ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్ జీ మొదటి నిరసన ప్రదర్శనలో ఒక యువతి చేతిలో షహీద్ భగత్ సింగ్ పుస్తకం కనిపించింది. నేటితరం ఉద్యమంలో ఆయన పుస్తకం ఎందుకు చదువుతున్నావని అడగ్గా, ఆమె ఇచ్చిన సమాధానం వందేళ్ళ క్రితం నాటి మూలాలను తట్టి లేపింది.
ఆమె ఏమన్నదంటే… “అప్పట్లో సహాయ నిరాకరణ ఉద్యమం విఫలమైన తర్వాత, దేశభక్తి నిండిన ప్రజల్లో యువ నాయకులకు గుర్తింపు లభించసాగింది. అప్పటికే స్థిరపడిన సీనియర్ నాయకులు ఒక రకంగా వెనుకబడి పోతున్నారని ఇందులో రాసి ఉంది. ఆనాడు భగత్ సింగ్ ఏది రాశారో, అది ఈనాటి పరిణామాల్లో కనిపిస్తోంది. ఉదయం నుంచి ఆయన ఉనికిని నేను అనుభూతి చెందుతున్నాను. బహుశా ఇలాంటి ఒక సందర్భం గురించే అప్పట్లో ఆయన ఇది రాసి ఉండవచ్చు”.
ఆమె వ్యక్తీకరణ కేవలం ఒక వ్యాఖ్యానం కావచ్చు. ఆమె ప్రస్తావించిన వ్యక్తి- భగత్ సింగ్ -రాజకీయ నాయకత్వం, మతోన్మాదం, నూతన తరం బాధ్యతలపై యువతకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిన శక్తి.
నౌజవాన్ భారత్ సభ ఆవిర్భావం
సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి. 2026లో జరుపుకున్న ఆయన జయంతి మరొక చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకుంది.
భగత్ సింగ్, సుఖదేవ్, భగవతీ చరణ్ ఓహ్రాల అనుబంధంతో ‘నౌజవాన్ భారత్ సభ’ అనే యువజన సంస్థ ఏర్పడి సరిగ్గా నేటికి వందేళ్ళు పూర్తయ్యాయి.
‘నౌజవాన్ సభ’ 1926 మార్చిలో సోషలిస్ట్ దృక్పథం, విప్లవాత్మక ప్రణాళికతో కూడిన ఒక విప్లవ యువజన సంస్థగా లాహోర్‌లో ఆవిర్భవించింది.
స్వాతంత్ర్యోద్యమానికి సైద్ధాంతిక, సామాజిక మద్దతు అందించడమే తమ లక్ష్యమని సంస్థ మేనిఫెస్టో స్పష్టం చేసింది. అందులో భాగంగానే సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు విద్యార్థులు, కార్మికులు, రైతులను సమీకరించి ఉద్యమ బాట పట్టించింది.
సంస్థ కులమతాలకతీతంగా అందరూ కలిసి భోజనం చేసేలా సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కులమతాల అడ్డుగోడలను బద్దలు కొట్టి సామాజిక ఐక్యత, సమానత్వం కోసం నౌజవాన్ సభ చేసిన కృషికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
మేనిఫెస్టోలో మతోన్మాదంపై విమర్శ
1928లో భగవతీ చరణ్ ఓహ్రా ‘నౌజవాన్ భారత్ సభ’ మేనిఫెస్టోను ప్రచురించారు. దానిలో స్వాతంత్ర్యోద్యమంలో సంస్థ దృక్పథాన్ని, లక్ష్యాలను స్పష్టంగా పొందుపరిచారు.
ఈ మేనిఫెస్టో మత రాజకీయాలపై ఎంతో ఘాటైన విమర్శను గుప్పించింది. అందులో ఇలా పేర్కొన్నారు- “రావి చెట్టు కొమ్మ ఒకటి నరికితే చాలు… హిందువుల మత భావోద్వేగాలు దెబ్బతింటాయి. విగ్రహారాధనను నిరసించే ముస్లింల కాగితపు ప్రతిమ(తజియా) ఒక మూల విరిగిపోతే అల్లా ఆగ్రహిస్తాడని, అన్యమతస్థులుగా భావించే హిందువుల రక్తం చిందితే తప్ప ఆ కోపం చల్లారదని వారు భావిస్తారు. సహజంగా జంతువులకంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇక్కడ అంటే మనదేశంలో ‘పవిత్ర జంతువుల’ పేరిట మనుషులే ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుంటున్నారు.”
