న్యూస్‌క్లిక్ ఉదంతంలో ఢిల్లీ హైకోర్టులో ఎదురైన ఘోర పరాభవాన్ని జీర్ణించుకోలేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సుప్రీంకోర్టు తలుపు తట్టాలనుకోవడం- రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి భావప్రకటనా స్వేచ్ఛకు పాతరవేయాలనే పట్టుదలకు నిదర్శనం.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ 41 పేజీల సుదీర్ఘ తీర్పులో దర్యాప్తు సంస్థల కుట్రను, అధికార దుర్వినియోగాన్ని నగ్నంగా ఎండగట్టినప్పటికీ- రాజ్యం తన కక్షసాధింపు ధోరణిని వీడటం లేదు.
ప్రాథమిక నేరమే లేని చోట మనీలాండరింగ్ ఆరోపణలు నిలవవని అత్యున్నత న్యాయస్థానం విధించిన చట్టబద్ధమైన పరిమితి తెలిసినప్పటికీ, సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకోవడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం- నిజాన్ని చెప్పే ప్రసార మాధ్యమాలను కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఊపిరాడకుండా చేసి నిశ్శబ్దం చేయడమే.
నాల్గవ స్తంభంపై దమనకాండ..
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా స్వేచ్ఛను, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను ఉరితీసేలా స్వతంత్ర వార్తా సంస్థలపై రాజ్యం సాగిస్తున్న దమనకాండ నేడు ప్రపంచంలోనే మునుపెన్నడూ లేని అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకుంది.
ప్రజల గొంతుకగా నిలిచే స్వతంత్ర మాధ్యమాలను చట్టబద్ధ వేధింపుల గుప్పిట్లోకి నెట్టి, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పాలక వర్గాలు వ్యవస్థలను వాడుకుంటున్నాయనడానికి ‘న్యూస్‌క్లిక్’ ఉదంతం అత్యంత చేదు నిజం.
స్వతంత్ర పత్రికారంగంపై వరుస దాడులు..
ఇది కేవలం ఒక న్యూస్‌క్లిక్‌కు పరిమితమైన ఒంటరి దాడి కాదు. స్వతంత్ర పత్రికారంగాన్ని లొంగదీసుకోవడానికి రాజ్య యంత్రాంగం అనుసరిస్తున్న ఒక విషపూరితమైన నమూనా.
గతంలో ఎన్డీటీవీ విషయంలోనూ సరిగ్గా ఇదే తరహా నాటకం నడిచింది. ఆనాడు ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేతలు, బినామీ వ్యవహారాలంటూ ఎన్డీటీవీ యాజమాన్యంపై, జర్నలిస్టులపై సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖలను వరుసబెట్టి ఉసిగొల్పారు.
కోర్టుల్లో వీగిపోయిన అబద్ధాలు..
తీవ్రమైన సంచలనం సృష్టించి, భయాందోళనలు రేకెత్తించి, పత్రికా స్వేచ్ఛ గొంతును పిసికేసేందుకు అల్లిన ఆ కేసుల పేకమేడలన్నీ చివరకు న్యాయస్థానాల సమగ్ర విచారణలో సత్య శోధనకు తట్టుకోలేక ముక్కలైపోయాయి.
కోర్టులు ఎన్డీటీవీపై మోపిన ఆరోపణలను కొట్టివేసి, నిర్దోషిగా ప్రకటించి పత్రికా స్వేచ్ఛ నిలకడను పునరుద్ధరించాయి.
విచారణే ఒక శిక్షగా మార్చిన వైనం..
అయితే, ఆనాడు ఎన్డీటీవీ కేసులో కోర్టుల ముందు నిజం గెలిచినా, సుదీర్ఘకాలం సాగిన ఆ చట్టబద్ధ వేధింపులు సాధించిన దుర్మార్గమైన ఫలితం ఏమిటంటే- ఆ సంస్థ ఆర్థికంగా దెబ్బతిని, చివరకు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నేడు న్యూస్‌క్లిక్ ఉదంతంలో కూడా అదే ‘విచారణే ఒక శిక్ష’ అనే సూత్రాన్ని అమల్లోకి తెస్తున్నారు.
లేని చట్టాన్ని రుద్దే ప్రయత్నం..
2018 ఏప్రిల్‌లో న్యూస్‌క్లిక్‌కు అమెరికాలోని ‘వరల్డ్‌వైడ్ మీడియా హోల్డింగ్స్’ నుంచి రూ 9.59 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) వచ్చింది. అప్పట్లో డిజిటల్ మీడియాపై ఎలాంటి 26 శాతం ఎఫ్‌డీఐ గరిష్ట పరిమితి లేదు.
