అమెరికా స్పెషల్ ఫోర్సెస్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అపహరించి ఆరు నెలలు దాటింది. అది దాడి కాదు(అక్రమ ప్రవేశం) ఒక “అప్పగింత” (ఎక్స్ట్రాడిషన్) అని ట్రంప్ అధికార వర్గాలు నాడు చెప్పిన విషయం తెలిసిందే. అది చట్టపరమైన అంశమని, తదనంతరం క్రిమినల్ విచారణ జరగాల్సి ఉందన్నారు.
వెనిజులా తక్షణమే దీనికి విరుద్ధంగా వాదించినప్పటికీ, చాలామంది న్యాయ కోవిదులు, వ్యాఖ్యాతలు, ప్రభుత్వ అధికారులు ఆ నిర్ణయాన్ని చట్టబద్ధమైనదిగా సమర్థించారు.
కోర్టులకు విచారణాధికారం ఉందా?
అయితే మదురో కేసు మరొకమారు కోర్టుకు వచ్చినప్పుడు, ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మరో కీలకమైన అడ్డంకిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆయన కేసును విచారించే అధికారం మన కోర్టులకు లేదు. అలా అని చెప్తున్న చట్టంపై సంతకం చేసింది స్వయంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ తన ఒప్పందానికి కట్టుబడి ఉంటే, అది తాను పట్టుకున్న అత్యంత విలువైన బందీని విడుదల చేయాల్సి రావచ్చు.
అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్రాధాన్యం..
దీనికి కారణం 20వ శతాబ్ది తొలి దశాబ్దాల నాటిది. అప్పట్లో పొడిగా, చట్టపరంగా కనిపించే “అంతర్జాతీయ మధ్యవర్తిత్వం”(ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్) అనే అంశం – ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్న ఒక ఆధునిక, హేతుబద్ధమైన న్యాయ సాధనంగా ఉత్సాహపూరితమైన ఆదర్శవంతమైన ఉద్యమంగా ఉండేది.
అధ్యక్షుడు విలియం హోవార్డ్ టాఫ్ట్ ఈ వాగ్దానంపై ఎంత నమ్మకంతో ఉన్నారంటే, ఆయన తన 1909 ప్రారంభోపన్యాసంలో (ఇనాగురల్ అడ్రెస్) దీని విశిష్టతలను కొనియాడారు.
“శాంతిని కాపాడటానికి, యుద్ధాన్ని నివారించడానికి, అన్ని అంతర్జాతీయ వివాదాలలో ఉపయోగపడేలా హేగ్ ట్రిబ్యునల్, మధ్యవర్తిత్వ ఒప్పందాల వంటి ప్రతి సాధనాన్ని మేము సమర్థిస్తున్నాము” అన్నారు. ఆయన తన అధ్యక్ష పదవి ముగిసిన తర్వాత అంతర్జాతీయ మధ్యవర్తిగా కూడా సేవలందించారు.
అధ్యక్షుడు విల్సన్ కూడా ఈ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన విదేశాంగ కార్యదర్శి విలియం జెన్నింగ్స్ బ్రియాన్ దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి శాశ్వత స్వతంత్ర కమిషన్లను ప్రతిపాదించారు.
టాఫ్ట్, విల్సన్, బ్రియాన్లకు శాంతిని కాపాడటానికి కొత్త మార్గాలను వెతకడానికి బలమైన కారణం ఉంది. ప్రపంచం యుద్ధం వైపు వెళుతోంది.
1922 నాటి చారిత్రక ఒప్పందం..
సంవత్సరాల తర్వాత శాంతి పునరుద్ధరించబడినప్పుడు, యునైటెడ్ స్టేట్స్ అనేక ఒప్పందాలలో మధ్యవర్తిత్వ నిబంధనలను చేర్చడం ప్రారంభించింది. వాటిలో ఒకటి 1922లో యునైటెడ్ స్టేట్స్, వెనిజులా మధ్య జరిగిన అప్పగింత ఒప్పందం(ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ).
