ఈ అణచివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతివాదులను మోదీ వ్యాఖ్యలు బహుశా కలవరపెట్టి ఉంటాయని మాధవ్ సూచిస్తున్నారు. అది పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది.
ఎందుకంటే, దేశ యువత “దిమాగీ నక్సల్” అనే బిరుదును స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు.
నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో కొన్నేళ్ల పాటు ప్రాధాన్యం లేకుండా పక్కనపెట్టబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త రామ్ మాధవ్, ఇటీవల జరిగిన పార్టీ ప్రక్షాళనలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
మాధవ్‌కు అధికారికంగా తిరిగి ప్రాధాన్యం దక్కిన సమయం కూడా గమనించదగినదే. దేశవ్యాప్తంగా విఫలమైన విద్యావ్యవస్థపై నిరసన తెలుపుతున్న భారతీయ యువత, మోదీకున్న ‘బలమైన నాయకుడు’ (స్ట్రాంగ్‌మ్యాన్) ఇమేజ్ను దారుణంగా దెబ్బతీసిన సమయంలోనే ఇది జరిగింది.
‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై వెల్లువెత్తిన మీమ్స్..
ఎర్రకోట నుంచి ఆగస్టు 15న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ “దిమాగీ నక్సల్” అనే పదాన్ని ప్రస్తావించిన సరిగ్గా రెండు రోజుల తర్వాత మాధవ్ నియామకం జరిగింది.
ప్రధాని “దిమాగీ నక్సల్” అనే పదాన్ని వాడటం ఊహించినట్లుగానే జెన్-జీ యువత నుంచి ఎగతాళికి గురైంది.
సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్, రీల్స్ వెల్లువెత్తాయి. చాలామంది ప్రతిపక్ష నాయకులు బీజేపీ సృష్టించిన ఈ కొత్త పదాన్ని సంతోషంగా స్వీకరించారు.
అర్బన్ నక్సల్‌కు మరో రూపం..
ఇది కేవలం “అర్బన్ నక్సల్” అనే పదానికి మరో రూపం మాత్రమే. కొన్నేళ్ల క్రితం పార్లమెంటులో ఇచ్చిన ఒక సమాధానం ప్రకారం, అధికారికంగా ఆ పదానికి ఎలాంటి అస్తిత్వం లేదు.
2020 మార్చి 11న హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, “హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘అర్బన్ నక్సల్స్’ అనే పదాన్ని ఉపయోగించదు” అని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో కూడా మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఇదే తరహా సమాధానం ఇస్తూ, అధికారిక రికార్డుల్లో “దిమాగీ నక్సల్” అనే పదం లేదని చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అధికారిక రికార్డు పుస్తకాల్లో లేనప్పుడే ఆర్ఎస్ఎస్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికల్లా మనకు బాగా అర్థమైంది.
వందలాది చిన్న, రహస్య సంస్థలతో కూడిన ఆర్ఎస్ఎస్ బహుముఖ సంస్థాగత నిర్మాణం అధికారిక ఉనికికే సవాలు విసురుతుంది. కాబట్టి, రామ్ మాధవ్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత, ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో “‘దిమాగీ నక్సల్’కి నిజంగా మనకొక నిర్వచనం అవసరమా?” అనే శీర్షికతో ఒక వ్యాసం రాస్తూ, “దిమాగీ నక్సల్” చర్చకు మరింత ఆజ్యం పోయడంలో ఆశ్చర్యం లేదు.
ఏదేమైనా, కొన్నింటికి నిర్వచనం లేకపోయినా వాటికంటూ ఒక సొంత అస్తిత్వం ఉండాలి కదా.
పావురాల గుంపులో పిల్లి..
“తన ప్రత్యర్థులను తీవ్రంగా ఇరకాటంలో పెట్టగల అరుదైన నైపుణ్యం ప్రధాని మోదీకి ఉంది” అని ఆయన అన్నారు.
మోదీ వాడిన దిమాగీ నక్సల్ పదం, పావురాల గుంపులో పిల్లిని వదిలినట్లుగా కలకలం రేపిందని మాధవ్ రాశారు.