అది అమల్లోకి వచ్చింది 2019 సెప్టెంబర్ ‘ప్రెస్ నోట్ 4’ ద్వారా మాత్రమే, లేని చట్టాన్ని వర్తింపజేసి నేరస్థులుగా చిత్రీకరించేందుకు యత్నించడం రాజ్య దుర్మార్గానికి అద్దం పడుతోంది.
వ్యాపార నిర్ణయాలను నేరంగా చూపడం..
రూ 10 ముఖ విలువ కలిగిన షేరును రూ 11,510 కి కేటాయించడం దారుణమని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. కానీ, ఫెమా నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడిదారులకు షేర్లను నిపుణులు నిర్ణయించిన ‘ఫెయిర్ వ్యాల్యూ’ కంటే తక్కువ ధరకు అమ్మకూడదు.
సదరు విలువ రూ 9,188గా సీఏ సంస్థ ధ్రువీకరిస్తే, అంతకంటే ఎక్కువ ధరకు షేర్లు అమ్మడం చట్టానికి లోబడి జరిగిన వ్యాపార నిర్ణయం. దీన్ని నేరంగా చూపడం చట్టాన్ని తలకిందులు చేయడమే.
కోర్టు నిలదీసిన ఈడీ దిగజారుడుతనం..
జర్నలిస్టులకు జీతాలు, కార్యాలయ అద్దెలు, కన్సల్టెన్సీ ఫీజులు చెల్లించడాన్ని ‘నిధుల దుర్వినియోగం’ అని ఈడీ వాదించింది.
ఒక మీడియా సంస్థ తన పని నిర్వహణకు ఖర్చు చేయడాన్ని నేరంగా చూపిస్తే, నష్టాల్లో నడుస్తూ ఉద్యోగులకు జీతాలిచ్చే ప్రతి వ్యాపార సంస్థను అక్రమ మార్గం కింద పరిగణించాలా? అని కోర్టు ప్రశ్నించడం దర్యాప్తు ఏజెన్సీల దిగజారుడుతనానికి నిదర్శనం.
బట్టబయలైన ఆరోపణల డొల్లతనం..
పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ సంస్థ ఉనికిలో లేదని ఆరోపించారు. అయితే, డెలావేర్ రాష్ట్ర చట్టాల ప్రకారం రద్దయిన పేరుతోనే కొత్తగా నవంబర్ 2017లో పునరుద్ధరించబడిన సంస్థ చట్టబద్ధంగా ఉనికిలో ఉందని, వ్యాపారం సాగిస్తోందని న్యాయస్థానం స్పష్టం చేసి ఈడీ నివేదికలలోని డొల్లతనాన్ని ఎండగట్టింది.
నివేదికల తారుమారు..
ఢిల్లీ పోలీసు నిబంధనల ప్రకారం దాఖలు చేసిన తొలి స్టేటస్ నివేదికలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విదేశీ నిధుల సమీకరణలో ఎలాంటి ఫెమా ఉల్లంఘనా జరగలేదని స్పష్టం చేసింది. కానీ, దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత సమర్పించిన రెండో నివేదికలో ఆర్బీఐ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను రహస్యంగా తొలగించి, దర్యాప్తులో అక్రమాలను సృష్టించేందుకు దిగజారాయి.
నిజాన్ని తొక్కిపెట్టే ఈ కుట్ర వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తోంది.
ఆధారాలు లేని ఆరోపణలు..
ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్) కింద కేసు నిలవాలంటే మోసపోయిన బాధితుడు ఉండాలి. పెట్టుబడి పెట్టిన కంపెనీ తనకు మోసం జరిగిందని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.
సంబంధం లేని మూడో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా మోసం కేసు పెట్టడం పత్రికా రంగం నోరు నొక్కే కుట్రలో భాగమే.
అలాగే వ్యాపార భాగస్వామ్యం కోసం షేర్లలో పెట్టుబడి పెట్టడం అనేది నమ్మకంతో ఇచ్చిన ఆస్తి కాదని, అది యజమాన్య హక్కు అని కోర్టు స్పష్టం చేయడంతో సెక్షన్ 406(క్రైమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) ఆరోపణలు కూడా గాల్లో కలిసిపోయాయి.
న్యాయసూత్రాలకు విరుద్ధమైన వాదనలు..
చట్టబద్ధమైన పెట్టుబడి ఒప్పందాన్ని కుట్రగా ముద్రవేయడానికి ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయారు. కేవలం ప్రకటనల ఆధారంగా ప్రబీర్ పురకాయస్థ, విదేశీ వ్యక్తుల మధ్య కుట్ర జరిగిందని ఈడీ వాదించడం న్యాయసూత్రాలకే విరుద్ధం.
నేలమట్టమైన ఈడీ కేసు..
