న్యాయ సమీక్షకి పంప బడిన 27 లక్షల మందిలో కేవలం ఏడు లక్షల మంది మాత్రమే తమ SIR తొలగింపులపై అప్పీల్ చేసుకున్నారన్న బెంగాల్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారం లేదు. జనగణనను అనధికారిక పౌరసత్వ పరీక్షగా మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు.
ఆగస్టు 1న పశ్చిమ బెంగాల్లో ‘జనగణన 2027’ స్వయం-నమోదు దశను బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రారంభించినప్పుడు, ఆయన తన దృష్టిని కేవలం జనాభాను లెక్కించే ప్రక్రియకే పరిమితం కాలేదు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ ప్రక్రియలో న్యాయ విచారణ లో ఉన్న 27 లక్షల మంది ప్రజల ప్రస్తావనను తీసుకువస్తూ, వారిలో కేవలం ఏడు లక్షల మంది మాత్రమే అప్పీల్ చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, “ఓటరు హోదాను కోరని వారు ఇప్పుడు పౌరసత్వాన్ని కోరుతారా?” అని ప్రశ్నించారు.
ఆ వాక్యం ఒక ప్రశ్నగా వ్యక్తపరచ బడినప్పటికీ, అది ఒక ఆరోపణ. వివాదాస్పదమైన ఎన్నికల అప్పీల్ ప్రక్రియను అధిగమించడంలో ఒక వ్యక్తి విఫలమవ్వడాన్ని, ఆ వ్యక్తి భారతీయుడు కాదని అంగీకరించి నట్లుగా చిత్రించే ప్రయత్నం అది.
ఏ ప్రభుత్వ అధినేత అయినా ఇంతటి తీవ్ర అతిక్రమణకు పాల్పడటం అసాధారణమైన విషయం. పైగా ఎలాంటి అనుమానాలు లేకుండా సమాధానాలు చెప్పగలమని ప్రజలు విశ్వసించడంపైనే విశ్వసనీయత ఆధారపడి ఉన్న ‘జనగణన’ ప్రారంభోత్సవంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళనకరం. బెంగాల్ జనగణన కార్యకలాపాల డైరెక్టర్ నిఖిల్ పవన్ కళ్యాణ్ వెంటనే దీనికి ప్రాథమిక సవరణను అందించాల్సి వచ్చింది: జనగణన లెక్కింపు అనేది ఓటర్ల జాబితాతో సంబంధం లేని స్వతంత్ర ప్రక్రియ అని, విదేశీయులతో సహా ప్రస్తుతం నివసిస్తున్న ప్రతీ ఒక్కరినీ ఇందులో లెక్కిస్తారని ఆయన స్పష్టం చేశారు. భారత జనగణన సొంత వివరణ కూడా అంతే స్పష్టంగా ఉంది. జనాభా లెక్కింపు అనేది “భారత పౌరులైనా, కాకపోయినా దేశంలోని ప్రతి ఒక్కరినీ” కవర్ చేస్తుంది.
ఓటర్ల జాబితా, జనగణన రిజిస్టర్, పౌరసత్వ నిర్ధారణ, సంక్షేమ డేటాబేస్ అనేవి నాలుగు వేర్వేరు చట్టపరమైన అంశాలు. ఓటర్ల జాబితా ఒక నియోజకవర్గంలో ఓటు వేయడానికి ఎవరు అర్హులో తెలుపుతుంది. జనగణన ఎవరు నివసిస్తున్నారు, కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయో నమోదు చేస్తుంది. పౌరసత్వాన్ని కేవలం ‘పౌరసత్వ చట్టం’ – దానికి నిర్దేశించిన వ్యవస్థ పరిధిలోనే తుదిగా నిర్ణయించగలరు. చివరగా, సంక్షేమ పథకాల అర్హత అనేది ఆ ప్రయోజనాన్ని కల్పించే చట్టం లేదా పథకం నిబంధనలకు సంబంధించినది. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మొదటి డేటాబేస్‌లో వ్యతిరేకంగా నమోదు అయినది మిగిలిన అన్నింటినీ ప్రభావితం చేస్తుందనే సిద్ధాంతాన్ని అధికారి ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ఈ సిద్ధాంతానికి ఎటువంటి చట్టబద్ధమైన పునాది లేదు.