మేనిఫెస్టో మతోన్మాదాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఇలా పేర్కొంది- “మతపరమైన మూఢనమ్మకాలు, మత దురభిమానం మన ప్రగతికి తీరని ఆటంకాలు. అవి మన మార్గంలో అడ్డంకులుగా నిలిచాయి. మనమే వాటిని అంతం చేయాలి. స్వతంత్ర ఆలోచనలను సహించలేనిది ఏదైనా నశించాల్సిందే. హిందువుల సాంప్రదాయ, సనాతన(మూఢాచారాలు) వాదాలు, ముస్లింలలో వారి మత దేశాల ధోరణిలో ఆలోచించే తత్వం అంతరించాలి. ఇలాంటి సంకుచిత మనస్తత్వాలు ఏ వర్గంలో ఉన్నా, విదేశీ శత్రువుల స్వార్థానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే అన్ని వర్గాల నుంచి విప్లవస్ఫూర్తి, పట్టుదల కలిగిన యువకులు అవసరం.”
యువతకు రాజీలేని పిలుపు
చివరిగా మేనిఫెస్టో ఎలాంటి రాజీ లేని పిలుపునిచ్చింది- “యువకులను నిర్మలమైన మనసుతో స్వతంత్రంగా, ప్రశాంతంగా, ఓర్పుతో ఆలోచించనివ్వండి. భారత స్వాతంత్రాన్ని సాధించడమే వారి జీవిత ఏకైక లక్ష్యంగా స్వీకరించనివ్వండి. వారి కాళ్లపై వారిని స్వతంత్రంగా నిలబడనివ్వండి. ఎలాంటి ప్రలోభాలకూ లోను కాకుండా తమను తాము సంఘటితం చేసుకోవాలి. కీలక సమయాల్లో ఉద్యమాన్ని వదిలి పారిపోయే మోసకారులు, నిబద్ధతలేని వ్యక్తుల చేతిలో నష్టపోవడాన్ని నిలువరించాలి. లోతైన అవగాహన కలిగి, నిజాయితీతో వారు ‘సేవ, సహనం, త్యాగం’ అనే త్రివిధ సూత్రాన్ని తమ ఏకైక మార్గదర్శకంగా స్వీకరించాలి”.
శతాబ్దం గడిచిన తర్వాత కూడా ఈ మేనిఫెస్టోలోని ప్రతి మాట ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా వర్తిస్తోంది. అందుకే నౌజవాన్ సభతో, 2026 నాటి నిరసనకారులను పోల్చి చూడటం సహజమే అనిపిస్తోంది.
నాటి విప్లవం… నేటి ప్రజాస్వామ్యం
భగత్ సింగ్, ఆయన అనుచరులు వలస పాలన(బ్రిటిష్ వారి సమయం)లో పనిచేశారు. వారి సంస్థ సామ్రాజ్య, వలసవాదాలకు వ్యతిరేకంగా విప్లవపోరాటం చేసింది. కానీ 2026 నాటి యువ నిరసనకారులు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఒక అంతర్భాగం. వారు ప్రజా నిరసనలు, సామాజిక మాధ్యమాలు, ఆధునిక పద్ధతులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటున్నారు.
అదే సందర్భంలో భారత చారిత్రక పరిస్థితులు మారినప్పటికీ మన సమాజాన్ని వేధిస్తున్న ప్రాథమిక సవాళ్లు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో, సామాజిక సంబంధాలను ప్రాథమిక అంశాలుగా భావిస్తూనే, రాజకీయ స్వేచ్ఛ కోసం పోరాడాలన్న నౌజవాన్ సభ నొక్కి చెప్పిన తీరు, నేటి యువత సమకాలీనతలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
సభ చేపట్టిన సహపంక్తి భోజనాలు, మతపరమైన విభజనలపై చేసిన విమర్శలు, విభిన్న వర్గాలకు చెందిన యువతకు ఇచ్చిన పిలుపు- ఇవన్నీ బృహత్తరమైన లక్ష్యంలో భాగమే.
అసలు సభ ఆశయం ఏమిటంటే- వారసత్వంగా వచ్చే ఎలాంటి సామాజిక విభజనలకూలోను కాకుండా ఉండే విధంగా ఒక రాజకీయ సమాజాన్ని నిర్మించడం.
