అప్పికట్ల జోసెఫ్ యువకునిగా ఉన్నప్పటి నుంచే దేశ స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీ పిలుపునందుకుని, సన్నిహితులైన మహ్మద్ యాసిన్, సిరిపురం కోటేశ్వరరావులతో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
గన్నవరం, విజయవాడ, అల్లీపురం, బళ్లారి జైళ్లలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాకాని వెంకటరత్నం, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం, గొట్టిపాటి బ్రహ్మయ్య, గౌతు లచ్చన్న మొదలైన ప్రముఖులు జోసెఫ్ స్వాతంత్య్రోద్యమ సహచరులుగా ఉన్నారు.
జననం, విద్యాభ్యాసం..
కృష్ణాజిల్లా, గుడివాడ మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1917 జూలై 7వ తేదీన అప్పికట్ల జోసెఫ్ జన్మించారు.
అప్పికట్ల దుర్గమ్మ, భూషణం జోసెఫ్ తల్లిదండ్రులు. ఉయ్యూరు మిషన్ హాస్టల్లో ఉండి మెట్రిక్యులేషన్ చదివిన అప్పికట్ల జోసెఫ్, కాకినాడలో టీచర్ ట్రైనింగ్ శిక్షణ పొందారు.
జోసెఫ్ చిన్ననాటే తండ్రిని కోల్పోయారు. సెలవుల్లో కూలీ పనులు చేసి, తల్లికి, తోబుట్టువులకు పెద్ద అండగా నిలిచిన జోసెఫ్ వ్యక్తిత్వం ప్రశంసనీయమైనది.
1950లో మార్తమ్మతో జోసెఫ్‌కు వివాహం అయింది. వీరికి ఏడుగురు సంతానం. జోసెఫ్, మార్తమ్మ దంపతులు తమ పిల్లలకు పెట్టిన పేర్లను గమనిస్తే, ఈ దంపతుల దేశభక్తి ఎంత గాఢమైనదో అర్థమవుతుంది. వారి పేర్లు వరుసగా ప్రేమ కుమారి, భరత్ భూషణ్, ఇందిరాగాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, జవహర్, కెన్నెడీ.
విద్యార్థి దశ నుండే రాజకీయోద్యమాల్లో రాణించిన జోసెఫ్‌లోని దేశాభిమానం, సామాజిక సేవా దృక్పథం టంగుటూరి ప్రకాశం పంతులు, రైతు నాయకుడు ఆచార్య ఎన్.జీ. రంగాను ఆకట్టుకున్నాయి.
రాజకీయ, సామాజిక సేవలు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం..
కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీకి కార్యనిర్వాహక కార్యదర్శిగా జోసెఫ్ ఆరేళ్లు పని చేశారు. చర్మకారుల ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసం రాష్ట్ర చర్మకార పరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) డైరెక్టర్‌గా ఆరేళ్ల పాటు సేవలందించారు.
1948 నుండి 1952 వరకు రాజ్యసభ సభ్యునిగానూ, 1966 నుండి 1972 వరకూ రాష్ట్ర శాసన మండలి సభ్యునిగానూ జోసెఫ్ విశేష సేవలందించారు.
బాబా సాహెబ్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, కాకాని వెంకటరత్నం, పేట బాపయ్య మొదలగు రాజకీయ దిగ్గజాలతో జోసెఫ్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు.
నాటి కేంద్రమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ విజయవాడ వచ్చినప్పుడల్లా జోసెఫ్ ఇంటిని సందర్శించే వారు. 1968లో కంచికచర్లలో ఆరుకుట్ల కోటేశు సజీవ దహనం కేసు విచారణ సందర్భంలో జగ్జీవన్ రామ్ అనుచరుడిగా జోసెఫ్ కంచికచర్ల బాధితుని కుటుంబాన్ని పరామర్శించారు.
సమర్థవంతమైన నాయకత్వం..
అంతేకాదు నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు వసతి గృహాన్ని, తండ్రి భూషణం పేరిట స్కూలును చాలా కాలం జోసెఫ్ నిర్వహించారు. టంగుటూరి ప్రకాశం పంతులుపై అభిమానంతో తాను నిర్వహించిన వసతి గృహానికి “ఆంధ్ర కేసరి హరిజన, హరిజన క్రైస్తవ వసతి గృహం”గా పేరు పెట్టుకున్నారు.
దేశ స్వాతంత్య్రానికి మునుపు నుంచీ జాతీయ నాయకుల దృష్టిలో ఉండి, తొలి రాజ్యసభకు ఎంపికైన స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కర్త, యువ నాయకుడు, విద్యావంతుడు అప్పికట్ల జోసెఫ్.
రెండు వందల మందికి పైగా గట్టి స్వాతంత్య్రోద్యమ సొంత అనుచరులు నిత్యం జోసెఫ్ నాయకత్వాన్ని వెన్నంటి అనుసరించి ఉండేవారు.
ప్రజా సమస్యల పరిష్కారం..
రోజూ వందలాది మంది బాధితులు, సమస్యల్లో ఉన్న ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని జోసెఫ్ ఇంటికి వచ్చి కోరేవారు.
జోసెఫ్ వారిని వెంట తీసుకొని వెళ్లి, ప్రత్యక్షంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు.
ఇంటికొచ్చిన బాధితులకు భోజన వసతి సమకూర్చే వారు. విజయవాడ పాల కేంద్రం స్థాపనలోనూ, విజయవాడ రైల్వేను వాణిజ్యపరంగా అభివృద్ధి కావడానికి జంక్షన్‌గా తీర్చిదిద్దడంలోనూ, తనకు జాతీయ నాయకులతో ఉన్న పరిచయాన్ని జోసెఫ్ సద్వినియోగం చేశారు.
చరిత్రకారుల గుర్తింపు – మరణం..
1996 ఆగస్టు 31వ తేదీన, 79 ఏళ్ల వయసులో తనువు చాలించిన అప్పికట్ల జోసెఫ్ అందరికీ చిరస్మరణీయుడు.
“1940లో కోస్తా ప్రాంతంలో ముసునూరు, ఆగిరిపల్లిని కేంద్రంగా చేసుకుని, స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన ఏకైక మాదిగ క్రైస్తవ కాంగ్రెస్ యువ నాయకుడు అప్పికట్ల జోసెఫ్” అంటూ ప్రఖ్యాత చరిత్రకారుడు బిపిన్ చంద్ర తాను రాసిన “ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ద లాంగ్ టర్మ్ డైనమిక్స్” పుస్తకంలో జోసెఫ్ గురించి రాశారు.
యువతరానికి ఆదర్శం..
బలహీన వర్గాల వారి విద్య, ఆర్థిక అభివృద్ధి కోసం, వారిపై కొనసాగుతున్న కుల వివక్ష, అత్యాచారాల నుంచి రక్షించడానికి తీవ్రంగా కృషి చేసిన అప్పికట్ల జోసెఫ్ ఇప్పటి యువతరానికి ఆదర్శనీయమైన ప్రాసంగికత ఉన్న గొప్ప రాజకీయ సామాజిక సంస్కర్త.
(ఆగస్టు 31 అప్పికట్ల జోసెఫ్ 30వ వర్ధంతి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