ఈ సందర్భంగా ఆయన మాజీ హోంమంత్రి పీ చిదంబరం ఇచ్చిన “నేను గర్వించదగిన దిమాగీ నక్సల్‌ను” అనే స్పందనను, అలాగే కొందరు సీనియర్ జర్నలిస్టులను “దిమాగీ నక్సల్స్”గా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనను ఉదహరించారు.
హిందుత్వ వ్యూహంలో భాగమే..
ఆ తర్వాత మాధవ్ ఈ విషయాన్ని తేలిక చేస్తూ, ఇటువంటి “పద ప్రయోగాలు హానిరహితంగా, ఆనందదాయకంగా ఉండొచ్చు” అని అన్నారు.
గతంలో కూడా “అర్బన్ నక్సల్”, “ఖాన్ మార్కెట్ గ్యాంగ్” వంటి పదాలను ఉపయోగించారని ఆయన చెప్పారు.
యాదృచ్ఛికంగా చెప్పాలంటే, మాధవ్ కూడా తన సొంత గ్యాంగ్‌తో ఖాన్ మార్కెట్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవారని పేరుంది.
మావోయిస్టులకు అర్బన్ మేధావుల మద్దతు ఉందనే అనుమానాలు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) ప్రభుత్వానికి కూడా ఉండేవని సూచిస్తూ, మోదీ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించడానికి లేదా సాధారణీకరించడానికి మాధవ్ ప్రయత్నిస్తున్నట్లు ఎవరైనా పసిగట్టవచ్చు.
మోదీ హయాంలో అసమ్మతిని మునుపెన్నడూ లేని విధంగా నేరంగా పరిగణించడం గమనిస్తే, మాధవ్ చేస్తున్న ఈ తెలివైన వాదన నిలబడదు.
దారిలోకి రాని ప్రతిపక్ష నాయకులు, ఎన్జీఓలు, మీడియా సంస్థలు, ఉద్యమకారులు, వ్యాపారవేత్తలపై ప్రభుత్వం ఏ స్థాయిలో పోలీసు, దర్యాప్తు సంస్థలను ప్రయోగించిందో చూపించడానికి తగినంత డేటా ఉంది.
“అర్బన్ నక్సల్”, “లుట్యెన్స్ గ్యాంగ్”, ఇప్పుడు “దిమాగీ నక్సల్” అనే పదాలన్నీ హిందుత్వ మితవాద వ్యూహంలో భాగమే.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దశాబ్దాల పాటు మేధోచర్చల్లో ఆధిపత్యం చెలాయించిన వామపక్ష, నెహ్రూవియన్ భావజాలాన్ని లక్ష్యంగా చేసుకుని ఇవి పుట్టుకొచ్చాయి.
ఒకప్పుడు సీనియర్ బీజేపీ నాయకుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి నాతో ఒక మాట అన్నారు. అధికారిక ఎన్నికల నిర్మాణాల్లో వామపక్షాలు, సోషలిస్టులు అట్టడుగుకు నెట్టబడొచ్చు కానీ, వారి ఆలోచనా విధానం, భారతీయ సమాజ మనస్తత్వంపై వారికున్న పట్టు మాత్రం పోదు అని ఆయన చెప్పారు.
“మన రాజకీయ వ్యవస్థలోని ఈ “దిమాగీ నక్సల్” స్ఫూర్తి, అత్యధిక శాతం భారతీయుల డీఎన్ఏలోనే ఇమిడి ఉంద”ని జోషి చేసిన ఈ అంగీకారం సూచిస్తుంది.
అదే స్ఫూర్తితో నాటి రాజకీయ ఉద్యమాలు..
మార్పు కోసం జరిగిన భారీ రాజకీయ ఉద్యమాలన్నింటికీ, బహుశా ప్రధాని మోదీ నిర్మూలించాలనుకుంటున్న అదే స్ఫూర్తి ఉత్ప్రేరకంగా పనిచేసి ఉండొచ్చు.
ఉత్తర భారతదేశంలో అతిపెద్ద యువజన ఉద్యమాలలో ఒకదానికి నాయకత్వం వహించిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను, నేటి నిర్వచనం ప్రకారం సులభంగా “దిమాగీ నక్సల్”గా వర్గీకరించవచ్చు.
