ఆగస్టు 9, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
కొండలు దాటుతాం… వాగులు దాటుతాం… మట్టి దారుల్లో నడుస్తాం. మారుమూల గిరిజన తండాలు,గూడేలకు వెళ్తాం. అక్కడి మనుషులను కలుస్తాం. వారి జీవితాలను వింటాం. వారి కష్టాలను చూస్తాం. వారి విజయాలను రికార్డు చేస్తాం.
ఎందుకు?
ఈ ప్రశ్నకు మా సమాధానం ఒక్కటే … అడవిలోని జీవితం కేవలం అడవిలోనే మిగిలిపోకూడదు. అక్కడి జ్ఞానం, అనుభవం, సంస్కృతి, పోరాటం సమాజానికి తెలియాలి.
ఆదివాసీ సమాజం ప్రకృతిని కేవలం ఒక వనరుగా చూడదు. ప్రకృతిని తన జీవితంలో భాగంగా చూస్తుంది.
అడవి వారికి నీడ, జీవనాధారం. ఆహారం. ఔషధం. సంస్కృతి. ఆత్మగౌరవం.
అడవిని కాపాడటం గురించి ప్రపంచం ఇప్పుడు పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతోంది. కానీ వాటికి అయ్యే వేలాది డాలర్ల ఖర్చు బదులు అతి తక్కువ ఖర్చుతో ఒక ఆదివాసీ పల్లెను విజిట్ చేస్తే , అడవితో సహజీవనం చేస్తున్న మనుషులను తరతరాల వారి జీవన విధానాన్ని చాలా అధ్యయనం చేయవచ్చు.
ఒక చెట్టును నరికితే దాని స్థానంలో ఇంకో చెట్టు ఎలా పెరగాలి? ఏ పండు ఏ కాలంలో దొరుకుతుంది? ఏ ఆకును ఔషధంగా ఉపయోగించాలి? ఏ విత్తనం ఏ నేలలో బాగా పెరుగుతుంది? అడవిలో ఏ మార్పు రాబోయే కాలానికి సంకేతం?
ఇలాంటి ఎన్నో విషయాలను అంత్రిగుడ గ్రామంలో రైతు కిల్లో డుంబు ద్వారా తెలుసుకున్నాం.రెండు దశాబ్దాల క్రితం మేము తూరుపు కనుమల్లో అతడి మిరియాల తోటలో కలిశాం. కొండవాలులో సపోట,ఉసిరి చెట్ల మధ్య సిల్వర్ ఓక్ చెట్లకు మిరయాల తీగలు పాకించి సాగు చేస్తున్నాడు.అపుడే కాసిన ఆకుపచ్చని లేత మిరియాలు కోసి నోట్లో వేసుకోమని చెప్పాడు.దగ్గు,జలుబు నివారిస్తుందని చెప్పాడు.
వారి దగ్గర పుస్తకాల్లో లేని జ్ఞానం ఉంది.
వారి విత్తనాల సంరక్షణ కూడా ఒక గొప్ప సంపద.
బయట దొరికే వ్యాపార విత్తనాలపై ఆధారపడకుండా, తరతరాలుగా తమ స్థానిక విత్తనాలను భద్రపరుచుకోవడం అనేక ఆదివాసీ సమాజాల్లో చూశాం. భద్రాచలం సమీపంలోని ఆవాసాల్లో సొరకాయ బుర్రల్లో ఎర్ర ధాన్యం విత్తనాలు దాచుకుంటారు. ఒక విత్తనం అంటే వారికి కేవలం పంట కాదు. అది తమ భవిష్యత్తు మీద హక్కు.
వాతావరణ మార్పులు, కరువు, వర్షాభావం, నేల మార్పులు వంటి పరిస్థితుల్లో స్థానిక విత్తనాలు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఎంతో విలువైన ప్రత్యామ్నాయ జ్ఞానాన్ని అందిస్తాయి. వారి సంప్రదాయ జ్ఞానం ఒక తరానికి చెందినది కాదు. తరతరాలుగా ప్రయాణించిన జీవన విజ్ఞానం.
అడవిలో ఆహారం ఎలా సేకరించాలి? ప్రకృతి నుంచి అవసరమైనంత మాత్రమే ఎలా తీసుకోవాలి? ఔషధ మొక్కలను ఎలా గుర్తించాలి? వర్షాన్ని, ఋతువులను, పంటలను ఎలా అంచనా వేయాలి? ఇలాంటి అనుభవాలు వారి జీవన విధానంలో భాగం.
