We Must Shed Excessive Deference to Authority: Justice Ujjal Bhuyan
ఎల్ఎల్ఎం కార్యక్రమం కోసం ఎన్ఎల్యూ 13వ స్నాతకోత్సవ వేడుకలో జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలు.
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థతో పాటు అధికారం పట్ల మితిమీరిన విధేయతకు స్వస్తి చెప్పాలని లా విశ్వవిద్యాలయాల పాత్ర గురించి మాట్లాడుతూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.
విశ్వవిద్యాలయాలు ఆలోచనలకు పుట్టినిళ్లు లాంటివని, ఆలోచనలను పరస్పరం పంచుకుంటూ ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ ఒకే రకమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.
“తొలుత నేను ఈ విషయం చెప్పాలని అనుకున్నాను, కానీ దానిని పక్కనపెట్టాను, అధికారం పట్ల మితిమీరిన విధేయతకు మనం స్వస్తి చెప్పాలి, అది సాధారణంగా కావచ్చు లేదా ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థ పట్ల కావచ్చు. అయితే ఇది వేరే అంశం, దాని గురించి మనం మరో రోజు చర్చించుకుందాం, ఈ స్నాతకోత్సవంలో కాదు” అని జస్టిస్ భుయాన్ పేర్కొన్నట్లు లైవ్ లా కథనం తెలియజేసింది.
స్నాతకోత్సవ వేడుకలో సందేశం..
ఎల్ఎల్ఎం విద్యార్థుల కోసం ఆగస్టు 30న ఢిల్లీ ఎన్ఎల్యూలో జరిగిన 13వ స్నాతకోత్సవం వేడుకలో జస్టిస్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
విశ్వవిద్యాలయాలు ఆలోచనలు పంచుకునే వేదికలని, ఆరోగ్యకరమైన విద్యా సంబంధిత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఒకే నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు.
స్వేచ్ఛా ఆలోచనలకు పుట్టినిళ్లు..
“స్వేచ్ఛను, భిన్నాభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్య సమాజం మనకు కావాలనుకుంటే, ఆ సంస్కృతి విశ్వవిద్యాలయాల నుంచే మొదలు కావాలి” అని ఆయన అన్నారు.
“నా దృష్టిలో, స్వేచ్ఛగా ఆలోచించే అలవాటు మొదలయ్యే మొదటి ప్రదేశాలలో విశ్వవిద్యాలయం ఒకటిగా ఉండాలి. కేవలం పరిచయం ఉన్నదన్న ఒకే కారణంతో ఒక ఆలోచనను ఆమోదించని ప్రదేశంగా అది ఉండాలి. సమాధానం అసౌకర్యంగా ఉంటుందన్న కారణంతో కఠినమైన ప్రశ్నలు వేయడానికి విద్యార్థులు వెనుకాడకూడదు”…
వివాదాల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు..
నల్సార్ విశ్వవిద్యాలయం లా విద్యార్థుల మొత్తం బ్యాచ్‌ను నిషేధించడానికి ప్రయత్నించి, తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ఎదుర్కొంటున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ మనన్ కుమార్ మిశ్రా వివాదం నేపథ్యంలో జస్టిస్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ స్నాతకోత్సవానికి ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ను ఆహ్వానించడాన్ని కొంత మంది విద్యార్థులు వ్యతిరేకించారు.
దీని తర్వాత, నల్సార్, ఎన్ఎల్ఎస్ఐయూ బెంగళూరు సహా పలు లా విశ్వవిద్యాలయాల విద్యార్థులు మిశ్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌పై ఆయన చర్యలు కోరినందుకు నిరసనగా, మిశ్రా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులను నమోదు చేసుకోరాదని మొదట జారీ చేసిన ఆదేశాలను మిశ్రా ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
