అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుభాష్ చంద్ర తన ఆస్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విక్రయించకుండా, బదలాయించకుండా నిషేధం విధించింది.
న్యూఢిల్లీ: ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో టై-బ్రేకర్‌గా వ్యవహరించిన ఒక ఏకసభ్య బెంచ్ జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
రూ 22 వేల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలకు గాను కేవలం రూ 6.5 కోట్లు చెల్లించి దివాలా చర్యల నుంచి బయటపడేందుకు ఆయనను అనుమతించింది. ఆ తీర్పు వెలువడిన వారం రోజుల్లోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేడు(సెప్టెంబర్ 1న) ఆగస్టు 25 నాటి ఉత్తర్వులపై స్టే విధించింది.
అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం- తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుభాష్ చంద్ర తన ఆస్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విక్రయించకుండా లేదా బదలాయించకుండా నిషేధం విధించింది.
తీవ్ర దుమారం రేపిన తీర్పు..
తన గ్రూప్ కంపెనీ తీసుకున్న రుణాలకు ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును పరిష్కరించుకునేందుకు చంద్ర చేసిన విజ్ఞప్తిని ఆ ఏకసభ్య బెంచ్ అంగీకరించింది.
మొత్తం రూ 22 వేల కోట్లకు పైగా ఉన్న బాధ్యతలో కేవలం రూ 6.5 కోట్లు చెల్లించేలా ఇచ్చిన ఈ ఉత్తర్వులు తీవ్ర దుమారానికి దారితీశాయి.
తన కష్టాల వెనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారని చంద్ర ఆరోపించడం కూడా చర్చనీయాంశమైంది.
చంద్ర వాదన ఏమిటి?..
బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) సంస్థలతో సహా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తాను వ్యక్తిగతంగా రూ 22 వేల కోట్లు అప్పుగా తీసుకోలేదని చంద్ర వాదించారు.
వివిధ సంస్థలు తీసుకున్న రుణాలకు తాను వ్యక్తిగత హామీ మాత్రమే ఇచ్చానని, ఆ మొత్తమే రూ 22 వేల కోట్లు అని ఆయన పేర్కొన్నారు.
ఇంత చిన్న మొత్తాన్ని అంగీకరించి రుణాన్ని సెటిల్ చేయడానికి అనుకూలంగా ఓటు వేసిన రుణదాతలలో కొందరు- ఆయన సమీప బంధువుల యాజమాన్యంలో లేదా నిర్వహణలో ఉన్న కంపెనీలకు చెందినవారు కావడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.
ఎన్సీఎల్టీ చరిత్రలో తొలిసారిగా..
నిన్న, ఎన్సీఎల్టీ అధ్యక్షుడు జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్ ఆదేశాల మేరకు, ఈ సమస్యను మళ్లీ కొత్తగా పరిశీలించేందుకు ఏకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీఎల్టీ నిర్ణయించింది. ఎన్సీఎల్టీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఈ సెటిల్మెంట్ను ఒక సభ్యుడు షరతులతో ఆమోదించగా, మరొకరు పూర్తిగా తిరస్కరించారు. అదే సమయంలో మూడో సభ్యుడు వేర్వేరు షరతులతో ఆమోదించారు. కాబట్టి, ఇందులో స్పష్టమైన మెజారిటీ తీర్పు రాలేదని ఎన్సీఎల్టీ అభిప్రాయపడింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
