందాల్సిన వైద్య సహాయాన్ని గోల్డెన్ అవర్ అంటారు) ఈఎస్ఐసీ నుండి వైద్య సదుపాయం పొందలేకపోతున్నాడు.
హర్యానాలో గాయపడిన కార్మికుల్లో దాదాపు 50 శాతం మంది, మహారాష్ట్రలో 35 శాతం మంది మొదటగా ఈఎస్ఐసీ ఆసుపత్రులకు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వస్తున్నది. అక్కడ తరచూ ఈఎస్ఐసీ కంటే నాసిరకమైన వైద్యం అందుతున్నది. దీనికి ఒక కారణంగా, ఈఎస్ఐసీలో ప్రమాదం జరిగినట్లు రిపోర్ట్ చేయడం, అందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయడంలో ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం కారణంగా కార్మికుడి వైకల్యం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది.
అదే సమయంలో పరిశ్రమలలో జరిగిన ప్రమాదాలు, కార్మికులకు ఈఎస్ఐసీ ద్వారా లభించిన ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం డీజీఎఫ్ఏఎస్ఎల్ఐ నిర్వహించే పారిశ్రామిక ప్రమాదాల డేటాతో సక్రమంగా అనుసంధానం కావడం లేదు. ఈ అరకొర డేటా ఆధారంగా డిష్ ఫ్యాక్టరీల్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తుంది.
చట్టాన్ని పాటించాలనే ఉద్దేశం కొన్ని యాజమాన్యాలకు ఉన్నప్పటికీ, భారతదేశంలోని తయారీ రంగ పరిశ్రమలు విస్తరించిన భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా ఈఎస్ఐసీ వైద్య మౌలిక వసతులు పెరగలేదు.
ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రులు ఇప్పటికే కేంద్రీకరించి ఉన్న కొన్ని పారిశ్రామిక క్లస్టర్స్‌కు పరిమితమై ఉన్నాయి. ముఖ్యంగా హర్యానాలోని మానేసర్, ఫరీదాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో అవి కేంద్రీకృతమై ఉన్నాయి.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న లేదా అక్కడక్కడా విస్తరించి ఉన్న తయారీ కేంద్రాల్లో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లోని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రాంతాల్లో కార్మికుల సంఖ్యతో పోలిస్తే ఈఎస్ఐసీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు చాలా తక్కువగా ఉన్నాయి.
దీని వల్ల కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రులను ఎందుకు ఆశ్రయించవలసి వస్తున్నదో కొంతవరకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు సమీప ఈఎస్ఐసీ ఆసుపత్రి చాలా దూరంలో ఉండవచ్చు.
ఆటోమొబైల్ రంగంలోనే సుమారు 3.7 కోట్ల మంది పనిచేస్తున్నారని అంచనా. తయారీ రంగంలోని ఎంఎస్ఎంఈలు, కొత్త పారిశ్రామిక కారిడార్లు వేగంగా పెరుగుతున్నాయి.
అయితే ఈఎస్ఐసీలో ఆసుపత్రి పడకలు, నిపుణులైన వైద్యులు, తెగిన/గాయపడిన అవయవాలను సరిచేసే శస్త్రచికిత్స సామర్థ్యం, వైద్య సిబ్బంది వంటి మౌలిక వసతులు పెరుగుతున్న కార్మికుల సంఖ్య, ప్రమాదాలు ఎక్కువగా జరిగే పరిశ్రమలు, సెమీ-అర్బన్, జిల్లా స్థాయి ప్రాంతాలకు అనుగుణంగా పెరగలేదు.
కేవలం కార్మికులకు ఈఎస్ఐసీ వర్తించే పరిధి విస్తరిస్తే సరిపోదు. అదే సమయంలో నాణ్యమైన తృతీయ స్థాయి వైద్య సేవలు, ముఖ్యంగా అవయవాల పునర్నిర్మాణం, వైకల్య నిర్వహణకు అవసరమైన నిర్మాణ ఏర్పాట్లు కూడా విస్తరించాలి.
