ఈ సంవత్సరం తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, తమ ప్రభుత్వం సాయుధ నక్సలైట్లు/మావోయిస్టుల బెదిరింపులను అంతమొందించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ ‘దిమాగీ నక్సల్స్'(ఆలోచనాపరులైన నక్సల్స్) తెచ్చే ప్రమాదం ఇంకా మిగిలే ఉందని ఆయన తెలిపారు.
గతంలో పరిపాలించిన వారు అటువంటి ప్రమాదకరమైన వ్యక్తులను సలహాదారులుగా చేర్చుకున్నారని ఆయన అన్నారు.
ఇప్పుడు వారు యువతను తప్పుదోవ పట్టించడానికి, దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి వేరుచేయాలని ఆయన భారత పౌరులను కోరారు.
ఒక ప్రజాస్వామ్య దేశాధినేత శిక్షార్హమైన నేరాలు లేకపోయినప్పటికీ కేవలం ‘ఆలోచనల ఆధారంగా’ ప్రజలను నేరస్థులుగా ప్రకటించడం ఇదే మొదటిసారి.
గతంలో ప్రధాని ‘అర్బన్ నక్సల్స్’ అనే పదాన్ని ప్రచార ప్రసంగాల్లోనూ, పార్లమెంటులోనూ ఉపయోగించారు. కానీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి.
మొదట్లో ‘అర్బన్ నక్సల్స్’ అనేది నగరాల్లో నివసించే వ్యక్తులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడానికి వాడారు. ఆ ఆరోపణలు నిజమైనవి కావచ్చు లేదా అల్లినవి కావచ్చు.
కానీ ‘దిమాగీ నక్సల్స్’ విషయంలో ప్రధాని నేరుగా మావోయిస్టు సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, కేవలం ఆలోచించే నైజాన్నే నేరంగా చిత్రీకరిస్తున్నారు.
‘దిమాగీ నక్సల్స్’ అంటే..
‘దిమాగ్’ అంటే మెదడు, ఆలోచన, వివేకం, నిరసన తెలపడం, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి. మోదీ వ్యాఖ్యల ప్రకారం – ప్రశ్నించే ఆలోచనా విధానమే అత్యంత ప్రమాదకరమైనదిగా మారబోతోంది.
ఉగ్రవాదులను వారి దుస్తుల ఆధారంగా గుర్తించమని పౌరులను కోరడం ద్వారా మోదీ పేరుగాంచారు — ‘కప్డే సే పెహచానో'(దుస్తుల ద్వారా గుర్తించండి/అంచనా వేయండి) అనేది లుంగీలు, ప్రార్థన టోపీలు లేదా హిజాబ్‌లు ధరించే ముస్లింలను లక్ష్యంగా చేసుకునే ఒక పద్ధతి.
ఇప్పుడు ఆయన ‘దిమాగ్ సే పెహచానో'(ఆలోచన ఆధారంగా గుర్తించండి) అంటున్నారు — అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తారనే దాన్ని బట్టి వారిని ‘దేశద్రోహులు’గా గుర్తించమని చెప్తున్నారు. ‘దిమాగ్’ను రాక్షసీకరించే ఈ చర్య ఒక దశాబ్దం క్రితమే ప్రారంభమైంది.
ప్రశ్నించే హక్కుపై ఉగ్రవాద ముద్ర..
యువ విద్యార్థులు, మేధావులు, నిరసనకారులు కేవలం తమ ఆలోచనలతో, విమర్శలతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఆలోచనలను అణచివేసేందుకు హింసాత్మక లేదా ఉగ్రవాద ముద్రలు వేసి వేధించడం కొత్తేమీ కాదు.
ప్రశ్నించే వారిని ‘దేశద్రోహులు’, ‘ఉగ్రవాదులు’ లేదా సమాజానికి పట్టే ‘తెగులు’గా చిత్రీకరించడం ద్వారా ప్రజల్లో వారిపట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు.
ఎక్కడైతే విమర్శనాత్మక ఆలోచనలు, అధ్యయనాలు, ప్రజాస్వామ్య డిమాండ్లను రాజ్యం తన ఉనికికే ప్రమాదంగా భావిస్తుందో, అక్కడ ఇలాంటి అణచివేత జరుగుతుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల స్వతంత్ర ఆలోచనా శక్తిని, ప్రశ్నించే హక్కును అణచివేయడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలకే ముప్పు తెస్తుంది. ప్రజలను ఆలోచించకుండా చేయడం, వారి ఆలోచనలపై నిఘా ఉంచడం నిజమైన ప్రజాస్వామ్య లక్షణం కాదు.
ఆరేళ్లుగా నిరసనలపై అణచివేత..
ఈ ప్రక్రియ దశాబ్దం క్రితమే 2016లో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులపై ద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టే ప్రయత్నంతో ఇది ప్రారంభమైంది.
