‘ప్రభుత్వమే కుంభకోణాల్లో కూరుకుపోయింది.’ పిల్లలు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లేలా పరిస్థితికి భిన్నంగా, పొరుగున ఉన్న పాఠశాలల్లోనే చదువుకునేలా ‘నైబర్ హుడ్ స్కూలింగ్‘ విధానాన్ని ప్రతిపాదిస్తూ జోషి తన సొంత ఆలోచనలను వివరించారు.
“ప్రభుత్వమే కుంభకోణాల్లో కూరుకుపోయింది.” “విద్య ప్రభుత్వ ప్రాధాన్యత కాదు. విద్యా బడ్జెట్ తగ్గుతూనే ఉంది.” “వికసిత్ భారత్’ సందర్భంలో ‘వికసిత్’ అంటే ఏమిటి?” “మీరు ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఉపాధ్యాయులు లేరు. విద్యార్థులు ఏమి చేయాలి?” “మీరు కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు కానీ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి?” “వాజపేయి కాలంలో పేపర్ లీక్‌లు ఎందుకు జరగలేదు?”
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి మాటలివి.
జెన్ ఆల్ఫా నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ, జెన్ జెడ్ నిరసనలు కాస్త చల్లారిన కొద్ది రోజులకే, హిందీ దినపత్రిక ‘అమర్ ఉజాలా’ కన్సల్టింగ్ ఎడిటర్ వినోద్ అగ్నిహోత్రి.. మురళీ మనోహర్ జోషితో జరిపిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు.
2014లో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత, మాజీ బీజేపీ అధ్యక్షుడు అయిన జోషిని పార్టీ కొత్తగా ఏర్పాటు చేసిన ‘మార్గదర్శక్ మండల్’కి పంపించి వేశారు. ఆ విధంగా ఆయనను క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా పెట్టారు.
ప్రభుత్వ విధానాలపై ప్రశ్నల వర్షం..
అమర్ ఉజాలాతో జరిపిన ఈ ఇంటర్వ్యూలో, మోదీ ప్రభుత్వ విద్యా విధానం, దాని ప్రాధాన్యతలపై జోషి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తారు.
విద్యా బడ్జెట్ తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విద్యా రంగంలో పెరుగుతున్న ప్రైవేటీకరణ, పేపర్ లీక్‌లు, విచ్చలవిడిగా మారిన అవినీతి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, నడుస్తున్న దిశలపై తీవ్ర విమర్శలు చేశారు. పేపర్ లీక్‌ల అంశాన్ని కేవలం పరీక్షల వ్యవస్థ లోపంగా పరిగణించడానికి బదులుగా, జోషి దానిని సమాజంలో, పాలనలో పెరుగుతున్న అవినీతితో ముడిపెట్టారు.
ప్రతి రంగంలోనూ అవినీతి రాజ్యమేలుతున్నది. యథా రాజా-తథా ప్రజా అన్నట్లు ప్రజలు కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారని చెబుతూ అంతిమంగా ప్రభుత్వం, వ్యవస్థ ఇందుకు బాధ్యత వహించాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్థిక ఉత్పాదకతే విద్య లక్ష్యం..
పేపర్ లీక్‌లకు మూలకారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు, విద్యా రంగం విషయంలో స్పష్టమైన దిశ లేకపోవడమే ప్రధాన కారణమని జోషి చెప్పారు.
విద్యను ఉపాధితో అనుసంధానించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. “విద్య ఆర్థికంగా ఉత్పాదకతను కలిగి ఉండాలి” అని ఆయన అన్నారు.
“విద్య ఆర్థిక ఫలితాలను ఇవ్వకపోతే, దానికి విలువ ఏమిటి?” అని ప్రశ్నించారు.
ఢిల్లీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని, పీహెచ్డీ హోల్డర్ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నారని ప్రస్తుత యథార్థ పరిస్థితిని జోషి ఎత్తిచూపారు.
“బీఈడీ డిగ్రీ ఉన్న ఒక పారిశుద్ధ్య కార్మికుడిని చూసి ఒకప్పుడు నేను చాలా కలత చెందాను” అని ఆయన అన్నారు.
“అతను నెలకు రూ 25,000–30,000 వేతనంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. కాబట్టి, ఈ పరిస్థితి ఎటు వైపు వెళ్తోంది?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త కళాశాలలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, పట్టభద్రులయ్యే యువతకు లభిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆయన అన్నారు.