అందులోని ఒక భాగంలో, “ఈ ఒప్పందం వ్యాఖ్యానం లేదా అమలుకు సంబంధించిన ఒప్పంద పక్షాల మధ్య అన్ని విభేదాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడతాయి” అని ఉందిద.
సెనేట్ ఆమోదించిన, అధ్యక్షుడిచే ధృవీకరించబడిన ఆ పత్రానికి చట్టపరమైన శక్తి ఉంది.
ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు..
సరే, ఈనాడు ఆ “ఒప్పంద పక్షాల” మధ్య తీవ్ర “విభేదాలు” ఉన్నాయి.
వెనిజులా ప్రస్తుత ప్రభుత్వం చమురు ఎగుమతుల విషయానికి వస్తే ట్రంప్ పరిపాలనతో సహకరిస్తోంది. కానీ మదురోను పట్టుకోవడం అంతర్జాతీయ చట్టం ప్రకారం అక్రమమని, దాని పరిధిలోకి 1922 ఒప్పందం కూడా వస్తుందని బహిరంగంగా స్పష్టం చేసింది.
ఈ వివాదం తప్పనిసరిగా 1922 ఒప్పంద మధ్యవర్తిత్వ నిబంధనను ప్రేరేపిస్తుంది. దాని నిబంధనల ప్రకారం, మదురో విచారణను పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ఆల్విన్ హెల్లర్‌స్టీన్ విచారణను నిలిపివేసి, ఒప్పందాన్ని పరిశీలించి అది గౌరవించబడిందో లేదో నిర్ణయించే బాధ్యతను స్వతంత్ర మూల్యాంకన కర్తల ప్యానెల్‌కు అప్పగించాలి.
ఒకవేళ మధ్యవర్తులు మదురో అరెస్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తేల్చిచెప్తే, యునైటెడ్ స్టేట్స్ ఆయన్ను విడుదల చేయాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు గత తీర్పులు..
ఇది వినడానికి అసంభవంగా అనిపిస్తుందా? సుప్రీం కోర్టు శతాబ్దానికి పైగా కాలంలో ఇటువంటి కేసులలో ఈ సూత్రాన్ని పదే పదే స్పష్టం చేసింది.
మొదటిది 1886లో, బ్రిటన్ నుండి అప్పగించబడిన విలియం రౌషర్పై విచారణ రెండు దేశాల అప్పగింత ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు, ఎందుకంటే ఆయన ఏ నేరాల కోసం అప్పగించబడ్డారో వాటిపై కాకుండా వేరే నేరాలపై విచారణ జరిగింది.
ప్రాసిక్యూషన్ ఒప్పందానికి లోబడి ఉండాలనే కోర్టు పట్టుదల కారణంగా రౌషర్ విజయం సాధించారు.
రెండవది 1927లో జరిగింది. మాజీ అధ్యక్షుడు టాఫ్ట్ (అప్పటి ప్రధాన న్యాయమూర్తి) సముద్రంలో అరెస్టు చేయబడిన కొంతమంది బ్రిటిష్ పౌరుల భవితవ్యంపై తీర్పు చెప్పారు.
ఈ కేసులో ఆయన విదేశీ నిందితులను “విచారణ కోసం పట్టుకునే హక్కు” ఒప్పందం పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
మూడవ ఉదాహరణ 1992లో జరిగింది. ఒక మెక్సికన్ పౌరుడిని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కోరిక మేరకు అపహరించి టెక్సాస్‌కు తీసుకెళ్లారు.
ప్రాసిక్యూషన్ చెల్లుతుందా లేదా అనే ప్రశ్న సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ “అప్పగింత ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించి నిందితుడిపై విచారణ జరపకూడదు” అని పునరుద్ఘాటించారు.
మధ్యవర్తిత్వ నిర్ణయమే కీలకం..