‘ఏడు లక్షలు’ అనే గణాంకం:
అధికారి ఏ ప్రాతిపదికన ఈ “ఏడు లక్షలు” అనే గణాంకానికి వచ్చారో కూడా స్పష్టంగా లేదు. అప్పీళ్ల సంఖ్య సుమారు ఏడు లక్షలుగా తెలిపినప్పుడు తన వద్ద ఖచ్చితమైన డేటా లేదని ఆయన స్వయంగా అంగీకరించారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం, న్యాయ సమీక్ష కోసం పంపిన 60,06,675 కేసులలో 27,16,393 కేసులు “ఓటు వేయడానికి అర్హులు కారు” అని తేలాయి. వారికి ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. సుప్రీంకోర్టు ఏప్రిల్ 13 నాటి ఉత్తర్వుల్లో అప్పీలేట్ విభాగంలో 34 లక్షలకు పైగా అంశాలు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో అన్యాయంగా తొలగించారనే వాదనలతో పాటు, చేరికలపై వచ్చిన అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఇవి రెండూ ఒకే రకమైనవి కావు.
కాబట్టి, సుప్రీంకోర్టు ముందు ఉంచిన చాలా పెద్ద గణాంకాలతో అధికారి అంచనా వేసిన ఏడు లక్షల సంఖ్యకు పొంతన లేదు. ECI లేదా రాష్ట్ర ప్రభుత్వం అప్పీళ్లు, అభ్యంతరాలు, పరిష్కారాలు, పునరుద్ధరణల యొక్క విడి విడి వివరాలు ప్రకటించే వరకు, అప్పీల్ చేయని వారు తాము పౌరులం కాదని అంగీకరించారని ప్రకటించడం సరైనది కాదు.
జనగణన అనేది అనధికారిక పౌరసత్వ పరీక్ష కాకూడదు:
జనగణనను దీనికి ముడిపెట్టడం అనేది పరిధిని అతిక్రమించడమే. 1948 నాటి జానాభా చట్టం లోని సెక్షన్లు 3, 4 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం జనగణనను ప్రకటించి, సెన్సెస్ కమిషనర్, రాష్ట్ర డైరెక్టర్లను నియమిస్తుంది. స్థానిక అధికారులను నియమించడం, వారిని ఆ పనిలో దింపడంరాష్ట్ర అధికార్ల వీధి. సెక్షన్ 8 కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ప్రశ్నలకు సమాధానాలను నిర్దేశిస్తుంది. రాష్ట్రానికి దానిని నిర్వహించే పాత్ర గణనీయంగా ఉన్నప్పటికీ, జనగణనను అనధికారిక పౌరసత్వ పరీక్షగా మార్చే అధికారం దానికి లేదు.
చట్టం ప్రకారం రహస్యంగా జరగాల్సిన దానిలో ముఖ్య మంత్రి మాటలు బాధ్యతారాహిత్యం అవుతుంది. చట్టం ప్రకారం, జనగణన సమాచారం బహిరంగ పరిశీలన నుండి రక్షించబడుతుంది. సాధారణ సివిల్ లేదా క్రిమినల్ వ్యాజ్యాలలో వ్యక్తిగత వివరాలు సాక్ష్యంగా చెల్లవు. అంతేకాకుండా, జనగణన అధికారుల ద్వారా సమాచారం అనధికారికంగా బహిర్గతమైతే తీవ్రమైన శిక్షార్హమైన చర్యలు ఉంటాయి. జనగణన అనేది గణాంకాల లెక్కింపు, పట్టిక రూపకల్పన కోసం వ్యక్తిగత సమాధానాలను సేకరిస్తుంది తప్ప, ఒక వ్యక్తి యొక్క పౌరసత్వం లేదా ఇతర ప్రయోజనాల అర్హతను నిర్ధారించడానికి కాదు. జనగణన సమాధానాలలోని గుర్తించదగిన అంశాలను ఓటర్ల జాబితా తొలగింపులతో పోల్చే ఏ ప్రయత్నమైనా చట్టబద్ధమైన అధికారం, ఉద్దేశిత పరిమితి, గోప్యత, దామాషా, ప్రక్రియ రక్షణలను ప్రశ్నార్ధకం చేస్తుంది. ఈ ప్రక్రియ ప్రారంభంలో అలాంటి ఫ్రేమ్ వర్క్ లేదా సరి పోల్చే ప్రోటోకాల్ ఏదీ బహిరంగంగా ప్రకటించబడలేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం.
