భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ హంగుల వెనుక, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఒక రాష్ట్రం పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధినేత పట్ల ప్రదర్శించిన భక్తి ప్రపత్తులు దాగి ఉన్నాయి.
2022-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ స్వల్పకాలిక కార్యనిర్వాహక రాజధానిగా ఉన్న విశాఖ పట్నానికి అధికారిక పర్యటనలలో, నేను అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ స్థలమైన భోగాపురాన్ని తరచుగా సందర్శించేవాడిని. అక్కడ మూడు విషయాలు నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. 1.భూసేకరణ ఎంత వేగంగా జరిగింది. 2.ఎంత సునాయాసంగా జరిగింది. 3.భూభాగాలు ఎంత ఖచ్చితత్వంతో గుర్తించ బడ్డాయో.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం గురించి ఇంకేం చెప్పినా, దాని పరిమాణం మాత్రం సముచితంగా ఉంది. భారతీయ పోర్ట్ మౌలిక సదుపాయాలలో అదానీ గ్రూప్ దాదాపు ప్రతి దాన్నీ తన స్వాధీనం చేసుకున్నప్పటికీ, గ్రంధి మల్లికార్జున రావు (GMR) గ్రూప్ ఈ ప్రాజెక్ట్‌పై తన పట్టును నిలుపుకోగలగడం దానికదే ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ విమానాశ్రయం ఈ ఆగస్టు చివరిలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. నన్ను కలవరపెడుతున్న విషయం ఏమిటంటే, గత వారం రిబ్బన్ కట్ చేసినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలు.
రాజకీయ ప్రచారం కోసం జానపద నృత్యాలను ఆయుధంగా మలచినప్పుడు:
విమానాశ్రయానికి సరైన రహదారి లేకపోవడమే ఇక్కడ అసలు చర్చనీయాంశంగా అనిపిస్తుంది. జాతీయ ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ వాహనం చుట్టూ గిరిజన యువకులు నృత్యం చేస్తూ పాటలు పాడారు. ఈ కొరియో గ్రఫీపై దృష్టి సారించేలా శిక్షణ పొందిన కెమెరాలు, పాలకవర్గం నెమ్మదిగా ముందుకు సాగుతుండగా, వేలాది మంది యువకులు సాధన చేసిన లయతో కదులుతున్న దృశ్యాలను రికార్డు చేశాయి.
ఈ వర్గాలకు, ఆ నృత్యం పర్యటనకు వచ్చే ప్రముఖుల కోసం ప్రదర్శించే ఒక జానపద అలంకారం కాదు. కనీసం ఈ స్థాయిలో ఖచ్చితంగా కాదు! ఆ నృత్యం ఒక ఆరాధన, చారిత్రాత్మకంగా వారి దేవుళ్లకు సమర్పించే ఒక కానుక. ఒక రిబ్బన్ కటింగ్ కార్యక్రమం కోసం ఆ జానపద రూపాన్ని ఇక్కడ ప్రదర్శించినప్పుడు అంతవరకూ క్రమశిక్షణతో ఉన్న కెమెరా, ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించలేదు. మైళ్ల దూరంలో కూర్చున్న ప్రేక్షకులు వీక్షించడానికి అద్భుతమైన దృశ్యాలను సృష్టించడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన “అక్రమ శిక్షణ” ఇది.
ఒక రోజంతా, ఒక బలమైన, దైవ సమానమైన నాయకత్వం కోసం అనుకూల వాతావరణాన్ని, వాదనను సృష్టించడానికి బాగా ప్లాన్ చేసిన జన సమూహాన్ని సమీకరించారు. ఈ ప్రదర్శన యొక్క శైలి లోనే ప్రధాన మంత్రిని దైవంగా మలిచారు. పండుగ రోజున గుడి రథం జన సమూహం గుండా ఎలా కదులు తుందో ఆ వాహనం అలాగే కదిలింది. ఒక అధికార ప్రముఖుడి వెనుక కాకుండా, దేవుడి (మధ్యమధ్యలో తాను జైవిక పుట్టుక కాదు అని చెప్పుకునే) ముందు భక్తులు ఎలా నృత్యం చేస్తారో ఆ యువకులు అలాగే నృత్యం చేశారు.
మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవానికి రంగులు అద్దడానికి రాష్ట్రం కేవలం గిరిజన కళాకారులను ఆహ్వానించడం మాత్రమే చేయలేదు. ఒక యాత్ర యొక్క సాంస్కృతిక రూపకల్పన, పవిత్రమైన విషయాల కోసం కేటాయించిన సామూహిక పరవశంతో కూడిన భక్తి యొక్క సమగ్ర నిర్మాణాన్ని అప్పుగా తీసుకుని, దానిని ఒక పదవిలో ఉన్న రాజకీయ నాయకుడి వైపు మళ్లించింది.
గిరిజన సమాజం కాదు, ముఖ్యమంత్రే ప్రధానమంత్రిని ఒక రోజు పాటు తమ దేవుడిగా మార్చడానికి ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రధాన పూజారిగా వ్యవహరించగా, ఆయన అనుచరులు భజన బృందంగా మారారు. ప్రజల నుండి సహజంగా వచ్చిన ఆరాధనగా చూపించడానికి దీనిని రిహార్సల్ చేసి, చిత్రీకరించి, ప్రచారం చేశారు. దైవానికి ఉద్దేశించిన భక్తిని, నిజమైన సంఘటనను ఒక రాజ మౌళి సినిమా తరహాలో ప్రదర్శించారు. అయితే, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఒక చిన్న పాత్రకే పరిమిత మయ్యారు. వేరే మాటల్లో చెప్పాలంటే, నాయకత్వాన్ని దైవంగా మారుస్తున్నప్పుడు, నిజమైన సినిమా సూపర్ స్టార్ ద్వితీయ స్థానానికే పరిమిత మయ్యారు.
పేరు పెట్టిన విప్లవకారుడికి న్యాయం చేయని విమానాశ్రయం:
విమానాశ్రయానికి పెట్టిన పేరు చుట్టూ ఒక చేదు వైపరీత్యం ఉండి, అది అసలు విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. రాజమౌళి ‘RRR’ (2022) చిత్రంలో చూపించిన అల్లూరి సీతారామరాజు, ఈ కొండలలో వలస పాలన దోపిడీకి వ్యతిరేకంగా రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవకారుడు. గిరిజన భూమిని, శ్రమను వేరొకరి అభివృద్ధి కోసం ముడిసరుకుగా భావించిన ప్రభుత్వాన్ని ఎదిరించి ఆయన ప్రాణాలర్పించారు.
వంద సంవత్సరాల తరువాత, గిరిజన, గ్రామీణ వర్గాల నుండి సేకరించిన భూమిపై నిర్మించిన విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు. ఆయన సొంత ప్రజల వారసులకు సాంప్రదాయ దుస్తులు తొడిగి, వేరొక రకమైన ఊరేగింపు కోసం ప్రదర్శనలు చేయించడం ద్వారా దీనిని ప్రారంభించారు. అక్కడ ఆరాధన యొక్క లక్ష్యం వారి సొంత విప్లవకారుడి జ్ఞాపకం కాదు. పర్యటనకు వచ్చిన ప్రభుత్వ అధినేత. అల్లూరి గనుక దీనిని చూస్తే, దీనిని నివాళిగా భావించరు. దీని వెనుక ఉన్న దోపిడీని ఆయన చూస్తారు. ఆధునిక భారతదేశపు ఒక విచిత్రమైన పరిస్థితి ఇది!
కళగా తనను తాను ప్రదర్శించుకుంటున్న రాజకీయం:
వాల్టర్ బెన్జమిన్ తన ‘ది వర్క్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ది ఏజ్ ఆఫ్ మెకానికల్ రీ ప్రొడక్షన్’ ముగింపులో రాజకీయాలను కళాత్మకంగా మార్చడం (aestheticization of politics) పట్ల హెచ్చరించారు. ఈ భావనను ఆధారంగా చేసుకుని పోస్ట్-మార్క్సిస్టులు లూయిస్ అల్తుస్సర్, మన దేశంలో మాధవ ప్రసాద్ ఇటువంటి దృశ్యాలను అర్థం చేసుకోవడానికి ఒక విశ్లేషణాత్మక నిర్మాణాన్ని అందించారు. రాజకీయ అధికారం చర్చలకు లొంగడం ఆపి, ప్రజా వినియోగం కోసం తనను తాను ఒక ప్రదర్శనగా మలచుకోవడం ప్రారంభించే క్షణం ఇది.
