2025 జూన్ 24న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సర్వేలో ప్రత్యర్ధుల కంటే ముందున్న జోహ్రాన్ మమ్దానీ నవంబరు 4న జరిగిన ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఓట్ల లెక్కింపు 91శాతం పూర్తయిన సమయానికి 50.4శాతంతో ముందుండి విజయాన్ని ఖరారు చేసుకున్నారు.
ప్రత్యర్ధిగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి పరాజయం పాలై, పార్టీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన న్యూయార్క్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఆండ్రూ కుమోకు 41.6; డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలను ధిక్కరించి పోటీలో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి కర్టిస్ సిల్వాకు 7.1; డెమోక్రటిక్ పార్టీ మరో తిరుగుబాటు అభ్యర్ది, మధ్యలో పోటీ నుంచి కుమోకు అనుకూలంగా తప్పుకున్న ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్కు 0.3 శాతం ఓట్లు నమోదయ్యాయి. న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్లుగా, వర్జీనియా లెప్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్ధులు మైక్ షెరిల్, అబిగెయిల్ స్పాన్‌బెర్గర్, గజాలా హష్మీ మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు.
గజాలా హష్మి 1964లో హైదరాబాద్‌లో జన్మించి నాలుగేండ్ల వయస్సులో అమెరికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తండ్రి జియా హష్మి వద్దకు వెళ్లారు. ఆమె చదువు సంధ్యలన్నీ అమెరికాలోనే సాగాయి. రిపబ్లికన్ పార్టీ, ఇతర జాత్యహంకారులైన పచ్చి మితవాదులు ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ న్యూయార్క్ నగర మేయర్‌గా, వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆ సామాజిక తరగతికి చెందిన వారికే పట్టం గట్టటం ఓటర్ల పరిణితికి నిదర్శనం.
నేతలు మతకళ్లద్దాలను తగిలించుకున్నప్పటికీ, సామాన్య జనం ముఖ్యంగా కార్మికవర్గం అలా లేదు. మమ్దానీ విజయంతో కంగుతిన్న ట్రంప్ తన ఉక్రోషాన్ని యూదుల మీద వెళ్లగక్కారు. వారు కూడా మమ్దానీకి ఓటు వేశారని వ్యాఖ్యానించారు. మనదేశంలో ఉన్న హిందువులలో కొందరు కాషాయ తాలిబాన్లుగా మతోన్మాదులుగా మారినప్పటికీ సామాన్యులు అలా లేరు. అలాగే యూదులలో కొందరు దురహంకారులు ఉన్నప్పటికీ, అందరూ అలాంటి వారు కాదని న్యూయార్క్ ఎన్నికలలో రుజువైంది.
ప్రాథమికంగా వెల్లడైన విశ్లేషణ ప్రకారం, 44 ఏండ్ల లోపు యూదులలో 67శాతం మంది మమ్దానీకి ఓటు వేశారని తేలింది. ఇటీవలి గాజా మారణకాండలో పాలస్తీనియన్లను ఊచకోత కోసిన ఇజ్రాయెల్ చర్యలను ఖండించటంలో మమ్దానీ ముందున్నవారిలో ఒకరు. అతనికి ఓటు వేశారంటే సామాన్య యూదులు కూడా ఇజ్రాయెల్ చర్యలను సమర్ధించటం లేదన్నది స్పష్టం.
గత ఎన్నికల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువ..
పోలింగ్‌కు కొద్ది గంటల ముందు వెల్లడైన సర్వేలన్నీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి సోషలిస్టును అని సగర్వంగా ప్రకటించుకున్న జోహ్రాన్ మమ్దానీ గెలుపు బాటలో ఉన్నట్లు ప్రకటించాయి. ఎమర్సన్ కాలేజి చివరి సర్వేలో జోహ్రాన్‌కు 50శాతం, సమీప ప్రత్యర్ధి ఆండ్రూ కుమోకు 25, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి కర్టిస్ సిల్వాకు 21శాతం మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు.
అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం, ప్రకటిత సమయానికి ముందే 7,35,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో యువత ఎక్కువగా ఉన్నట్లు, అత్యధికులు జోహ్రాన్‌కే ఓటు వేసినట్లు మీడియా పేర్కొన్నది. యాభై సంవత్సరాల లోపు వయస్సున్న ఓటర్లలో 69శాతం మద్దతు ఇస్తున్నట్లు, ఆఫ్రో- అమెరికన్ ఓటర్ల మొగ్గు కూడా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఇవి నాలుగు రెట్లు ఎక్కువని, దీన్ని బట్టి ఓటర్లు ఎంత ఆసక్తిగా ఉన్నారో వెల్లడైందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఓటు వేసిన వారిలో 58శాతం మమ్దానీకి వేసినట్లు, వేయాల్సివారిలో 45శాతం మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. ఏ రీత్యా చూసినా మమ్దానీ విజయం ఖాయమని నిర్ణయించుకున్న తరువాత చివరి నిమిషంలో స్వంత పార్టీని పక్కన పెట్టి ట్రంప్ స్వతంత్ర అభ్యర్ధి ముసుగులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ తిరుగుబాటుదారుకు మద్దతు ప్రకటించారని ఆ మేరకు కొన్ని ఓట్లు కుమోకు మళ్లినట్లు ఫలితాలు వెల్లడించాయి. మొత్తం నగరంలో నమోదైన ఓటర్ల సంఖ్య 47లక్షలు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ పోటీ నుంచి మధ్యలో తప్పుకొని అదే పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి ఆండ్రూ కుమోకు మద్దతు ప్రకటించారు.
విప్లవాన్ని అడ్డుకోవటం ఎవరివల్లా కాదు..
మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. అనివార్యమని చరిత్రగమనాన్ని బట్టి గట్టిగా విశ్వసించటం తప్ప ఎక్కడ, ఎప్పుడు, ఎలా వస్తుందో కూడా తెలియదు. అన్నింటినీ మించి అంతిమంగా విప్లవాన్ని అడ్డుకోవటం ఎవరివల్లా కాదు.
2025 జూన్ 24వ తేదీ బుధవారం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ రాజధాని న్యూయార్క్ నగరంలో పిడుగుపాటు. విప్లవమని వర్ణించటం అతిశయోక్తి అవుతుంది కానీ పెట్టుబడిదారులకు దడపుట్టించే పరిణామం జరిగింది. నగర మేయర్ ఎన్నికలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీ(33) ఎన్నిక యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరిగింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని కోరుతూ 11 మంది పోటీపడ్డారు.
తొలి రెండు దఫాలలో మమ్దానీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ 50శాతంపైగా ఓట్లు రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఇద్దరి మధ్య మూడో రౌండులో న్యూయార్క్ రాష్ట్ర ఎమ్మెల్యే జోహ్రాన్‌కు 56.39, రెండవ స్థానంలో ఉన్న న్యూయార్క్ మాజీ గవర్నర్, ఒక కార్పొరేట్ సంస్థకు అధిపతైన అండ్రూ కుమోకు 43.61శాతం ఓట్లు వచ్చాయి. గత 36 సంవత్సరాలలో పెద్ద ఎత్తున డెమోక్రటిక్ పార్టీలో ఓటర్లు పాల్గొనటం ఇదే ప్రథమం.
జోహ్రాన్ గెలిస్తే ఆర్థిక, సామాజిక విపత్తు సంభవిస్తుందని, అతను గెలిస్తే తాను నిబంధనలమేరకు తప్ప అదనపు నిధులు విడుదల చేసేది లేదని, తన మద్దతు డెమోక్రటిక్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి మాజీ గవర్నర్‌ఆండ్రూ కుమోకు ఇస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కమ్యూనిస్టు జోహ్రాన్, చెడ్డ అభ్యర్థి కుమోలలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి గనుక తాను కుమోనే ఎందుకున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా అతనంటే అభిమానం ఉందా లేదాని కాదు, మరొక మార్గం లేదు కనుక కుమోను బలపరచాలి. మమ్దానీని ఓడించగలిగిందతనేనని ట్రంప్ పేర్కొన్నారు. ఒక అధ్యక్షుడిగా అదనంగా నిధులు ఇవ్వటం కష్టం, ఎందుకంటే మీరు గనుక కమ్యూనిస్టును ఎన్నుకుంటే నగరానికి ఇచ్చే నిధులన్నింటినీ మీరు వృధా చేసినట్లే అని ఒక టీవీలో ట్రంప్ చెప్పారు. వేయి సంవత్సరాలుగా విఫలమైన కమ్యూనిస్టు సిద్దాంతాన్ని మమ్దానీ అనుసరిస్తున్నారని అన్నారు.
