“మనమంతా అమాయకుల్లా పుడతాము. కానీ, పెరుగుతున్న కొద్దీ మూర్ఖులుగా మారి, అలాగే కొనసాగుతూ ఉండాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది.”
– బెంజమిన్ ఫ్రాంక్లిన్, బహుముఖ ప్రజ్ఞాశాలి, అమెరికా.
ప్రభుత్వంలో ఉండి అధికారం చలాయిస్తున్న వారే కాదు, సమాజంలో సామాన్య పౌరులు కూడా నైతికత అనేది లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు.
నీతి, నిజాయితీ బొత్తిగా లేకుండా పోతున్నాయి. రెండు వేలో, మూడు వేలో ఎవరిస్తే వెళ్లి వారికే ఓటేస్తున్నారు. ఆ బుద్ధి తక్షణం మార్చుకోవాల్సి ఉంది.
ఆ మూడు వేలతో వాడి జీవితం బాగుపడుతుందా? కుటుంబం నిలదొక్కుకుంటుందా? సమస్యలు తీరతాయా? తాత్కాలిక స్వల్ప ప్రయోజనాలను చూసుకుని, సమాజాన్ని అతి దారుణంగా భ్రష్టు పట్టిస్తున్నారు కదా?
లక్ష రూపాయల జీతం తీసుకునే వాడు ఏదో పని చేయమని వచ్చిన పేద రైతుని పీడించి లంచం లాగుతున్నాడు. నీతిగా బతకడం, నిజాయితీగా వ్యవహరించడమన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశం. అన్ని స్థాయిలలో మనుషులంతా అవినీతి, మోసం, దగా, కుట్రలను పక్కన పెడితే, మనం ఉన్న చోటనే ‘స్వర్గం’ దిగొస్తుంది కదా?
కానీ, ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది? మారణకాండల సృష్టికర్త ప్రధాని అవుతాడు. జడ్జిలను చంపించిన వాడు హోంమంత్రి అవుతాడు.
గత కాలపు త్యాగధనుల గూర్చి చులకనగా మాట్లాడి, వారి గూర్చి తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిని ఈ జనం ఎందుకు అధికారంలో కొనసాగనిస్తున్నారు? అంటే – జనంలో కూడా అధిక సంఖ్యాకులు అవినీతిపరులవుతున్నారు కదా? అంతరాత్మల్ని చంపుకుని బతుకుతున్నారు కదా? అల్ప సంఖ్యాకులైన మేధావుల్లో ఒక రకమైన అలసత్వం కూడా ఒక కారణమవుతోంది.
కొందరు పూటకు లేక అవినీతికి పాలుపడితే, మరి కొందరు కొవ్వెక్కి బలుపుతో పాలుపడుతున్నారు. విషయం లోతుగా ఆలోచించి చూడండి, వాస్తవమేదో ఎవరిది వారికే అర్థమవుతుంది.
దేశ ప్రస్తుత దుస్థితి – అంతర్జాతీయ సూచీలు..
ప్రస్తుత పాలనలో భారతదేశ పరిస్థితి ఎంత దిగజారిందో ఈ అంతర్జాతీయ సూచీ తెలియజేస్తుంది. వైద్య సదుపాయాల లభ్యత విషయంలో దేశం ఎక్కడో చిట్టచివరన 193వ స్థానంలో ఉంది.
పర్యావరణ పనితీరులో 176వ స్థానంలో ఉంటే, పత్రికా స్వేచ్ఛలో 151వ స్థానంలో ఉంది. మానవాభివృద్ధి విషయంలో 130వ స్థానమైతే, తాగునీటి నాణ్యత సూచీలో 120వ స్థానం.
ప్రపంచ ఆకలి సూచీలో 102వ స్థానం(మన చుట్టున్న చిన్న చిన్న దేశాలు కూడా ఈ విషయంలో మనకంటే మెరుగ్గా ఉన్నాయి). అవినీతి ర్యాంకింగ్లో 91వ స్థానం.
గత పన్నెండేళ్లలో దేశం ఎంత ప్రమాదకరంగా తయారయిందో తేటతెల్లమవుతూ ఉంది కదా, ఇది ఇలా ఉంటే 2002లో మానవత్వానికి ప్రమాదకారులు అని ఒక ఇద్దరు వ్యక్తుల గూర్చి ఈ దేశపు సుప్రీం కోర్టే చెప్పింది.