వంద సంవత్సరాల క్రితం ఐరోపాలో నాజీలు, ఫాసిస్టులు చేసినట్లే, ప్రజాదరణ పొందిన వినియోగం కోసం వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్ర యంత్రాంగం సినిమా, ప్రదర్శనల అంశాలను అప్పుగా తీసుకునే సమయం ఇది. ఒక ఓపెన్-టాప్ వాహనం, సమన్వయం చేయబడిన జన సమూహం, ఇదంతా చిత్రీకరించడానికి వేర్వేరు కోణాల్లో ఉంచిన అనేక కెమెరాలు, ఆ ఫీడ్‌ను సవరించి, ఎడిట్ చేసి ప్రసారం చేయడం. ఇది అనుకోకుండా జరిగిన హంగామా కాదు. అది సాధించిన ఫలితాలు ఏమిటి లేదా ఎవరి కోసం సాధించింది అని ఎవరూ ప్రశ్నించకుండా ఉండటానికి, తమను ఆరాధించే దేశాన్ని కోరుకునేలా ప్రజలను సమీకరించడానికి, రాజకీయం తనను తాను ఒక కళగా ప్రదర్శించుకోవడం ఇది. 100 సంవత్సరాల తర్వాత ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే, ఇప్పుడు ఈ దృశ్యాలు రియల్ టైమ్‌లో ప్రసారమవుతున్నాయి!
సంస్కృతి పరిశ్రమపై మాక్స్ హోర్క్హైమర్తో కలిసి రాసిన థియోడోర్ అడోర్నో, ఈ వాదనను మరింత ముందుకు తీసుకెళ్లారు. సంస్కృతి అంటే ఎల్లప్పుడూ తాను ప్రతిబింబించే ‘ఉన్నతమైనది’ అని భావించే మేధావి, ఎలైట్ అడోర్నో, ప్రజాదరణ పొందినది చాలా కాలం క్రితమే ‘ప్రజా సమూహంగా’ (public) మారిపోయిందని, ఈ సంస్కృతిని ప్రజలను ఒప్పించే యంత్రాంగంలోకి సులభంగా మళ్లించవచ్చని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, అది దాన్ని సృష్టించిన ప్రజలకు చెందడం ఆగిపోయి, అధికారం తయారుచేసే ప్రజా సమూహానికి సొంతమైంది. ఒకప్పుడు దైవాన్ని ఉద్దేశించిన నృత్యం ఇప్పుడు అధికారాన్ని ఉద్దేశించి, ప్రజల కోసం ప్రసార మవుతోంది. భోగాపురంలో ఊరేగింపు కేంద్రంలో ఉన్న దేవుడు ఎవరనే దానిపై ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదు.
బహిరంగ ఆర్భాటాల కోసం భారీగా ఖర్చు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మాత్రం ఊరట నిచ్చేలా లేదు. 2025-2026 నాటికి, రాష్ట్ర బకాయి రుణం దాని స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) లో దాదాపు 35% కి చేరుకుంది. ఇది పెద్ద భారతీయ రాష్ట్రాల సగటు కంటే దాదాపు 13 శాతం ఎక్కువ. పద్నాలుగో ఆర్థిక సంఘం ఒకప్పుడు వివేకవంతమైన పరిమితిగా సిఫార్సు చేసిన 20% కంటే ఇది చాలా ఎక్కువ.
23/100 స్కోరుతో, నితి ఆయోగ్ యొక్క 2026 నాటి ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత ఆర్థిక ఒత్తిడిలో ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా పేర్కొంది. రాష్ట్రం తన పొరుగున ఉన్న దక్షిణ రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం వెచ్చించినట్లు చెబుతున్న రూ. 300 కోట్ల ఖర్చుకు అదనంగా, ప్రారంభోత్సవ ప్రదర్శన కోసం వందల కోట్లు ఖర్చు చేసింది.
