బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ ముగ్గురిలో ఇతరుల అసమ్మతి ఉంటే ఏం చేయాలి? భిన్నాభిప్రాయాల విలువను ఎవరూ పట్టించుకోవడం లేదు.
ముగ్గురిలో ఇద్దరు ఏకమై అసమ్మతి తెలిపితే, అది కమిషన్ మెజారిటీ నిర్ణయం అనుకోవాలే కాని, అది ప్రధాన కమిషనర్ అభిప్రాయానికి విలువ ఎక్కువై ఇతరులయిన ఇద్దరి విలువతో సమానమవుతుందా?
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు పది నెలల వ్యవధిలో అనేక సందర్భాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్ఐఆర్), ఫారం-6, ఓటర్ల డేటాబేస్ కేంద్రీకరణ, సాంకేతిక వ్యవస్థ, అప్పీళ్ల వంటి అంశాలపై అభ్యంతరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో ఎస్ఐఆర్కు సంబంధించిన ప్రశ్నలను చేర్చడంపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇక్కడ అసలు ప్రశ్న భిన్నాభిప్రాయం ఉన్నదా లేదా అన్నది కాదు. ఆ చర్యకు చట్టబద్ధమైన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే.
దీనికి బీజేపీ చరిత్రలోనే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. 2006 మార్చిలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీయే నాయకులు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక వినతిపత్రం సమర్పించి, ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని కోరారు.
ఆ వినతిపత్రంపై 205 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఆ కారణాల మీదనే ఎన్నికల కమిషన్‌ను తీసిపారేయాలా?
చావ్లాకు కాంగ్రెస్ నాయకులతో ఆర్థిక, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులకు సంబంధించిన ట్రస్టుల ద్వారా కాంగ్రెస్ రాజకీయ నాయకులతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఎన్డీయే ఆరోపించింది.
ఇటువంటి సంబంధాలు ఒక రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంస్థలోని అధికారి నిష్పాక్షికతపై ప్రశ్నలు, అనుమానాలు తీసుకువస్తాయి.
అయితే నేడు కాంగ్రెస్ అదే ప్రశ్నను ఎందుకు లేవనెత్తడం లేదు? 2006లో ప్రారంభమైన వివాదం కేవలం ఆ వినతిపత్రంతో ముగియలేదు.
2006లో ఒక ఉదాహరణ
ఆ సమయంలో ఎన్డీయే వాడిన వాదనలో ఒక ముఖ్యమైన అంశం ఉంది. నవీన్ చావ్లా వాస్తవంగా అన్యాయంగా వ్యవహరించారని చెబితే సరిపోదు.
ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా, నిష్పాక్షికంగా కనిపించాలికూడా అని వాదించారు. అది సరైన పనే.
ఎన్నికల విశ్వసనీయతకు ఎన్నికల సంఘం తటస్థతపై ప్రజలకు నమ్మకం ఉండటం అవసరమని అప్పటి ఎన్డీయే స్పష్టం చేసింది.
205 మంది ఎంపీల తరఫున సమర్పించిన వినతిపత్రం వ్యవహారంపై బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, నవీన్ చావ్లాకు నోటీసులు జారీ చేసింది. ఇది కేవలం ఒక రాజకీయ ఆరోపణగా మిగిలిపోలేదు. ఎన్నికల సంఘం స్వతంత్రత, దాని సభ్యుల నిష్పాక్షికత, రాజ్యాంగ సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అంశాలు న్యాయపరమైన పరిశీలనకు కూడా వెళ్లాయి.
రాజ్యాంగపరమైన వేదికపైకి వివాదం
2009లో ఈ వివాదం మళ్లీ రాజ్యాంగపరమైన వేదికపైకి వచ్చింది. అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్ గోపాలస్వామి నవీన్ చావ్లాను తొలగించాలని సిఫారసు చేశారు.