జోహ్రాన్ అభ్యర్ధిగా ఎన్నికైనప్పటి నుంచి అతను కమ్యూనిస్టని పదేపదే ట్రంప్ ఓటర్లను ఆకర్షించేందుకు, ఆ ముద్రతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టాలని ట్రంప్ చూశారు. అతగాడికి కొమ్ము కాసే మీడియా యాజమాన్యాలు, వాటిలో పని చేసే యాంకర్లు రాజును మించిన రాజభక్తిపరులుగా మారారు.
ఫాక్స్ న్యూస్ టీవీ యాంకర్ ఊగిపోతూ “జోహ్రాన్ మమ్దానీ, అతని అనుచరులు కమ్యూనిస్టులు, తీవ్రవాదులు. వారిని దెబ్బతీసేందుకు గతంలో కమ్యూనిస్టులపై విషం చిమ్మటంలో పేరు మోసిన జో మెకార్ధీని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొంత మంది తీవ్రవాదులను న్యూయార్క్ వంటి గొప్పనగరంలో ఎన్నిక కావటానికి అనుమతించకూడదు. నగరాన్ని నాశనం కానివ్వకూడదు”అని జోహ్రాన్ మీద విరుచుకుపడ్డారు.
కమ్యూనిస్టును కాదని, ప్రజాస్వామిక సోషలిస్టునని మమ్దానీ చెప్పుకుంటున్నారని, అది ఏ తరహా ప్రజాస్వామ్యం?అతను ఎన్నిక కావటాన్ని సహించకూడదని ఏదో విధంగా అడ్డుకోవాలన్నారు ఆ యాంకర్.
అంతేకాకుండా, “జోహ్రాన్ గడ్డం ఉన్న కమలాహారిస్. ప్రచ్చన్న యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ మార్క్సిజం బతికింది. దీంతో విశ్వవిద్యాలయాల్లోని టీచర్లకు ధైర్యం వచ్చింది. వలస వచ్చేవారిని, సోషలిస్టు సిద్ధాంతాలను ఎక్కించటాన్ని అడ్డుకోవాలి. కమ్యూనిస్టుకు ఓటువేయాలని నగరనాశనాన్ని కోరుకొనే వారిని బయటకు నెట్టాలి. అందరం కూర్చుని కమ్యూనిస్టు ఎన్నికకాకుండా చూడాలి. అధికారికంగా నమోదు కాని, పౌరులు కాని వారు కూడా ఓట్లు వేస్తున్నారు” ఆరోపించారు.
ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. అమెరికా తిరోగామి మీడియాలో ఇలాంటి యాంకర్లు కోకొల్లలు.
డెమోక్రటిక్ పార్టీ కూడా కార్పొరేట్లకు అనుకూలమే కదా, అలాంటి పార్టీలో జోహ్రాన్ వంటి పురోగామివాదులు ఎలా ఉన్నారనే సందేహం రావటం సహజం. ఒక విధంగా అది మనదేశంలో కాంగ్రెస్ వంటిది. మన స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ సంస్థలో నాయకత్వ విధానాలను వ్యతిరేకించే వారు; తమ పురోగామి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. దాని నేతలుగా ఉన్న ఇంఎంఎస్ నంబూద్రిపాద్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అనేక మంది తరువాత కమ్యూనిస్టులుగా మారారు.
అదే మాదిరి అమెరికా డెమోక్రటిక్ పార్టీలో పురోగామి విధానాలను ముందుకు తెచ్చేవారు, డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. వారిలో ప్రముఖుడు సెనెటర్ బెర్నీశాండర్స్ బహిరంగంగా తనను సోషలిస్టుగా ప్రకటించుకున్నారు. అదే బాటలో జోహ్రాన్ మమ్దానీ వంటి యువకులు పెద్ద సంఖ్యలో సోషలిస్టులుగా ప్రకటించుకున్నారు. వీరందరినీ కమ్యూనిస్టులుగా అక్కడి మీడియా, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలోని మితవాదులు ముద్రవేస్తున్నారు. అభ్యర్థిగా ఎన్నికైన తరువాత జోహ్రాన్ ఒక కమ్యూనిస్టు పిచ్చోడని డోనాల్డ్ ట్రంప్ నోరుపారవేసుకున్నారు.
అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది. లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నారని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్దంగా ఉన్నట్లు, ఒక సామాజిక సంక్షోభానికి ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు. జోహ్రాన్ అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఫలితాల తీరు వెల్లడించగానే జరిగిన పరిణామాలు మనదేశంలో జరిగిందాన్ని గుర్తుకు తెచ్చాయి.
కొన్ని పార్టీల వారు గతంలో సీపీఎం నేత జ్యోతిబసును ప్రధాని పదవికి సూచించగానే బాంబే క్లబ్‌గా పిలిచే బడాకార్పొరేట్ ప్రతినిధులందరూ సమావేశమై ఎట్టి పరిస్థితిలోనూ కానివ్వరాదని తీర్మానించారు.
చరిత్ర గతిని ఎవరూ ఆపలేరు…
న్యూయార్క్ నగరానికి ఒక వామపక్షవాది మేయర్ కాగానే అక్కడి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే అవకాశం లేదు. అయినప్పటికీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్ లేదా జోహ్రాన్‌తో పోటీ పడిన కుమోను స్వతంత్ర అభ్యర్ధిగా నిలపాలని, రిపబ్లికన్ పార్టీ పోటీ చేయకుండా మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞాపనలతో పాటు 20 మిలియన్ల డాలర్లను వసూలు చేయాలని పిలుపునిచ్చారు.
అభ్యర్ధి ఎన్నికలో జోహ్రాన్ ముందంజ గురించి తెలియగానే స్టాక్మార్కెట్లో కొన్ని కంపెనీల వాటాల ధరలు పడిపోయాయంటే, ఎలాంటి కుదుపో చెప్పనవరం లేదు. మమ్దానీ ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకించటమే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా పాలస్తీనా మద్దతుదారుగా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయించేందుకు వెనుకాడనని కూడా చెప్పారు. అందుకనే ప్రత్యర్ధులు అతనికి యూదువ్యతిరేకని ముద్రవేశారు. అయినప్పటికీ న్యూయార్క్‌లోని యూదులు పెద్ద సంఖ్యలో అతని అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటు చేశారని వార్తలు వచ్చాయి. మంగళవారం నాటి ఓటింగ్‌లో ముందే చెప్పుకున్నట్లు యూదులలో యువతరానికి చెందిన వారు 67శాతం మంది జోహ్రాన్‌కు ఓటు వేశారు.
ట్రంప్ ఉక్రోషం గురించి చూశాం. నరేంద్రమోడీ న్యూయార్క్ వస్తే భేటీ అవుతారాని ప్రచారం సందర్భంగా విలేకర్లు అడగ్గా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులందరూ లేదని ముక్తకంఠంతో చెప్పారు. బెంజమిన్ నెతన్యాహు మాదిరి నరేంద్రమోడీ కూడా గుజరాత్లో మారణకాండకు బాధ్యుడైన ఒక యుద్ద నేరగాడని జోహ్రాన్ కారణం చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మేయర్ అయ్యాడంటే మనదేశంలోని కాషాయ దళాలు ఏ విధంగా స్పందిస్తాయో చెప్పనవసరం లేదు.
కుమో పోటీకి దిగాలని నిర్ణయించినపుడే అతగాడు డోనాల్డ్ ట్రంప్‌తో సంబంధాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాను ట్రంప్ నుంచి ఎలాంటి సహాయం పొందటం లేదని అలాంటి ఆలోచన కూడా లేదని, పోటీ గురించి ట్రంప్‌తో మాట్లాడినట్లు న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ప్రముఖ మీడియా యజమాని జిమీ ఫింక్లెస్టయిన్ ఇంట్లో సమావేశమైన ట్రంప్ మద్దతుదార్లు చర్చించి కుమో ఎలా పోటీ ఇవ్వగలరో ట్రంప్‌కు నివేదించినట్లు కూడా న్యూయార్క్‌టైమ్స్ రాసింది. ట్రంప్‌తో నేరుగా మాట్లాడితే ఫలితం ఉంటుందేమోనని ఒక మద్దతుదారు కుమోను అడగ్గా ట్రంప్‌కు అన్నీ తెలుసు తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మమ్దానీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే తనకు మద్దతు ఇవ్వాలని మరోపోటీదారు, ప్రస్తుత డెమోక్రటిక్ పార్టీ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను కుమో కోరినట్లు వార్తలు వచ్చాయి. తరువాత అదే జరిగింది.