ఆరేళ్ల పాటు ఈ ప్రభుత్వం నిరసన తెలుపుతున్న విద్యార్థులను(ఉమర్ ఖాలిద్, షార్జీల్ ఇమామ్, గుల్ఫిషా ఫాతిమా, నటాషా నర్వాల్, దేవాంగనా కలితా వంటి వారిని) న్యాయస్థానాల్లో విచారణ లేకుండానే, న్యాయవ్యవస్థ, పత్రికారంగం నుంచి పెద్దగా వ్యతిరేకత లేకుండా ఉగ్రవాదులుగా ప్రకటించింది.
ధైర్యం పొందిన ప్రభుత్వం, పరీక్షా పేపర్ల లీకేజీలపై నిరసన తెలిపిన విద్యార్థులపై కూడా అదే వ్యూహాన్ని ఉపయోగించి వారిని ఉగ్రవాదులు అని పిలిచింది.
అయితే ఈ వ్యూహాన్ని శృతిమించి ఉపయోగించడంతో అది వికటించింది— ఎదురుదెబ్బ తగిలింది. ఇది ప్రభుత్వ ప్రచార రహస్యాలను బహిర్గతం(‘లీక్’) చేసింది. అకస్మాత్తుగా, చాలామందికి ఈ వ్యూహ శైలి స్పష్టంగా అర్థమైంది.
అధికారం పట్ల గుడ్డి విధేయత, భక్తి, భజన చేసేవారిని ప్రభుత్వం పురస్కరిస్తుంది. కానీ అధికారంలో ఉన్నవారి నుండి ప్రజాస్వామ్య బాధ్యతను డిమాండ్ చేయడానికి మీరు మీ మేధస్సును(‘దిమాగ్’) ఉపయోగిస్తే, ప్రభుత్వం మిమ్మల్ని ఉగ్రవాదిగా, ‘ఆందోళన్‌జీవి'(నిరసనలపై బతికే పరాన్నజీవి)గా, ఒక బొద్దింకగా “గుర్తించి వేరు చేస్తుంది”.
పాత పద్ధతుల పునరావృతం..
ఈ సమయం చాలా కీలకమైనది. ప్రధాని మోదీ కేవలం మేధస్సు, సమయస్ఫూర్తి, ఊహాశక్తితో మాత్రమే ఆయుధాలు ధరించిన యువ విద్యార్థుల చేతిలో దెబ్బతిన్న తర్వాత, ఇప్పుడు వారి ‘దిమాగ్'(ఆలోచనా శక్తి)పై దాడి చేస్తున్నారు. అది మళ్లీ పునరావృతం కాకుండా నిరోధించాలని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే “ఈ ఆలోచనలను వ్యాప్తి చెందడానికి అనుమతిస్తే, ఏ జెండాను ఎగురవేయాలి, ఏ లక్ష్యాలను సాధించాలి అనే విషయాలపై ప్రజల మధ్య ఉన్న ప్రస్తుత సమన్వయాన్ని అవి భంగపరుస్తాయి.”
విద్యార్థుల నిరసనలు చేసింది కూడా సరిగ్గా ఇదే: ప్రధాని మోదీ తనదని చెప్పుకుంటున్న ప్రజాదరణను వారు ప్రశ్నించారు.
ఆ ప్రజాదరణను కేవలం కొద్దిమంది విమర్శకులు మాత్రమే సవాలు చేశారని ప్రధాని భావిస్తారు. ఆ ప్రజాదరణను మళ్లీ పునరుద్ధరించాల్సి ఉంది.
మోదీ ‘దిమాగీ నక్సల్స్’ను అంతర్గత శత్రువుగా, జాతీయ భద్రతకు అత్యంత ముప్పుగా గుర్తించారు. వారితో వ్యవహరించడానికి “భారీ స్వచ్ఛంద సివిల్ డిఫెన్స్ ఫోర్స్”ను ఏర్పాటు చేయాలనేది ఆయన ప్రణాళికా?
సైద్ధాంతిక గురువుల స్ఫూర్తితో..
దీనికి మోదీ పేర్కొన్న ఉదాహరణలు ఏమాత్రం నమ్మదగినవిగా లేవు. ఆకాశమార్గంలో జరిగే దాడుల నుంచి చమురు శుద్ధి కర్మాగారాలను కాపాడటం, సైబర్ దాడుల నుంచి బ్యాంకులను రక్షించడం వంటి పనులను ‘సివిల్ స్వచ్ఛంద కార్యకర్తలకు’ వదిలిపెట్టలేము. వీటికి మెరుగైన ఎయిర్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు అవసరం.
రక్షణ చట్టం 1968, హోమ్ గార్డ్స్ రూపంలో మనకు ఇప్పటికే నాన్-కాంబ్యాట్ పాత్రల కోసం పౌరులను సమీకరించే వ్యవస్థలు ఉన్నాయి. మోదీ ప్రతిపాదనలు శతాబ్దం క్రితం తన సైద్ధాంతిక గురువుల ఆలోచనల నుండి ప్రేరేపించబడ్డాయా?