అలాగే, ఒక ప్రధానమంత్రిని తమ దేవుళ్ల స్థానంలో నిలిపి నృత్యం చేసిన గిరిజన యువకులు ఆ టెర్మినల్ గుండా నడవడానికి ఎప్పటికీ స్థోమత కలిగి ఉండకపోవచ్చు. రూ. 4,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఆరు మిలియన్ల ప్రయాణీకుల సామర్థ్యం గల విమానాశ్రయం, విజయనగరం జిల్లాలోని ఆరు మిలియన్ల నివాసితులకు విమాన ప్రయాణం చేసే స్థోమతను అందించదు.
తయారు చేయబడిన, నిలిపి వేయబడిన అంగీకారం:
దశాబ్దం పాటు క్రిటికల్ థియరీని అధ్యయనం చేసి, బోధించి, మరో దశాబ్దం పాటు పరిపాలన, దౌత్య యంత్రాంగం లోపల పనిచేసిన అనుభవంతో నేను ఈ మాట చెప్తున్నాను. ఈ రెండు కోణాల నుండి నాకు తెలుసు. సంస్కృతి అనేది నిరాకరించే అవకాశం అత్యల్పంగా ఉన్న నిరాశ్రయులకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, అంగీకారాన్ని నిలిపివేయడానికి తమకు తగినంత స్వేచ్ఛ ఉందని భావించే పౌరులకు వ్యతిరేకంగా కూడా సాంస్కృతికంగా, కళాత్మకంగా ఎలా ఉపయోగించ బడుతుందో నాకు తెలుసు. నిరాశ్రయులు నృత్యం చేస్తారు ఎందుకంటే నిరాకరించడం వారికి ఎప్పుడూ సురక్షితం కాదు. ముఖ్యమంత్రి దీనిని వారసత్వంగా అభివర్ణిస్తుండగా, మిగిలిన మనం దేవుళ్లకు కేటాయించిన ప్రశంసలను ప్రధానమంత్రి అందుకోవడం చూస్తాము. ప్రజలు దీనిని మరింత ఘోరంగా సమ్మేళనం (inclusion) అని పిలిచి, తదుపరి వార్తల్లోకి వెళ్లి పోతారు.
పెట్టుబడిదారీ విధానంపై స్లావోజ్ జిజెక్ పదే పదే చేసే వాదన చిన్న మార్పుతో ఇక్కడ వర్తిస్తుంది. పెట్టుబడిదారీ విధానం తన సొంత సంక్షోభాలకు ఇచ్చే సమాధానం మరిన్ని పెట్టుబడిదారీ విధానాలేనని ఆయన ఎల్లప్పుడూ ఎత్తి చూపారు. జంతర్ మంతర్ నుండి విశాఖ వీధుల వరకు భారతీయ యువత, అవినీతి, భజన పరులుగా చూసే పాలక వర్గానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరం నిరసనలు తెలిపారు. భోగాపురం ప్రారంభోత్సవాన్ని చూస్తుంటే, మన ప్రస్తుత సమయం కోసం జిజెక్ సూత్రాన్ని సవరించు కోవాలనిపించింది. భజన పరుల పట్ల పౌరులకు కలిగిన విరక్తికి సమాధానం, కేవలం మరిన్ని భజనలు మాత్రమే.
చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం, దాని ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, సినిమాటోగ్రఫీతో, టెర్మినల్ కోసం ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పేరును అప్పుగా తీసుకుని, దేశపు పురాతన భక్తి విధానాన్ని ఒక మధ్యాహ్నం వేళ పదవిలో ఉన్న ప్రభుత్వ అధినేతకు అప్పగించి దీనిని ప్రదర్శించింది.
రచయిత: జో క్రిస్టోఫర్
జో క్రిస్టోఫర్, Ph.D., విద్యారంగానికి తిరిగి రావడానికి ముందు ఒక దశాబ్దం పాటు భారత అమెరికా మిషన్‌లోని బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్‌తో పనిచేశారు. ఆయన తదుపరి తరం ఉద్యోగుల సాధికారత కోసం సాంకేతికత, AI ని ఉపయోగిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