అయితే యూపీఏ ప్రభుత్వం ఆ సిఫారసును అంగీకరించలేదు. ఆ తరువాత చావ్లా ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ ఒక న్యాయపరమైన తేడాను గుర్తించాలి. ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే విధానం ఒకేరకంగా ఉండవు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ఎన్నికల కమిషనర్లకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. ఎన్నికల కమిషనర్ తొలగింపుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసు అవసరమయ్యే విధంగా రాజ్యాంగం వ్యవస్థను నిర్దేశించింది. అందువల్ల నేటి చర్చలో అసలు ప్రశ్న 2006లో నవీన్ చావ్లాపై చేసిన ఆరోపణలు, 2026లో వస్తున్న ఆరోపణలు ఒకటేనా కాదా అనేది కాదు. అవి ఒకటే కావు.
అసలు ప్రశ్న ఏమిటంటే— బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రతకు సంబంధించి ప్రస్తావించిన సంస్థాగత సూత్రాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా పాటిస్తుందా? అదే విధంగా కాంగ్రెస్ కూడా తన ప్రతిపక్ష పాత్రలో ఇదే ప్రమాణాన్ని వర్తింపజేస్తుందా?
2006 నుంచి 2026 వరకు ఏం మారింది?
మొత్తం వ్యవహారంలో ప్రధానమైన అంశం ఎన్నికల సంఘంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడుతుందా లేదా అన్నదే.
2006లోని వివాదం ఒక ఎన్నికల కమిషనర్‌కు అనుమానాలు, సాన్నిహిత్యం, ఆర్థిక సంబంధాల చుట్టూ తిరిగింది. పతివ్రతగా ఉండడం మంచిది కదా. కనీసం పతివ్రతవలె కనపడాలి కదా.
2026లోని వివాదం మాత్రం ఎన్నికల పరిపాలన స్వయంగా ఏవిధంగా జరుపుతున్నారనే అంశంపై ఎన్నికల కమిషన్‌లోనే ఏర్పడినట్లు వెల్లడైన భిన్నాభిప్రాయాలకు సంబంధించినది. అసమ్మతి ఉండడం అవసరం కదా. ఈ రెండు పరిస్థితులను ఒకటిగా చూడకూడదు. మౌలికమైన అంశాలను పోల్చుకోవచ్చు.
రాజకీయ ప్రభావం ఉన్నట్లు ప్రజలకు కనిపించడం కూడా ఎన్నికల సంఘంపై విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని 2006లో బీజేపీ వాదించినది.
2026లో జాతీయ అత్యవసర పరిస్థితి అధికారికంగా ప్రకటించబడనప్పటికీ, దానికి సమానమైన తీవ్రమైన సంస్థాగత ఆందోళనల మధ్య, ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కొన్ని పరిపాలనా, సాంకేతిక చర్యలపై అభ్యంతరాలు కనపించాయి.
అందువల్ల ప్రస్తుత సమస్య వ్యక్తిగత అంశం కంటే సంస్థాగత అంశంగా మారుతోంది. ఒక పౌరుడు ఓటరుగా మారే ప్రక్రియను నిర్వహించే వ్యవస్థ పారదర్శకంగా, చట్టబద్ధమైన అధికార పరిధిలోనే పనిచేస్తుందా అన్నదే ప్రశ్న.
ప్రతిపక్ష కాంగ్రెస్ 2006 వ్యూహాన్ని ఎందుకు అనుసరించడం లేదు?
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘాన్ని విమర్శించాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. అయినప్పటికీ ఈ ప్రశ్న అడగాల్సిందే.
అయితే ఆధారాలు లేకుండా కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల ఉద్దేశాలను ఆపాదించకూడదు. ఊహాగానాల వల్ల సరిపోదు.
అదే సమయంలో రాజకీయ విమర్శకు, 2006లో ఎన్డీయే చేపట్టిన సంస్థాగత, రాజ్యాంగపరమైన చర్యలకు మధ్య చాలా తేడా ఉంది.
2006లో ఎన్డీయే ఒకేసారి అనేక మార్గాలను ఉపయోగించింది:
♦ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించింది.
♦ పార్లమెంటు సభ్యుల సంతకాలను సేకరించింది.
