తాను నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో న్యూయార్క్ సెంట్రల్ హాలులోకి అడుగు పెడుతున్నానని ట్రంప్నుద్దేశించి న్యూయార్క్ మేయర్గా గెలుపొందిన జోహ్రాన్ మమ్దానీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం విజయోత్సవ సభలో మమ్దానీ ప్రసంగిస్తూ ఈ మాటలను అన్నారు.
ప్రజల్లో విభజన తెచ్చే రాజకీయ వ్యూహాలు, విధానాలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమోపై విజయం సాధించిన మమ్దానీ, అమెరికా ప్రజలు అనుభవిస్తున్న కారు చీకట్లలో న్యూయార్క్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం కాంతి రేఖ వంటిదన్నారు.
“ఇక్కడ ప్రస్తుత సమస్య పౌరులు వలస వచ్చినవారైనా, విలక్షణ లైంగికులైనా, ఒంటరి మహిళలైనా, నిత్యజీవితంలో దిక్కుతోచని కష్టాలు ఎదుర్కొంటున్న వారెవరైనా, ట్రంప్ పాలనలో ఉద్యోగాలు కోల్పోయిన వంటి వారి పక్షాన నిలవడమే తన లక్ష్యమ”ని మమ్దానీ ప్రకటించారు. అంతేకాకుండా, న్యూయార్క్లో ఇకపై ముస్లింలను బూచిగా చూపించి ఎన్నికల్లో గెలవటం సాధ్యం కాదన్నారు.
ట్రంప్ బెదిరింపులను ప్రస్తావిస్తూ, “మీ బెదిరింపులను న్యూయార్క్ ఓటర్లు ధిక్కరించారు”అని మమ్దానీ ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
“ఒక నియంతకు ఆందోళన కలిగించాలంటే, ట్రంప్ లేదా అటువంటి నియంతల చేతిలో పోగుపడిన అధికారాలను లాక్కోవడమే మార్గమ”ని మమ్దానీ అన్నారు.
ట్రంప్నుద్దేశించి మాట్లాడుతూ మందాని ‘‘ట్రంప్, నా ఉపన్యాసం వింటున్నావని నాకు తెలుసు. ఇంకా గట్టిగా వినిపించేలా మాట్లాడతాను’’అని బల్ల గుద్ది చెప్పారు.
మమ్దానీ ధాటికీ తట్టుకోని క్యుమో..
జూన్లో జరిగిన ప్రైమరి ఎన్నికల్లో పరాజయం పాలైన ఆండ్రూ క్యుమో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్ధిగా నిలిచిన క్యుమోకు పెద్దఎత్తున కార్పొరేట్ వర్గాలు నిధులు సమకూర్చినా, ఆయన మమ్దానీ ముందుకు తెచ్చిన ప్రత్యామ్నాయ ఎజెండా ధాటికి తట్టుకుని నిలవలేకపోయారు.
రానున్న కాలంలో ట్రంప్ ప్రభుత్వం విసిరే సవాలును ఎలా ఎదుర్కోనున్నారో మమ్దానీ తన ఉపన్యాసంలో రేఖా మాత్రంగా వివరించారు. ఇంటి యజమానులు అద్దెకుండే వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో కూడా గమనిస్తామని మమ్దానీ హెచ్చరించారు. కోటీశ్వరులకు ఉపయోగపడుతున్న అవినీతిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్మిక సంఘాల పక్షాన నిలిచి వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్మికులు తమ హక్కులనే ఆయుధాలుగా ప్రయోగించబూనుకున్నప్పుడు యజమాని ఎంత గొప్పవాడైనా దిగిరాక తప్పదని మమ్దానీ అన్నారు.
‘‘న్యూయార్ నగరం వలస వచ్చిన వారి నగరం. వలస వచ్చిన వారు నిర్మించిన నగరం. వలనవచ్చిన వారే అందంగా తీర్చి దిద్దిన నగరం. ఈ నగరానికి ఇప్పుడు ఓ వలస వచ్చిన పౌరుడే నాయకత్వం వహించనున్నారు’’ అని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
‘‘ట్రంప్, మీరు మాలో ఏ ఒక్కరిపైనా దాడి చేయాలనుకున్నా అందరిపైనా దాడి చేయాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకో’’ అని హెచ్చరించారు. మరో రెండు నెలల్లో మేయర్ బాధ్యతలు చేపట్టబోయే నాటికి ప్రజల్లో మరిన్ని ఆశలు రేకెత్తే అవకాశం ఉందని, అయినా వాటిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయాలపై స్పందిస్తూ, ట్రంప్ ఎన్నికలసంస్కరణల బిల్లులను ఆమోదించే విషయంలో మీనమేషాలు లెక్కించరాదని సెనెటర్లను హెచ్చరించారు. ఓటరు గుర్తింపు కార్డులను రంగంలోకి తేవాలని, మెయిల్ ద్వారా ఓటు వేసే విధానానికి స్వస్తి చెప్పాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