కుమోను ట్రంప్ బలపరుస్తున్నారని, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపేందుకు కుట్ర చేస్తున్నారని మమ్దానీ ప్రతినిధి డోరా పెకీ కొద్ది నెలల ముందే ఒక ప్రకటనలో హెచ్చరించారు. లక్షలాది మంది వలంటీర్లు అలాంటి ప్రయత్నాల మీద కన్నేసి ఉంచాలని మమ్దానీ మద్దతుదార్లు తగిన జాగ్రత్తలు తీసుకున్న కారణంగా అలాంటి దుస్సాహసానికి ట్రంప్ పూనుకోలేదు.
ట్రంప్ ప్రకటన తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ నేత ఆండ్రూ కుమో స్పందిస్తూ, రిపబ్లికన్ ఓటర్లు అధ్యక్షుడి మాట వింటారని భావిస్తున్నానని, ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచే మేయర్ మనకు కావాలని, న్యూయార్క్ నగరానికి నేషనల్ గార్డ్స్(మిలిటరీ) పంపే ముప్పు ఉన్నందున తాను సరైన అభ్యర్ధినని, మమ్దాని గనుక గెలిస్తే వెన్నలో వేడికత్తిని దింపినట్లు ట్రంప్ వ్యవహరిస్తారని ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు.
ట్రంప్ ప్రకటన తరువాత కొందరు రిపబ్లికన్ ఓటర్లు స్వంత అభ్యర్ధిని కాదని కుమోకు వేసినకారణంగానే సర్వేలకు భిన్నంగా అతనికి ఓట్లు పెరిగాయన్నది స్పష్టం. ఒక కమ్యూనిస్టును గాక న్యూయార్క్ ఒక చెడు డెమాక్రాట్‌ను ఎన్నుకోవాలని చెప్పటం సరైంది కాదని, తాను చెడ్డవాడిని కాదు, జోహ్రాన్ కమ్యూనిస్టు కాదని, ఒక సోషలిస్టు మాత్రమే అని; అయితే నగరానికి సోషలిస్టు పనికి రాడని కుమో చెప్పుకున్నారు. ప్రపంచ ధనికుల్లో ముందున్న ఎలన్ మస్క్ కూడా కుమో వైపు నిలిచినట్లు వెల్లడించారు.
అయితే ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కర్టిస్ సిల్వా తాను పోటీ నుంచి తప్పుకోవటం లేదని ప్రకటించారు. ఈ ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల కమ్యూనిస్టు, సోషలిస్టు వ్యతిరేక ప్రచారంతో పాటు ముస్లిం, పాలస్తీనా వ్యతిరేకతను కూడా రెచ్చగొట్టేందుకు ప్రత్యర్ధులు, మీడియా శతవిధాలా ప్రయత్నించాయి. ఇన్ని చేసినా ఓటింగ్‌కు కొద్ది గంటల ముందు ప్రతిపక్ష అభ్యర్ధుల కంటే ఎక్కువ మంది మద్దతు జోహ్రాన్‌కు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలిపాయి.
ఓటర్ల పరిణితిని ప్రతిబింబించిన ఎన్నికలు..
అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కొనసాగుతున్న ఫెడరల్ ప్రభుత్వ స్థంభన కారణంగా పేదలు, సబ్సిడీ ఆహారం మీద ఆధారపడిన వారందరూ ఆకలితో మాడుతున్నట్లు వచ్చిన వార్తలను చూసిన తరువాత వారందరూ కూడా జోహ్రాన్‌కు మద్దతు ప్రకటించారని కనిపిస్తున్నది.