♦ ప్రధాన ఎన్నికల కమిషనర్ జోక్యాన్ని కోరింది.
♦ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈనాటి సందర్భంలో ప్రతిపక్షానికి ఎన్నికల సంఘం అంతర్గత పత్రాలు ఇలాంటి సంస్థాగత ప్రమాదాన్ని వెల్లడిస్తున్నాయని భావిస్తే, రాజ్యాంగపరమైన మార్గాలు కూడా వాడుకోవచ్చు. అవన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ప్రధానంగా వారు చేయవలసినవి:
♦ సమాచారాన్ని, నిర్ణయాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయవచ్చు.
♦ పార్లమెంటరీ పరిశీలన కోరవచ్చు.
♦ నిర్దిష్ట పరిపాలనా చర్యలను న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు.
♦ స్వతంత్ర సాంకేతిక ఆడిట్ కోరవచ్చు.
♦ చట్టబద్ధమైన ఫారాలను మార్చడానికి ఉన్న న్యాయపరమైన అధికారాన్ని, దానికి ఆధారమైన నిబంధనలను కోరవచ్చు.
♦ ఎన్నికల అప్పీళ్లను ఎవరి అనుమతితో, ఏ అధికారంతో దాఖలు చేశారో వివరణ కోరవచ్చు.
♦ రాజ్యాంగం ఏదైనా అభిశంసన లేదా ప్రత్యేక తొలగింపు విధానాన్ని నిర్దేశించినట్లయితే, అందుబాటులో ఉన్న ఆధారాలు ఆ రాజ్యాంగపరమైన ప్రమాణాన్ని చేరుకున్నాయా లేదా అన్నది కూడా పరిశీలించవచ్చు.
కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతిపక్షం కేవలం ఆరోపణలు చేయకూడదు. ఆధారాలను చట్టం ప్రకారం కలిసి ముందుకు తీసుకెళ్లాలి.
మరి బీజేపీ ఏం చేయాలి?
బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షంలో లేదు. అధికారంలో ఉంది. ఈ రాజకీయ స్థానంలో వచ్చిన మార్పు రాజ్యాంగ సూత్రాలలో మార్పుకు కారణం కాకూడదు. ఇదే బహుశా ఈ మొత్తం చర్చలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న.
2006లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రతకు అప్రమత్తత అవసరమని బీజేపీ విశ్వసిస్తే, అదే ప్రమాణం ఇప్పుడు కూడా వర్తించాలి.
అధికార పార్టీకి నైతికంగా స్థిరమైన వైఖరి ఒక్కటే: “వాస్తవాలు, కనిపించే రికార్డులే వివరంగా చెప్పనీయండి. మాట్లాడనివ్వండి.”
విచారణ వల్ల రాజకీయ ఇబ్బంది కలగవచ్చనే కారణంతో ప్రభుత్వం ఆరోపణల పరిశీలనను అడ్డుకోకూడదు. ఎన్నికల సంఘాన్ని సంబంధిత నిర్ణయాలు, అనుమతులు, అధికారిక రికార్డులను బహిర్గతం చేయాలని కోరాలి.
1. ఎన్నికల డేటాబేస్‌పై స్వతంత్ర టెక్నికల్ ఆడిట్
విశ్వసనీయమైన ఆందోళనలు వ్యక్తమైతే ఎన్నికల డేటాబేస్లపై స్వతంత్ర సాంకేతిక ఆడిట్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించాలి.
2. ఎన్నికల నమోదు అధికారుల అధికారాలను రక్షించాలి
పార్లమెంటు చట్టం ద్వారా కల్పించిన అధికారాలు ఎన్నికల నమోదు అధికార యంత్రాంగం చేతిలోనే ఉండేలా ప్రభుత్వం నిర్ణయించాలి.
3. చట్టబద్ధమైన ఫారాలను అనధికారికంగా మార్చకూడదు
చట్టం నిర్దేశించిన అధికారంతోనే ఎన్నికల సంబంధిత ఫారాలను మార్చే విధానం ఉండాలి.