“ప్రభుత్వ ఉద్యోగమే ఏకైక సురక్షితమైన ఉద్యోగం, అది జీవితాంతం భద్రతను ఇస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
తన వ్యక్తిగత ఉదాహరణను ప్రస్తావిస్తూ జోషి, “నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, ఫిజిక్స్ కోర్సులోనే ఎక్కువ మంది చేరేవారు. ఒక దశాబ్దం తర్వాత ఎలక్ట్రానిక్స్ కోర్సుల వైపు, ఆపై పదిహేనేళ్ల తర్వాత ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవడం ప్రారంభించారు” అని చెప్పారు.
“ప్రభుత్వ వ్యూహాన్ని పరిశీలించడం చాలా అవసరం. ప్రజలు సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్నప్పుడు గత్యంతరం లేక వారు సహజంగానే అందుబాటులో ఉన్న అవకాశాల వైపు మొగ్గు చూపుతారు” అని ఆయన తెలిపారు.
నిజాయితీ ఎలా ఆశించగలం?
పేపర్ లీక్‌లను, విద్యావ్యవస్థలో పెరిగిపోతున్న అవినీతితో ముడిపెడుతూ, వ్యవస్థే అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు విద్యార్థుల నుంచి నిజాయితీని ఆశించడం కష్టమని జోషి వ్యాఖ్యానించారు.
“ఇలాంటి పరిస్థితుల్లో మోసం జరగడం సహజం” అని ఆయన అన్నారు. “ప్రజలు విషయాలను గమనిస్తారు. లంచం ఇస్తే కాంట్రాక్ట్ దక్కించుకోవచ్చని అర్థమైన తర్వాత, తమ దరఖాస్తులు ఆమోదం పొందడానికి అలాంటి మార్గాలనే ఎంచుకోవాలని వారు భావిస్తారు. అలాగే ఉపాధ్యాయుడు లంచం ఇవ్వడం ద్వారా ఆ పదవిని పొందాడని విద్యార్థి గ్రహించినప్పుడు, ‘నేను కూడా అలాంటి పద్ధతుల ద్వారా ఎందుకు సఫలం కాకూడదు?’ అని వారు అనుకోవచ్చు” అని ఆయన అన్నారు.
“మంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, న్యాయవ్యవస్థలోని వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మార్గాన్నే అనుసరించాలని ప్రజలు భావిస్తారు. ఆ దారి చూపిన వారే ఇలా ఎందుకు జరుగుతోందని అడుగుతున్నారా? ఆ దారి చూపింది మనమే అయినప్పుడు నిందించాల్సింది పిల్లలను కాదు. మనల్ని మనమే నిందించుకోవాలి” అని ఆయన నొక్కి వక్కాణించారు.
ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే తన పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ జోషి, “నేను ఎంతో నమ్రతతో అడుగుతున్నాను–వాజపేయి కాలంలో పేపర్ లీక్‌లు ఎందుకు జరగలేదు?” అని ప్రశ్నించారు.
ఆ సమయంలో ప్రాథమిక సూత్రాలపై దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. “ఇప్పుడు బ్యాంకుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి, కాబట్టి విద్యలో కూడా కుంభకోణాలు జరగడం అనివార్యం” అని ఆయన అన్నారు.
“వ్యాపారంలో కుంభకోణాలు జరుగుతున్నాయి, ప్రభుత్వమే కుంభకోణాల్లో కూరుకుపోయింది. అలాంటప్పుడు, పేద విద్యార్థులను ఎందుకు నిందిస్తున్నారు? వారు కూడా అదే బాటలో నడవక తప్పదు” కదా అన్నారు.
ఈ సమస్యను విస్తృత సామాజిక చట్రంతో ముడిపెడుతూ జోషి, “ప్రాథమిక విషయాలను పరిశీలించాలి. ముఖ్యంగా లాభాల చుట్టూ మాత్రమే నిర్మించబడిన సామాజిక నిర్మాణాన్ని చూడాలి” అని చెప్పారు.
“వ్యక్తులు డబ్బు సంపాదించాలి, వేరొకరి జేబు కొట్టి అయినా సరే ప్రతి ఒక్కరూ సంపద కోసం ప్రయత్నించాలి అనే సామాజిక లక్ష్యాన్ని మీరు నిర్దేశించారు.”
ఇది పరీక్షా లేక యుద్ధమా?..
జంతర్ మంతర్ వద్ద పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, జోషి ఈ పరిస్థితికి తీవ్రమైన కేంద్రీకరణే కారణమని పేర్కొన్నారు.
ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుందని భావించడం సాధారణమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
పరీక్షా పత్రాలు ముందుగా బయటకు రాకుండా చూడటానికి వాటి ముద్రణ, రవాణా, భద్రపరచడం, వాటిని కాపాడటానికి సైన్యాన్నే ఎలా మోహరించాలి, విమానాలను ఎలా ఉపయోగించాలి అనే దానిపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆయన అన్నారు.
ఇది జోషికి నవ్వు తెప్పించింది, “ఇది నమ్మశక్యం కానిది. ఇది ఏదో పరీక్ష కానట్టు, ఏదో యుద్ధం ప్రారంభమైనట్టుంది” అన్నారు.
విద్యా బడ్జెట్ ప్రాధాన్యత ఏమిటి?
ప్రభుత్వ విద్యా బడ్జెట్, దాని ప్రాధాన్యతలపై కూడా జోషి ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో విద్య లేకపోవడం వల్లే సాధారణ బడ్జెట్లో విద్యకు నిధుల కేటాయింపు తక్కువగా ఉందా అని ప్రశ్నించగా, “గత కొన్నేళ్ల బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే, విద్య, ప్రాథమిక విద్య, ఆరోగ్య రక్షణకు కేటాయింపులు తగ్గుతుండగా, రోడ్లు, రోడ్డు రవాణాపై వ్యయం పెరిగింది” అని ఆయన చెప్పారు.
“ఎన్ని రోడ్లు నిర్మించాలి, ఎలాంటి రోడ్లు నిర్మించాలి, దేశ అవసరాలు ఏమిటి లాంటి అంశాలను లెక్కించాలి. అయితే, నిర్మాణ వ్యయాన్ని, ఎవరి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలో కూడా ఆలోచించడం అవసరం” అన్నారు.
ఏ అభివృద్ధి విధానంలోనైనా ముందుగా దేశ ప్రాధాన్యతలను నిర్ణయించడం చాలా ముఖ్యం. “ప్రాధాన్యత పారిశ్రామికీకరణ, ముఖ్యంగా ప్రైవేట్ రంగ పారిశ్రామికీకరణ అయితే, అన్ని ప్రయత్నాలు ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి. దేశ సమగ్ర అభివృద్ధే ప్రాధాన్యత అయితే, విద్యా బడ్జెట్ ఆ లక్ష్యం వైపు మళ్లించబడుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మౌలిక సదుపాయాలు-విద్య మధ్య ఉన్న సంబంధాన్ని ఉదాహరణగా చూపిస్తూ, కేవలం రోడ్లు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి పూర్తయినట్లు భావించలేమని చెప్పారు.
“మీరు రోడ్డును నిర్మించారు, కానీ ఇంజనీర్లు ఎక్కడ దొరుకుతారు? దానికోసం మీరు ఇంజనీరింగ్ కళాశాలలను నిర్మించాలి. ఒకవేళ మీరు రోడ్డు నిర్మిస్తుంటే, మిషన్లు ఎక్కడి నుండి వస్తాయి? విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే ప్రయోజనం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.
పాత విధానాన్ని ఎందుకు మార్చలేదు?
నూతన విద్యా విధానం(ఎన్ఈపీ 2020) గురించి జోషి మాట్లాడుతూ, దీనిని రూపొందించడానికి తొలి ప్రయత్నాలు అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో జరిగాయని తెలిపారు. ఆ సమయంలో పాఠ్యపుస్తకాలలో వివిధ వర్గాలు, కులాలకు సంబంధించిన అభ్యంతరకర విషయాల అంశం వెలుగులోకి వచ్చిందని, ఈ విషయం సుప్రీంకోర్టు ముందుకు కూడా వెళ్లిందని చెప్పారు.
ఆ తర్వాత కొత్త విద్యా విధానాన్ని రూపకల్పన చేయాలని ప్రభుత్వం తనను(జోషిని) కోరింది. తదనుగుణంగా ఆ నాటి విద్యా విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేశానని, కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదని గుర్తించానని గుర్తుచేసుకున్నారు.
“నేను పాత విద్యా విధానాన్ని సమీక్షించాను. దానిని మార్చాల్సిన అవసరం లేదని చెప్పాను. మనం సాధించాలనుకుంటున్నదంతా దీని ద్వారానే సాధించవచ్చు” అని ఆయన అన్నారు.
కేవలం రాజీవ్ గాంధీ పదవీకాలంలో రూపొందించారనే కారణంతో పాత విద్యా విధానాన్ని మార్చడం సరికాదని ఆయన చెప్పారు.
పాత విద్యా విధానం ఆధారంగా అవసరమైన చోటల్లా తమ ప్రభుత్వం తగిన మార్పులు చేసిందని ఆయన తెలిపారు.