ఒక ఇంగ్లీషు పత్రిక నరేంద్ర మోదీ ముఖచిత్రం ప్రచురించి “విద్వేషపు హీరో” అనే శీర్షిక ఇచ్చింది. మరో పత్రిక అమిత్ షా ఫొటో ప్రచురించి “ఇతను ఇంకా స్వేచ్ఛగా ఎందుకు బయట తిరుగుతున్నాడు?” అని ప్రశ్నించింది. అలాంటి వారిని ప్రధానిగా, గృహమంత్రిగా ఈ దేశ ప్రజలు ఎన్నుకుని అక్కడ కూర్చోబెట్టారంటే, ఈ దేశ ప్రజల విజ్ఞతను, దేశంలోని వ్యవస్థలను అనుమానించాల్సిందే కదా?
విద్యా వ్యవస్థ విధ్వంసం – యువత ఆగ్రహం..
కేంద్ర విద్యామంత్రిగా దేశంలో పేపర్లన్నీ లీక్ చేయించాడు. విద్యా వ్యవస్థను ధ్వంసం చేశాడు. నీట్ పేపర్ లీక్ల వల్ల సుమారు 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ రంగప్రవేశం చేసి, ఒక మహోద్యమం చేస్తేగాని ఈయనకు తన తప్పులు తెలిసిరాలేదు.
జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ దాకా సాగిన విద్యార్థుల మార్చ్ మీద లాఠీచార్జి చేయించాడు. బాష్పవాయువు, పెల్లెట్ గన్స్ వగైరా ఉపయోగించి వందల మంది యువతీ యువకుల్ని గాయపరిచాడు.
పోలీసు యూనిఫాంలో ఉన్న గుండాల్ని ప్రవేశపెట్టి, ఆడపిల్లల బట్టలు చింపేయించాడు. ఒకప్పటి జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని కళ్ళకు కట్టించాడు.
శాంతి ప్రదర్శనల్ని అడ్డుకుని, ఇంత విధ్వంసం సృష్టించడం అవసరమా? యువతీ యువకులు – విద్యార్థులంటే ఎవరూ? ఈ దేశానికి భవిష్యత్తు కదా? ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ లేకుండా చేసి, లోకల్ రైళ్లు ఆపేయించి, వారికి నీళ్లు, ఆహారం అందకుండా కూడా చేశారు.
అయినా ఏమైంది? ఈ దేశ యువత ఆత్మవిశ్వాసం ముందు, సహనం ముందు, రాజ్యాంగ స్ఫూర్తి ముందు కేంద్ర ప్రభుత్వమే మోకాళ్ల మీద కూర్చుంది.
గత పన్నెండేళ్లలో ఎంత నాశనం చేసినా, దీన్ని యువత పునరుద్ధరించుకుంటుందన్న విశ్వాసం ఇప్పుడు ఈ దేశ పౌరులకు కలిగింది.
మంత్రుల తీరు – భయాందోళనలు..
ఇక్కడ ఏ ఒక్కరిద్దరి గురించి చెప్పుకోవడం కాదు, మొత్తానికి మొత్తంగా మంత్రివర్గంలో ఉన్న వాళ్లంతా ఘనాపాటీలే. ఒకరు విదేశాంగ విధానాన్ని ధ్వంసం చేసి కూర్చున్నాడు. ప్రపంచ దేశాలలో గతంలో ఉన్న విలువ ఇప్పుడు దేశానికి లేదు.
మరొకరు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచాడు. ఇంకొకరు నిత్యావసర వస్తువుల ధరల్ని చుక్కలు తాకించింది. మరొకరు భూ కుంభకోణం చేయించాడు. ఇక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరుండి అయోధ్య రామాలయం నుంచి ప్రజల కానుకలు, విరాళాలు స్వాహా చేయించాడు.
“ఇలా చిన్న పనులెందుకురా బాబూ, నేను చూడండి దేశ విదేశాలు వీరుడిగా తిరుగుతూ దేశాన్నే అమ్ముకొస్తున్నాను” అని చెప్తున్నాడు ప్రధాని. వీళ్లంతా కలిసి దేశ ప్రజల్ని ఎలా భయపెడుతున్నారో చూడండి. దేశంలో అధిక సంఖ్యాకులైన హిందువులు ప్రమాదంలో ఉన్నారని ఊదరగొడుతున్నారు.
ఇక్కడ ఒక్క విషయం ఆలోచిద్దాం.
దేశ ప్రధాని హిందువు. హోంమంత్రి, రక్షణమంత్రి హిందువులే. అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులంతా హిందువులే. అయినా కూడా, హిందువులు ప్రమాదంలో ఉన్నారని ప్రచారం ఎందుకూ? ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? అందరికందరు హిందువులే అధికారంలో ఉండి, దేశంలోని హిందువులకు రక్షణ కల్పించలేకపోతే ఇంకా అక్కడ అధికార పీఠాల మీద ఎందుకూ? రాజీనామాలు చేసి తప్పుకోవచ్చు కదా?
