నేను 2019 అక్టోబర్‌లో మొదటిసారి ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ సందర్శన కోసం వెళ్లాను. అప్పుడు ఆ దేశ రైల్వే కార్మిక నేత “ఎక్సెల్ పర్సన్”ను కలిసి పలు విషయాలు చర్చించాను. ఆ సందర్భంగా వారి యూనియన్ ఆఫీసుకు తీసుకొని వెళ్లి టీ తయారు చేసి ఇచ్చారు. అప్పుడు ఆ టీ కంపెనీ చరిత్ర చెప్పి కార్మికులే పరిశ్రమ యాజమానులని చెప్పారు. ఆశ్చర్యపోయాను. నిజమా అనే సందేహం నన్ను వెంటాడింది.
ఇటీవల ఒక ప్రముఖ ఆర్థికవేత్త వీడియోలో ఫ్రాన్స్, ఇటలీలలో కార్మికులే పరిశ్రమలకు యజమానులని చెప్పారు. దానిపై మరింత లోతుగా పరిశీలన చేశాను. అది వాస్తవమేనని కనువిప్పు కలిగింది. ఒక్క టీ కంపెనీయే కాదు ఇతర అనుభవాలు కూడా ఉన్నాయని రూఢి అయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
కార్మికులే యాజమాన్యం: ఫ్రాన్స్ ఆదర్శం..
రకరకాల కారణాలతో పరిశ్రమలో లాక్ అవుట్ ప్రకటించడం, కార్మికులను తొలగించడం లాంటి ఘటనలు అనేకం మన దేశంలో చూస్తున్నాము. మరీ ముఖ్యంగా సరళీకృత ఆర్థిక విధానాల కాలంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయి.
ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ యాజమాన్యాల కొమ్ము కాస్తున్నాయి. యాజమాన్యాల అక్రమ చర్యలను సక్రమం చేస్తూ లేబర్ కోడ్లు తెచ్చి చట్టబద్ధం చేశాయి. కానీ ఫ్రాన్స్‌లో కార్మిక వర్గం పరిశ్రమలను అకారణంగా మూసివేస్తుంటే చూస్తూ కూర్చుండే దద్దమ్మలం కాదని, తాము కేవలం శ్రమను అమ్ముకునే వారం మాత్రమే కాదు, పరిశ్రమల యాజమాన్యం కూడా సమర్థవంతంగా నిర్వహించగలమని ఆచరణలో రుజువు చేశారు.
ఉత్పత్తి సాధనాలపై కార్మికులకు యాజమాన్య హక్కు ఉంటే పరిశ్రమ ఎలా నడుస్తుంది? అనే ప్రశ్నలకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో అనేక ప్రయోగాలు జరిగాయి.
ఫ్రాన్స్‌లోని డురాలెక్స్ గాజు కర్మాగారం ఇటీవలి కాలంలో ఈ ప్రశ్నలకు ఒక ఆసక్తికరమైన తాజా ఉదాహరణగా నిలిచింది.
సంక్షోభంలో డురాలెక్స్.. కార్మికుల చొరవ..
డురాలెక్స్ ఫ్రాన్స్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెంపర్డ్ గ్లాస్ తయారీ సంస్థ.
అనేక ఆర్థిక సంక్షోభాలు, యాజమాన్య మార్పులు, కోర్టు పర్యవేక్షణలో పునర్వ్యవస్థీకరణల తర్వాత 2024లో సంస్థ మూసివేత ప్రమాదాన్ని ఎదుర్కొంది. అప్పుడు బయట నుంచి వచ్చే యజమాని కోసం ఎదురు చూడకుండా కార్మికులే సంస్థను సహకార సంస్థగా స్వీకరించి నడిపించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.
డురాలెక్స్ 1945లో ప్రారంభమైన ఫ్రెంచ్ గాజు ఉత్పత్తుల బ్రాండ్. ముఖ్యంగా బలమైన టెంపర్డ్ గ్లాస్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర వంటగది వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
ఫ్రాన్స్‌లోని లా చాపెల్లె-సెయింట్-మెస్మిన్, ఓర్లియన్స్ సమీపంలో ఉన్న కర్మాగారం ఈ సంస్థకు ప్రధాన కేంద్రం.
అయితే సంస్థ చరిత్రలో అనేక సార్లు యాజమాన్య మార్పులు జరిగాయి. ఆర్థిక సమస్యలు పదే పదే ఎదురయ్యాయి.
2020లో కోర్టు పర్యవేక్షణలో పునర్వ్యవస్థీకరణ జరిగింది. 2022లో ఇంధన ధరల సంక్షోభం కారణంగా ఉత్పత్తి కూడా కొంతకాలం నిలిచిపోయింది. 2024 ఏప్రిల్‌లో మరోసారి న్యాయపరమైన పునర్వ్యవస్థీకరణకు(రిడ్రెస్మెంట్ జ్యుడీషియేర్) గురయింది.
