“దేవుడు అబద్ధం. మనిషిలో నీతి పెరగాలంటే అతని మనసులో దైవ భావన పోవాలి. ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరుగుతూ ఉంది. దానితో విద్వేషాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా స్వచ్ఛమైన నీతిమంతుడైన మానవుడిగా మిగులుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చినప్పుడు సోదరభావం దానంతట అదే వెల్లివిరుస్తుంది. ప్రేమ, ఆప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది”- అనేవి గోపరాజు రామచంద్రరావు(గోరా) ఆలోచనలు.
ఎవరీ గోరా? తెలుగు ప్రజలకు ఎందుకు ప్రియతముడయ్యాడు?
ఒడిశాలో పుట్టి, తమిళనాడులో చదివి, శ్రీలంకలో ఉద్యోగం చేసి, ఇటు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, అటు సర్వోదయ ఉద్యమంలోనూ పనిచేస్తూ జాతీయ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తగా ఢిల్లీ, అలహాబాద్లలో తిరిగిన తెలుగు వాడు గోరా.
కృష్ణా జిల్లా విజయవాడను నాస్తిక కేంద్రంగా మలిచిన మొనగాడు గోరా. ప్రపంచ నాస్తిక సభల్ని తెలుగు నాట నిర్వహించిన ఒకే ఒకడు గోరా.
భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు గోరా. పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు.
ప్రపంచ దేశాలు పర్యటిస్తూ అంతర్జాతీయ నాస్తికోద్యమానికి ఊపిరి నిచ్చిన గోరా ఒకేసారి అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువయ్యారు.
ఒక వైపు మనువాదులు అలవాటు చేసిన అంధ విశ్వాసాలకు ప్రజలు బలై గిలగిల కొట్టుకుంటూ ఉన్నప్పుడు – మరో వైపు పరాయి పాలనలో దేశం దాస్య శృంఖలాలలో మగ్గిపోతున్నప్పుడు – ఈ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కుని పోరాడడం ఎలాగో నేర్పించిన ధీరోదాత్తుడు గోరా.
స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారు బతుకుల్ని నిర్వీర్యం చేసిన బ్రాహ్మణిజం పై పోరాడలేదు.
గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు.
పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు అంటూ పిడికిళ్ళు బిగించిన వారు ఎవరూ దేవుణ్ణి, దయ్యాన్ని పక్కన పెట్టి అసలైన మనిషిని వెతికి పట్టుకోలేదు.
అందుకే చెప్పేది, మనిషిని గుర్తించిన వారందరూ మహనీయులే అయ్యారు. అవుతారు కూడా.
మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఉన్న ఈ దైవ కేంద్ర సమాజాన్ని మానవ కేంద్ర సమాజంగా మార్చడానికి జీవితాంతం కృషి చేసిన మహోన్నతుడు గోపరాజు రామచంద్రరావు(గోరా).
వృక్ష శాస్త్ర అధ్యాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధీజీ అనుచరుడు, జాతీయ స్థాయి కాంగ్రెస్ కార్యనిర్వాహకుడు.
అస్పృశ్యతా నివారణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే ప్రజల్లో కులమతతత్వ నిర్మూలనకు నడుంబిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.
దేశంలో ఉన్నత విద్య సులభంగా అందుబాటులో లేని రోజుల్లో దాని కోసం తపించి, శ్రమించి స్నాతకోత్తర పట్టా సాధించిన వైజ్ఞానిక విద్యార్థి.
ఉన్నత విద్యావంతుడై కూడా తన సుఖం తాను చూసుకోకుండా జనం కోసం జనం మధ్యలో తిరుగుతూ వారిలో వివేకాన్ని పెంచిన బాధ్యతగల పౌరుడు.
గోరా నవ యువకుడిగా ఉన్నప్పటి నుండే అంటే దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుండే, సామాజిక కార్యాచరణకు పూనుకున్నారు.
అనతి కాలంలోనే ఆయన చేపట్టిన సానుకూల నాస్తికత్వ ప్రచారం అనేక మందిని ఆకర్షించింది.