4. ప్రతి ప్రధాన ఎన్నికల చర్యకు స్పష్టమైన చట్టపరమైన ఆధారం ఉండాలి
ప్రతి ప్రధాన ఎన్నికల జోక్యానికి ఏ చట్టం, ఏ నిబంధన, ఏ అధికారం ఆధారమో స్పష్టంగా ఉండాలి.
ఏదైనా అనధికార చర్య జరిగినట్లు నిర్ధారణ అయితే, దాని సవరణకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి. ఆ సవరణ వల్ల రాజకీయంగా ఎవరికైనా నష్టం జరిగినా, చట్టబద్ధతను పునరుద్ధరించడం ప్రభుత్వ బాధ్యత. అదే రాజ్యాంగ నైతికత. అయితే రాజ్యాంగ నైతికత గురించి ఎవరు పట్టించుకుంటున్నారు?
బీజేపీ, ఇండియా కూటమి ఒకే ప్రమాణాన్ని పాటించాలి
ఇక్కడ లోతైన గుణపాఠం చదువుకోవాలి. బీజేపీ నేడు అధికార పార్టీ. ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఉంది. భవిష్యత్తులో వారి సంస్థాగత స్థానాలు మారవచ్చు. కానీ మౌలిక రాజ్యాంగ సూత్రం మాత్రం అధికార పక్షం మారినప్పుడల్లా మారకూడదు.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రతను కోరుతూ, అధికారంలోకి వచ్చిన తరువాత అదే సంస్థపై కార్యనిర్వాహక నియంత్రణను సమర్థిస్తే, దాని రాజ్యాంగ వాదన రాజకీయంగా మారిపోతుంది.
అదే విధంగా కాంగ్రెస్ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు నేడు పారదర్శకతను కోరుతూ, భవిష్యత్తులో తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలపై మౌనం పాటిస్తే, వారి వాదనకూ అదే బలహీనత వస్తుంది.
పారదర్శకత అంటే అందరికీ అందే సమాచార హక్కు. ఆర్టీఐ. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా సరే పారదర్శకత, ఆర్టీఐ అవసరం.
ఎన్నికల సంఘం ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే స్వతంత్రంగా ఉండాలంటే సరికాదు కదా. అది ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత కూడా ఒకే రకంగా, అదీ స్వతంత్రంగా ఉండాలి. అది న్యాయం అవుతుంది. లేకపోతే, కుట్రపూరితమైన రాజకీయ ఎత్తుగడలు అనవలసి ఉంటుంది.
అక్రమం నిర్ధారణ అయితే ప్రభుత్వం ఏం చేయాలి?
దానికి మొదటి పరిష్కారం ఎవరో ఒకరిని తొలగించడం కావాల్సిన అవసరం లేదు. సంస్థాగత పరిష్కారాలకు ఒక క్రమం ఉండాలి.
♦ మొదట, ఏ చర్య జరిగింది అనేది గుర్తించాలి.
♦ రెండవది, దానికి చట్టబద్ధమైన అధికారం ఏమిటో గుర్తించాలి.
♦ మూడవది, ఆ చర్యకు ఎవరు అనుమతి ఇచ్చారో గుర్తించాలి.
♦ నాలుగవది, నిర్దేశిత విధానాన్ని అనుసరించారా లేదా నిర్ణయించాలి.
♦ ఐదవది, అనధికార చర్య వల్ల ఏర్పడిన పరిణామాలను సరిచేయాలి.
♦ ఆరవది, అటువంటి పొరపాటు జరగడానికి వీలు కల్పించిన సంస్థాగత వ్యవస్థను సరిచేయాలి.
ఓటర్లను తప్పుగా తొలగించినట్లయితే, వారికి తిరిగి ఓటరుగా నమోదయ్యే సమర్థవంతమైన అవకాశం కల్పించాలి.
ఒక ఫారాన్ని చట్టవిరుద్ధంగా మార్చినట్లయితే, దానిని పునరుద్ధరించాలి లేదా చట్టబద్ధమైన విధానంలో కొత్త ఫారాన్ని రూపొందించాలి.