లేకపోతే ఎక్కువ మంది కార్మికులకు ఈఎస్ఐసీ విస్తరించినట్లు కాగితాలపై ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగిన తర్వాత అత్యవసర చికిత్స అందించాల్సిన “గోల్డెన్ అవర్” సమస్య పరిష్కారం కాదు.
ఆధారాలు గుట్టలు గుట్టలు
2025 ఏప్రిల్‌లో సాథీ సంస్థ ప్రచురించిన ఒక పరిశోధనా నివేదిక మహారాష్ట్రలోని ఏడు జిల్లాల్లో 11 ఈఎస్ఐసీ ఆసుపత్రులను పరిశీలించింది. ఆ పరిశోధనా నివేదిక ప్రకారం వైద్య సిబ్బంది కొరత, ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరికరాల కొరత, మందుల సరఫరాలో కొరత వంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నట్లు తేలింది.
పైపెచ్చు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) కింద ఈఎస్ఐసీతో అనుబంధమైన ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు చెల్లింపుల్లో ఆలస్యం జరగడంతో ప్రైవేట్ వైద్య సంస్థలు ఈఎస్ఐసీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం, కార్మికులకు సూపర్-స్పెషాలిటీ చికిత్సల అందుబాటు తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఐఎల్ఓ అధ్యయనం కూడా ఈఎస్ఐఎస్ గురించి కార్మికుల్లో అవగాహన తక్కువగా ఉందని తేలింది. ఐఎల్ఓ అధ్యయనం ప్రకారం 89 శాతం మందికి వైద్య ప్రయోజనాల గురించి తెలుసు.
46 శాతం మందికి మాత్రమే నగదు ప్రయోజనాల గురించి తెలుసు. కేవలం 32 శాతం మందికి వైకల్య ప్రయోజనాల గురించి తెలుసు.
కార్మికులలో ఉన్న ఈ అవగాహన లోపం కారణంగా కార్మికులు పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడానికి ముఖ్య కారణం అవుతున్నది.
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులు
2023 సెప్టెంబర్‌లో పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈఎస్ఐసీపై విడుదల చేసిన నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలను గుర్తించి, సిఫారసులు చేసింది.
1. వేతన పరిమితి సవరణ: పథకం వర్తించే కార్మికుల వేతనం రోజుకు రూ.176 మించితే అలాంటి కార్మికులకు పథకం వర్తించదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి సమానంగా కాకపోయినా వేతనాలు కొంత మేర పెరుగుతున్నాయి. కానీ 7 సంవత్సరాలుగా 176 గా ఉన్న వేతన పరిమితి మారలేదు.
వేతనాలు పెరుగుతున్న నేపథ్యంలో వేతన పరిమితులు, కవరేజ్, ప్రయోజన అర్హత నియమాలను సమీక్షించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది.
2. కవరేజ్ విస్తరణ: 2020 సామాజిక భద్రతా కోడ్ ద్వారా ప్రమాదకర పరిశ్రమలు, గిగ్/ప్లాట్‌ఫారమ్ కార్మికులు, 10 మందికంటే తక్కువ ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థలు కూడా ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చాయి.
అయితే ఈఎస్ఐసీ దీనికి తగినట్లు సిద్ధంగా లేదని పేర్కొంటూ, అర్హత ఉన్న కార్మికులను గుర్తించేందుకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం, సర్వేలు నిర్వహించడం చేయాలని సంఘం సిఫారసు చేసింది.
3. యజమానుల చెల్లింపుల వైఫల్యం: కార్మికుడి వేతనం నుంచి పథకానికి చెల్లించాల్సిన డబ్బు రికవరీ అయినప్పటికీ యజమాని వాటా చెల్లించని కారణంగా కార్మికులు నష్టపోతున్నారు. అందువల్ల యజమానులపై శిక్షార్హమైన నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సంఘం సిఫారసు చేసింది.
4. వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల కొరత: 2019లో 39 ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా అందులో కేవలం 2 మాత్రమే పనిచేయడం ప్రారంభించాయని సంఘం గుర్తించింది. ఆసుపత్రుల నిర్మాణాన్ని నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని, ఇన్సూరెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్లకు (ఐఎంపీ) ఫీజులు పెంచాలని, యాజమాన్యాలు నిర్వహించే డిస్పెన్సరీల సంఖ్యను పెంచాలని సంఘం సిఫారసు చేసింది.
5. సిబ్బంది కొరత: ఈఎస్ఐసీ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 35 శాతం వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని సంఘం పేర్కొంది. వెంటనే నియామకాలు చేపట్టి, నియామక నిబంధనలను పునర్వ్యవస్థీకరించాలని సంఘం సిఫారసు చేసింది.
6. పెట్టుబడి నిధులు: ప్రభుత్వ సెక్యూరిటీల నుంచి వచ్చే రాబడులు తగ్గుతున్న నేపథ్యంలో, పెట్టుబడి విధానాలను ప్రతి సంవత్సరం సమీక్షించాలని, ఈక్విటీ వంటి ఇతర పెట్టుబడి అవకాశాలను కూడా పరిశీలించాలని సంఘం సిఫారసు చేసింది.
కార్మికులు ఏమి కోరుతున్నారు
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర స్థాయిలోని డిష్ సంస్థల జవాబుదారీతనం క్రమంగా బలహీనపడటం వల్ల ఈఎస్ఐఎస్ అమలులో సంక్షోభం ఏర్పడింది. ఇందులో కార్మిక సంఘాలు, కార్మిక భద్రత కోసం పనిచేసే సేఫ్టీ కౌన్సిల్స్ని బలహీనపరచడం కూడా ఒక భాగం. (పారిశ్రామిక సంబంధాల కోడ్-2020 లో కార్మిక సంఘాల సమ్మె హక్కులపై వాస్తవం కాని షరతులు విధించింది).
అలాగే యజమానులు చట్టపరమైన రక్షణలను నిర్వీర్యం చేసి చట్టాన్ని పాటించకపోవడం, అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య పెరగడం, కార్మికులను బలహీనులను చేయడం, ఈఎస్ఐఎస్ని మెరుగుపరచాలనే రాజకీయ సంకల్పం లేకపోవడం సంక్షోభానికి కారణాలుగా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కార్మికులు కొత్తగా ఏదీ అడగడం లేదు
ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుండి, ప్రమాదం జరిగిన మొదటి గంటలో, అంగ వైకల్యం జరిగిన తర్వాత మొత్తం కాలం పథకం(చట్టం) లో ఈ పాటికే ఉన్నదాన్ని తమకు అమలు చేయాలని అడుగుతున్నారు.
కార్మికుల నమోదు, ప్రమాద నివేదికలు, వైద్య సేవలు ఈ మూడు పరస్పర సమన్వయంతో పనిచేసి, భారతదేశంలో ఫ్యాక్టరీలు వాస్తవంగా ఉన్న ప్రాంతాలకు సరిపడే మౌలిక వసతులను పటిష్టం చేయకపోతే, ఈఎస్ఐ భద్రతా వలయానికి ఉన్న కంతలలో కార్మికులు పడిపోతారు. పథకం నిరుపయోగమైన భద్రతా వలయంగానే మిగిలిపోతుంది.
(రచయితలు: భార్గవ్ ఓజా అహ్మదాబాద్‌కు చెందిన న్యాయవాది, స్వచ్ఛంద పరిశోధకుడు. అసంఘటిత రంగం, వలస కార్మికులు, కార్మిక చట్టాలు, కార్మిక విధానాలపై ఆయన రచనలు చేశారు; హర్ష్ కింగర్ వడోదరకు చెందిన న్యాయవాది. ఆయన క్రిమినల్ జస్టిస్ అండ్ పోలీస్ అకౌంటబిలిటీ ప్రాజెక్టులో పరిశోధన, న్యాయవాద కన్సల్టెంట్‌గా కూడా పనిచేస్తున్నారు.)
ది వైర్ ఇంగ్లీష్‌లో ప్రచురితమైన ఈ వ్యాసానికి తెలుగు అనువాదం: డి. వెంకన్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