స్వచ్ఛందంగా అనేక మంది ముందుకొచ్చి ఆయన కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. క్రమంగా వాళ్ళే వాలంటీర్లయి ఆయనకు తోడు నిలిచారు.
బాల్యం, విద్యాభ్యాసం..
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఛత్రపురంలో గోరా 1902 నవంబర్ 15 న జన్మించారు.
వీరి తల్లిదండ్రులు రాజలక్ష్మి, వెంకట సుబ్బారావు. పుట్టింది ఉన్నత వర్గంలోనైనా ఆయన దానికి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు.
పైగా కుల మతాల అడ్డు గోడలు తొలగించడానికే ఉద్యమించారు. పర్లాకిమిడిలో ప్రాథమిక విద్య, పిఠాపురం రాజా కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువు పూర్తి చేసి, మద్రాసు (తమిళనాడు) ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
విద్యార్థి దశలోనే విజయనగరానికి చెందిన సరస్వతిని పెండ్లి చేసుకున్నారు.
అప్పుడు ఆమె వయసు పదేళ్ళు మాత్రమే. గోరా అనేక చోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధురలోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు.
ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పనిచేశారు.
కొంత కాలం శ్రీలంక వెళ్ళి కొలంబోలోని ఒక కళాశాలలో జీవ శాస్త్ర అధ్యాపకుడయ్యారు.
తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. స్వతంత్ర భావాలు గల గోరా ఎక్కడా ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం స్థిరంగా ఉండలేకపోయేవారు.
నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు.
తను నడిచే మార్గం సంప్రదాయ వాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించుకుని, భార్యాపిల్లలతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించారు.
నాస్తిక కేంద్రం స్థాపన, సామాజిక సంస్కరణలు..
సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని గోరా అనుకున్నారు.
ఆ ఆలోచనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు. సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కులమతాలకు అతీతంగా మానవ వాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని రూపొందించడానికి 1940లో కృష్ణా జిల్లా ముదునూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు.
గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. స్వాతంత్య్ర సమర యోధునిగా పనిచేస్తూనే సామాజిక, ఆర్థిక సమానత్వానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కులమతాల నిర్మూలనకు, అస్పృశ్యతా నిర్మూలనకు, దళితుల ఆలయ ప్రవేశానికి, కులాంతర-మతాంతర వివాహాలు జరిపించడానికి నిరంతరం కృషి చేశారు గోరా.
నాస్తిక కేంద్రం ముదునూరు నుంచి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు.
ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందువయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహా సభలు విజయవాడలో నిర్వహించిన ఘనత గోరా గారిదే. అప్పుడాయన వయసు 70 సంవత్సరాలు.
భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి? అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జులై 26న గోరా తుది శ్వాస విడిచారు. 2002లో గోరా శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తపాలా బిళ్ళ విడుదల చేసింది. గోరా మరణానంతరం ఆయన శ్రీమతి సరస్వతీ గోరా నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
1980లో రెండవ ప్రపంచ నాస్తిక మహా సభలు కూడా విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలోనే నిర్వహించారు. 2006లో సరస్వతీ గోరా మరణం తర్వాత 2020లో నాస్తిక కేంద్రం ఎనభై సంవత్సరాల మహోత్సవాలు జరుపుకుంది.
ఆచరణాత్మక జీవనం..
ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే గ్రహణం మొర్రి రాదని, తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిది మంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు.
రాహు-కేతువులు ఎక్కడో లేరు సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెపుతూ ఉండేవారు.
పిల్లల పేర్లు, ఆదర్శ కుటుంబం..
గోరా దంపతులు తమ పిల్లలకు పెట్టిన పేర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన కొడుక్కి ‘లవణం’ అని, భారతీయులు చట్ట సభల్లో గెలిచినపుడు పుట్టిన కొడుక్కి ‘విజయం’ అని; రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టిన కొడుకులకు సమరం, నియంత అనీ, తమ తొమ్మిదో సంతానానికి ‘నవ్'(నౌవి) అని; గాంధీ-ఇర్విన్ ఒడంబడిక జరిగిన సందర్భంలో పుట్టిన కూతురికి ‘మైత్రి’ అని; మరో అమ్మాయికి మనోరమ అనీ పేర్లు పెట్టారు.