హిందువులకే కాదు, మొత్తం దేశ ప్రజలకు రక్షణగా ఉండేవారు ఎవరో వస్తారు. విద్యావంతులు, వివేచన గలవారూ చాలామందే ఉన్నారు దేశంలో.
ప్రజల మోసాలు – భ్రష్టాచారం..
అధికార పార్టీ అంటే మోసం, వినాశనం.. అన్న భావన దేశ ప్రజలు, ముఖ్యంగా యువత అర్థం చేసుకుంది. ఇంకా వీరి ఆటలు ఎక్కవా కాలం సాగవు. మొదటి నుండీ మోసాలే కాదా? మోసం తర్వాత మోసం. ఎలక్టోరల్ బాండ్స్ – మోసం. పీఎం కేర్స్ – మోసం. నమామి గంగే – మోసం. స్మార్ట్ సిటీ మిషన్ అమలు – మోసం. అదానీ హిండెన్ బర్గ్ సమస్య – మోసం. సెబీలో తప్పులు – మోసం. ఉజ్జయిని – మోసం. అయోధ్య రామాలయ విరాళాలు – పెద్ద మోసం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దొంగతనం – మోసం. కోవిడ్-19 వైద్య పరికరాలు మందుల సరఫరా – మోసం.
చెప్పుకుంటూ పోతే ఎన్నని? గత పుష్కర కాలంలో భ్రష్టాచారం వృద్ధి చెందింది. సామాన్యులకు, నిస్సహాయులకు ఏ సహాయమూ లేదు.
అధికారంలో కొనసాగడమే తమ విధానమన్నట్లున్న ఈ అహంకారాన్ని ఈ దేశపు యువత బద్దలు కొట్టింది. వైషమ్యాలు పక్కనపెట్టి ప్రతిపక్షాలు ఐకమత్యంగా ఉంటే, మార్పు సత్వరమే సాధ్యమవుతుంది.
కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అలవోకగా యువతని, నిరుద్యోగుల్ని, కాక్రోచ్లని (బొద్దింకలని), పరాన్నజీవులని, సోమరిపోతులని ఎద్దేవా చేశాడు. అందులో నుంచి కాక్రోచ్ అనే పదాన్ని తీసుకుని ఒక స్కాలర్ కాక్రోచ్ జనతా పార్టీకి రూపకల్పన చేశాడు.
సామాజిక మాధ్యమాల ద్వారా కోట్లాది యువతీ యువకుల్ని, విద్యార్థుల్ని ఆకర్షించాడు. ఇండియాకు తిరిగి వచ్చి, ఇక్కడి నీట్ పేపర్ లీక్పై దృష్టి పెట్టి, బాధ్యుడైన కేంద్ర విద్యామంత్రి రాజీనామాకు పట్టుబట్టాడు.
మేధావులు వీరికి తోడు నిలిచి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం వల్ల, సీజేపీ ఉద్యమానికి ఊపొచ్చింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ యువత ఉద్యమానికి మద్దతు తెలిపాయి.
యువ నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకొస్తున్నారని తెలుసుకుని భయంతో పార్లమెంట్ వెనక గేట్ నుండి పారిపోయాడు.
విద్యా వ్యవస్థలోని లోపాల్ని సవరిస్తామని అర్ధరాత్రి ఇంట్లో కూర్చుని వీడియోలు చేసి విడుదల చేశాడు. ఏమైనా అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వానికి బొద్దింక – యువత కళ్ళు తెరిపించింది. ఎంతటి బలమైన ప్రభుత్వమైనా, ప్రజాబలం ముందు దిగదుడుపే నన్నది మరోసారి రుజువైంది.
యువత అఖండ విజయం..
విద్యామంత్రి రాజీనామాతో, ఇతర మంత్రులతో జరిపిన చర్చలతో కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు సంతృప్తి పడలేదు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారినందరినీ పదవుల్లోంచి తొలగించడమన్నది అక్కడ ప్రధానమైన అంశం అయ్యింది.
ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించడం మరో ముఖ్యమైన అంశం. దౌర్జన్యకాండలో గాయపడిన వారికి వైద్యమందించడం, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయించడం వంటి ఉద్యమకారుల డిమాండ్లన్నీ నెరవేరాయి.