సుప్రీంకోర్టు ‘విజయ్ మదన్ లాల్ చౌదరి’ తీర్పు ప్రకారం ప్రధాన నేరం కొట్టివేస్తే, దానికి అనుబంధంగా ఉండే మనీలాండరింగ్(ఈడీ) కేసు నిలబడదు.
ఎఫ్ఐఆర్ రద్దవ్వడంతో ఈడీ కేసు స్వయంచాలకంగా కూలిపోయింది. పునాది లేని ఈడీ భవనం కోర్టు ముందు ఒక్క దెబ్బకు నేలమట్టమైంది.
ఈ అపార నష్టానికి బాధ్యులెవరు?
ఆరు సంవత్సరాల పాటు న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ సహా ఎంతోమంది పాత్రికేయుల ఇళ్లపై దాడులు చేసి, డివైజ్‌లు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు పేరిట విచారణలు జరిపారు. ఆఖరికి ఈ కేసులో ఒక్క ప్రాథమిక నేరం కూడా నిరూపితం కాలేదు. కానీ ఆరేళ్ల పాటు పాత్రికేయుల సమాజం అనుభవించిన నరకానికి, సంస్థకు జరిగిన ఆరని నష్టానికి బాధ్యులెవరు?
ప్రశ్నించడమే నేరమా?
ప్రభుత్వ విధానాలను, అధికారిక నిర్ణయాలను ప్రశ్నించడమే పత్రికారంగం ప్రాథమిక విధి. కానీ నేడు ‘ప్రశ్నిస్తే దేశద్రోహం’, ‘నిజం చెబితే అక్రమ ధనార్జన’ అనే రీతిలో తీరు మారింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాలు కల్పించే రక్షణ మాత్రమే చివరి ఆశగా నిలుస్తోంది.
విదేశీ చట్టాల స్ఫూర్తితో జవాబుదారీతనం అవసరం..
విదేశాల్లో అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడి పౌరుల, పాత్రికేయుల హక్కులను కాలరాసే అధికారులపై చట్టం కఠినంగా విరుచుకుపడుతుంది. ఉదాహరణకు, అమెరికాలో ‘సివిల్ రైట్స్ యాక్ట్’ (సెక్షన్ 1983) ప్రకారం పౌరుల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి తప్పుడు కేసులు బనాయించే అధికారులపై నేరుగా వ్యక్తిగత నష్టపరిహార దావాలు వేయవచ్చు.
అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే ఉద్దేశపూర్వక వేధింపులకు పాల్పడితే వారి ఉద్యోగ బర్తరఫ్‌తో పాటు భారీ జరిమానాలు విధించే చట్టపరమైన బాధ్యత ఎదుర్కొనాల్సి వస్తుంది.
బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలలో ‘మాలిషియస్ ప్రాసిక్యూషన్'(కక్షపూరిత విచారణ) చట్టాల కింద తప్పుడు కేసులు పెట్టిన అధికారులకు జైలు శిక్ష పడటమే కాకుండా, బాధితులకు కోట్లాది రూపాయల పరిహారం రాజ్య ఖజానా నుంచి కాకుండా సదరు అధికారుల జేబుల నుంచే వసూలు చేస్తారు. కానీ మనదేశంలో అధికార యంత్రాంగానికి ఉన్న ‘సేఫ్ గార్డ్స్’ (రక్షణ కవచాలు) కారణంగా తప్పుడు ఆరోపణలతో జర్నలిస్టుల జీవితాలను, స్వతంత్ర మీడియా సంస్థలను నాశనం చేసిన అధికారులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా సురక్షితంగా బయటపడగలుగుతున్నారు.
అధికార బలంతో అబద్ధపు కేసులు బనాయించే అధికారులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి ఉద్యోగాల నుంచి తొలగించే చట్టపరమైన శిక్షా విధానం అమల్లోకి వస్తే తప్ప ఈ ‘చట్టబద్ధ రాజ్యహింస’కు శాశ్వత అడ్డుకట్ట పడదు.
పత్రికా స్వేచ్ఛకు ఒక చారిత్రక మైలురాయి..
ఢిల్లీ హైకోర్టు ఈ తప్పుడు కేసులను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు పత్రికా స్వేచ్ఛాయుత పోరాటంలో ఒక చారిత్రక మైలురాయి.
పత్రికా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడానికి సమాజం కదలిరావాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ సమరంలో సుప్రీంకోర్టు సైతం రాజ్యాంగబద్ధమైన పత్రికా స్వేచ్ఛకే జెండా ఎగురవేస్తుందని, అధికార పీఠాల కక్షసాధింపులకు అడ్డుకట్ట వేస్తుందని స్వతంత్ర సమాజం ఆశిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