జోహ్రాన్ పక్కా కమ్యూనిస్టని ప్రకటించి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుట్రచేసి ఫలితాలను ప్రభావితం చేసేందుకు చూసినా ఓటర్లు అయితే మాకేంటి అన్నట్లుగా ఓటువేశారు. ప్రపంచ పెట్టుబడిదారుల కుంభస్థలం మీద తొలిసారిగా ఒక సోషలిస్టు గద్దెనెక్కారు. 1892 తరువాత ఒక యువమేయర్‌గా కూడా జోహ్రాన్ చరిత్రకెక్కారు. మతకళ్లద్దాలతో చూసిన వారు తొలి ముస్లిం వ్యక్తి మేయర్ అవుతారంటూ చెప్పారు. ఒక పురోగామివాదిగా జోహ్రాన్ అసలు డెమోక్రటిక్ అభ్యర్ధిగా ఎన్నిక అవకుండా మొగ్గలోనే తుంచేందుకు ఆ పార్టీలోని మితవాద, పురోగామివాద వ్యతిరేకశక్తులు అన్ని విధాలుగా ప్రయత్నించాయి.
డెమోక్రటిక్ పార్టీలోని మితవాదులతో సహా ప్రతిపక్షం అంతా ఒక్కటి, జోహ్రాన్ ఒక్కడిగా రంగంలో ఉన్నారు.
ట్రంప్ చివరికి ఎంతగా దిగజారారంటే, తమ పార్టీ అభ్యర్ధి కర్టిస్ సిల్వాకు వేసే ఓటు జోహ్రాన్‌కు వేసినట్లుగానే పరిగణించాలన్నారు. కొన్ని సమయాలలో కొందరు అన్నట్లుగా ఒక సోషలిస్టు విసిరిన సవాలును ఎదుర్కొనేందుకు మిగతా సమయాలలో దెబ్బలాడుకొనే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎప్పుడైనా తమకే ఎసరు వస్తుందని భావిస్తే ఇద్దరు కలసిపోతారనేందుకు తాజా పరిణామం తార్కాణం.
జోహ్రాన్ మమ్దానీ మూలాలు..
ఈ అంశం అనేక మందిలో భ్రమలను పోగొట్టి తామెటో నిర్ణయించుకొనేందుకు పనికి వస్తుందని, రానున్న రోజుల్లో డెమోక్రటిక్ పార్టీలోని మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగలటం అనివార్యమని చెప్పవచ్చు. ఆఫ్రికాలో జన్మించిన 34 ఏండ్ల జోహ్రాన్ గెలిస్తే ఒక దక్షిణాసియా సంతతి, ముస్లిం సామాజిక తరగతికి చెందటమే గాక తొలి సోషలిస్టు మేయర్‌గా చరిత్రకెక్కారు.
ప్రచారంలో డెమోక్రటిక్ సోషలిస్టునని చెప్పుకున్నారు తప్ప ఇతర అంశాలకు చెందిన మనోభావాలను ముందుకు తెచ్చేందుకు ప్రయతించకుండా ఎంతో హుందాగా వ్యవహరించారని చెప్పవచ్చు. అతన్ని సోషలిస్టుగా వర్ణించినా తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని అనేక మంది చెప్పటం అమెరికా సమాజంలో వస్తున్న మార్పుకు నిదర్శనం.
జోహ్రాన్ తండ్రి మహమ్మద్ మమ్దానీ అమెరికాలో స్థిరపడిన గుజరాతీ మూలాలు ఉన్న ఉగాండా జాతీయుడు కాగా; తల్లి ఒడిషాలో జన్మించిన పంజాబ్ హిందూ కుటుంబానికి చెందిన మీరా నాయర్(నయ్యర్ ) పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమా దర్శకురాలు, నిర్మాత.
ఇజ్రాయెల్ హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి గౌరవ అతిధిగా వచ్చిన ఆహ్వానాన్ని 2013లో ఆమె తిరస్కరించారు. పాలస్తీనా ఆక్రమణ నుంచి వైదొలిగినపుడు, జాత్యంహంకారాన్ని వీడినపుడు మాత్రమే ఇజ్రాయెల్ గడ్డమీద అడుగుపెడతానని చెప్పారు.