కాక్రోచ్ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ దేశ యువత ప్రస్తుత కేంద్రాన్ని లొంగదీసుకున్నందుకు ఈ దేశ పౌరులందరూ గర్వపడ్డారు.
ఉద్యమించిన ఉన్నత విద్యావంతులైన యువతీయువకులకు ఈ దేశ పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఒకవైపు దేశంలో పాఠశాలలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం భయపెడుతోంది.
సిలబస్లో అధ్వాన్నమైన మార్పులు చేసి, దేశాన్ని వినాశనానికి నడిపిస్తున్నారు. ఇవన్నీ ఎంత బలంగా సాగుతూ వస్తున్నాయో యువత పూర్తిగా అర్థం చేసుకుంది. అన్ని అవకతవకలన్నీ సరిచేయాల్సిన బాధ్యత తమదే నన్నది కూడా యువత గ్రహించింది.
అధికారంలో ఉన్నవారిని బాధ్యుల్ని చేసి, వారిని దారిలో పెట్టాల్సి ఉందన్నది కూడా గ్రహించింది. దేశంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన ఈ ప్రభుత్వానికి – ఇక ఇప్పుడు ప్రజాహితం కోసం పనిచేయాల్సి ఉందన్న విషయం గుర్తుచేయదలిచింది.
భవిష్యత్తు కోసం మరో స్వాతంత్ర్య పోరాటం..
కొంతమంది స్వతంత్ర పాత్రికేయులు ఢిల్లీ జంతర్ మంతర్ ప్రాంతంలో గుండాలు చేసిన దాష్టీకాన్ని చిత్రీకరించి, బయటి ప్రపంచానికి పంపారు. విద్యార్థుల మీద రాళ్లూ, గాజు పెంకులూ రువ్వడానికి వారు ఒక లారీ తెచ్చిపెట్టుకున్న విషయం బయటపెట్టారు. పోలీసులు వారికి సహకరించిన విషయం కూడా ఎత్తిచూపారు.
అంతేకాదు, పోలీసులే స్వయంగా హద్దుమీరి అమ్మాయిల్ని చితకబాదిన విషయం చిత్రీకరించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపేసినా, లోకల్ రైళ్లు ఆపేసినా, దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థినీ విద్యార్థులు అక్కడికి చేరుకున్నారంటే – వారి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎంత బలమైందో అర్థం చేసుకోవాల్సిందే.
మరొక ముఖ్యమైన విషయమేమంటే, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అధిక సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములు కావడమన్నది ఆహ్వానించదగ్గ విషయం- అఖిల భారత విద్యార్థి సంఘం అధ్యక్షురాలైన ఒక యువతి కూడా 23 రోజులు నిరాహార దీక్ష చేసింది.
ఎంతో మంది న్యాయవాదులు దీక్షా స్థలానికి వెళ్లి అక్రమంగా కేసుల్లో ఇరుక్కున్న విద్యార్థులకు స్వచ్ఛందంగా న్యాయ సలహాలిచ్చారు. వారి వెంట పోలీసు స్టేషన్లు తిరిగి, వారికి ధైర్యమందించారు.
పేరు తెలియని దాతలెందరో మంచినీళ్లు, టీ, ఆహారం తెప్పించి, అక్కడ రోజుల తరబడి ఉంటున్న వేలాదిమంది నిరసనకారులకు పంపిణీ చేయించారు.
దేశం నలుమూలల నుంచి అక్కడికి చేరుకున్న సామాజిక, మానవవాద, పౌర హక్కుల కార్యకర్తలు ఉద్యమకారులకు స్ఫూర్తినందించారు. వారిని ప్రోత్సహిస్తూ, వారితో కలిసి పనిచేశారు. ఏమైనా ఇది యువతరం సాధించిన ఘన విజయం. గత పుష్కర కాలంగా యువతలో పేరుకున్న అశాంతి, నిరాశా, నిస్పృహలు, ఉద్యమ రూపం దాల్చి – అతి పెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకునే వారి అహంకారాన్ని నేలమట్టం చేశాయి.
అయితే, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో సరిదిద్దాల్సినవి, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. దేశంలోని ప్రధాన మీడియా సంస్థలన్నీ అధికార పక్షానికి వత్తాసు పలికేవిగా మారినప్పుడు, సోషల్ మీడియా వేదికగా పనిచేసి, ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నందుకు మనం మన యువతను హృదయపూర్వకంగా అభినందించాలి.
దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకుపోగల సత్తా గల ఈ యువతకు మనమంతా వెన్నుదన్నుగా నిలబడాలి. దేశ పౌరులు మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధపడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