ఒక శతాబ్దం క్రితం నాటి ఆలోచనల ప్రేరణ..
1931లో, బీఎస్ ముంజే — హిందూ మహాసభ నాయకుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్‌కు సన్నిహితుడు — ఫాసిస్ట్ నాయకుడు బెనిటో ముస్సోలినీని కలవడానికి ఇటలీ పర్యటించారు.
ముస్సోలినీ ‘రాష్ట్రీయ సురక్ష'(బాలిల్లా) పేరుతో ఏర్పాటు చేసిన పౌర మిలీషియా వ్యవస్థ పట్ల ముంజే తీవ్ర ఆకర్షితులయ్యారు.
ఈ వ్యవస్థ ఇటలీలోని రాజకీయ ప్రత్యర్థులు, యూనియన్ నాయకులు, జర్నలిస్టులు, రచయితలపై తీవ్రమైన హింసాత్మక దాడులకు పాల్పడేది.
1934లో ముంజే, హెడ్గేవార్‌లు సమావేశమై, “ఇటలీ, జర్మనీల్లోని నిరంకుశ పాలకుల తరహాలోనే” హిందువులను సైనికీకరించడానికి, ఒక హిందూ ఆధిపత్య మిలీషియాను ఏర్పాటు చేయడంపై చర్చించారు. 1935లో ముంజే దీనిని వివరిస్తూ — తన లక్ష్యం వర్తమాన హిందూ సమాజాన్ని సైనికీకరించడమేనని, తద్వారా సామాజిక జీవితంలోని ఇతర వ్యక్తీకరణలను పూర్తిగా నలిపివేయవచ్చని అన్నారు.
“పౌరుడికి, సైనికుడికి, యూనిఫాం లేని వ్యక్తికి, యూనిఫాంలో ఉన్న వ్యక్తికి మధ్య తేడా లేకుండా చేయడమే దీని ఉద్దేశం” అని పేర్కొన్నారు.
1939లో, ఆర్ఎస్ఎస్ ప్రణాళికలు “ఇటువంటి హిందూ-ఆధిపత్య మిలీషియాను సిద్ధం చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి” అని ముంజే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మిలీషియా ఎవరితో పోరాడుతుంది? బ్రిటీష్ పాలనతోనో లేదా జపనీస్ ఆక్రమణదారులతోనో కాదు, “అంతర్గత శత్రువులు” అయిన ముస్లింలు, స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న కాంగ్రెస్ వర్గంతో.
ముంజే దీనిని పరస్పర శత్రుత్వం కలిగిన రెండు భావజాలాల మధ్య పోరాటంగా ఊహించారు — ఒకటి “రైఫిల్” (హిందూత్వ మిలీషియాను సూచిస్తుంది), మరొకటి “చరఖా” (గాంధీని సూచిస్తుంది). దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నాథూరామ్ గాడ్సే గాంధీని చంపడానికి ఆ రైఫిల్నే ఉపయోగించాడు.
ముందున్న బాట..
నేడు, తనను తాను “గాడ్సే అభిమాని” అని గర్వంగా ప్రకటించుకుని, ‘గాంధీ’ అనేది ఒక బూతు పదం అని వ్యాఖ్యానించిన ఒక మహిళను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించడానికి ఎంపిక చేశారు.
అదే మహిళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. అలాగే ముస్లింలు, అణచివేతకు గురైన కులాలకు ఉన్న ఓటు హక్కును “భారతదేశ సమస్యలన్నింటికీ మూలకారణం” అని ఆమె అభివర్ణించారు.
మరోవైపు, ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోదీ అనుకూల మూకలు, పోలీసులు నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను, ముఖ్యంగా యువతులను, మహిళలను వేధిస్తున్నారు.
విద్యార్థులు వేరే దారి లేక చిట్టచివరికి స్వయంగా మోదీకి వ్యతిరేకంగా అసభ్యకరమైన నినాదాలు చేశారనేది ఒక నెపంగా చూపుతున్నారు. కానీ ఆ నినాదాలే చివరికి ఆయన తన అవినీతి మంత్రిని తొలగించేలా చేయడానికి దోహదపడ్డాయి.
ఈ మూకలు, ‘నైతిక నిఘా’ మూకలు, ముస్లిం వ్యతిరేక దాడి మూకలతో కలిసి మోదీ ప్రణాళికలోని ‘సివిల్ డిఫెన్స్ ఫోర్స్’ శ్రేణులకు ప్రమోట్ చేయబడతాయా?
మోదీ మద్దతుదారులు ఆయనను ముంజే, హెడ్గేవార్‌ల కలలను నిజం చేసే “హిందూ హిట్లర్”గా నమ్ముతున్నందున, ఇది తీవ్రమైన ప్రమాదకరమైన అంశం.
అనువాదం: ఎ అజ శర్మ
(2026 ఆగస్ట్ 31న ది హిందూ దిన పత్రికలో కవిత కృష్ణన్ రాసిన వ్యాసానికి ఇది తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