ఒక విద్యా విధానాన్ని రూపొందిస్తున్నప్పుడు, దాని లక్ష్యాలు, ఉద్దేశాలు స్పష్టంగా ఉండాలి. “లక్ష్యం స్పష్టంగా ఉండాలి. దాన్ని ఏదో ఒక పారిశ్రామిక విధానంతోనో, వాణిజ్య విధానంతోనో, అంతర్జాతీయ విధానంతోనో లేదా యుద్ధ విధానంతోనో ముడిపెట్టలేము. ఇది సమగ్రంగా ఉండాలి. ఈ విధానాలన్నిటితో పాటు మానవాభివృద్ధిపై దృష్టి పెట్టాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త విద్యా విధానాన్ని సిద్ధం చేసే ప్రక్రియను కూడా మాజీ మంత్రి జోషి ప్రశ్నించారు. పూర్వపు విధానానికి చైర్మన్‌గా ఉన్న శాస్త్రవేత్త కె కస్తూరి రంగన్ తనకు పాత పరిచయస్తుడని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యా విధానం గురించి మీరేమి చేస్తున్నారని కస్తూరి రంగన్‌ను అడిగినప్పుడు, ‘కమిటీ ఏం చేయాలో అది చేస్తుంది. వచ్చే దేన్నైనా నేను కేవలం సమన్వయం చేస్తాను’ అని ఆయన బదులిచ్చారని జోషి చెప్పారు.
నూతన విద్యా విధానంలోని అనేక అంశాలు నీతి ఆయోగ్ నుండి వచ్చాయని జోషి అన్నారు. తన పదవీకాలంలో ఉన్న ప్లానింగ్ కమిషన్‌కు ఇది భిన్నమైనది.
“మా కాలంలో ప్లానింగ్ కమిషన్ ఉండేది. అయితే, అది విద్యలో జోక్యం చేసుకోలేదు. ఏ పనికి ఎలాంటి శ్రమ(మానవ వనరులు) అవసరమో నిర్దేశించడమే దాని పనిగా ఉండేది” అని ఆయన చెప్పారు.
విద్య వ్యాపారంగా మారకూడదు..
విద్యలో సమానత్వం కోసం జోషి ఏకరూప పాఠశాల వ్యవస్థను(యూనిఫాం స్కూల్ సిస్టం) సమర్థించారు. అవసరమైతే, ప్రతి మగ లేదా ఆడ చిన్నారి తమ పొరుగున ఉన్న పాఠశాలలోనే చదువుకునేలా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన పేర్కొన్నారు.
“ధనవంతుడి బిడ్డ అయినా, అధికారి బిడ్డ అయినా పేదైనా, గొప్పైనా వారిని తమ ప్రాంతంలో లేదా గ్రామంలోనే చదవనివ్వండి. మొదటి నుంచీ సమానమైన విద్యను అందించాలి.” కనీసం సెకండరీ విద్య వరకు ఈ వ్యవస్థను అమలు చేయాలని ఆయన తెలిపారు.
“ఇది నా దార్శనికత, దేశంలో అలాంటి విద్య లేకపోతే, ఈ స్థాయిలో ఉచిత విద్య అందుబాటులో లేకపోతే, విద్యా రంగంలో మనం గణనీయంగా వెనుకబడిపోతామని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను” అని ఆయన అన్నారు.
విద్య మరింతగా వ్యాపారీకరణ చెందడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను ఒక వాణిజ్య సంస్థగా చూడకూడదని, దాని లక్ష్యం డబ్బు సంపాదించడం కాకూడదని నొక్కి చెప్పారు.
“దేశానికి విద్య అత్యవసరం కాబట్టి వ్యక్తులు విద్యా రంగానికి రావలసి ఉంటుంది. అక్కడ లాభాలకు కూడా అవకాశం ఉంది. అయితే, విద్య ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ విద్యలోనే తిరిగి వినియోగించేలా నిబంధనలు ఉండాలి” అని ఆయన అన్నారు.
వైద్య రంగాన్ని లాభాపేక్షతో కూడిన వ్యాపారంగా మార్చడాన్ని కూడా జోషి విమర్శించారు. “వైద్యం, విద్య ద్వారా లాభాలు పొందడం, ప్రజల విద్య, ఆరోగ్య అవసరాలను దోపిడీ చేయడం ఆమోదయోగ్యం కాదు. మన దేశంలో అలాంటి పద్ధతులు ఎప్పుడూ లేవు” అన్నారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యం ఏమిటి?..
