అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్ఢ్ ట్రంప్ తాజాగా తెరపైకి తెచ్చి, ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర చర్చకు శ్రీకారం చుట్టారు. అమెరికాకు ప్రమాదకరమని భావిస్తున్న దేశాలపై గత కొద్ది నెలలుగా సుంకాలతో ఇబ్బంది పెట్టడానికి ట్రంప్ ప్రయత్నించారు. ఆ ఎత్తుగడ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో, అణ్వస్త్రాల అంశాన్ని లేవనెత్తి; కొత్త పద్ధతిలో బ్లాక్మెయిల్ చేయడానికి సంకల్పించినట్టుగా అర్థమవుతుంది.
భారతదేశంతో పాటు మరిన్ని దేశాలను సుంకాలతో లొంగదీసుకోవడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలను ఆయా దేశాలు ఎదుర్కొంటూ, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ తరుణంలో అణ్వస్త్రాల పై ఆయన చేసిన తాజా ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఈ దేశాలు కూడా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ ప్రకటించారు. రష్యా, ఉత్తర కొరియా కూడా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, కానీ ఈ దేశాలన్నీ దాని గురించి బహిరంగంగా మాట్లాడడం లేదని అన్నారు.
మళ్లీ అదేమాట..
“మాది మాత్రం స్వేచ్ఛా సమాజం, మేము చాలా భిన్నం, అందుకే ప్రతి విషయంపై బహిరంగంగా మాట్లాడుతాము”అని తమకు తాము ట్రంప్ కితాబిచ్చుకున్నారు. అణ్వస్త్ర పరీక్షల గురించి ఆయా దేశాల మీడియా కూడా ఏమీ రాయదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భారత్- పానిస్తాన్ ఈ ఏడాది మేలో అణుయుద్ధం అంచు వరకు వెళ్లాయని; ఆ దేశాలకు వాణిజ్యం, సుంకాల బూచీ చూపించి ఆ యుద్ధాన్ని నివారించానని విలేకరుల సమావేశంలో ట్రంప్ పునరుద్ఘాటించారు.
అయితే, గత కొద్ది నెలలుగా అమెరికా సుంకాలపై తీవ్రంగా చర్చ జరుగుతున్నా, ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ అణు పరిక్షపై అమెరికా అధ్యక్షులు ఇంత బహిరంగంగా ప్రకటన చేశారు. అయినప్పటికీ, కనీసం ఈ విషయంపై మన విశ్వగురు ఇంకా నోరు విప్పకపోవడం గమనించాలి.
ప్రపంచంలో అణ్వస్త్రాలు కలిగిన దేశాలు..
ప్రస్తుతం తొమ్మిది దేశాలైన భారత్, పాకిస్తాన్‌తో సహా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఉత్తర కొరియా, గ్రేట్ బ్రిటన్, ఇజ్రాయిల్ వద్ద అణ్వస్త్రాలున్నాయి. 1940 దశకంలోనే అమెరికా, సోవియట్ యూనియన్ అణుపరీక్షలను నిర్వహించి అస్త్రాల ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి నాటికి సుమారు 90% అంటే 12,200 అణ్వాయుధాలు ఈ రెండు అగ్ర దేశాల వద్దనే ఉన్నాయి.
రష్యా 5,449, అమెరికా 5,277, చైనా 600, ఫ్రాన్స్ 290, గ్రేట్బ్రిటన్ వద్ద 225 అణ్వాయుధాలున్నట్టుగా సమాచారం.
పాకిస్తాన్ రహస్యంగా అణుపరిక్ష నిర్వహిస్తుందని ప్రకటించిన ట్రంప్. ఇంకో అడుగు ముందుకేసి “ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయ గల అణుబాంబులు తమ వద్ద తగినన్ని ఉన్నాయి”అని అన్నారు. ప్రపంచాన్ని భయపెట్టించడానికా, లొంగదీసుకోవడనికా లేకా సరదాగా ఇలాంటి ప్రకటనను ట్రంప్ చేశారాన్నది ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది.
భారత్- పాకిస్తాన్ల గురించి తరుచూ ప్రస్తావిస్తున్న ట్రంప్ ఒక రకంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్లకు ఊతం ఇస్తున్నట్టుగా కనబడుతుంది. ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అనుకూల సమయం కోసం మోడీ, ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాయి.![]()
తమ ఏజెండాలో కూడా చేర్చాయి. ఇందులో భాగంగా “అఖండ భారత్”స్వప్నాన్ని పదేపదే వల్లె వేస్తుంటాయి. తమ ఆకాంక్ష సాకారం దిశగా అడుగులు, ఎత్తుగడలను ఇవి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు భారత్‌ను అటు పాకిస్తాన్‌ను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలతోనే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
గత వారం దక్షిణ కొరియా నుంచి తిరిగి అమెరికాకు వెళ్తున్న సమయంలో, తక్షణమే అణ్వాయుధాల పరీక్షలు నిర్వహించాలని తమ దేశ సైన్యానికి మార్గమధ్యలోంచే ట్రంప్ ఆదేశాలు జారి చేశారు. ఆసియాలోని మూడు దేశాల్లో జరిపిన పర్యాటనలో ట్రంప్ ఏమి చూశారో, విన్నారో తెలియదు. కానీ అప్పటి నుంచి ఆకస్మికంగా అణ్వస్త్రల ప్రస్తావనను మొదలు పెట్టారు.
అంతటితో ఆగకుండా ట్రంప్ తన మాటల తూటాలను పెల్చుతూ- పాకిస్తాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలియజేస్తూ; అణు పరీక్షలకు దూరంగా అమెరికా ఒక్క దేశమే ఉండటం తనకు ఇష్టం లేదని సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
“ప్రపంచంలోనే అత్యధిక అణ్వస్త్రాలు అమెరికా వద్ద ఉన్నాయి. అయినప్పటికీ తన సైనిక ప్రత్యర్ధులైన రష్యా, చైనా తమ అణు సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయని” ట్రంప్ తన అక్కస్సును వెలుబుచ్చారు.
ట్రంప్ తాజా బ్లాక్మెయిల్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ దేశాల అణ్వస్త్రల గురించి కొంత పరిశీలన అవసరం ఏర్పడింది. భారత్ 1960 దశకం నుంచి అణ్వాయుధాలపై దృష్టిని సారించి, మొట్టమొదటి సారిగా 1974 మే 18న రోజున అణు పరిక్ష పోక్రాన్- I(స్మైలింగ్ బుద్ధా) కోడ్ పేరుతో విజయవంతంగా నిర్వహించింది. ఆ తర్వాత 1998లో పోక్రాన్- II(ఆపరేషన్ శక్తి) కోడ్ పేరుతో రెండవ సారి అణు పరిక్షను కూడా విజయవంతంగా నిర్వహించింది.
ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పొరుగు దేశం 1970 దశకంలో అణ్వాయుధాలపై ఆలోచనను మొదలు పెట్టి తొలిసారిగా 1998లో(చెగావ్ 1,11) కోడ్ పేరుతో అణుపరిక్షలను నిర్వహించింది. అయితే భారత్ రెండవసారి పరీక్షను నిర్వహంచిన తర్వాత తమ అణుపరిక్షలు, ఆయుధాలపై పాకిస్తాన్ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు రహస్యంగా అణుపరిక్షలు నిర్వహిస్తుందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ చెపుతున్నారు. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో తేల్చాల్సిన అవసరం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