మూల కారణాల పరిష్కారమే లక్ష్యం
“యువకులారా, ఎలాంటి సాయం లేకుండా ఒంటరిగా ఒక పెద్ద పోరాటాన్ని చేయాల్సి వచ్చినప్పుడు అధైర్య పడకండి. మీలో దాగి ఉన్న శక్తిని మీరు గుర్తించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. విజయం మీదే అవుతుంది”.
ఎలాంటి సంకోచాలు దరిచేరనివ్వరాదని, ఏ బంధనాలకూ భయపడి ధైర్యాన్ని కోల్పోకూడదని భగత్ సింగ్ సూచించారు. నిరంతర శ్రమ ప్రతి ఒక్కరిని గొప్ప వారిని చేస్తుంది.
ఒకసారి సహనాన్ని కోల్పోవడం, మరో సమయంలో ఆశలు చిగురించడం లాంటి అస్థిర ఆలోచనలు ఉండకూడదంటారు ఆయన.
స్థిరత్వం, దృఢ నిశ్చయం మీ అలవాటుగా మార్చుకునేందుకు ప్రయత్నించండి అంటున్న ఈ సూచన మళ్లీ సభ మేనిఫెస్టోలోని ప్రధాన సందేశం వైపు తీసుకెళ్తుంది. ఆ త్రివిధ సూత్రాల ప్రాముఖ్యత నేటికీ ఎంతగానో ఉంది.
సభ కేవలం నాయకులుగా మన గలిగే వ్యక్తుల మార్పు కోసం మాత్రమే పిలుపు ఇవ్వలేదు. ఏ కాలంలోనైనా యువత సమకాలీన సమస్యలకు లోతైన అంతర్లీన కారణాలను అర్థం చేసుకొని, వాటిని సరిదిద్దడం గురించి ఆలోచించాలని నౌజవాన్ భారత్ సభ ఆకాంక్షించింది.
కేవలం వ్యక్తులను(నాయకులను) మార్చడం వల్ల వ్యవస్థలో నాటుకుపోయిన సమస్య సరిదిద్దబడదు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు ఎలాంటి వివక్ష లేకుండా భారత ప్రజల భవిష్యత్తును కాపాడటానికి మూల కారణాలను పరిష్కరించాల్సి ఉంటుంది.
అన్యాయంపై పోరాడే స్ఫూర్తి
భగత్ సింగ్, ఆయన సహచరుల విప్లవస్ఫూర్తి- అన్యాయంతో నిండిన వ్యవస్థను, సమాజం మౌనంగా అంగీకరించే ధోరణిని అడ్డుకుంటుంది. అందుకే వంద సంవత్సరాల తర్వాత కూడా యువతలో భగత్ సింగ్ ఆలోచనా స్ఫూర్తి చెరిగిపోని ముద్రగా ఉండిపోయింది.
ఏ రూపంలోని అన్యాయమైనా సరే, దానిని అనివార్యంగా భరించడాన్ని ఆయన అంగీకరించనే లేదు.
నేటి యువత, భగత్ సింగ్ నినాదాలు ఇచ్చేటప్పుడు, కాలానుగుణంగా ఆయా సందర్భాలను నినాదాలలో క్రోడీకరిస్తున్నారు. అంటే వారు నిత్యం చూస్తూ అనుభవిస్తున్న అసమానత, అభద్రత, నిరుద్యోగంలాంటి సమస్యలను ఆ నినాదాలకు జోడించి కొత్త అర్ధాన్ని ఇస్తున్నారు.
ఈ విధంగా భగత్ సింగ్ నేటి యువతకు ఒక గొప్ప లక్ష్యాన్ని అందించారు. అదేమంటే “అన్యాయపూరితమైన ఈ వ్యవస్థ మారాలి”.
(వ్యాసకర్తల గురించి: ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్ భగత్ సింగ్ మేనల్లుడు. ఆయన షహీద్ భగత్ సింగ్ రీసెర్చ్ కమిటీ కార్యదర్శిగా, పంజాబ్‌లోని షహీద్ భగత్ సింగ్ క్రియేటివిటీ సెంటర్ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు; సౌరవ్ కుమార్, షహీద్ భగత్ సింగ్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడు, కెనాల్ మీడియాలో పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. ఈయన భారతదేశపు బ్యాంకింగ్, ఆర్థిక రంగాల సమాచారాన్ని అందిస్తుంటారు.)
అనువాదం: టాన్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