డేటాబేస్ చట్టబద్ధమైన అధికారులను పక్కన పెట్టినట్లయితే, ఆ వ్యవస్థను సరిచేయాలి. సరైన అనుమతి లేకుండా అప్పీలు దాఖలు చేసినట్లయితే, ఆ అప్పీళ్లకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నిర్ధారించాలి.
ఒక అధికారి తన అధికార పరిధిని దాటి వ్యవహరించినట్లయితే, చట్టం ప్రకారం బాధ్యతను నిర్ణయించాలి. కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కంటే ఇది మరింత నిర్మాణాత్మకమైన విధానం.
అసలు సమస్య కేవలం జ్ఞానేశ్ కుమార్ అనే వ్యక్తి సంగతి కాదు, మన వ్యవస్థ, రూల్ ఆఫ్ లా. ఈ వివాదాన్ని చివరకు జ్ఞానేశ్ కుమార్ అనే వ్యక్తికి లేదా మరే ఇతర కమిషనర్‌కు మాత్రమే పరిమితం చేయకూడదు. అసలు సమస్య సంస్థాగత రూపకల్పన.
మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌గా ఈ రచయితకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:
ఎన్నికల కమిషనర్లను ఎవరు నియమిస్తున్నారు? వారి పనితీరును ఎవరు నియంత్రిస్తున్నారు? ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘం నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? భిన్నాభిప్రాయాలను ఎలా నమోదు చేస్తున్నారు?
ఒక భిన్నాభిప్రాయం ఎప్పుడు మెజారిటీ నిర్ణయంగా మారుతుంది? ఎన్నికల డేటాబేస్‌ను ఎవరు నియంత్రిస్తున్నారు?
ఓటరు సమాచారాన్ని ఎవరు మార్చగలరు? క్షేత్రస్థాయి అధికారులకు ఎవరు ఆదేశాలు ఇవ్వగలరు? అప్పీలు ఎవరు దాఖలు చేయగలరు? సాఫ్ట్‌వేర్‌ను ఎవరు ఆడిట్ చేస్తున్నారు? చట్టబద్ధమైన అధికారిని పక్కనపెట్టినప్పుడు బాధ్యత ఎవరిది?
ఈ ప్రశ్నలు ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలంతో ముగియవు. ఇవి బీజేపీ ప్రభుత్వంతో ముగియవు. కాంగ్రెస్ లేదా మరే ఇతర ప్రతిపక్ష పార్టీతోనూ ముగియవు. కనీసం ఒక రాష్ట్ర లేదా కేంద్ర స్థాయి కమిషనర్ అయినా సమాచార హక్కు చట్టం కింద ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. కనీసం సమాచారంగా అయినా ఒక పౌరుడు ఈ ప్రశ్నలను అడగవచ్చు.
అయితే ఎందుకు అడగకూడదు? అందుకే ప్రస్తుత వివాదాన్ని ఒక వ్యక్తిని బలహీనపరచడానికి కాకుండా, సంస్థను బలోపేతం చేయడానికి ఉపయోగించాలి.
తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన ఐదు ప్రశ్నలు
మొత్తం వివాదాన్ని ఐదు ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నలుగా కుదించవచ్చు:
1. అధికారం: వివాదాస్పదమైన ప్రతి చర్యకు ఎవరు అనుమతి ఇచ్చారు?
2. చట్టబద్ధ అధికారం: ఏ చట్టంలోని ఏ నిబంధన కింద ఆ చర్యకు అధికారం లభించింది?
3. కమిషన్ భాగస్వామ్యం: పూర్తి ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చి, దానిపై చర్చించడానికి అవకాశం కల్పించారా?
4. నిర్ణయ ప్రక్రియ: వర్తించే ఏకాభిప్రాయం లేదా మెజారిటీ విధానాన్ని అనుసరించి నిర్ణయం తీసుకుని, దానిని నమోదు చేశారా?