దేవుళ్ళ పేర్లు పెట్టుకునే జాడ్యం నుంచి తెలుగు వారిని కాపాడాలన్న ఉద్దేశంతో తమ సంతానానికి ఇలా ప్రత్యేకమైన పేర్లు పెట్టి చూపించారు.
వీరి ప్రభావంతో చాలా మంది దంపతులు వారికి పుట్టిన పిల్లలకు దేవుడి పేర్లు పెట్టుకోవడం మానేశారు. అందుకే చూడండి ఆధునికుల పేర్లు మానవ్, కౌశల్, వాత్సల్య, ప్రేమ, కారుణ్య లాంటివి కనిపిస్తున్నాయి.
సరస్వతి గోరా పూర్తిగా భర్తను అనుసరించి సంఘ సేవికగా మారారు. చిన్న వయసులోనే వివాహమైనా, అనతి కాలంలోనే ఆమె గోరా ఆలోచనల్ని అందుకుని ముందుకు నడిచారు.
గోరా శ్రీలంకలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈమె అక్కడ నిప్పుల మీద నడిచి చూపించారు. అందులో దైవ మహిమలేవీ లేవని నిరూపించారు.
అంతేకాదు, దేవదాసీ వ్యవస్థ నుంచి మహిళల్ని బయటికి లాగి, సరస్వతి గోరా వారికి వివాహాలు జరిపించారు. ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కొన్నేళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. జీవితాంతం బొట్టు, కాటుక, మంగళ సూత్రాలు వంటివి ధరించకుండా మనువాద నియమాల్ని తిరస్కరించారు.
గోరా మరణించినప్పుడు కూడా మతానికి సంబంధించిన కార్యక్రమాలేవీ లేకుండా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రేమ, ఆప్యాయత, నైతికత మాత్రమే మానవత్వ లక్షణాలని గోరా దంపతులు చాటి చెప్పారు.
గోరా రచనలు, స్ఫూర్తి..
నిరంతరం కార్యరంగంలో శ్రమిస్తూనే, ఉపన్యసిస్తూనే గోరా నాస్తికత్వం మీద పత్రికలు – పుస్తకాలు ప్రకటించారు. స్వాతంత్ర్యం లభించిన తొలినాళ్ళలో సంఘం పేరుతో ఒక పత్రిక వెలువరించారు.
1968లో ‘ది ఏథీస్ట్’ అనే ఆంగ్ల మాస పత్రిక ప్రారంభించి అంతర్జాతీయంగా ప్రపంచ నాస్తికుల ప్రశంసలు పొందారు.
ఆయన రచించిన యాన్ ఏథీస్ట్ విత్ గాంధీ (1951), పాజిటివ్ ఏథీస్ట్ (1972), ది నీడ్ ఆఫ్ ఏథీజం (1982), నాస్తికత్వం (1941), దేవుని పుట్టు పూర్వోత్తరాలు (1951), నేను నాస్తికుణ్ణి (1976), సృష్టి రహస్యం (1976), ఆర్థిక సమానత్వం (1980), నాస్తికత్వం – ప్రశ్నోత్తరాలు వంటివి బహుళ జనాదరణ పొందిన రచనలు. ప్రతి ఒక్కరూ గోరా రచనలు చదవాలి. చదివించాలి.
వాస్తవాలు చెప్పే వారు లేక ఈ తరం యువతీ యువకులు దారి తప్పి పోతున్నారు. పైగా, అబద్ధాలు ప్రచారం చేసే ప్రభుత్వాలే అధికారం వెలగబెడుతున్నాయి గనుక, బాధ్యతగల పౌరులు చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంది. వచ్చే తరాలకు సరైన దిశా నిర్దేశం చేయాల్సి ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
