రెండు వారాల క్రితం హైదరాబాదులో జరిగిన ఒక ఇష్టాగోష్ఠిలో ఒక మిత్రుడు కలిశాడు. నేను కళ్లజోడు వాడే వయసా కాదా అని నాకు స్పష్టంగా తెలియదు కానీ ప్రస్తుతానికి కళ్లజోడుతో అవసరం లేకుండానే పని నడుస్తోంది. కాబట్టి నాకు కళ్లజోళ్లు, వాటి రీతిరివాజులు, హంగు ఆర్భాటాలు, వాటికి అయ్యే ఖరీదుల గురించి పెద్దగా తెలియదు.
ఆ గోష్ఠిలో పక్కనే కూర్చున్న మరో మిత్రుడు సదరు కళ్లజోడు ఉన్న మిత్రుడి గురించి వ్యాఖ్యానిస్తూ అంతా రికార్డు చేస్తున్నావా అంటూ చెలోక్తి విసిరాడు. టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్లలో సహజంగానే ఆసక్తి పెరిగింది. ఆ టేబుల్ చుట్టూ ప్రముఖ న్యాయవాదులు కూడా ఉన్నారు.
లక్షలు విలువ చేసే ‘రేబాన్’ స్మార్ట్ కళ్లజోడు..
అప్పుడు తెలిసిన విషయం ఇది. రేబాన్ కంపెనీ కొత్తగా ఒక కళ్లజోడును మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ కళ్లజోడు ఖరీదు 25 నుంచి 35 వేల మధ్య ఉంది. ఎందుకు అంత ఖరీదు అంటే ఆ కళ్లజోడుతోనే మాట్లాడొచ్చు, వీడియో తీయొచ్చు, రికార్డు చేయొచ్చు, సంభాషణలు వినవచ్చు, పాటలు వినొచ్చు, అంతర్జాతీయ సంగీత కచేరీలు కూడా వినొచ్చు.
భారతదేశంలో తెహల్కా 2001లో కార్గిల్ శవ పేటికల కుంభకోణం గురించి వెలుగులోకి తెచ్చేంత వరకు బటన్ కెమెరాలు, కాలర్ కెమెరాలు, పెన్ కెమెరాల గురించి సాధారణ ప్రజానీకానికి పెద్దగా తెలియదు.
ఇప్పుడు కూడా రేబాన్ మెటా గ్లాస్‌ల గురించి అందరికీ పెద్దగా తెలియదు. ఆ తర్వాత టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్లకు ఒక్కొక్కసారి ఒకళ్లకి ఆ కళ్లజోడు పెట్టి కెమెరా రికార్డు అవుతున్న తీరు, మ్యూజిక్ వినాలంటే ఉండే ఆప్షన్స్, అవకాశాలు అన్నీ వివరించడం జరిగింది.
ఢిల్లీ కేఫ్‌లో ఘటన.. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ రీల్..
ఈ విషయంపైనే ఢిల్లీలో గత నెల జరిగిన ఒక సంఘటన పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో ఒక కాఫీ షాప్‌లో కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ఇటువంటి రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకొని ఎదుట ఉన్న వ్యక్తిని వేధిస్తూ వ్యవహరించాడు.
అంతేకాకుండా ఆ వ్యవహారం అంతా రేబాన్ మెటా కళ్లజోడు ద్వారా వీడియో రికార్డు చేయించి దానిని ఇన్స్టాగ్రామ్ రీల్‌గా పోస్ట్ చేశాడు. ఆ రీల్‌ను నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది చూశారు.
ఇదే విషయంపై బాధిత వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేయగా, కమ్యూనిటీ స్టాండర్డ్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించుకున్న ప్రమాణాలకు లోబడే ఉన్నదని, ఎవరి వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలగలేదని ఫిర్యాదును తోసిపుచ్చింది.
ఫేస్బుక్ మెటాకు కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేయగా కనీస స్పందన కూడా లేదు. ఈ రీల్‌ను తొలగించాలని, బాధిత వ్యక్తికి క్షమాపణ చెప్పాలని, ఆ వీడియోలు సాక్ష్యంగా భద్రపరచాలని, రెండు కోట్ల ఐదు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది.