జోహ్రాన్ వాగ్దానాల విషయానికి వస్తే తనను ఎన్నుకుంటే న్యూయార్క్ నగరంలో అద్దెలను స్థంభింపజేచేస్తానని, పేదలకు ఇండ్లు నిర్మిస్తానని, లాభనష్టాలు లేని ప్రాతిపదిక నగరపాలక సంస్థ సూపర్మార్కెట్లను ఏర్పాటు చేస్తానని, 2030 నాటికి గంటకు 30 డాలర్ల కనీసవేతన అమలు జరిగేట్లు చూస్తానని, అందరికీ అందుబాటులో ఉండే శిశు సంరక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి తన వాగ్దానాల అమలుకు అవసరమైన పదిబిలియన్ డాలర్ల సొమ్మును ధనికుల మీద అదనంగా పన్నులు వేసి సమీకరిస్తానని చెప్పారు. వలసవచ్చిన కుటుంబాల వారికి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేశారు.
ఇతగాడిని డెమోక్రటిక్ పార్టీలోని కార్పొరేట్ అనుకూల శక్తులు ఏదో ఒక సంస్కరణవాదని సరిపెట్టుకోలేదు. వర్గపోరాటాన్ని ప్రోత్సహించే విప్లవవాదిగా చూశారు. ఆ పార్టీలో చేయి తిరిగిన పెద్దలు, మితవాదులు, కార్మిక, కార్పొరేట్ శక్తులు ఏకమై అనేక తప్పుడు ప్రచారాలు చేశారు.
జొహ్రాన్ పూర్తి పేరు జొహ్రాన్ క్వామే మమ్దానీ. తండ్రి మహమ్మద్ మమ్దానీ ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో 1946లో ముంబైలో జన్మించారు. తరువాత ఆఫ్రికాలోని ఉగాండాకు ఆ కుటుంబం వలస వెళ్లింది. ఉగాండాలో ఉండగా 1963లో అమెరికాలో విద్య స్కాలర్షిప్ రావటంతో అక్కడ చదువుకున్నారు. తరువాత ఉగండా వెళ్లి అక్కడ బోధనావృత్తిలో చేరారు. సినిమా దర్శకురాలు మీరా నయర్ తన సినిమా ”మిస్సిసిపీ మసాలా ” కోసం ఉగాండాలో పరిశోధనకు వెళ్లినపుడు,1988లో అక్కడ పరిచయమైన మహమ్మద్ హిమ్దానీని ఆమె రెండవ వివాహంచేసుకున్నారు. వారికి అక్కడే 1991లో జోహ్రాన్ జన్మించారు. ఘనా తొలి అధ్యక్షుడు క్వామే అంటే అపరిమిత అభిమానంతో తమ కుమారుడి పేరులో క్వామే చేర్చారు. ఆ కుటుంబం తరువాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో కూడా ఉంది, తరువాత అమెరికాలో స్థిరపడింది.
2018లో జోహ్రాన్‌కు అమెరికా పౌరసత్వం వచ్చింది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలలో 2020లో తొలిసారిగా న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా జోహ్రాన్ ఎన్నికయ్యారు. 2024లో మూడవసారి ఎన్నికై ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేసినట్లుగా జోహ్రాన్ అభ్యర్ధిత్వాన్నే జీర్జించుకోలేని అదే పార్టీకి చెందిన ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఉక్రోషం వెలిబుచ్చారు. చివరికి అనుకున్నదంతా జరిగింది, ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారో తెలియదు.
జోహ్రాన్ మమ్దానీ వందశాతం కమ్యూనిస్టు పిచ్చోడని, మేయర్ అయ్యేదారిలో ఉన్నాడని ట్రంప్ తన సామాజిక మాధ్యమంలో గతంలోనే పోస్టు పెట్టారు. జోహ్రాన్ ఎన్నికను అడ్డుకొనేందుకు కొందరు 1954నాటికి కమ్యూనిస్టు వ్యతిరేక చట్టానికి దుమ్ముదులిపి జోహ్రాన్ పౌరసత్వాన్ని రద్దు చేసి ఉగాండాకు పంపే అవకాశాలను పరిశీలించాలని ఒత్తిడి తెచ్చారు. ఈ మేరకు మీడియాలో విశ్లేషణలు చేశారు. వీలుగాక ఊరుకున్నారు.
