ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి దేశంలో 8,59,972 పీఎంజేవీకే యూనిట్లు పూర్తి చేయగా గుజరాత్లో 82 యూనిట్లు మాత్రమే అంటే 0.01 శాతమే.
న్యూఢిల్లీ: కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (పీఎంజేవీకే) పథకం కింద 2021-22 నుంచి 2025-26 వరకు గుజరాత్‌కు పైసా విడుదల చేయలేదని, కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ ముందు ఉంచిన డేటా బయట పెట్టినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.
అధికారికంగా రాష్ట్రాల వారీగా నిధుల విడుదల టేబుల్ రికార్డును పరిశీలిస్తే గుజరాత్‌కు 2021-22లో పైసా విడుదల చేయలేదు. అదే విధంగా 2022-23, 2023-24, 2024-25, 2025-26లో కూడా పీఎంజేవీకే కింద పైసా విడుదల చేయలేదంటే గడచిన ఈ ఐదు ఆర్థిక సంవత్సరాలలో గుజరాత్‌కు నిధులు విడుదల చేయలేదని దాని అర్థం.
నిధుల మంజూరు విధానం..
రాష్ట్రాలకు స్థిరమైన కేటాయింపులకు బదులుగా, అన్ని షరతులకు లోబడి అర్హత గల ప్రాజెక్టుల ప్రతిపాదనలను రాష్ట్రాలు అందజేస్తే వాటి ఆధారంగా పీఎంజేవీకే నిధులను విడుదల చేయడం జరుగుతుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
అయితే ప్రభుత్వం అందజేసిన డేటా ప్రకారం ఆ కాలంలో గుజరాత్ పైసా నిధి కూడా స్వీకరించలేదు. అదే కాలంలో అనేక ఇతర రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులను స్వీకరించాయి.
అస్సాం 2021-22, 2024-25, 2025-26లో నిధులు అందుకోగా, కర్ణాటక, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లతో సహా ఇతర రాష్ట్రాలు కూడా వివిధ ఏళ్లలో పెద్ద మొత్తంలో నిధులను స్వీకరించాయి.
పూర్తయిన యూనిట్లలోనూ వెనుకబాటే..
ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి దేశంలో 8,59,972 యూనిట్లను పూర్తి చేయగా గుజరాత్లో కేవలం 82 పీఎంజేవీకే యూనిట్లు అంటే 0.01 శాతం మాత్రమే పూర్తి చేశారు.
పశ్చిమ బెంగాల్ 3,44,946 యూనిట్లు పూర్తి చేయగా, ఉత్తరప్రదేశ్ 2,01,086, అస్సాం 1,09,798 యూనిట్లు పూర్తి చేశాయి.
ఈ రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్లో పూర్తయిన 82 యూనిట్ల సంఖ్య చాలా తక్కువ అని న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