కుల ధృవీకరణ పత్రాలు, అన్నపూర్ణ, రేషన్ కార్డులు:
అదే సమయంలో, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేవలం సాధారణ ప్రకటనగా కొట్టి పారేయలేము. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఇప్పటికే SIR ఫలితాలను ఇతర పరిపాలనా రంగాల్లోకి వర్తింపజేయడం ప్రారంభించింది. బెంగాల్ SIR పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు ప్రసేన్ జిత్ బోస్ జూలై 14న దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కు మూడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను జత చేశాడు. వీటిని కలిపి చదివితే, ఈ అనుసంధానం బెంగాల్‌లోని బిజెపి ప్రభుత్వ విధానమని స్పష్టమవుతుంది.
మే 14న, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 2011 నుండి జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలను పునః పరిశీలించాలని ఆదేశించింది. SIR సమయంలో తొలగించబడిన వ్యక్తులు, వారిపై ఆధారపడిన వారి సర్టిఫికేట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి, తగిన ప్రక్రియ తర్వాత రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
మే 19న, మహిళా, శిశు సంక్షేమ శాఖ ‘అన్నపూర్ణ యోజన’ను నోటిఫై చేసింది. బెంగాల్లో నివసిస్తున్న, సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు కాని, ఆదాయపు పన్ను చెల్లించని 25 నుండి 60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఇది నెల వారీ నగదు బదిలీ పథకం. అయితే, ప్రస్తుతం ఉన్న “లక్ష్మీర్ భండార్” లబ్ధిదారులను కొత్త పథకంలోకి మార్చేటప్పుడు, SIR తొలగింపు ప్రక్రియ నుండి తీసుకున్న అనేక వర్గాలను మినహాయించారు.
జూన్ 4న, ఆహార, సరఫరా శాఖ తొలగించబడిన ఓటర్ల జాబితాను తీసికొని, రేషన్ కార్డ్ లబ్ధిదారులను సరిచూడడానికి బూత్-వారీ ప్రక్రియను రూపొందించింది. నిబంధనల ప్రకారం రుజువును చూపించకపోతే డిజిటల్ రేషన్ కార్డులను రద్దు చేయడానికి మార్క్ చేసే అవకాశం ఉంది.
అప్పీలేట్ వ్యవస్థలో జాప్యాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడంగా చిత్రీకరించడం:
రాష్ట్ర ప్రభుత్వం చెరిపి వేయడానికి ప్రయత్నిస్తున్న అధికార పరిధి రేఖను సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా గీసింది. బీహార్ SIR నుండి ఉద్భవించిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ కేసులో మే 27 నాటి తీర్పులో, ఓటరు అర్హత కోసం మాత్రమే ఎన్నికల సంఘం పౌరసత్వంపై పరిమిత విచారణ చేపట్టవచ్చని కోర్టు పేర్కొంది. అలాంటి విచారణ కేవలం ఎన్నికల పర్యవసానాలకే పరిమితం. అది పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ణయించదు లేదా ఒక వ్యక్తి యొక్క పౌరసత్వ హక్కును రద్దు చేయదు. కమిషన్ అసంతృప్తిగా ఉంటే, అది పౌరసత్వ చట్టం కింద సమర్థ అధికార యంత్రాంగానికి ఈ విషయాన్ని నివేదించాలి, కానీ దాని సొంత అభిప్రాయం తుది తీర్పు కాజాలదు.
జూలై 17న బోస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిశీలించినప్పుడు ఈ అంశం మళ్లీ తెర పైకి వచ్చింది. కోర్టు సీఈసీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ECI ఓటర్ల జాబితా అర్హతను నిర్ణయించగలదు కానీ పౌరసత్వాన్ని నిర్ణయించలేదని స్పష్టం చేశారు.