ఈ కేసులో ప్రో బోనో ప్రాతిపదికన బాధిత వ్యక్తికి న్యాయపరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది.
బాధితుడికి తెలియకుండానే వీడియో రికార్డింగ్..
ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సదరు బాధిత వ్యక్తి 2026 జూలై 24వ తేదీన ఢిల్లీకి చెందిన ఖాన్ మార్కెట్లోని కోస్టా కాఫీ షాపులో కూర్చున్నారు. అకస్మాత్తుగా ముక్కు ముఖం తెలియని వ్యక్తి పక్కన చేరి వేధించటం మొదలుపెట్టాడు.
సదరు బాధిత వ్యక్తి కాఫీ షాప్‌లో ఎటు వెళ్తే అటు ఈ నిందితుడు వెంట వెళ్లాడు. చివరకు ఈ వేధింపులు భరించలేక బాధిత వ్యక్తి తను ఎంచుకున్న సీటు ఖాళీ చేసి మరో టేబుల్ వద్దకు వెళ్లాడు.
ఎవరో ఆకతాయిగా చేసిన పని అనుకుని అక్కడితో చికాకు తొలగిపోయింది అనుకున్నాడు బాధితుడు. కానీ అతనికి తెలీకుండా జరిగిన మరో పరిణామం ఉన్నది. ఆ సదరు వ్యక్తి అప్పుడే మార్కెట్లోకి వచ్చిన రేబాన్ మెటా కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు.
2025 మేలో మార్కెట్లోకి వచ్చిన రేబాన్ మెటా కళ్లజోడు.. దానికే కెమెరాలు కూడా ఉంటాయి. తల సర్దుకున్నట్టో, చెవి మీద వాలిన ఈగనో దోమనో తరిమినట్టో చెయ్యెత్తి కళ్లజోడును కావాల్సిన చోట తడిమితే అది రికార్డు చేసే కెమెరాలాగా పని చేస్తుంది. అలాగే ఆ నిందితుడు సదరు వ్యక్తిని వేధిస్తూ కెమెరా ఆన్ చేసి రికార్డు చేశాడు.
అలా జులై 26న రహస్యంగా రికార్డు చేసిన కంటెంట్‌ను రీల్‌గా మార్చి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు నిందితుడు. ఆగస్టు నాలుగో తేదీకి మూడు లక్షల మంది ఈ రీల్ చూస్తే, ఆగస్టు ఆరో తేదీకి వీక్షకుల సంఖ్య నాలుగు లక్షలు పైబడింది. సుమారు 500 మంది తమ కామెంట్స్ కూడా ఈ రీల్‌కు జోడించారు.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతారాహిత్యం..
ఈ మొత్తం వ్యవహారంలో మూడు అంశాలు ఉన్నాయి. మొదటిది ఇలాంటి అర్థం పర్థం లేని కంటెంట్‌ను తయారు చేయటం ద్వారా ఆన్లైన్లో వీక్షకుల దృష్టిని ఆకర్షించడం.
ఫ్యాషన్ కోసం ధరించినట్లు కనిపించే ఈ కళ్లజోడు ద్వారా సాధారణ మనిషి కూడా తన చుట్టూ ఉన్న పరిసరాలను కెమెరాలలో నిక్షిప్తం చేసి కొత్త తరహా నిఘాకు తెరతీయడం.
మూడోది, ఇలా ఎవరైనా వ్యక్తిగత గోప్యతకు ఫలానా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా భంగం కలిగింది అని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా అంతర్జాల వేదికలు ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలం చెందటం.
భారతదేశంలో రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ తయారీదారులపై నమోదైన తొలి కేసుగా దీనిని భావించవచ్చు. దీనిపై ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి దాంట్లో రీల్ పోస్ట్ చేసిన వ్యక్తికి, మెటా ప్లాట్‌ఫామ్‌లు ఉమ్మడిగా బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది.
వేధింపులే లక్ష్యంగా ఇన్స్టాగ్రామ్ ఖాతా..