ఎమర్జెన్సీ విధించడానికి ముందే, అణచివేతకు గురిచేస్తున్న భారత రాజ్యంపై తిరుగుబాటు చేయాలని పోలీసులకు, సైన్యానికి పిలుపునివ్వడం ద్వారా ఆయన అతిపెద్ద “జాతి వ్యతిరేక” చర్యకు పాల్పడ్డారు.
ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతి పట్ల నేడు ఉన్న అసహన స్థాయిని బట్టి చూస్తే, జేపీపై యూఏపీఏ, ఎన్ఎస్ఏ, దేశద్రోహం వంటి నిబంధనలు బనాయించి, విచారణ లేకుండా జైల్లోనే మగ్గేలా చేసేవారు.
ప్రస్తుత ప్రభుత్వంలోని చాలామంది మంత్రులు, బీజేపీ నాయకులు జేపీ అనుచరులే. కానీ గత దశాబ్ద కాలంలో వారికి రాజకీయ మతిమరుపు వచ్చింది.
బీజేపీకి మతపరమైన వ్యూహం బెడిసికొట్టిందా?..
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకృత పద్ధతిలో కొనసాగుతున్న జెన్-జీ, ఎక్స్, ఆల్ఫా ఉద్యమాలు.. తమ భావజాల వ్యూహం కాలంచెల్లిందని ప్రకటించాయన్న విషయాన్ని మాధవ్ తన నాయకులకు సూచించడం మంచిది.
ఈ మతపరమైన, అతి జాతీయవాద వ్యూహాన్ని గత 12 ఏళ్లుగా పదే పదే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అది చాలా అరిగిపోయినట్లుగా, విసుగు పుట్టించేలా తయారైంది.
ఈ అణచివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అసమ్మతివాదులను మోదీ వ్యాఖ్యలు బహుశా కలవరపెట్టి ఉంటాయని మాధవ్ సూచిస్తున్నారు. అది పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడమే.
ఎందుకంటే, దేశ యువత “దిమాగీ నక్సల్” అనే బిరుదును స్వీకరించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. నేడు 16 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న యువత ఏం ఆలోచిస్తున్నారో కచ్చితమైన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి, బీజేపీ తనకున్న అపారమైన వనరులను ఉపయోగించి ఈ ప్రతిపాదనను పరీక్షించి చూడొచ్చు. వారు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.
2047 నాటికి ‘అమృత్ కాల్’, ‘వికసిత్ భారత్’ వస్తుందంటూ అస్పష్టమైన హామీలు ఇస్తున్న హిందుత్వ జాతీయవాద అజెండా కోసం వెచ్చించడానికి వారి దగ్గర సమయం లేదు.
యువతలో పెరుగుతున్న తీవ్ర అసహనం..
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మరుసటి రోజే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యాసం రాసింది ఈ మాధవే. అందులో ఆయన, “దేశంలోని మేధో, విధాన రూపకల్పన వ్యవస్థపై సూడో-సెక్యులర్, ఉదారవాద కూటముల ఖాన్ మార్కెట్ అరుపులు అసమానమైన ప్రభావాన్ని, గుత్తాధిపత్యాన్ని చెలాయించాయి.
మోదీ రెండవ పాలనలో, దేశ విద్యా, సాంస్కృతిక, మేధో రంగాల నుంచి ఆ కూటమి అవశేషాలను పారద్రోలాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు.
అందులో “దిమాగీ నక్సల్” ఛాయలు కనిపిస్తున్నాయా? అసమ్మతిని ప్రక్షాళన చేయాలనే ఈ ఆలోచన చాలా కాలంగా ఉందని, రాజకీయ వ్యవస్థ, సమాజం ఇప్పుడు ఒక విసిగిపోయిన దశకు చేరుకున్నాయని ఎవరైనా సరే సహేతుకంగా వాదించవచ్చు.
యువత చూపుతున్న తీవ్రమైన ధిక్కారమే ఈ అసహనానికి అద్దం పడుతోంది. తాజాగా కొత్త బాధ్యతలు చేపట్టిన రామ్ మాధవ్ ముందుగా గుర్తించాల్సింది ఈ విషయాన్నే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