సహకార సంస్థగా ఆవిర్భావం..
బయటి పెట్టుబడిదారుల నుంచి సంస్థను కొనుగోలు చేసి నడిపించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని ప్రతిపాదనలు ఉద్యోగాల కోతకు దారితీసే అవకాశం ఉంది. అప్పుడు కార్మికులు ఆశ్చర్యకరంగా సాహసోపేతంగా ఒక ప్రత్యామ్నాయంతో ముందుకొచ్చారు.
“మేమే సంస్థను సహకార సంస్థగా తీసుకుని నడుపుతాం” అని కార్మిక సంఘం తెలియజేసింది. ఈ ప్రతిపాదనకు 60 శాతానికి పైగా ఉద్యోగులు మద్దతు తెలిపారు.
డురాలెక్స్ను పోలీసులను కార్మికులు తరిమి వేసి లేదా ఫ్యాక్టరీని బలవంతంగా ఆక్రమించి స్వాధీనం చేసుకోలేదు. ఇది చట్టబద్ధమైన సహకార సంస్థ(స్కోప్ – సొసైటీ కోఆపరేటివ్ డి ప్రొడక్షన్) రూపంలో జరిగింది.
కార్మికులు తమ సంస్థను తామే కొనుగోలు చేసి, దానిలో భాగస్వాములుగా మారారు. 2024 జూలై 26న ఓర్లియన్స్ కమర్షియల్ కోర్టు కార్మికులు ప్రతిపాదించిన స్కోప్ ప్రణాళికను ఆమోదించింది. దీంతో మొత్తం 226 మంది కార్మికుల ఉద్యోగాలు కాపాడబడ్డాయి.
2024 ఆగస్టు 1న డురాలెక్స్ స్కోప్ ఎస్ఏ అధికారికంగా ప్రారంభమైంది.
స్కోప్ అంటే ఏమిటి?..
స్కోప్ అనేది ఫ్రాన్స్‌లో ఉన్న ఒక ప్రత్యేకమైన కార్మిక సహకార సంస్థ. సాధారణ కంపెనీలో ఎక్కువ మూలధనం పెట్టిన వ్యక్తికి ఎక్కువ నియంత్రణ ఉంటుంది. కానీ స్కోప్‌లో ప్రధాన సూత్రం “ఒక్క కార్మిక సభ్యుడికి ఒక్క ఓటు.” అంటే ఒక కార్మికుడు ఎక్కువ షేర్లు కలిగి ఉన్నా, తక్కువ షేర్లు కలిగి ఉన్నా నిర్ణయాధికారంలో అతని ఓటుకు సమాన విలువ ఉంటుంది.
డురాలెక్స్లో 2024లో సుమారు 60 శాతం మంది ఉద్యోగులు సంస్థలో వాటాదారులుగా మారారు. ప్రతి ఎంప్లాయ్-ఓనర్‌కు సాధారణ సభలో ఒక ఓటు ఉంటుంది. ఇది కార్మిక ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన అంశం.
యాజమాన్యంలో సామూహిక భాగస్వామ్యం..
సాధారణంగా కంపెనీలో యజమాని -> పెట్టుబడి -> లాభం -> నిర్వహణ నిర్ణయాలు అనే విధానం ఉంటుంది. కానీ డురాలెక్స్ స్కోప్‌లో మాత్రం కార్మికులు -> యాజమాన్యంలో భాగస్వామ్యం -> సామూహిక నిర్ణయాలు -> సంస్థ భవిష్యత్తుపై బాధ్యత అనే విధానం అమలులోకి వచ్చింది.
అయితే దీని అర్థం ప్రతి రోజు ఉత్పత్తి విభాగాన్ని అందరూ కలిసి నిర్వహిస్తారని కాదు. రోజువారీ కార్యకలాపాలకు మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ సంస్థకు సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక నిర్ణయాలలో ఉద్యోగి-వాటాదారులకు ప్రజాస్వామ్య భాగస్వామ్యం ఉంటుంది.
కొనసాగుతున్న ప్రయోగం.. సవాళ్లు..
కార్మికుల ఆధ్వర్యంలో సంస్థ ప్రారంభమైన తరువాత మొదటి సంవత్సరం ఆశాజనకంగా కనిపించింది. 2025లో డురాలెక్స్ సుమారు 31–32 మిలియన్ యూరోల ఆదాయాన్ని సాధించింది.