ఈ వివిధ కేసులన్నింటిలోనూ సారాంశం ఒకటే. అప్పగింత ఒప్పందం పరిధితో ప్రయోజనాలు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, మొదటి అడుగు ఒప్పందంపై సంతకం చేసిన వారి ఉద్దేశాన్ని జాగ్రత్తగా పరిశీలించడమే.
ఒక శతాబ్దం నాటి ఒప్పందం వెనిజులా మాజీ అధ్యక్షుడిని స్వేచ్ఛగా విడిపించవచ్చు.
విచారణ ఈ దశను దాటకుండా చట్టపరంగా ముందుకు సాగదు. నేను ప్రముఖ న్యాయకోవిదుడు డేవిడ్ స్లోస్ను అడిగాను.
ఒకవేళ ఈ కేసు కోర్టు నుండి మధ్యవర్తిత్వానికి వెళ్తే అది ఎంత దిగ్భ్రాంతికరంగా ఉంటుంది కదా అని అడిగినప్పుడు, ఆయన అంతగా ఉండదని చెప్పారు.
మదురో కేసు మధ్యవర్తిత్వానికి వెళ్లడం సాధారణంగా కోర్టుకు వర్తించే విధానమే అని, “మధ్యవర్తిత్వ నిబంధన ఉన్న ఒప్పందాల ఆధారంగా దాఖలైన దావాలను కోర్టులు కొట్టివేసినప్పుడు ఇదే జరుగుతుంది” అని రాశారు.
మధ్యవర్తులకు మదురో కేసు వెళ్లిన తర్వాత, తదుపరి అడుగు మదురో అపహరణ, 1922 ఒప్పందం నిబంధనల ప్రకారం చట్టబద్ధమైనవా కావా అని నిర్ణయించడం.
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన..
ఒప్పందాల వ్యాఖ్యానం అనేది ఒక ప్రత్యేకమైన న్యాయ విభాగం కాబట్టి, అంతర్జాతీయ మధ్యవర్తులు ఈ కేసును ఎలా నిర్వహిస్తారో తెలుసుకోవాలనుకున్నాను. నేను ఈ రంగంలో అగ్రగామి నిపుణుడైన స్టీవెన్ రత్నర్ను అడిగాను. ఆయన చెప్తూ, వియన్నా కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ట్రీటీస్ ప్రకారం “1922 నాటి అంతర్జాతీయ చట్టాల సంబంధిత నిబంధనల” వెలుగులో ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తారని చెప్పారు.
ఆనాడు నైట్ టైమ్ కిడ్నాపింగ్ చేయడం ఒప్పందం ప్రకారం చట్టబద్ధమైనదని ఏ మధ్యవర్తి చెప్పడం ఊహించడం కష్టం. ముఖ్యంగా లక్ష్యంగా ఉన్న వ్యక్తి ఒక దేశ అధిపతి అయినప్పుడు.
ఈ చర్య ఇప్పటికే అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది. యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వాన్ని పక్కన పెట్టడానికి చేసే ఏ ప్రయత్నమైనా అది దాని స్వంత చట్టాలను కూడా స్పష్టంగా ఉల్లంఘించినట్లే అవుతుంది.
శాంతి భవిష్యత్తు..
మధ్యవర్తిత్వం ఫలితం ఏమైనప్పటికీ, ఆ ప్రక్రియ అంతర్జాతీయ చట్ట సూత్రాలను నిలబెట్టి రెండు దేశాల మధ్య భవిష్యత్తులో వచ్చే ఘర్షణల అవకాశాన్ని తగ్గిస్తుంది.
ఇది అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశ కలిగించవచ్చు. కానీ టాఫ్ట్, విల్సన్, బ్రియాన్లను ఎంతో సంతోషపెడుతుంది.
– మైఖేల్ రిప్స్ – న్యాయవాది, రచయిత
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