కోవిడ్ కాలంలో నగరాల్లో జీవించే వాళ్లు ఆహారం కోసం ఆందోళన పడ్డారు కానీ, ఆదివాసీలకు ఆ సమస్యలు లేవు. తూరుపు కనుమల్లో అరుదుగా దొరికే తేగ దుంపలు, నాగలి దుంపలు వారి కడుపు నింపాయి.వాటిని సాగు చేయకుండానే సహజంగా పెరుగుతాయి. మనం తినే ఆలుగడ్డలకంటే ఎక్కువ రుచి ప్రోటీన్స్ వాటిల్లో ఉంటాయి. కరువు సమయంలో వారికి అడవి ఇచ్చిన కానుక .
కానీ ఈ విలువైన జ్ఞానం అంతా ఇప్పుడు ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
తరాలు మారుతున్నాయి. జీవన విధానాలు మారుతున్నాయి. అడవితో సంబంధాలు మారుతున్నాయి. యువత వలస వెళ్తోంది. భాషలు కనుమరుగవుతున్నాయి. సంప్రదాయ జ్ఞానం క్రమంగా మరుగున పడుతోంది.
ఒక ఆదివాసీ భాష అంతరించిపోతే, కేవలం కొన్ని పదాలు మాత్రమే కనుమరుగవ్వవు.
ఒక సమాజం ప్రపంచాన్ని చూసిన ఒక ప్రత్యేకమైన దృక్పథం కూడా కనుమరుగవుతుంది.
అందుకే మేము ఆదివాసీ ప్రాంతాలకు ఎక్కువగా వెళ్తాం. వారి గురించి జాలి చూపించడానికి కాదు. వారిని వెనుకబడినవారిగా చూపించడానికి కాదు.
వారి జీవితాన్ని ఒక ‘వింత’గా చూపించడానికి అసలే కాదు.
వారి దగ్గర ఉన్న విలువైన జ్ఞానాన్ని సమాజం ముందుకు తీసుకురావడానికి వెళ్తాం..
వారి సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకురావడానికి వెళ్తాం. వారి హక్కుల గురించి మాట్లాడటానికి వెళ్తాం. వారి విజయాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి వెళ్తాం. ముఖ్యంగా వారి గొంతు వినిపించని చోట వారి గొంతుకు మైక్రోఫోన్ అందించడానికి వెళ్తాం.
మీడియా కేవలం సంఘటనలను రిపోర్ట్ చేసే సాధనంగా మిగిలి పోకూడదు.
సమాజం మరచిపోతున్న విషయాలను గుర్తు చేసే బాధ్యత కూడా మీడియాదే.
అందుకే మÖలవాసుల కథనాలు మాకు కేవలం వార్తలు కావు. అవి భవిష్యత్తు కోసం భద్రపరచాల్సిన సామాజిక జ్ఞాపకాలు.
వారి భాషను కాపాడటం అంటే వారి సంస్కృతిని కాపాడటం. వారి సంప్రదాయ జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేయడం అంటే మానవ జ్ఞాన సంపదను కాపాడటం. వారి అడవుల గురించి మాట్లాడటం అంటే రేపటి మన బిడ్డల బతుకు గురించి మాట్లాడటం.
అందుకే మీడియా మరింతగా ఆదివాసీ ప్రాంతాల వైపు చూడాలి. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రశ్నించాలి. వారి భాషలు అంతరించిపోకుండా వాటి గొంతును వినిపించాలి. వారి జ్ఞానం మరుగున పడకుండా నమోదు చేయాలి.
వారి కథలు కేవలం అడవుల్లోనే మిగిలిపోకుండా ప్రపంచానికి చెప్పాలి.
ఎందుకంటే… ఒక ఆదివాసీ భాష అంతరించి పోతే . ఒక సంస్కృతి మాయమవుతుంది.
ఒక సంప్రదాయ జ్ఞానం మాయమైతే… మనం ఒక విలువైన జ్ఞానాన్ని కోల్పోతాం.
ఒక అడవి అంతరించడం మొదలైతే మన భవిష్యత్తులో ప్రమాదంలో పడుతుంది.
అందుకే మేము మళ్లీ మళ్లీ కొండలు ఎక్కుతాం… మళ్లీ ఆ మట్టి దారుల్లో నడుస్తాం…
ఎందుకంటే , అక్కడి కథలు కేవలం వారి కథలు కావు, అవి మన సమాజం, మన ప్రకృతి, మన భవిష్యత్తు .
ఫొటో… తూరుపు కనమల్లో పాడేరు మన్యంలో సంగోడి గ్రామంలో నాగలి దుంపను పరిచయం చేస్తున్న రైతు కల్యాణం.
శ్యాంమోహన్ ( ఆదివాసీ జీవనం ,సమస్యల పై అధ్యయనం చేస్తున్న జర్నలిస్టు )
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