2024తో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. 2025 మే నాటికి సుమారు 242 మంది ఉద్యోగులు ఉన్నారని ఓర్లియన్స్ మెట్రోపోల్ తెలిపింది. 2025లో సంస్థ తిరిగి నిలదొక్కుకుంటుందనే ఆశలు బలపడ్డాయి. ఇది కార్మికుల యాజమాన్య నమూనాపై ఫ్రాన్స్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇక్కడే ఈ కథకు ఒక ముఖ్యమైన మలుపు ఎదురైంది. డురాలెక్స్ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. 2026 జూన్‌లో డురాలెక్స్ మళ్లీ న్యాయపరమైన పునర్వ్యవస్థీకరణ(రిసీవర్‌షిప్)లోకి వెళ్లింది.
2025 చివరి నాటికి సంస్థ ఆదాయం సుమారు 7 శాతం పెరిగినప్పటికీ, నగదు ప్రవాహ సమస్యలు, ముడి పదార్థాలు, ఇంధన వ్యయాల పెరుగుదల, నిల్వల పెరుగుదల వంటి సమస్యలతో సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంది.
ప్రస్తుతం డురాలెక్స్ను “విజయవంతంగా పూర్తిగా స్థిరపడిన కార్మిక సంస్థ”గా చెప్పడం తొందరపాటు. కానీ అదే సమయంలో “కార్మికుల సహకార సంస్థ విఫలమైంది” అని చెప్పడం తప్పు.
ఎందుకంటే సంస్థ ఇబ్బందులకు ఆర్థిక సమస్యలు, ఇంధన ధరలు, మార్కెట్, వర్కింగ్ క్యాపిటల్ వంటి అనేక కారణాలు ఉన్నాయి.
కార్మికుల సామర్థ్యం నిరూపితం..
డురాలెక్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని రుజువు చేసింది. ఒక పరిశ్రమ యజమాని లేకపోతే ఉత్పత్తి వెంటనే ఆగిపోవాల్సిన అవసరం లేదు. కార్మికులకు ఉత్పత్తి ప్రక్రియపై అనుభవం, పట్టు ఉన్నాయి.
యంత్రాలపై సంపూర్ణ పరిజ్ఞానం ఉంది. మార్కెట్ గురించిన అవగాహన ఉంది. నాణ్యమైన ఉత్పత్తి చేయగల సత్తా ఉంది. సంస్థను కాపాడుకోవాలనే కాంక్ష ఉంది. అందువల్ల కార్మికులు సంస్థ నిర్వహణలో భాగస్వాములైతే పరిశ్రమను నడపడం సాధ్యమేనని ఈ ఉదాహరణ చూపిస్తుంది.
అయితే ఒక పరిశ్రమను విజయవంతంగా నడపడానికి కేవలం ఉత్పత్తి పరిజ్ఞానం సరిపోదు. మూలధనం, మార్కెట్, సాంకేతిక పరిజ్ఞానం, ముడి పదార్థాలు, ఇంధన ధరలు, అమ్మకాలు, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలు కూడా కీలకం. డురాలెక్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఇదే.
ఫ్రాన్స్‌లో ఎన్నో గొప్ప అనుభవాలు..
డురాలెక్స్ మొదటి ఉదాహరణ కాదు. ఫ్రాన్స్‌లో కార్మికుల స్వయం నిర్వహణకు అత్యంత ప్రసిద్ధి చెందిన ఉదాహరణ లిప్ వాచ్ ఫ్యాక్టరీ.
బెసన్కన్ నగరంలోని లిప్ గడియారాల కర్మాగారంలో 1973లో కార్మికులు యాజమాన్య సంక్షోభానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీని ఆక్రమించి, కొంతకాలం తామే ఉత్పత్తిని నిర్వహించారు.
గడియారాలను తయారు చేసి, విక్రయించి, వచ్చిన ఆదాయంతో తమకు వేతనాలు చెల్లించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయోగం ఫ్రాన్స్‌లో 1968 తరువాత ఏర్పడిన కార్మిక ఉద్యమాలకు గొప్ప ప్రేరణగా నిలిచింది.
అయితే లిప్లోని స్వయం నిర్వహణ శాశ్వతంగా కొనసాగలేదు. తరువాత ప్రభుత్వం జోక్యం చేసుకుని కొత్త నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
మరో ఉదాహరణ – ఫ్రాలిబ్ / స్కోప్-టీఐ. ఫ్రాన్స్‌లో యూనిలీవర్‌కు చెందిన ఫ్రాలిబ్ టీ ఫ్యాక్టరీ మూసివేయాలని నిర్ణయించినప్పుడు కార్మికులు దీర్ఘకాలిక పోరాటం చేశారు.
చివరకు వారు కర్మాగారాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని స్కోప్-టీఐ అనే కార్మిక సహకార సంస్థగా నిర్వహించారు.
వారి పోరాటం నాలుగు సంవత్సరాల పాటు సాగింది. చివరకు ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. అందువల్ల ఫ్రాన్స్‌లో కార్మికులు పరిశ్రమను స్వాధీనం చేసుకుని సహకార పద్ధతిలో నడపడం ఒక కొత్త విషయం కాదు.