విద్యా విధానానికి సంబంధించి ‘వికసిత్ భారత్’ లక్ష్యంపై కూడా జోషి ప్రశ్నలు లేవనెత్తారు. లక్ష్యాలను నిర్దేశించుకోవడం ప్రయోజనకరమే అయినప్పటికీ, “అభివృద్ధి”, “అభివృద్ధి చెందిన” అనే పదాల అర్థం ఏమిటో స్పష్టం చేయడం అత్యవసరమని ఆయన అన్నారు.
ఆధునిక ప్రామాణికాల ప్రకారం గిరిజన ప్రజలను “అభివృద్ధి చెందని వారు”గా పరిగణించినప్పటికీ, మానవతా కోణంలో ఈ దృక్పథాన్ని ఎలా సమర్థించగలమని ఆయన ప్రశ్నించారు.
“వారు పర్యావరణాన్ని పరిరక్షిస్తారు. సాధారణ జీవితం గడుపుతారు. అబద్ధం చెప్పరు, దొంగిలించరు, ప్రకృతితో సహజీవనం చేస్తారు, సంతృప్తిగా ఉంటారు, అడవులను నరకరు” అని ఆయన అన్నారు.
“సమాజానికి జీవిత విలువలు ఏమిటో విద్యా విధానంలో నిర్ణయించడం ముఖ్యం. మీరు ఒక రకమైన జీవితపు విలువలను కొనసాగించాలని అనుకుంటున్నారు. కానీ దానికి విరుద్ధమైన ఆర్థిక విలువలను సృష్టిస్తున్నారు. అది ఒక పరస్పర విరుద్ధమైన అంశం” అని ఆయన అన్నారు.
ప్రభుత్వం “గొప్ప వైదిక సంప్రదాయాన్ని”, “భారతీయ జ్ఞాన సంప్రదాయాలను” ప్రోత్సహిస్తున్నప్పటికీ, అదే సమయంలో సామాన్యుడికి విద్య అందుబాటులో లేని విధంగా విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతిస్తోందని ఆయన అన్నారు.
“చాలా బాగుంది, మీరు చదువుకోవాలనుకుంటే వెళ్లి రూ. 50 లక్షలు ఏర్పాటు చేసుకోండి. దీని అర్థం ఏమిటి? ఇలాంటి పరిస్థితిలో పేద కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి కూడా చదువుకోలేడు”. ఖరీదైన విద్య ఆర్థిక, సామాజిక అసమానతలను మాత్రమే పెంచుతుందని ఆయన అన్నారు.
పెద్ద విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సామాజిక ఒత్తిడిలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని జోషి తెలిపారు.
“పెద్ద పెద్ద సంస్థల్లో మాత్రమే విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? చిన్న పాఠశాలల్లో అవి జరగడం లేదు” అని ఆయన ప్రశ్నించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల మూసివేత..
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం వెనుక ఉన్న తార్కాన్ని జోషి ప్రశ్నించారు. విద్యార్థుల నమోదు తగ్గడమే కారణమని చెబుతున్నారు. కానీ పిల్లల సంఖ్య ఎందుకు తగ్గిందో ఎవరూ అడగరని ఆయన అన్నారు.
“టీచర్ రావడం లేదని ఫిర్యాదు చేయడం వల్లే పిల్లలు తక్కువగా ఉన్నారు. ఉపాధ్యాయుడు ఎందుకు వస్తాడు? మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.” ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే బదులు, వాటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జోషి అభిప్రాయపడ్డారు.
“సౌకర్యాల గురించిన హామీలన్నీ కేవలం మాటలు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఏదీ ఎందుకు జరగడం లేదు?” విద్యాసంస్థల్లో ప్రాథమిక సౌకర్యాలు, ఉపాధ్యాయుల కొరత అంశాన్ని కూడా జోషి లేవనెత్తారు.
“మీరు విద్యాసంస్థలను(పాఠశాలలను) తెరిచారు. కానీ అక్కడ ఉపాధ్యాయులు లేరు. విద్యార్థులు ఏమి చేస్తారు? ఇటీవల కొంతమంది బాలికలు నిరసన తెలపడం మీరు చూసే ఉంటారు. ఫిజిక్స్ టీచర్ కూడా లేరని వారు ఫిర్యాదు చేస్తున్నారు. పాఠశాలకు భవనం కూడా లేదని మరొకరు, తన పాఠశాలకు పైకప్పు కూడా లేదని ఇంకొకరు ఫిర్యాదు చేస్తున్నారు. ఇవి విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యలు. దీన్ని బట్టి మీరు ఎటు వైపు పయనిస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
ది వైర్ హిందీలో మొదట ప్రచురితమైన వ్యాసం తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