చారిత్రాత్మక అపూర్వఘట్టం..
న్యూయార్క్ మేయర్ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో నిజమైన సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది. డెమోక్రటిక్ సోషలిస్టులు ముందుకు తెస్తున్న సంస్కరణలనే మీడియా, శత్రువులు సోషలిజం, కమ్యూనిజమని చిత్రిస్తున్నారు. వాటికి ఉండే పరిమితులను కార్మికవర్గం అర్ధం చేసుకున్న తరువాత శాస్త్రీయ సోషలిజం కోసం మరింత ముందుకు పోవటం తప్ప మరొక మార్గం లేదు.
డెమోక్రటిక్ పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించేది ఇప్పుడున్న నాయకత్వం కాదని దేశ కార్మికవర్గమేనని డెమోక్రటిక్ సోషలిస్టు సెనెటర్ బెర్నీశాండర్స్ వ్యాఖ్యానించారు.
భారత మూలాలున్న జోహ్రాన్ భారతీయుడి కంటే పాకిస్తానీగా ఎక్కువ హడావుడి చేస్తున్నారని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నోరుపారవేసుకున్నారు. అతని హిందూ గుర్తింపు లేదా రక్తం సంగతి పక్కన పెడితే హిందూయిజాన్ని లేపేసేందుకు అతను ఇప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఆరోపించారు. అసలు ఉక్రోషం ఏమిటంటే నరేంద్రమోడీని యుద్ధ నేరస్తురని వర్ణించటమే అని వేరే చెప్పనవసరం లేదు.
కొసమెరుపు ఏమంటే ప్రపంచంలోనే పిన్నవయస్కురాలైన మేయర్‌గా తిరువనంతపురంలో ఎన్నికైన సీపీఎం నాయకురాలు 21ఏండ్ల ఆర్య రాజేంద్రన్‌ను– గతంలో అభినందిస్తూ జోహ్రాన్ చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ, ఒక కమ్యూనిస్టును అభినందించిన ఇతగాడు కూడా కమ్యూనిస్టే అంటూ విద్వేషాన్ని వెళ్లగక్కారు.
2025 జనవరి 20న డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇంటా బయటా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. వాటిలో ఒక ప్రధాన అంశంగా న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ఎన్నికను అడ్డుకోవటం కూడా ఉంది. బహుశా అమెరికా అధ్యక్షుల చరిత్రలో గడచిన శతాబ్ది కాలంలో మరొకరెవరికీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితం, పర్యవసానాలు వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. ఆ కారణంగానే ట్రంప్ స్వంత పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టటమే కాదు, అతగాడికి ఓటేస్తే జోహ్రాన్‌కు ఓటేసినట్లే అని చెప్పేంతవరకు వెళ్లాడు. చిత్రం ఏమిటంటే ట్రంప్‌ను వ్యతిరేకించిన ఎలన్ మస్క్ కూడా ఇదే చెప్పారు.
మహాభారతంలో అభిమన్యుడిని అంతం చేసేందుకు చూసినట్లు జోహ్రాన్ ఓటమికి అన్ని రకాల శక్తులు ఏకమైనా సర్వేలు అతనికి అనుకూలంగా చెప్పాయి. ఈ అభిమన్యుడు కుట్రలను వమ్ము చేసి పద్మవ్యూహం నుంచి జయప్రదంగా బయటపడి విజయదుందుభి మోగించారు. అమెరికాలో సరికొత్త రాజకీయాలకు నాంది పలికారని చెప్పవచ్చు. డెమోక్రటిక్ పార్టీలో ఉన్న పురోగామి శక్తులు మరింతగా తమ స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఈ విజయం ఎంతగానో తోడ్పడుతుంది. ఆ క్రమం కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. పార్టీలోని కార్పొరేట్ల ప్రతినిధులతో ఘర్షణ పడుతున్నారు. అలాంటి వారికి ఈ పరిణామం ఎంతో ఊపునిస్తుంది, సమీకరణ వేగం పుంజుకుంటుంది. ఏ పరిణామాలకు ఇది నాంది పలికిందో ముందు ముందు చూస్తాం !
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