ఇక్కడ మూడు రకాల పద్ధతులను వేరు వేరుగా చూడాలి. 1) ఫ్యాక్టరీ ఆక్రమణ. యాజమాన్యాన్ని బయటకు పంపి కార్మికులు ఫ్యాక్టరీలోనే ఉండిపోవడం. లిప్ దీనికి ఉదాహరణ. 2) కార్మికుల స్వయం నిర్వహణ (ఆటోగేస్షన్). కార్మికులు ఉత్పత్తి, నిర్వహణ, నిర్ణయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించడం. 3) కార్మిక సహకార సంస్థ-స్కోప్. కార్మికులు చట్టబద్ధంగా సంస్థలో వాటాదారులై, సంస్థను సహకార పద్ధతిలో నిర్వహించడం. డురాలెక్స్ మూడవ విధానానికి ఉదాహరణ.
డురాలెక్స్ ప్రయోగాన్ని కేవలం “కార్మికులు కంపెనీని స్వాధీనం చేసుకున్నారు” అనే కోణంలో చూడకూడదు.
అసలు విషయం మూసివేత ప్రమాదంలో ఉన్న పరిశ్రమను బయట పెట్టుబడిదారుడికి అప్పగించకుండా, కార్మికులే సహకార సంస్థగా మార్చి తమ ఉద్యోగాలను, ఉత్పత్తిని కాపాడుకునే ప్రయత్నం చేశారు.
2024లో అది విజయవంతంగా ప్రారంభమైంది. 2025లో మంచి ఫలితాలు సాధించారు. 2026లో మళ్లీ ఆర్థిక సంక్షోభం వచ్చింది. అందువల్ల ఇది ఇంకా కొనసాగుతున్న “కార్మిక యాజమాన్య ప్రయోగం” గానే చూడాలి.
చారిత్రక ప్రయోగానికి మద్దతు..
పెట్టుబడిదారీ వ్యవస్థలో సాధారణంగా పరిశ్రమకు యజమాని పెట్టుబడి పెడతాడు. కార్మికులు తమ శ్రమను అమ్ముకొని సరుకులను ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి నుంచి వచ్చే అదనపు విలువపై యజమానిదే సంపూర్ణ అధికారం.
“పరిశ్రమను సృష్టించేది కార్మికుల శ్రమ అయితే, ఆ పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు ఎందుకు ప్రధాన పాత్ర ఉండకూడదు?” అనే ప్రశ్నను డురాలెక్స్ వంటి సహకార ప్రయోగాలు ముందుకు తెస్తాయి.
డురాలెక్స్కు ఎదురైన ఆర్థిక సమస్యలు ఈ నమూనా సులభమైన పరిష్కారం కాదని కూడా చెబుతున్నాయి.
అయితే 2024లో 200కు పైగా ఉద్యోగాలను కాపాడుతూ, కార్మికులను యజమానులుగా మార్చి, ప్రజాస్వామ్య యాజమాన్య పద్ధతిలో ఉత్పత్తిని కొనసాగించడం మాత్రం ఒక చారిత్రక ప్రయోగం.
ఫ్రాన్స్‌లో లిప్, ఫ్రాలిబ్/స్కోప్-టీఐ, డురాలెక్స్ వంటి అనుభవాలు ఒకే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. “యజమాని లేకుండా కర్మాగారం నడవగలదా?” సమాధానం-“అవును.
కార్మికులకు సంస్థపై హక్కు, నిర్వహణపై ప్రజాస్వామ్య నియంత్రణ, అవసరమైన మూలధనం, మార్కెట్‌కు ప్రాప్తి ఉంటే నడపగలరు.
అయితే దీర్ఘకాలిక విజయానికి ఆర్థిక, సాంకేతిక, మార్కెట్ సమస్యలను కూడా సమర్థంగా పరిష్కరించాలి.”
ప్రస్తుత పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల యాజమాన్యంలో పరిశ్రమలను నడిపి నిలదొక్కుకునేందుకు, విజయ పథంలో నడిపేందుకు యజమానులు, ప్రభుత్వాలు అంగీకరించారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫ్రాన్స్‌లో కార్మికుల ఒత్తిడి, పట్టుదల, అంకితభావంతో కార్మిక వర్గం ముందుకు రావడం, పరిశ్రమలను నిర్వహించి సత్తా చాటడం అద్భుతం. ఫ్రాన్స్ కార్మిక వర్గం చేస్తున్న ఈ సాహసానికి ప్రపంచ కార్మిక వర్గం అండగా నిలవాలి.
గమనిక: తదుపరి వ్యాసంలో ఇటలీ అనుభవాలు తెలుసుకుందాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