సదరు ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేసిన ఖాతా 2023 మార్చిలో మొదలైంది. ఇప్పటివరకు రెండు లక్షల 25 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు.
2025 డిసెంబర్లో ఈ ఖాతాకు మెటా వెరిఫైడ్ అన్న బ్యాడ్జి కూడా వచ్చింది. అంటే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల యజమాని అయిన మెటా కంపెనీ రూపొందించిన అంతర్జాల ప్రమాణాలను ఈ ఖాతాదారుడు బహు చక్కగా పాటిస్తున్నాడు అన్న ధ్రువీకరణ.
ఈ ఖాతాదారుడు గతంలో కూడా అనేక అంతర్జాల వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2024 మేలో ఒక కారు దుర్ఘటనలో గాయపడిన వారిని వేధిస్తూ వ్యవహరించిన తీరుపై పోలీసు ఫిర్యాదు నమోదయ్యింది.
అంతర్జాల వేదికలలో బహిరంగంగానే లైవ్ స్ట్రీమ్‌లో అత్యాచారానికి పాల్పడతాను అంటూ బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సాంఘిక ప్రవర్తన కలిగిన వ్యక్తికి అంతర్జాల ప్రవర్తన విషయంలో మెటా కంపెనీ సర్టిఫికెట్ ఇవ్వటం ఆందోళన కలిగించే అంశం.
పై ఉదాహరణలను బట్టి తోటి వారిని వేధించడమే ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది తప్ప, ఆకతాయిగా పొరపాటుగా జరిగిన ఒకానొక సందర్భం మాత్రం కాదు.
స్పందించని ‘మెటా’, పట్టించుకోని గ్రీవెన్స్ ఆఫీసర్..
ఈ ఘటనలో వేధింపులకు గురైన వ్యక్తి 2026 జూలై 27వ తేదీన రేబాన్ మెటాకు ఇచ్చిన నోటీసుకు ఇంతవరకు స్పందన రాలేదు. అలానే ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఫిర్యాదులు చేయడానికి మెటా ప్లాట్‌ఫామ్ డ్రాప్ డౌన్ పద్ధతి ద్వారా కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అటువంటి ఆప్షన్స్‌లో బుల్లీయింగ్, హెరాస్మెంట్ అనే ఆప్షన్ ఆధారంగా సదరు బాధిత వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
భారతదేశంలో మెటా గ్రీవెన్స్ ఆఫీసర్‌కు కూడా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడంపై ఫిర్యాదు చేశాడు.
ఈ ప్లాట్‌ఫామ్స్ లేదా అంతర్జాల వేదికలలో మరొక ప్రధాన సమస్య ఏమిటంటే.. మనం చేసే ఫిర్యాదులకు సంబంధించి ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ లేదా ఫిర్యాదు రిసీవ్ చేసుకున్నాము అన్న ధ్రువీకరణ రాదు.
జూలై 28వ తేదీన ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులు ఇచ్చిన సమాధానంలో సదరు ఖాతాదారుడు ఎటువంటి కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఉల్లంఘనకు పాల్పడలేదని తేల్చేసింది.
రేబాన్ మెటా సంయుక్త విభాగంలో తయారైన ఇటువంటి సాధనాలకు సంబంధించి మెటాకు ప్రోడక్ట్ లయబిలిటీ ఉన్నది. అందువల్ల సదరు బాధిత వ్యక్తి మెటాకు కూడా లీగల్ నోటీసు జారీ చేశాడు.
ఇవన్నీ పరిశీలించినప్పుడు రాను రాను నిజ జీవితంలో పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగంతో నిరంతరం సగటు మనిషి గోప్యత, జీవితం ప్రమాదంలో పడుతోంది అని అర్థమవుతుంది.
కాబట్టి మీ చుట్టూ తిరిగేవాళ్లు, కలిసే వాళ్లు, నడిచే వాళ్లకు నల్ల కళ్లజోడు ఉంటే, అది రేబాన్ కంపెనీది అయి ఉంటే కచ్చితంగా అడగాల్సిన ప్రశ్న ఈ కళ్లజోడుతో వీడియో రికార్డింగ్ చేయవచ్చా అని.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