సుమారు 34 లక్షల కేసుల్లో కేవలం 38,000 కేసులు మాత్రమే విచారణకు వచ్చాయని, పరిష్కరించబడిన వాటిలో దాదాపు 70% మంది విజయం సాధించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలియజేశారు. ప్రతికూల SIR లోని వ్యతిరేక నిర్ధారణ అనేది పౌరుడు కాదని నమ్మ తగిన సాక్ష్యంగా నిరూపిస్తుందనే వాదన తప్పు అని ఇది తెలియ జేస్తున్నది. అంతేకాకుండా, విపరీతమైన భారం ఉన్న అప్పీలేట్ వ్యవస్థలో జరిగే ఆలస్యాన్ని, పౌరుడు స్వచ్ఛందంగా తన హక్కును వదులు కున్నట్లుగా పరిగణించడం హాస్యాస్పదమని ఇది తెలియజేస్తున్నది.
కలకత్తా హైకోర్టు కూడా సంక్షేమ పథకాలపై దీని ప్రభావాన్ని పరిశీలించడం ప్రారంభించింది. ‘ఉమ్మే సల్మా వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసులో జూలై 28 నాటి మధ్యంతర ఉత్తర్వులో, పిటిషనర్ యొక్క RKSY-I రేషన్ కార్డ్ యాక్టివ్గానే ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. ఓటర్ల జాబితా నుండి తొలగించడం ద్వారా ఆహార అవసరాలను నిరాకరించడాన్ని సమర్థించ వచ్చా, ముఖ్యంగా ఫారమ్ 6 దావా పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇలా చేయవచ్చా? అని ప్రశ్నించింది.
మతపరమైన CAA మినహాయింపు:
పౌరసత్వ సవరణ చట్టం (CAA) దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వారికి లభించే రక్షణ ఈ విధానాన్ని తగ్గించడానికి బదులు మరింత ఆందోళనకరంగా మారుస్తుంది. శబర్ ఇన్స్టిట్యూట్ విశ్లేషణ ప్రకారం, న్యాయ సమీక్ష ప్రక్రియలో అనర్హులుగా భావించబడిన 27 లక్షలకు పైగా వ్యక్తులలో ముస్లిం ఓటర్లు సుమారు 70% ఉన్నారు. అయితే, చట్టబద్ధమైన గడువు నాటికి భారత్‌లోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నిర్దిష్ట ముస్లిమేతర వర్గాలకు మాత్రమే CAA మార్గం అందుబాటులో ఉంది. కాబట్టి ఆహారం లేదా నగదు సహాయాన్ని SIR అప్పీల్ లేదా మత ఆధారిత పౌరసత్వ మార్గంతో ముడిపెట్టడం వివక్ష పూరిత పరిస్థితిని సృష్టిస్తుంది.
చట్టప్రకారం జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) చేపట్టకుండానే, NRC ప్రభావాన్ని సృష్టించే ప్రయత్నంగా ప్రభుత్వం భావిస్తోందనే అనుమానానికి ఇది బలాన్ని చేకూరుస్తుంది. పౌరుడు తన పౌరసత్వాన్ని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తుంటే, ప్రభుత్వం మాత్రం తన తనిఖీ చేయని డేటాను సరైనది గానే భావిస్తోంది.
మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ పేర్లు లేదా ఇతర అనర్హులైన లబ్ధిదారులను తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ/కుతూహలం ఉండటం సబబే. ఒక కుటుంబం ఇంకా ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారో లేదో, దరఖాస్తు దారు ఆదాయ పరిమితికి లోబడి ఉన్నారో లేదో, తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారా, లేదా నగదు బదిలీ పథకం నిబంధనల ప్రకారం అర్హులా కాదా వంటి అన్నీ అంశాలను ప్రభుత్వం తనిఖీ చేయవచ్చు. ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పౌరసత్వం, సివిల్ హక్కులను నిర్ణయించడానికి ఓటర్ల జాబితాను ఒక ప్రధాన డేటా బేస్‌గా మార్చే పని రాష్ట్ర ప్రభుత్వం చేయ కూడదు.
గమనిక: ది వైర్, ఇంగ్లీష్ లో అపర్ణా భట్టాచార్య రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