5. అమలు: ఏదైనా అధికారి, డేటాబేస్ నిర్వాహకుడు లేదా సాఫ్ట్వేర్ వ్యవస్థ చట్టబద్ధమైన ఎన్నికల అధికారాన్ని పక్కన పెట్టిందా?
ఎన్నికల సంఘం ఈ ప్రశ్నలకు పారదర్శకంగా సమాధానాలు ఇస్తే, ప్రస్తుత వివాదంలో చాలా భాగం పరిష్కారమవుతుంది. లేకపోతే అనుమానాలు సహజంగానే కొనసాగుతాయి.
రాజకీయ ఎత్తుగడల నైతికత నుంచి రాజ్యాంగ నైతికత వైపు
2006లోని నవీన్ చావ్లా సంఘటన ప్రతి రాజకీయ పార్టీకి ఒక ముఖ్యమైన పాఠాన్ని అందిస్తుంది. అప్పుడు బీజేపీ ఒక ఎన్నికల కమిషనర్ నిష్పాక్షికంగా ఉండటమే కాకుండా, నిష్పాక్షికంగా కనిపించాలి అని వాదించింది.
నేడు జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రస్తావించిన “పర్సెప్షన్ టెస్ట్” అదే సూత్రాన్ని మరింత విస్తృతమైన రాజ్యాంగపరమైన సందర్భంలోకి తీసుకువెళ్తోంది. అవి అనుకోవడం గురించి అంశాలు. అనుమానాలు అవుతాయి. దీని అర్థం 2006లో బీజేపీ సరైనదని, 2026లో బీజేపీ విమర్శకులే తప్పకుండా సరైనవారని చెప్పడం కాదు. పాఠం, గుణపాఠం సులువుగానే అర్థమవుతుంది.
రాజ్యాంగ సంస్థకు వర్తించే ప్రమాణం ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానిపై ఆధారపడకూడదు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే విశ్వసించే ఎన్నికల సంఘం సరిపోదు.
ప్రతిపక్షం మాత్రమే విశ్వసించే ఎన్నికల సంఘం కూడా సరిపోదు. విజేతకూ, పరాజితుడికీ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేంత నమ్మకాన్ని కలిగించే విధంగా— దాని విధానాలు, రికార్డులు, నిర్ణయాలు పారదర్శకంగా ఉండే సంస్థగా ఎన్నికల సంఘం ఉండాలి.
ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫలితం మాత్రమే ముఖ్యం కాదు, ఆ ఫలితాన్ని ఎలా సాధించారన్న ప్రక్రియ కూడా అంతే ముఖ్యం.
ఇటీవల బయటకు వచ్చిన అంతర్గత భిన్నాభిప్రాయాలు కేవలం రాజకీయ ప్రత్యారోపణలతో ముగించాల్సిన విషయం కాదు.
ఎన్నికల సంఘం వాటికి ఒక్కొక్కటిగా సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వం పారదర్శకతను అడ్డుకోకుండా ప్రోత్సహించాలి. పార్లమెంటు, న్యాయస్థానాలు తమ తమ రాజ్యాంగపరమైన పాత్రలను నిర్వహించాలి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రమాణాలను కోరుతున్నారో, అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే ప్రమాణాలను రాజకీయ పార్టీలు పాటించాలి.
అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లినప్పుడు కూడా అదే ప్రమాణాలను కొనసాగించాలి.
ఎన్నికల సంఘం బీజేపీ వైపు ఉందా, కాంగ్రెస్ వైపు ఉందా, ఇండియా కూటమి వైపు ఉందా, మరే రాజకీయ పక్షం వైపు ఉందా అనేది అంతిమ ప్రశ్న కాదు.
ఎన్నికల సంఘం స్పష్టంగా రాజ్యాంగం వైపు ఉందని నిరూపించగలదా? అదే అసలు ప్రశ్న. ఆ ప్రమాణంతోనే ఈ సంస్థను పరిశీలించాలి. అధికారంలో ఎవరు ఉన్నా, ఆ ప్రమాణం మాత్రం మారకూడదు. సమాధానాలు దొరికితే మరిన్ని ప్రశ్నలకు దారి తీస్తాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
